Friday, June 22, 2012

కవిత


కారణం తెలుసుకో తమ్ముడూ! జీవితం మలచుకో అమ్మడూ!
చిలకమర్తి .దుర్గాప్రసాదరావు
దేశానికి వెన్నెముకా! ఓ సోదర కార్మికా!
గిడ్డంగులనెన్నెన్నో నింపుతున్నావు గాని
బిడ్డలచిఱు పొట్టల్ని నువ్వు నింపలేకపోతున్నావ్
ఎన్నెన్నో కట్టడాల్ని నిర్మిస్తున్నావుగాని
తలదాల్చగ గూడు లేక తల్లడిల్లి పోతున్నావ్
పట్టుబట్టలెన్నెన్నో గుట్టలుగా నేస్తున్నా
కట్టగుడ్డలేక నువ్వు కరువువాచి పోతున్నావ్
కారణం తెలుసుకో తమ్ముడూ! జీవితం మలచుకో అమ్మడూ!
శక్తియుక్తులెన్నున్నా అక్షరజ్ఞానంసున్నా
అందుకే ఈ దైన్యం
అందుకే ఈ హైన్యం
పనిముట్టుతో బాటె నువ్వు పలకా బలపం పట్టు
హలంపట్టు చేత్తోనే కలం కూడ పట్టుకో
పుస్తకాన్ని చేతబట్టు
మస్తకాన్ని పదును పెట్టు.




నేటి భారతం
చిలకమర్తి .దుర్గాప్రసాదరావు
.
చెడు అనకుము చెడు వినకుము
చెడు కనకుమటంచు నొక్కిచెప్పిన గాంధీ
చెడుచేయకంచు చెప్పెనె!
చెడుచేయగనేల మాకు సిగ్గున్నెగ్గున్
.
తెల్లదొరలేగ నిప్పుడు
నల్లదొరలె దేశమందు నయవంచకులై
కొల్లంగొట్టు దేశము
తెల్లదొఱలె నయమటంచు దెలిపిరి మనకున్
.
అమ్ముడు వోవని వస్తువు
ఇమ్మహి గనపడదు నిక్కమిది నమ్మవలెన్
సొమ్మొక్కటున్న ఈ దే
శమ్మున గొనలేని వస్తుజాలము గలదే!
.
కులము మతమ్మను రెండే
కొలమానములిపుడు కావుగుణములు మరి యీ
కులమతవైషమ్యము గొ
డ్డలి పెట్టుగ దేశ మంతటను వ్యాపించెన్
.
బ్రతి కున్న వాని కంటెను
మృతిచెందినవాడె చాలమేలనిపించే
స్థితి నేడున్నది ఈదు:
స్థితినిర్మూలనమె దేశ సేవయనదగున్.

1 comment: