Thursday, June 25, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-9 రచన:- శ్రీ శంకరాచార్యులు

 

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-9

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

122.     ప్రశ్న :- కో జగద్భర్తా?

ఈ జగత్తును ఎవడు భరిస్తున్నాడు?

 సమాధానం :- సూర్య:

సూర్యుడే ఈ జగత్తును భరిస్తున్నాడు. సూర్యుని సవితా అని కూడా పిలుస్తారు . షూఙ్ ప్రాణి ప్రసవే అనే  ధాతువు నుండి   ( सूयते इति सविता ) అనే వ్యుత్పత్తిని బట్టి ఆయనే వృక్ష జాలానికి (Flora) జంతుజాలానికి( Fauna) జీవనాధారం (He gives life to Flora and Fauna) అని తెలుస్తోంది.

123.     ప్రశ్న :- సర్వేషాం కో జీవనహేతు: ?

అందరికి ఎవరు జీవనాధారము ?

సమాధానం :-స: పర్జన్య:

మేఘమే అందరికీ జేవనాధారము.  

124.     ప్రశ్న :- క:  శూర: ?

ఎవడు శూరుడు/ పరాక్రమవంతుడు ?

సమాధానం :-యో భీతత్రాతా

ఎవడు ఆపదలో ఉన్నవారిని , భయపడేవారిని రక్షిస్తాడో అతడే శూరుడు/ పరాక్రమవంతుడు

125.     ప్రశ్న :- త్రాతా చ క: ?

మనకు రక్షకులు ఎవరు ?

సమాధానం :-స: గురు:

సంసార సాగరంలో పడి దిక్కు తోచక అలమటిస్తున్న  వారిని కాపాడ గలిగిన వాడు ఆ గురువు మాత్రమే. ఆయనే  మనకు రక్షకుడు .  

126.     ప్రశ్న :- కో హి జగద్గురురుక్త:?

ఎవరు జగద్గురువుగా చెప్పబడుతున్నాడు.?

 సమాధానం :-శంభు: శం భవతి అస్మాత్ (ఇతని వలన సుఖం కలుగుతుంది)ఇతి శంభు: అనే అర్థంలో శంభు: అనే పదం ఏర్పడింది.   

శివుడే జగద్గురువుగా చెప్ప బడుతున్నాడు. 

127.     ప్రశ్న :- జ్ఞానం కుత: ?

జ్ఞానం ఎవరి వలన కలుగుతుంది?

సమాధానం :-శివాదేవ

 జ్ఞానం శివుని వలన మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే ఆయన జ్ఞాన స్వరూపుడు.  

128.     ప్రశ్న :- ముక్తిం లభతే కస్మాత్?

దేని వలన ముక్తి లభిస్తుంది ?

సమాధానం :-ముకుందభక్తే:

ముకుందుని పట్ల భక్తి కలిగి ఉండడం వలన ముక్తి లభిస్తుంది

129.     ప్రశ్న :- ముకుంద: క:?

ఎవడు ముకుందుడు?

సమాధానం :-య: తారయేదవిద్యామ్

ఎవరు అవిద్యనుండి మనల్ని తరింపచేస్తాడో అతడే ముకుందుడు.

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ( భగవద్గీత )

నా ఆధీనములో ఉన్నది,  త్రిగుణాత్మకమైనది అగు ఈ మాయ ఎవరికీ దాటడానికి వీలు కానిది. ఇక ఎవరైతే నన్ను సేవిస్తారో వారు మాత్రమె ఈ మాయను దాటగలరు.  

130.     ప్రశ్న :- కా చ అవిద్యా ?

అవిద్య అంటే ఏది ?

సమాధానం :-యత్  ఆత్మనోsస్ఫూర్తి:

ఆత్మస్వరుపాన్ని మరుగుపరిచేదే అవిద్య

అనిత్యాsశుచి దు:ఖాsనాత్మసు నిత్యశుచిసుఖాత్మఖ్యాతిరవిద్యా” అని శాస్త్రం చెపుతోంది. దీన్నిబట్టి అనిత్యాన్ని నిత్యం గాను; అశుచిని శుచిగాను ; దు:ఖాన్ని సుఖంగాను ; అనాత్మను ఆత్మగాను భావించడమే అవిద్య .  అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం కాదు , విపరీత జ్ఞానం మాత్రమే, అంటే తప్పుడు భావన. అవిద్య జీవ గతం,  (micro) మాయ ఈశ్వర గతం (macro)  అని తెలుసు కోవాలి. ఒకటి జీవాశ్రయం రెండోది ఈశ్వరాశ్రయం.  

131.     ప్రశ్న :- కస్య న శోక: ?

ఎవడికి శోకం ఉండదు?

 సమాధానం :- య: స్యాదక్రోధ:

ఎవనికైతే క్రోధం ఉండదో అతనికి శోకం ఉండదు.

<><><>  

No comments: