కాళిదాసుకవిత్వం – లోకానికే ఆదర్శం
డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు
సంస్కృతసాహిత్యనిర్మాతలలో వాల్మీకివ్యాసుల తరువాత
అత్యున్నతస్థానాన్ని సంపాదించిన కవి కాళిదాసు. ఈయన కవికులగురువుగా
ప్రసిద్ధి పొందాడు. ఆయన దేశాకాలాదులు
నేటికిని పండితలోకంలో వివాదాస్పదాలుగానే
మిగిలి పోయాయి. కాళిదాసు ఏ దేశకాలాలకు చెందినవాడైనా ఆయన తన కావ్యాల ద్వారా అందించిన
ఆదర్శాలు సార్వదేశికాలు సార్వకాలికాలున్నూ. అందుకే ఆయన నాటినుండి నేటివఱకు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు.
కావ్యం యశసేsర్ధకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే
అని కావ్యప్రయోజనాల గురించి మమ్మటుడనే ఆలంకారికుదు చెప్పియున్నాడు. కావ్య౦ వల్ల కీర్తి, ధన౦, వ్యవహారజ్ఞాన౦, అమంగళపరిహార౦,
ఆనంద౦, ఉపదేశ౦ మొ|| ప్రయోజనాలున్నాయి. కాళిదాసు ‘మేఘసందేశం’ ‘ఋతుసంహార౦’ అనే రెండు
ఖండకావ్యాలు; ‘రఘువంశ౦’ ‘కుమారసంభవ౦’ అనే రెండు మహాకావ్యాలు; ’మాళవికాగ్నిమిత్ర0’ ‘విక్రమోర్వశీయ0’ ‘అభిజ్ఞానశాకుంతల0’ అనే మూడునాటకాలు రచించాడు. కాళిదాసును మనం
జాతీయకవిగా ఆరాధిస్తున్నాం. ఆయన భారతీయసంస్కృతిలోని అత్యుత్తమమైన ఆదర్శాలను తన కావ్యాలద్వారా
ప్రకటించిన మహనీయుడు. మానవుడు మహనీయునిగా మారడానికి ఆచరిoపవలసిన యుత్తమధర్మాలను తాను ఎంచుకున్న
పాత్రల ద్వారా లోకానికి అందించిన ఆదర్శకవి. భారతీయసంస్కృతి అనే సౌధానికి మూలస్తంభాలైన అహింస, సత్యం, దానం, తపస్సు మొ|| వాని యౌన్నత్యాన్ని
కావ్యరూపంలో మనకందించిన కవికులగురువు. కాళిదాసు చిత్రించిన నాయకులందరు సేవాతత్పరత,
కార్యదక్షత, కర్తవ్యనిష్ఠ, పరాక్రమం, సహనం
మొ || ఉత్తమగుణాలు కలవారు . ఆయన నాయికలుగా వర్ణించిన స్త్రీమూర్తులందరు పరమపతివ్రతలు, సౌశీల్య౦, సహన౦, కార్యదక్షత, పట్టుదల
కలిగిన ఆదర్శనారీమణులు. కాళిదాసు అపారమైన లోకానుభవ౦ గల కవి. ఈ విషయాన్నే “మేము వనాల్లో నివసించే తాపసులమైనప్పటికి లోకవ్యవహారాలన్నీ బాగా తెలిసినవార౦” అని కణ్వుని పాత్రద్వారా
ప్రకటించుకున్నాడు. ఆయన కావ్యాల్లో అలౌకికధర్మాలతో బాటుగా లౌకికధర్మాలు కూడ చాల కనబడతాయి.
మొత్తంమీద భారతీయసంస్కృతిని ఇంత చక్కగా ప్రదర్శించి ప్రపంచానికoదించిన కవి కాళిదాసు తప్ప
మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. ఆయన మనకందించిన శకుంతల స్త్రీలోకానికే తలమానికమై పాశ్చాత్యులహృదయాలను
కూడ యుర్రూతలూగించడంతో ఆ నాటకం అనువాదం
యొక్క అనువాదం యొక్క అనువాదాన్ని చదివిన “Gothe” అనే జర్మన్ పండితుడు తన ఆనందాతిశయాన్ని ఇలా వ్యక్తం చేశాడు.
Wouldst thou the young year’s blossoms,
Wouldst thou the fruits of the later year
Wouldst thou what charms and enraptures,
Wouldst thou what feasts and nourishes,
Wouldst though the heaven and the earth,
With one word comprehend
I name thee Sakuntala and then has all been said.
అసలు మూల గ్రంథాన్ని చదివితే ఇంకా
ఎటువంటి అనుభూతిని పొంది ఉండేవాడో మనం ఊహించలేం. కాళిదాసు రఘువంశచక్రవర్తుల గుణగణాలను
వర్ణిస్తూ భారతీయుల ఆశ్రమధర్మవ్యవస్థను ప్రదర్శించారు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం,
వానప్రస్థం, సన్యాసం.
“శైశవేsభ్యస్త
విద్యానాం యౌవనే విషమైషిణాo
వార్ధకే
మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం”
ఆ రఘువంశరాజులు బాల్యంలో చక్కగా విద్యాభ్యాసం చేసేవారు, యౌవనంలో భోగాలనుభవించేవారు,
వార్ధక్యంలో మునివృత్తిలోనుండి చివరకు యోగమార్గంలో శరీరాన్ని త్యజించేవారు. అలాగే త్యాగం
చెయ్యడానికే ధనం కూడబెట్టేవారు. సత్య౦ కొరకే మిత౦గా మాట్లాడేవారు. కీర్తికొరకే శత్రువులను
జయించేవారు. సత్సంతాన౦ పొందడం కోసమే గృహస్థాశ్రమ౦ స్వీకరించేవారు.
ప్రతి వ్యక్తి ఆకారానికి తగిన
తెలివితేటలు, తెలివితేటలకు తగిన పరిశ్రమ, పరిశ్రమకు తగిన పని పనికి తగిన ఫలసిద్ధి కలవారై ఉండాలని రఘువంశ రాజుల వర్ణన ద్వారా తెలియజేశాడు.
ఆకారసదృశః ప్రజ్ఞః ప్రజ్ఞయా సదృశాగమః
ఆగమై: సదృశారంభః ఆరంభసదృశోదయః
కాళిదాసు రఘువంశరాజుల పరిపాలన
విధానాన్ని వర్ణిస్తూ “ఆ దిలీప
మహారాజు ప్రజలను సన్మార్గప్రవర్తకులుగా జేయడం వల్ల, అన్న పానాదులచే పోషించడం వల్ల, ప్రజలందరకి తానే తండ్రి వంటి వాడయ్యాడు. ఇంకవారి
వారి తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చినవారు గానే మిగిలిపోయారని వర్ణించడం వల్ల ప్రజలందరి విద్యాదాన, పోషణ, రాక్షణాదిభారం ప్రభుత్వమే వహించేదనే విషయం తెలుస్తోంది. అంతేగాక
రాజులకు తమ సౌఖ్యం కన్న ప్రజాసంక్షేమమే ముఖ్యమని పలుమార్లు నొక్కిచెప్పడం గమనించొచ్చు.
కాళిదాసు ధీరుల లక్షణాన్ని వివరిస్తూ “వికార హేతౌ సతి
విక్రియంతే యేషాం న చేతాంసి త ఏవ ధీరా:” అంటాడు. అనగా
చిత్తచాoచల్యo కలగడానికి అన్నివిధాల అవకాశం ఉన్నప్పటికి ఎవరి మనస్సు ఎటువంటి ప్రలోభాలకు లోనుగాకుండ నిశ్చలంగా ఉంటుందో అట్టి వారే ధీరులని ఆయన యభిప్రాయ౦.
పార్వతి వంటి జగదేకసుందరి సమీప౦లో ఉన్నా ఎటువంటి చిత్తచాంచల్యానికి లోనుగాని ఈశ్వరుని ధీరత్వ౦ వర్ణిస్తూ కవి పలికిన మాటలివి. వశిష్టుడు, కణ్వుడు
మొ|| మహామునులు ఆశ్రమాల్లో ఉండి తపస్సు చేస్తుంటే దిలీపుడు, దుష్యంతుడు మొ|| చక్రవర్తులు
ఎటువంటి ప్రలోభములకు లోనుగాక రాజ్యమనే ఆశ్రమంలో ఉండి పరిపాలన అనే తపస్సుకొనసాగిస్తున్న
గొప్ప రాజయోగులు.
కాళిదాసు వర్ణించిన నాయికలు
స్త్రీలోకానికే ఆదర్శనారీమణులు. తన సౌoదర్య౦తో ఈశ్వరుని ఆకర్షింపలేని పార్వతి, తన
బాహ్యసౌoదర్యాన్ని నిందించుకొని, యీశ్వరుని పొందడానికి తపస్సొకటే సాధనమనితలచి తీవ్రమైన
తపస్సు చేసి, శివుని వివాహమాడి౦ది. పార్వతి
ద్వారా స్త్రీలకు బాహ్యసౌ౦దర్యం కన్న సహన౦, సౌశీల్య౦ మొ|| గుణాలతో నిండిన అంతస్సౌందర్య౦
ముఖ్యమని సూచించాడు.
అభిజ్ఞానశాకుంతలoలో శకుంతలను అత్తవారింటికి సాగనంపేటప్పుడు కణ్వుడు తన కూతురు
శకుంతలకు చేసిన ఉపదేశ౦ మొత్త౦ స్త్రీజాతికే గొప్ప సందేశం.
ఓ శకుంతలా! నువ్వు అత్తమామలకు అలాగే పెద్దవారికి సేవలు చెయ్యి. సవతులయెడ స్నేహభావ౦తో
మసులుకో. ఎప్పుడైనా నీభర్త నీ పై కోపిస్తే నువ్వు తిరిగి అతని యెడ కోప౦ చూపించకు. సేవకుల యెడ దయాదాక్షిణ్యాలతో మసలుకో.
నీ సంపదలు చూసుకుని గర్వపడకు. లోకంలో ఈ విధoగా నడచుకొన్న స్త్రీలే గృహిణులని
అనిపిoచుకుoటున్నారు. అట్లు ప్రవర్తిoచనివారు వంశానికి మానసిక వ్యాధి వంటి వారౌతున్నారు. కాళిదాసు చేతిలో శకుంతల ఒక ఉదాత్తవ్యక్తిత్వాన్ని ధరించి సీత
సరసన స్థానాన్ని సంపాదించుకుంది. ఆయన చిత్రించిన నాయికలు ఆదర్శప్రేమమూర్తులు.
“మేఘసందేశ౦లో కర్తవ్యవిముఖుడైన ఒక యక్షుడు తన యజమాని
కుబేరునిచే శపింపబడి ఒక సంవత్సరకాల౦ రామగిర్యాశ్రమ౦లో ప్రియావియోగదు:ఖ౦ అనుభవిస్తూ
ఉంటాడు. ఆ యక్షుడు అలకాపట్టణ౦లో ఉన్న తన
ప్రియురాలికి సందేశo అందించడానికి ఒక మేఘాన్ని
ప్రార్ధిస్తాడు. అతడు మేఘుని ప్రార్దిస్తూ “ఓ మేఘమా! నువ్వు మేఘాల్లో ఉత్తమవంశానికి చెందిన వాడవు.
ఇంద్రునికత్యంతసన్నిహితుడవు. నేను విధివశాన నా ప్రియురాలికి దూరమయ్యాను. నా సందేశ౦ ఆమెకు
తెలియ జెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను. లోక౦లో ఒక నీచుని ప్రార్ధించి కార్య౦ సాధించుకోడం కన్నా
ఉత్తముని ప్రార్ధించి లేదనిపించుకోవడం మేలు కదా ! అంటాడు.
“జాతం వంశే భువనవిదితే
పుష్కరావార్తకానాం
జానామి త్వాం
ప్రకృతిపురుషం కామరూపం మఘోనః
తేనార్దిత్వం
త్వయి విధివశాద్దూర బంధుర్గతోsహం
యాంచా మోఘా
వరమధిగుణే నాధమే లబ్ధకామా “
ఈ మాటలద్వారా కవి ఎట్టివానికైన కర్తవ్య౦
విస్మరిoచడం తగదని, ఉత్తముని ఆశ్రయించి
లేదనిపించుకున్నా మంచిదేగాని నీచజనులను ఆశ్రయించరాదని ఉపదేశించాడు. ఇచ్చట “నీచాశ్రయ౦ న
కర్తవ్యం కర్తవ్యం మహాదాశ్రయం “ అనే సూక్తి
కాళిదాసు మాటల్లో వ్యక్తమైంది.
శాకుంతల౦లో రాజముద్రగల ఉంగరాన్ని
అమ్ముతున్న ఒక జాలరిని ఇద్దరు రాజభటులు బంధిస్తారు. ఆ ఉంగర౦ తనకెలా వచ్చిందని అతన్ని
ప్రశ్నిస్తారు. ఆ జాలరి తాను
శక్రావతారతీర్ధ౦లో చేపలు పట్టుకుని జీవిoచే
జాలరినని అంటాడు. అది విని ఆ రక్షకభటులలో ఒకడు జాలరితో “ఆహా! నీ వృత్తి
యెంత పవిత్రమై౦ది! అని ఆక్షేపిస్తాడు. అపుదు ఆ జాలరి రాజభటునితో అయ్యా! మనిషికి జీవనోపాధిగా
ఏ వృత్తి విధిoపబడునో ఆవృత్తి నిoదిoపదగినదే యయినప్పటికి దాన్ని విడిచిపెట్టకూడదు.
యజ్ఞాల్లో పశువుల్ని చంపే దారుణకర్మకు
పాల్పడుతున్న శ్రోత్రియబ్రాహ్మణుడు దయార్ద్రహృదయుడేగదా!
అందరు అతన్ని గౌరవిస్తున్నారు కదా! అని అంటాడు. కాళిదాసు ఈ మాటలద్వారా “సహజం కర్మ
కౌoతేయ ;స దోషమపి న త్యజేత్ “అను గీతాచార్యుని అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు. కాబట్టి మానవుడు తన జీవనోపాధికై
చేపట్టే వృత్తుల్లో హెచ్చుతగ్గులు లేవని మనిషి గొప్పదనం గుణాలనుబట్టి నిర్ణయిoచాలి
గాని వృత్తిని బట్టి గాదని కాళిదాసు మనకిచ్చిన సందేశం.
సహజం కిల యద్వినిందితం
న ఖలు తత్కర్మ వివర్జనీయo
పశుమారణకర్మదారుణో
హ్యనుకంపామృదురేవ శ్రోత్రియ:
సుఖదుఃఖాలనేవి మానవజీవితంలో భాగాలని,
అవి చక్రంలోని రేకుల వలె పైకి క్రిందకి తిరుగుతూ ఉంటాయని మనిషికి సుఖదు:ఖాలు శాశ్వతం
కావని సుఖదుఃఖాత్మకమైన ఈ జీవిత౦లో సుఖాలకు పొంగిపోక, దు:ఖాలకు కృoగిపోక ద్వoద్వాతీతుడుగా ఉండాలని
కాళిదాసు సూచించినాడు.
“కస్యాత్యంతం సుఖముపనతం దు:ఖమేకాంతతో వా
నీచైర్గచ్ఛత్యుపరి
చ దశాః చక్రనేమిక్రమేణ (మేఘసందేశము)
అంతేగాక మనిషి గొప్పదనం అతని గుణగణాలవల్లనే
గాని వయస్సు బట్టి కాదని “న ధర్మవృద్ధేషు
వయస్సమీక్ష్యతే “ అనే మాటల ద్వారా
కాళిదాసు వెల్లడించాడు. మనిషికి క్షణికమైన
ఈ శరీరం కంటె శాశ్వతమైన కీర్తియే ముఖ్యమని కర్తవ్యపాలనలో శరీరాన్ని విడిచి పెట్టడానికి కూడ
వెనుకాడరాదని దిలీపుని పాత్రద్వారా తెలియజేశాడు.
“ఏ కాంతవిధ్వంసిషు మద్విధానాం
పిండేష్వనాస్థా ఖలు భౌతికేషు “ (రఘువంశం )
ఇక దండనీతిని గూర్చి చెబుతూ శామయేత్ ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జునః అంటాడు.
అనగా దుర్మార్గుని దుర్మార్గ౦తోనే అణచివెయ్యాలిగాని మంచితన౦ పనికిరాదని అభిప్రాయం.
కాళిదాసు తన కావ్యాల్లో స్వీకరించిన ఇతివృత్తం ఉన్నతశ్రేణికిచెందిన వారిదే అయినా ఆవ్యక్తుల
ద్వారా అందించిన యాదర్శాలు సర్వజనసామాన్యాలు
, సహృదయసమ్మతాలు, ఆచరణ సాధ్యాలు ఔతున్నాయి. ఇటువంటి మానవజనకళ్యాణదాయకమైన ఉపదేశాలు ఆయన
కావ్యాల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. ఆయన కవిత ప్రత్యక్షర రమణీయం, ప్రజాసందేశమహనీయం. గ్రంధ విస్తరభీతిచే మచ్చుకు
కొన్ని మాత్రమే పేర్కొనడం జరిగింది. తక్కిన
విశేషాల్ని పాఠకులు స్వయంగా పరిశీలించి తెలిసికోగలరు.
ఈ విధ౦గా స్వల్పమైన పాత్రలద్వారా
అనల్పమైన మానవతాధర్మాలను అందించిన కాళిదాసును జాతీయకవిగా, భారతీయసనాతనధర్మ
ప్రవర్తకునిగా గౌరవించడం ఆయన ఆశయాలను
ఆచరించడం భారతీయుల మైన మన యందరి కనీసబాధ్యత.