Thursday, June 25, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-12 రచన:- శ్రీ శంకరాచార్యులు

 

 ప్రశ్నోత్తర రత్నమాలికా Part-12

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

122.     ప్రశ్న :- క: సర్వదేవతాత్మా ?

ఎవరు సమస్త దేవతలకు నిలయుడు ?

 సమాధానం :-విద్యాకర్మాన్వితో విప్ర:

వేదాలు చదివి , వైదిక కర్మలను ఆచరించే బ్రాహ్మణుడు సకల దేవతా స్వరూపుడు.

123.     ప్రశ్న :- కశ్చ కులక్షయ హేతు: ?

ఏది వంశాన్ని నాశనం చేస్తుంది ?

సమాధానం :- సంతాప: సజ్జనేషు యో అకారి.

సజ్జనులకు చేసిన అపకారం వంశాన్ని నాశనం చేస్తుంది.

124.     ప్రశ్న :- కేషాం అమోఘ వచనం ?

ఎవరి మాటలు తిరుగు లేనివి?

సమాధానం :- యే చ పున: సత్య -మౌన -శమశీలా:

ఎవరు సత్యం , మౌనం ,ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో, వారి మాటలు తిరుగు లేనివి.  

125.     ప్రశ్న :- కిం జన్మ ?

జన్మ అంటే ఏది?

సమాధానం :-విషయ సంగ:

ఇంద్రియసంసర్గమే/ ఇంద్రియ సుఖముల పట్ల కోరికయే  జన్మకు కారణం.   

126.     ప్రశ్న :- కిముత్తరం జన్మ ?

మరో జన్మ అంటే ఏది?

 సమాధానం :-పుత్ర: స్యాత్

పుత్రుడే మరో జన్మ.  

127.     ప్రశ్న :- కో అపరిహార్య: ?

మనం నివారించలేనిది ఏది ?

 సమాధానం :- మృత్యు:

సమాధానం :- మనం నివారించ లేనిది మృత్యువు. ఉపనిషత్తు అంటుంది.

మృత్యో: బిభేషి కిం మూఢ! భీతం ముంచతి వై యమ:

 అజాతం నైవ గృహ్ణాతి కురు యత్నమజన్మని  

ఓరి మూర్ఖుడా ! మరణానికి ఎందుకు భయపడతావ్. నువ్వు భయపడితే నిన్ను యముడు వదిలిపెట్టేస్తాడని అనుకుంటున్నావా ! వదిలే ప్రసక్తి లేదు. ఒక పని చెయ్యి . ఆ యముడు పుట్టని వాళ్ళని ఏమీ చెయ్య లేడు. అందువల్ల పుట్ట కుండా ఉండడానికి (జన్మరాహిత్యానికి) ప్రయత్నించు. ఉపనిషత్తులు చదువుకో . నీకు మరణ భయం పునర్జన్మ ఉండవు.   

 128.     ప్రశ్న:- కుత్ర పదం నివసేచ్చ?

ఎక్కడ కాలు మోపాలి?

  సమాధానం :- దృక్పూతే

పవిత్రంగా కనిపించిన  స్థలంలో

129.     ప్రశ్న :- పాత్రం కిమన్నదానే?

అన్నదానానికి యోగ్యత ఏది? సమాధానం :-క్షుధితమ్.

ఆకలియే అన్నదానానికి యోగ్యత.

ఏ దానానికైన ఆ దానం పుచ్చుకునే వాడికి కొన్ని యోగ్యతలు ఉంటాయి . కాని అన్నదానానికి యోగ్యతలు చూడనక్కర లేదు. ఆకలియే యోగ్యత. ఏ మనిషైనా , జంతువైనా ఆకలితో కనిపిస్తే చాలు , వెంటనే అన్నం పెట్టండి. ఏమీ ఆలోచించొద్దు.    

130.     ప్రశ్న :- కోSర్చ్యో హి?

ఎవరు పూజింప దగిన వారు ?

సమాధానం :-భగవదవతార:

భగవంతుని అవతారము .

భగవంతుడు విద్యుత్ లాంటి వాడు . అది

ప్రత్యక్షంగా ఎవరికీ ఉపయోగపడదు. విద్యుత్తును ముట్టుకుంటే మనం వెంటనే  చచ్చిపోతాం . విద్యుత్తు ప్రత్యక్షంగా మనకు ఎవరికీ ఉపయోగపడకపోయినా T.V, Radio, మొదలైన     విద్యుదుప కరణాల ద్వారా ఎంతగానో ఉపయోగ పడుతోంది. కాబట్టి భగవంతునికి అవతార పురుషులకు మధ్య గల తేడా మనం అర్థం చేసుకోవాలి.

శివుడు, విష్ణువు భగవత్తత్వం, రామాదులు అవతార పురుషులు.

131.     ప్రశ్న :- కశ్చ భగవాన్ ?

భగవంతుడు ఎవరు?

సమాధానం:-మహేశ: శంకరనారాయణాత్మక:

శంకరనారాయణాత్మకుడైన మహేశ్వరుడు.

132.     ప్రశ్న :- ఫలమపి భగవద్భక్తే: కిం ? భగవద్భక్తికి ఏది ఫలం ?

సమాధానం :- తల్లోకస్వరూపసాక్షాత్కార:

మనం ఏ భగవంతుని  ఆరాధిస్తామో ఆ లోకం, ఆ లోకాధిపతి యొక్క సాక్షాత్కారం ఈ రెండు ఫలితాలు .

133.     ప్రశ్న :- మోక్షశ్చ క:?

మోక్షం అంటే ఏమిటి ?

సమాధానం :- (హి) అవిద్యాస్తమయ:

అవిద్యను నశింప చేసుకోవడమే మోక్షం  . మోక్షం అంటే అదేదో పొందేది కాదు. పోగొట్టుకునేది మాత్రమే.  ఎందుకంటే జీవుడు స్వయంగా బ్రహ్మమే ఐ ఉన్నాడు . అతడు నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావుడు . జీవత్వం అవిద్యా కల్పితం . ఇక అవిద్య అంటే ఏమిటో తెలుసుకుందాం.  అనిత్యాsశుచి దు:ఖాsనాత్మసు నిత్య, శుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా” అని శాస్త్రం చెపుతోంది. దీన్నిబట్టి అనిత్యాన్ని, నిత్యం గాను; అశుచిని, శుచిగాను ; దు:ఖాన్ని , సుఖంగాను ; అనాత్మను, ఆత్మగాను భావించడమే అవిద్య .  అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం కాదు , విపరీత జ్ఞానం మాత్రమే. అందుకే :

అనాత్మని చ  దేహాదావాత్మ బుద్ధిస్తు దేహినా

మవిద్యా తత్కృతో బంధ: తన్నాశో మోక్ష ఉచ్యతే

అన్నారు పెద్దలు. అనాత్మలైన దేహాదుల యందు ఆత్మ అనే భావన ఏదైతే ఉందో అదే అవిద్య, అందువల్లనే బంధం . జ్ఞానం వల్ల ఆ బంధం నశించడమే మోక్షం .       

134.     ప్రశ్న :- క: సర్వదేవ భూ: ?

ఏది అన్ని దేవతలకు మూలకారణం ?

 సమాధానం :- థ చ ఓం

‘అథ’ మరియు ‘ఓం’  అనేవి సమస్త దేవతలకు మూలం .

ఓంకారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ: పురా

కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్మాం గళికావుభౌ

అని శాస్త్రం చెపుతోంది .

సృష్టికి ముందు ఓం కారము , ‘అథ’ అనే శబ్దము ఈ రెండు బ్రహ్మయొక్క కంఠాన్ని ఛేదించుకుని బయటకు వచ్చాయట. . అందువల్ల ఈ రెండు చాల మంగళ ప్రదమైనవి, పవిత్రమైనవి . అందుకే ‘అథ’ శబ్దానుశాసనమ్, ‘అథ’ యోగానుశాసనమ్, ‘అథా’తో బ్రహ్మజిజ్ఞాసా.      అని అథ శబ్దంతో ప్రారంభించి శాస్త్రాలు రచించారు .

ఇత్యేషా కంఠస్థా ప్రశ్నోత్తర రత్నమాలికా యేషాం

తే ముక్తాభరణా ఇవ విమలాశ్చ భాంతి సత్సమాజేషు

ఈ ప్రశ్నోత్తర రత్నమాలికను ఎవరైతే కంఠస్థం చేసి ఆచరణ పూర్వకంగా ప్రవర్తిస్తారో వారు ఈ సమాజంలో ముత్యాల హారాలవలె స్వచ్ఛంగా ప్రకాశిస్తారు.  

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరభవగత్పూజ్యపాదకృత ప్రశ్నోత్తర రత్నమాలికా సమాప్తా .

                                                        <.><><>

No comments: