Saturday, July 4, 2026

చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన కరుణావిజయం (పద్యనాటకం)-సమీక్ష

 

“పద్య నాటక రత్న”  చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన

కరుణావిజయం

(పద్యనాటకం)

ఒక విహంగ వీక్షణాత్మక సమీక్ష

సమీక్షకులు : డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

‘ఉత్తమశ్లోకచరిత ముదాహరణమర్హతి’ అన్నారు మన పెద్దలు . అంటే ఉత్తమ శ్లోకుడైన ఒక గొప్పవ్యక్తి  చరిత్ర అందరికి తెలియ జేయుటకు యోగ్యమైనది అని ఆ మాటలలోని సారాంశం . కాబట్టి లోకోత్తరుడయిన   బుద్ధభగవానుని జీవిత విశేషాలను, బోధలను ,  ఒక దృశ్య కావ్యంగా మలచి మనకు అందించిన నా మిత్రుడు వేంకటరత్నం గారికి ముందుగా అభినందనలు. వారు రచించిన ఈ పద్య నాటకం చదివి విగలిత వేద్యాంతరమైన, ఆనందాన్ని పొందాను.

ఇక “నాటకాంతం  హి సాహిత్యం” అన్నారు పెద్దలు . నాటకరచన సాహిత్య సృష్టికి ఒక పరాకాష్ఠ.   అందులోనూ రూప రహితమైన మనోభావాలకు రూపకల్పన చేసి  ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించడం అంత సులభమేమీ కాదు . ఆ ప్రయత్నంలో సంపూర్ణ విజయం సాధించారు వేంకటరత్నం గారు.  గతంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అశ్వఘోషుని సౌందరనందం, పింగళి కాటూరి కవుల సౌందరనందకావ్యం చదివిన వాడనే. ఇక ఈ పద్య నాటకం అశ్వఘోషుని సౌందరనందం లోని తాత్త్విక విశేషాలు, పింగళి కాటూరి కవుల సౌందరనంద కావ్య విశేషాలతో బాటుగా   దృశ్య కావ్యపు  సొబగులను సంతరించుకున్న   త్రివేణీ సంగమంలా మారింది. ఇక ఆ రెండు కావ్యాలను నిశితంగా పరిశీలించినవారికి వేంకటరత్నం గారి కృషి ఎంత మహత్తరమైనదో అర్థం ఔతుంది. ఇక “కవి ప్రతిభలోననుండు కావ్యగత శతాంశమునందు తొంబది యైన పాళ్ళు” అన్న విశ్వనాథ వారి మాటలను బట్టి ఆలోచిస్తే నాటకీకరణ కోసం వేంకటరత్నం గారు మూలంలో లేని    పాత్రలను  కల్పించిన తీరు  , సృష్టించిన సన్నివేశాలు, పాత్రోచితమైన నామకరణం    వారి ప్రతిభకు నిదర్శనాలుగా  కనిపిస్తున్నాయి .

      ఇక  రసహీనమైన తాత్త్విక విశేషాలకు  రసం పులిమి ప్రేక్షకులముందు ప్రదర్శించడం చాల కష్టమైన  పని . ఇది ఒక సవాలని  అందరికీ  తెలిసిన విషయమే. సాహిత్యంలో ‘ప్రబోధచంద్రోదయం’ , ‘సంకల్పసూర్యోదయం’ వంటి వేదాంత విషయ సంబంధమైన  నాటకాలు  చాల అరుదుగా కనిపిస్తున్నాయి . ఆ మార్గంలో  ప్రయాణం చేసి ఆయా నాటకాల్ని  రచించి వారు ఆహా అనిపిస్తే ఇప్పుడు వీరు ఈ నాటక రచన చేసి ఓహో అనిపించారు.       

ఇక ఇతివృత్తం మాటకొస్తే, నందుడు బుద్ధునకు సవతి సోదరుడు. అతడు అందగాడు, ఇంద్రియ లోలుడున్నూ. అతని భార్య సుందరి.  సుందరీ నందుల ప్రేమ చక్కనిదీ, చిక్కనిదీని. ఎంత చక్కనిదో అంత చిక్కనిది , ఎంత చిక్కనిదో, అంతే చక్కనిది.  ఒకనాడు వారిరువురు ఏకాంతంలో ఉండగా బుద్ధుడు భిక్షకై వారి ఇంటికి వెళతాడు. అతని రాకను గమనించలేని తమకంలో వారున్నారు. బుద్ధ భగవానుడు కొంత సేపు నిరీక్షించి వెనుదిరిగి వెళ్లి పోతాడు . ఆ తరువాత వారి పరిచారిక భగవానుని రాకను వారికి విన్నవిస్తుంది. నందుడు, జరిగినదానికి తీవ్రమైన  పరితాపం చెందుతాడు . అన్నగారి కాళ్ళపై పడి క్షమాపణ చెప్పుకోడానికి బయలుదేరతాడు . ఆమె క్షణంలో తిగిగి రమ్మని భర్తను కోరుకుంటుంది. నేను ఇప్పుడే నీ  చెక్కిళ్ళకు అలదిన మకరికాపత్రాల తడి ఆరక ముందే తిరిగి వస్తానని వాగ్దానం చేసి అక్కడ నుండి బయలు దేరతాడు . బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందునకు తన శిష్యుల ద్వారా ధర్మోపదేశం కావిస్తాడు . అంతే! నందుడు ఇక ఇంటికి తిరిగి వెళ్ళడు. ఆ తరువాత సుందరి బుద్ధ భగవానుని చేరుకొని ఆయన అనుమతితో బౌద్ధమతాన్ని స్వీకరింస్తుంది. వారిరువురు సమాజ సేవలో తమ జన్మలు  పునీతం చేసుకుంటారు . ఇది మూల కథలోని సారాంశం .  

వేంకటరత్నం గారు ఈ కథకు కొన్ని పాత్రలను , పాత్రలకు తగిన సన్నివేశాలను జోడించి ఈ పద్యనాటకాన్ని రచించారు. ఇక ప్రాచీన నాటక కర్తలు  నాటకరచన చేయడానికి ఎంత ప్రతిభ చూపించారో, ఆ నాటకానికి పేరు, నాందీ, ప్రస్తావనల కల్పనకు కూడ ఇంచుమించుగా అంతే ప్రతిభ కనబరిచేరు అనడం నిర్వివాదాంశం . అభిజ్ఞానశాకుంతలం , మృచ్ఛకటికం, వేణీ సంహారం మొదలైన నాటకాలు ఇందుకు ఉదాహరణ . ఈ నాటక రచయిత కూడ ఈ విషయంలో ఎంతో ప్రతిభను ప్రదర్శించారు.  

  ఈ నాటకంలో ఆరు అంకాలున్నాయి.

మొదటి అంకంలోని మొదటి రంగంలో  యశోధరా శుద్దోధనుల సంభాషణ ద్వారా బుద్ధభగవానుడు కపిలవస్తు నగరానికి వస్తున్నాడనే వార్త తెలుస్తుంది. యశోధర, తన  ఇంటి దీపం, మింటి దీపం గా మారిందని లోలోన సంతోషిస్తుంది . ప్రజలకు బుద్ధుని పై గల భక్తి,  ప్రపత్తులకు ; వారు బుద్ధునిపై కురిపించే ప్రశంసలకు  ఆమె పరవశించి పొతుంది .  ఆమె తన మామగారితోను  , కుమారునితోను కలసి బుద్ధుని చూడటానికి బయలుదేరుతుంది.

రెండవ రంగంలో బుద్ధభగవానుడు ఒక మర్రిచెట్టు క్రింద నున్న వేదికపై కూర్చుని శిష్యులకు జ్ఞాన బోధ చేస్తూ ఉంటాడు. తన వద్దకు చేరిన తండ్రి శుద్దోధనునకు, దీక్ష ప్రసాదిస్తాడు.  దీక్షకోసం పుర ప్రజలను ఆశ్రమానికి రమ్మని ఆదేశించి  తనకు మ్రొక్కిన భార్య యశోధరను , కుమారుడు రాహులుని ఆశీర్వదించి అక్కడ నుండి నిష్క్రమిస్తాడు .

రెండవ అంకం మొదటి రంగంలో సుందరీ నందుల ప్రణయ కలహం తోనూ  , శృంగార చేష్టలతోను  మనోరంజకంగా సాగుతుంది . సుందరి చెలికత్తె రాగమాలిక ప్రవేశించి నందునితో “ అయ్యగారూ! మీ అన్నగారైన బుద్ధభగవానులు భిక్షకోసం ఇంటికి వచ్చారని, ఇంటి ముందు నిలబడి ‘భిక్ష’ ‘భిక్ష’   ‘భిక్ష’ అని మూడుసార్లు అరిచి ఎటువంటి సమాధానం రాకపోయే సరికి వెనుదిరిగి వెళ్లి పోయారని వివరిస్తుంది. జరిగిన దానికి సుందరీ నందులు చాల బాధపడతారు.  నందుడు తాను  చేసిన తప్పుకు పరిహారంగా ఆశ్రమానికి వెళతానని,  ఆమెకు తాను అలదిన మకరికా పత్రాల తడి ఆరక ముందే తిరిగి వచ్చేస్తానని చెప్పి ఆమె  కౌగిలి వదలించుకుని బయలు దేరతాడు.  

రెండవ అంకం రెండవ రంగంలో బుద్ధుడు,  నందుల సమాగమంతో మొదలౌతుంది. బుద్ధుడు నందునకు   “ఈ ప్రపంచమంతా క్షణికమని, ఇంద్రియసుఖాలు క్షణ భంగురాలని ఉపదేశిస్తాడు . అంతలో బుద్ధుని శిష్యుడు సౌమత్యాయనుడు అక్కడకు రాగా తన తమ్మునకు దీక్షను ఇమ్మని అతనిని ఆదేశిస్తాడు. నందుడు ఎంత ప్రతిఘటిస్తున్నా వినకుండా సౌమత్యాయనుడు అతనిని తన వెంట లాక్కు పోతాడు .       

మూడవ అంకం మొదటి రంగం  సుందరి మనో వేదనతో ప్రారంభం ఔతుంది. తన భర్త జాడ తెలుసుకు రమ్మని చెలులను పంపిస్తుంది. తన నాథుడు రానందుకు విలపిస్తుంది , భర్తను అనుమానిస్తుంది , నిందిస్తుంది,  శపిస్తుంది . మరొక చెలి ద్వారా తన భర్త బుద్ధుని వెంట బౌద్ధ విహార మార్గంలో విహరిస్తున్నాడని విని తన భర్త సన్యాసి అయ్యే ఉంటాడని పరిపరి విధాల విలపిస్తుంది . చివరకు చెలులు ఆయన తప్పక తిరిగి వస్తాడని ధైర్యం చెప్పగా కాస్త ఎంగిలి పడుతుంది.

నాల్గవ అంకం మొదటి రంగంలో సుందరి కోసం విలపిస్తూ ఉలుకు పలుకు లేని నందునకు బౌద్ధ ధర్మ బోధలను వినిపించి సుందరీ గతమైన ప్రేమను విశ్వవ్యాప్తం చెయ్యమని  సమాజంలోని దీన జనులను సేవించమని హిత బోధ చేస్తాడు .

నాల్గవ అంకం రెండో రంగంలో కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా నందుని గట్టిగా మందలించగా నందుడు ‘ తాను కాముకుడను కానని , ప్రేమికుడని వాదిస్తాడు .  అప్పుడు బుద్ధుడు నందునితో  వైయక్తికమైన ప్రేమ పరిపూర్ణం కాదని అది విశ్వవ్యాప్తమైతే ఆనందాన్నే ప్రవహింప చేస్తుందని హిత బోధ చేస్తాడు.

అపుడు నందుడు గురుదేవా! స్వరాలు కలిస్తే రాగోదయమైనట్లు మనసులు కలిస్తే అనురాగోదయం ఔతుంది,  అది పరమ సుకుమారం, అతి మనోహరం, అని అంగీకరిస్తాడు. వారిద్దరి వాదోపవాదాల వలన ప్రేమ తత్త్వమే ఈ ప్రపంచాన్ని నడుపుతోందని, అది ‘నా’ అనే భావంతో కాకుండా మమత లేనట్టి ప్రేమ నిత్యమని ఈ ప్రపంచమంతా దు:ఖమయం కాబట్టి దు:ఖ  మగ్నులైన అందరికి అండగా ఉండమని బుద్ధుడు ఉపదేశిస్తాడు.

“ ప్రేమ కన్న సత్యము లేదు భిక్షువులకు

పరమ సత్యము కన్న సుందరము లేదు

లభ్యమైతి సౌందర్య లాలసుడ వీవు

రసమయము లౌను మన విహారమ్ములింక”

అని వివరించి శీలమే బౌద్ధ ధర్మమునకు మూలమని వివరిస్తాడు.

నందుడు సుందరిని కూడ బౌద్ధ ధర్మ దీక్షకు అనుమతించమని కోరగా “ నా కరుణకు నీ ప్రవర్తన వలన కలిగిన విజయం, సుందరి ప్రవేశం వలన ఘన విజయం కాగలదని పలికి అనుమతిస్తాడు.

ఐదవ అంకంలో కపిలవస్తు నగరం లోని ఒక వీథిలో శ్యామలాంబ, కోమలంబల సుదీర్ఘ మైన సంభాషణ ద్వారా సుందరిలో కలిగిన మానసిక పరివర్తన ప్రేక్షకులకు తేటతెల్లం ఔతుంది .          

ఆరవ అంకం మదటి రంగంలో బుద్ధ శిష్యుడైన సౌమత్యాయనుడు సుందరి ఇంటి ముందు నిలబడి ఉంటాడు. సుందరి అతనికి నమస్కరిస్తుంది. ఆయన తనను సుందరికి పరిచయం చేసుకుని ఆమెతో అమ్మా! గురుదేవులు నీ హృదయవేదనను అర్థం

చేసుకుని నీకు దీక్ష ఇవ్వడానికి నన్ను పంపించారని చెప్పి కాషాయవస్త్రాలను , భిక్షాపాత్రను, అందించి తలపై వెంట్రుకలు తీయించుకుని  రమ్మని ఆదేశిస్తాడు. ఆమె అంగీకరిస్తుంది. వారి పరస్పర సంభాషణ వలన ఆమెలో కలిగిన మానసిక పరిణతి ప్రేక్షకులకు అవగతం ఔతుంది. ఆమె సౌమత్యాయనుని సాగనంపి తాను  శిరోముండనం కావించుకుని , కాషాయవస్త్రాలు ధరించడానికి అక్కడ నుండి నిష్క్రమిస్తుంది.

ఆరవ అంకం రెండో రంగంలో కపిలవస్తు నగరం వెలుపల గల మాల వాడలోని ఒక పూరి గుడిసెలో కుక్కి మంచం పై చిక్కి శల్యమై మరణానికి చేరువలో  ఉన్న ‘శాంతిమాల’ అనే ఒక స్త్రీ దర్శనం ఇస్తుంది.  అక్కడ ఒక పసిపాపను గుండెలకు హత్తుకొని నందుడు నిలబడి ఉంటాడు . అక్కడ చండీదత్తుడనే ఆరు సంవత్సరాల బాలుడు తనను లాగుకొని రాగా సుందరి ప్రవేశిస్తుంది. సుందరీ నందులు ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరికొకరు దగ్గరగా చేరబోయి హఠాత్తుగా ఆగి పోతారు. నందుడు ప్రాణేశ్వరీ! అనబోయి, తనను తాను సముదాయించుకుని  సోదరీ! నీవా! అని సంబోధిస్తాడు. ఆమె కూడ ప్రాణేశ్వరా! అనబోయి   తనను తాను సముదాయించుకుని సోదరా! నీవా! అంటుంది.

‘శాంతిమాల’  వారితో “ నాకు మరణం సమీపిస్తోంది, అని చెప్పి తన శిశువుల వైపు తిరిగి ఆ శిశువులను సుందరీ నందులకు అప్పగించి శాశ్వతంగా కన్నుమూస్తుంది. అపుడు బుద్ధుడు వారితో  “మాతృహీనులైన ఈ అనాథ శిశువులను మీరు తప్పక కాపాడాలి ” అని చెపుతాడు. ఈ ప్రపంచంలో ఇంకా ఎందరో అనాథ సుందరీ నందులున్నారు, వారందరినీ ఆదుకున్నప్పుడే ఈ భువి దివిగా మారుతుంది, బౌద్దాశయం నెరవేరుతుంది అని చెపుతాడు.

బుద్ధుడు సుందరితో అమ్మా! భార్యా వియోగంలో మునిగిన నందుడు ఈ మార్గంలోకి రావడం ఒక విజయం, నీవు కూడ ఈ మార్గంలోకే రావడంతో అది ఘన విజయమైనది . పరస్పర ప్రేమికులైన మీరిద్దరూ మానవ ప్రేమికులు కావడంతో అది సంపూర్ణ విజయమైనది. ఇది ఒక వ్యక్తి  సాధించిన విజయం కాదు. ఇది కరుణా విజయం అని పేర్కొంటాడు. ఆ తరువాత సుందరీ నందులు చేసిన బుద్ధ స్తుతితో నాటకం ముగుస్తుంది .

 

ఇక మూల కథ,  కథలోని   సుందరీ నందులు , కొంతమంది బుద్ధుని శిష్యులు,  ప్రక్కన పెడితే మిగిలిన సంఘటనలన్నీ కవి ప్రతిభా కల్పితాలే. పాత్రల పేర్లు కాలానుగుణం పెట్టడం గమనార్హం . పాత్రోచిత భాష ప్రయోగించడం ప్రశంసనీయం .

ఇక ఈ నాటకంలో పింగళి, కాటూరి కవుల పద్యాల కూర్పు  బంగారు కంకణాలకు రత్నాలు పొదిగి నట్లుగా ఉంది. వీరి స్వీయరచనలైన గేయాలు బంగారానికి తావిని కూడ చేకూర్చిన విధంగా ఉంది . . ఇక సర్వ లక్షణ లక్షితం, సహృదయ హృదయానురంజకం ఐన ఈ నాటకాన్ని గురించి  ఎంత చెప్పిన అది చాలదు . నేను కొంత మాత్రమే చెప్పగలిగాను. ఈ నాటకానికి ఎంతోమంది మహాపండితులు ప్రశంసా వర్షాలు కురిపించడం ముదావహం .

ఈ నాటకాన్ని తదేకదీక్షతో చూసిన వారు పులకించకుండ ఉండలేరు, కంట తడి పెట్టక మానరు.  అయినా గారెల రుచి తింటేను, సంగీతం రుచి వింటేను, నాటకం రుచి కంటేను మాత్రమే తెలుస్తుంది . చదివితే పూర్తిగా తెలియదు. అందువల్ల నటన పట్ల ప్రావీణ్యం గల నటులు ఈ నాటకాన్ని పలు ప్రాంతాల్లో ప్రదర్శిస్తే దీని గొప్పదనం తెలుస్తుంది, బౌద్ధ ధర్మం కూడ దేశమంతా వెల్లి విరుస్తుందని నమ్ముతూ ఆ మహాయజ్ఞం తెలుగు వారికి  రాజధాని అమరావతితో ప్రారంభమైతే  మరింత సొబగు చేకుఱుతుందని భావిస్తూ , నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రుని హృదయపూర్వకంగా అభినందిస్తూ .....

దుర్గాప్రసాదరావు.        

9897959425.       

 

 

Thursday, June 25, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-12 రచన:- శ్రీ శంకరాచార్యులు

 

 ప్రశ్నోత్తర రత్నమాలికా Part-12

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

122.     ప్రశ్న :- క: సర్వదేవతాత్మా ?

ఎవరు సమస్త దేవతలకు నిలయుడు ?

 సమాధానం :-విద్యాకర్మాన్వితో విప్ర:

వేదాలు చదివి , వైదిక కర్మలను ఆచరించే బ్రాహ్మణుడు సకల దేవతా స్వరూపుడు.

123.     ప్రశ్న :- కశ్చ కులక్షయ హేతు: ?

ఏది వంశాన్ని నాశనం చేస్తుంది ?

సమాధానం :- సంతాప: సజ్జనేషు యో అకారి.

సజ్జనులకు చేసిన అపకారం వంశాన్ని నాశనం చేస్తుంది.

124.     ప్రశ్న :- కేషాం అమోఘ వచనం ?

ఎవరి మాటలు తిరుగు లేనివి?

సమాధానం :- యే చ పున: సత్య -మౌన -శమశీలా:

ఎవరు సత్యం , మౌనం ,ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో, వారి మాటలు తిరుగు లేనివి.  

125.     ప్రశ్న :- కిం జన్మ ?

జన్మ అంటే ఏది?

సమాధానం :-విషయ సంగ:

ఇంద్రియసంసర్గమే/ ఇంద్రియ సుఖముల పట్ల కోరికయే  జన్మకు కారణం.   

126.     ప్రశ్న :- కిముత్తరం జన్మ ?

మరో జన్మ అంటే ఏది?

 సమాధానం :-పుత్ర: స్యాత్

పుత్రుడే మరో జన్మ.  

127.     ప్రశ్న :- కో అపరిహార్య: ?

మనం నివారించలేనిది ఏది ?

 సమాధానం :- మృత్యు:

సమాధానం :- మనం నివారించ లేనిది మృత్యువు. ఉపనిషత్తు అంటుంది.

మృత్యో: బిభేషి కిం మూఢ! భీతం ముంచతి వై యమ:

 అజాతం నైవ గృహ్ణాతి కురు యత్నమజన్మని  

ఓరి మూర్ఖుడా ! మరణానికి ఎందుకు భయపడతావ్. నువ్వు భయపడితే నిన్ను యముడు వదిలిపెట్టేస్తాడని అనుకుంటున్నావా ! వదిలే ప్రసక్తి లేదు. ఒక పని చెయ్యి . ఆ యముడు పుట్టని వాళ్ళని ఏమీ చెయ్య లేడు. అందువల్ల పుట్ట కుండా ఉండడానికి (జన్మరాహిత్యానికి) ప్రయత్నించు. ఉపనిషత్తులు చదువుకో . నీకు మరణ భయం పునర్జన్మ ఉండవు.   

 128.     ప్రశ్న:- కుత్ర పదం నివసేచ్చ?

ఎక్కడ కాలు మోపాలి?

  సమాధానం :- దృక్పూతే

పవిత్రంగా కనిపించిన  స్థలంలో

129.     ప్రశ్న :- పాత్రం కిమన్నదానే?

అన్నదానానికి యోగ్యత ఏది? సమాధానం :-క్షుధితమ్.

ఆకలియే అన్నదానానికి యోగ్యత.

ఏ దానానికైన ఆ దానం పుచ్చుకునే వాడికి కొన్ని యోగ్యతలు ఉంటాయి . కాని అన్నదానానికి యోగ్యతలు చూడనక్కర లేదు. ఆకలియే యోగ్యత. ఏ మనిషైనా , జంతువైనా ఆకలితో కనిపిస్తే చాలు , వెంటనే అన్నం పెట్టండి. ఏమీ ఆలోచించొద్దు.    

130.     ప్రశ్న :- కోSర్చ్యో హి?

ఎవరు పూజింప దగిన వారు ?

సమాధానం :-భగవదవతార:

భగవంతుని అవతారము .

భగవంతుడు విద్యుత్ లాంటి వాడు . అది

ప్రత్యక్షంగా ఎవరికీ ఉపయోగపడదు. విద్యుత్తును ముట్టుకుంటే మనం వెంటనే  చచ్చిపోతాం . విద్యుత్తు ప్రత్యక్షంగా మనకు ఎవరికీ ఉపయోగపడకపోయినా T.V, Radio, మొదలైన     విద్యుదుప కరణాల ద్వారా ఎంతగానో ఉపయోగ పడుతోంది. కాబట్టి భగవంతునికి అవతార పురుషులకు మధ్య గల తేడా మనం అర్థం చేసుకోవాలి.

శివుడు, విష్ణువు భగవత్తత్వం, రామాదులు అవతార పురుషులు.

131.     ప్రశ్న :- కశ్చ భగవాన్ ?

భగవంతుడు ఎవరు?

సమాధానం:-మహేశ: శంకరనారాయణాత్మక:

శంకరనారాయణాత్మకుడైన మహేశ్వరుడు.

132.     ప్రశ్న :- ఫలమపి భగవద్భక్తే: కిం ? భగవద్భక్తికి ఏది ఫలం ?

సమాధానం :- తల్లోకస్వరూపసాక్షాత్కార:

మనం ఏ భగవంతుని  ఆరాధిస్తామో ఆ లోకం, ఆ లోకాధిపతి యొక్క సాక్షాత్కారం ఈ రెండు ఫలితాలు .

133.     ప్రశ్న :- మోక్షశ్చ క:?

మోక్షం అంటే ఏమిటి ?

సమాధానం :- (హి) అవిద్యాస్తమయ:

అవిద్యను నశింప చేసుకోవడమే మోక్షం  . మోక్షం అంటే అదేదో పొందేది కాదు. పోగొట్టుకునేది మాత్రమే.  ఎందుకంటే జీవుడు స్వయంగా బ్రహ్మమే ఐ ఉన్నాడు . అతడు నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావుడు . జీవత్వం అవిద్యా కల్పితం . ఇక అవిద్య అంటే ఏమిటో తెలుసుకుందాం.  అనిత్యాsశుచి దు:ఖాsనాత్మసు నిత్య, శుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా” అని శాస్త్రం చెపుతోంది. దీన్నిబట్టి అనిత్యాన్ని, నిత్యం గాను; అశుచిని, శుచిగాను ; దు:ఖాన్ని , సుఖంగాను ; అనాత్మను, ఆత్మగాను భావించడమే అవిద్య .  అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం కాదు , విపరీత జ్ఞానం మాత్రమే. అందుకే :

అనాత్మని చ  దేహాదావాత్మ బుద్ధిస్తు దేహినా

మవిద్యా తత్కృతో బంధ: తన్నాశో మోక్ష ఉచ్యతే

అన్నారు పెద్దలు. అనాత్మలైన దేహాదుల యందు ఆత్మ అనే భావన ఏదైతే ఉందో అదే అవిద్య, అందువల్లనే బంధం . జ్ఞానం వల్ల ఆ బంధం నశించడమే మోక్షం .       

134.     ప్రశ్న :- క: సర్వదేవ భూ: ?

ఏది అన్ని దేవతలకు మూలకారణం ?

 సమాధానం :- థ చ ఓం

‘అథ’ మరియు ‘ఓం’  అనేవి సమస్త దేవతలకు మూలం .

ఓంకారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ: పురా

కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్మాం గళికావుభౌ

అని శాస్త్రం చెపుతోంది .

సృష్టికి ముందు ఓం కారము , ‘అథ’ అనే శబ్దము ఈ రెండు బ్రహ్మయొక్క కంఠాన్ని ఛేదించుకుని బయటకు వచ్చాయట. . అందువల్ల ఈ రెండు చాల మంగళ ప్రదమైనవి, పవిత్రమైనవి . అందుకే ‘అథ’ శబ్దానుశాసనమ్, ‘అథ’ యోగానుశాసనమ్, ‘అథా’తో బ్రహ్మజిజ్ఞాసా.      అని అథ శబ్దంతో ప్రారంభించి శాస్త్రాలు రచించారు .

ఇత్యేషా కంఠస్థా ప్రశ్నోత్తర రత్నమాలికా యేషాం

తే ముక్తాభరణా ఇవ విమలాశ్చ భాంతి సత్సమాజేషు

ఈ ప్రశ్నోత్తర రత్నమాలికను ఎవరైతే కంఠస్థం చేసి ఆచరణ పూర్వకంగా ప్రవర్తిస్తారో వారు ఈ సమాజంలో ముత్యాల హారాలవలె స్వచ్ఛంగా ప్రకాశిస్తారు.  

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరభవగత్పూజ్యపాదకృత ప్రశ్నోత్తర రత్నమాలికా సమాప్తా .

                                                        <.><><>

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-11 రచన:- శ్రీ శంకరాచార్యులు

 

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-11

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

 

122.     ప్రశ్న :- () అజ్ఞానం కుత: ?

అజ్ఞానం ఎక్కడిది ?

సమాధానం :-అనాది:

అజ్ఞానం అనాది .

జీవ ఈశో విశుద్ధా చిత్ , తథా జీవేశయోర్భిదా

 అవిద్యా తచ్చితోర్యోగ: షడస్మాకమనాదయ:  

1.      జీవుడు  2.ఈశ్వరుడు  3. విశుద్ధమైన చైతన్యం ,  4. జీవేశ్వర భేదం  5. అవిద్య 6. అవిద్యకు చైతన్యంతో గల సంబంధం ఈ ఆఱు అనాదులు. ఇక అవిద్య అనాది ఐనప్పటికీ సాంతం . జ్ఞానం వల్ల  తొలగిపోతుంది.        

123.     ప్రశ్న :- వపుషశ్చ పోషకం కిం ?

శరీరాన్ని పోషించేది (నడిపించేది) ఏది?

సమాధానం :- ప్రారబ్ధం

ప్రారబ్ధమే శరీరాన్ని నడిపిస్తుంది .

కర్మలు మూడు విధాలుగా ఉంటాయి. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. మనందరికీ సులభంగా అర్థం అవ్వడం కోసం చెప్పుకోవాలంటే మనకు ఒక లక్ష రూపాయలు బ్యాంకులో ఉన్నాయనుకోండి, అది సంచితం. మనం వ్యాపారం చెయ్యడానికి కొంత ధనం తీసుకుని  ఏదో ఒక ఊరు వెళ్లి ఆ డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టాం  అనుకుందాం, అది ప్రారబ్ధం . అక్కడ మరల కొంత ధనం సంపాదిస్తాం. అది ఆగామి ఔతుంది.  మనం అనేక జన్మల్లో పోగేసుకున్న కర్మలు ఒక్క జన్మలోనే అనుభవించడం సాధ్యం కాదు కాబట్టి  కొన్ని కర్మలతో మనిషి పుడతాడు. ఇక జ్ఞానం కలిగిన వెంటనే సంచిత , ఆగామి కర్మలు నశిస్తాయి. “ప్రారబ్ధం భోగతో నశ్యేత్” అనే నియమం ప్రకారం అది మాత్రం అనుభవించి తీరాలని కొంతమంది వాదన. శ్రీ రామకృష్ణ పరమహంస , రమణమహర్షి వంటి కొంతమంది సిద్ధ పురుషులు అనుభవించిన కొన్ని శారీరకమైన యాతనలు ఇందుకు నిదర్శనం . ఇక కొంత మంది అభిప్రాయం ప్రకారం ఈ మూడు ఒకేసారి నశిస్తాయి. వారు “భిద్యతే హృదయ గ్రంథి: ఛిద్యంతే సర్వ సంశయా:

 క్షీయంతే చాsస్య కర్మాణి   తస్మిన్ దృష్టే పరావరే” అనే ఉపనిషద్వాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ కర్మాణి (బహువచనం) అన్నప్పుడు అవి ప్రారబ్ధం , సంచితం , ఆగామి కర్మలను సూచిస్తాయని వివరించారు. ఇక రమణమహర్షి వంటి మహనీయులు బాధలను అనుభవించారని, దాన్ని ప్రారబ్ధమని మీరు చెపుతున్నారు. మీరు మీ దృష్టిలో వారు  బాధపడుతున్నారని అనుకుంటున్నారు కాని వారికి  అవేమీ లేవని వాదిస్తున్నారు. ఇక “తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యేsథ సంపత్స్యే”  మొదలైన వాక్యాలు జీవన్ముక్తుడు ప్రారబ్ధ కర్మ అనుభవించడం కోసం కొంతకాలం శరీరంతో ఉంటాడని , అది పూర్తి కాగానే దేహ పాతానంతరం విదేహముక్తి పొందుతాడని చెపుతున్నాయి. ఉపనిషత్తులు ఏ విషయాన్నీ  పరస్పర విరుద్ధంగా చెప్పవు. ఇవన్నీ మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి              

124.     ప్రశ్న :- (చ) అన్నదాయి కిం ?

ఏది అన్నదాయి

సమాధానం:- (చ) ఆయు:

ఆయువు .

 ఎవరైనా మరణిస్తే ‘వాడికి నూకలు చెల్లి పోయాయి’ అని మనం నిత్య వ్యవహారంలో అంటూ ఉంటాం

125.     ప్రశ్న :- కో బ్రాహ్మణై: ఉపాస్య: ?

ఎవరు బ్రాహ్మణుని చేత ఉపాసింప దగిన వారు?

 సమాధానం :- గాయత్రీ - అర్క - అగ్ని- గోచర: శంభు:

గాయత్రి , సూర్యుడు, అగ్ని మొదలైన వారి ద్వారా తెలుసుకోదగిన శివుడు

126.     ప్రశ్న :- గాయత్ర్యామాదిత్యే చ అగ్నౌ శంభౌ చ కిం ను?

గాయత్రి , సూర్యుడు , అగ్ని , శివుడు వీరిలో ఏమి ఉన్నది .

సమాధానం :- తత్ తత్వం

తత్త్వం ఉన్నది .

మననాత్ త్రాయతే ఇతి మంత్ర:

మననం చేస్తే రక్షిస్తుంది కాబట్టి అది మంత్రం అయింది. న గాయత్ర్యా: పరం మంత్రం అనడం వల్ల గాయత్రిని మించిన మంత్రం లేదని తెలుస్తోంది.  ఇక సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం.  “అగ్ని ముఖా: వై దేవా:” అనడం వల్ల ఆయన గొప్ప సంధాన కర్త . శివుడు సాక్షాత్తుగా జ్ఞాన స్వరూపుడు .

127.     ప్రశ్న :- ప్రత్యక్షదేవతా కా?

మనకు  కళ్ళ యెదుట కన్పించే ప్రత్యక్ష దైవం ఎవరు ?

 సమాధానం :-మాతా

తల్లి మనకు  కళ్ళ యెదుట కన్పించే ప్రత్యక్ష దైవం

“మాతా కిల మనుష్యాణాం దైవతానాం చ దైవతమ్”  అంటాడు భాసమహాకవి .  

God created mother because, He can not stay every where.

128.     ప్రశ్న :- ప్రత్యక్షో గురుశ్చక: ?

ఎవరు ప్రత్యక్ష గురువు ?

సమాధానం :-తాత:

తండ్రి ప్రత్యక్ష గురువు.

><><