Saturday, May 18, 2024

శ్రీ నూతులపాటి రాఘవరావు గారి శత వసంత దినోత్సవ వేడుకల సందర్భంగా వారిగురించి నా మనసులోని నాలుగు మాటలు .

శ్రీ నూతులపాటి రాఘవరావు గారి శతవసంత దినోత్సవవేడుకల సందర్భంగా వారిగురించి నా మనసులోని  నాలుగు మాటలు .

        ఉత్తమ అధ్యాపకులు, అత్యుత్తమ సాహితీవేత్త శ్రీ రాఘవరావు గారి తో నాకు గల అనుబంధం అమూల్యం, పురాకృత సుకృత ఫలం . కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమా: అన్న ఉపనిషద్వాక్యానికి ఆయన ఉదాహరణ .   

        ఇక నేను 1-2- 85 లో అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో సంస్కృత అధ్యాపకునిగా చేరాను.  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యెర్నేని వేంకటేశ్వరరావు గారు పిల్లలకు నన్ను పరిచయం చేయమని వీరిని కోరినప్పుడు వీరు నన్ను వెంటబెట్టుకుని తరగతిగదికి తీసుకెళ్లారు. నేను వారి పాదాలకు నమస్కారం చేసి  నా మొదటి పాఠం మొదలు పెట్టాను.  వారి ఆశీర్వాద బలంతోనే  నా విధినిర్వహణ ఫలవంతమైందని నా ప్రగాఢ విశ్వాసం. శ్రీ రాఘవరావుగారిని  ఎవరైనా కదిపితే సాహిత్యం, వారు స్వయంగా పెదవి  కదిపితే సాహిత్యం, ఇక వారి చుట్టూ చేరేవారికి సాహిత్య సంబంధమైన ఇంపులు సొంపులు , గుబాళింపులు తప్ప వేరేమీ కనిపించవు.

      ఒక మనిషి వ్యక్తిత్వానికి ‘వకార పంచకం’ ముఖ్యమని పెద్దల చెబుతారు .

వస్త్రేణ వపుషా వాచా విద్యాయా వినయేన వా  వస్త్రం, రూపం, మాట తీరు, విద్య, వినయం. అనే  ఈ ఐదు అంశాల్లోను  రాఘవరావు గారు తెలుగు దనం ఉట్టిపడేలా ఉంటారు . వారి వస్త్ర ధారణ, రూపం,  మాట తీరు,  విద్య, వినయ సంపద  అందరికీ ఆదర్శప్రాయం.

     ఆ రోజుల్లో తెలుగు, సంస్కృత, హిందీ శాఖలు మూడు త్రివేణీ సంగమంలా ఒకచోట కలిసి ఉండేవి.   భాషలు వేరైనా ఒకే విషయం పైన సాహిత్య గోష్ఠి జరుగుతూ ఉండేది . వివిధ శాఖలకు చెందిన  సభ్యులు కూడ వచ్చి పాల్గొంటూ ఉండేవారు. రాఘవరావు గారు అన్ని అంశాలను సమన్వయ పరిచే వారు . అభిప్రాయ భేదాలొస్తే  వాటిని సమాధాన పరుస్తూ  సమన్వయ కర్తగా   పరిష్కారం ముద్ర  వేసేవారు. అసలు సిసలైన కొసమెరుపులతో సమావేశం ముగిసేది. నేను, ఆయన కలిసి కొన్ని వందల సాహిత్యసభల్లో పాల్గొన్నాం.  కొన్ని వారితో కలసి,  మరికొన్ని ఆయన ఆధ్వర్యవం లోనివి . ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో వారు లేకుండ  ఏ సాహిత్య సభ జరిగేది కాదు.  ఇక ఏ విషయం, ఎక్కడ, ఎంతవరకు, ఎలా మాట్లాడాలో  అలా ప్రసంగించే సంయమనం వారి సొత్తు. ఇక సభా నిర్వహణ వారికి వెన్నతో పెట్టిన విద్య. వారి ప్రసంగాలు ఆచార్య నిడదవోలు వేంకటరావు వంటి సాహిత్య విమర్శకులను, విశ్వనాథ , తుమ్మల వంటి మహాకవులను అలరింప చేశాయంటే ఎంత సభా రంజకంగా ఉండేవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుడివాడ భారతీ సమితిలో వారు ప్రసంగించని సాహిత్యాంశం  లేదంటే అతిశయోక్తి కాదు.

        ఇక శ్రీ రాఘవరావుగారిని కలుసుకున్నా,  వారి పేరు తలుచుకున్నా నా మనస్సులో రెండు పద్యాలు స్పురిస్తాయి. విశ్వనాథ వారు తమ గురువులైన చెళ్ళపిళ్ళ వారిని స్తుతిస్తూ ఇలా అంటారు.    

“తన యెద యెల్ల మెత్తన కృత ప్రతిపద్యము నంతకంటే మె

త్తన తన  శిష్యులన్న యెడదం గల ప్రేముడి చెప్పలేని మె

త్తనయగు  శత్రు పర్వత శతారము శ్రీ గురు చెళ్ళపిళ్ళ వేం

కన గురువంచు చెప్పుకొనగా నది గొప్ప తెలుంగు నాడునన్” .

రాఘవరావుగారి హృదయం చాల సున్నితం. మాట అంతకంటే మృదువైనది. శిష్య వాత్సల్యం చెప్పలేనంత మెత్తినది . ఆయన శిష్యకోటి నేటికి దేశవిదేశాల్లో సగర్వంగా తలెత్తుకు తిరుగుతూ సాహిత్యసౌరభాలు వెదజల్లుతున్నారు.  

మరో పద్యం .  

 “పుడమిని పెక్కు సత్కవులు పుట్టరె!  మెట్టరె ! సత్కవిత్వపుం

దొడిమలు చెళ్ళపిళ్ళకవితో  తులతూగెడువారె! వానలో

తడియని వారు మద్గురు వధానకవిత్వ మరందధారలో

కడుగనివారు నాకెచట కానగరారిల తెల్గు నాడునన్ .

 అన్నట్లుగా శ్రీ రాఘవరావుగారి ఉపన్యాస ధారలో మునిగి పునీతులు కాని వారు

తెలుగు నేలలో ఎవరు కనిపించరనే చెప్పాలి. ఇంత గొప్ప వ్యక్తిత్వం గల వీరు అతి సామాన్యంగా ఉండడం గమనిస్తే  ‘ కొండ అద్దమందు కొంచెమై ఉండదా’ అన్న వేమన సూక్తి అక్షరాలా నిజమనిపిస్తుంది.

వీరు మరెన్నో వసంతాలు ఆయురారోగ్యై శ్వర్యాలతో జీవిస్తూ సాహిత్యసేవ చేస్తూ భావితరాలకు ఆదర్శ ప్రాయంగా నిలవాలని కోరుకుంటూ....

                                                                        విధేయుడు,

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

గుడివాడ ,                                     9897959425

19-5-2024                       dr.cdprao@gmail.com

                                                          <><><>