Sunday, August 31, 2025

కలనైనా మఱువబోకు ‘కమ్మనైన’ అమ్మభాష రచన : డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

కలనైనా మఱువబోకు ‘కమ్మనైన’ అమ్మభాష

 

రచన : డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

9897959425

Revised

 

 

                సుప్రసిద్ధ సంస్కృత కవి , ఆలంకారికుడు, తత్త్వవేత్త అయిన  శ్రీ అప్పయ్య దీక్షితులు “ఆంధ్రత్వమాంధ్రభాషా చ, నాsల్పస్య తపస: ఫలం”  అన్నారు

. అంటే ఆ౦ధ్రుడుగా పుట్టడం, ఆంధ్రభాష మాట్లాడ గలగడం ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సిద్ధి౦చదని ఆ మాటలకర్థం .                                                   

​భాష ప్రాణం వంటిది . భాషను పోగొట్టుకుంటే మనం మన  ఉనికిని కోల్పోయినట్లే.  ప్రతి వారికి కనీసం,  తమ మాతతమ మాతృభూమి, తమ మాతృభాషలపట్ల ఎనలేని గౌరవం ఉండాలి. మాతృభాషను కించపరిస్తే  తల్లిని అవమానించి నట్లే అ౦టారు మన జాతిపిత మహాత్మా గాంధి . ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. जो मातृभाषा को अवगणना कर्ता है , वह अपनी माता की कर्ता है (Belittling ones mother Tongue is like disparaging ones own mother )

 ​తెలుగుభాష మాట్లాడేవారు తెలుగు రాష్ట్రాల్లో సుమారు తొమ్మిది కోట్ల మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లోను విదేశాల్లోను కూడ ఇంచుమించు అ౦త మందే ఉన్నారు. ఇంతమంది ఉన్నా కాలగతిలో మన భాష నిలుస్తుందా?, నిలవదా? అనే సందేహం మనకు లేకపోలేదు. దానికి కారణం ఒక భాష పదికాలాలపాటు మనుగడ సాగించాలంటే ఆ భాష మాట్లాడాలి, కేవలం మాట్లాడితేనే సరిపోదు, ఆ భాషలో  వ్రాయగలగాలి, వ్రాస్తేనే సరిపోదు, ఆ భాషలో సాహిత్యసృష్టి జరగాలి,  సాహిత్యసృష్టి జరిగినంత మాత్రాన సరిపోదు, ఆ సాహిత్యం జనసామాన్యానికి అందుబాటులో ఉండాలి. అప్పుడే ఏ భాషైనా కాలగతిలో  నిలుస్తుంది. లేకపోతే నిలిచే ప్రసక్తి లేదు.

 ఇక ప్రస్తుత విషయానికొస్తే నేటి తరం విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు మాతృభాషగా గల విద్యార్థులలో చాల మందికి  తెలుగుభాషపట్ల ప్రేమ లేదు. ఆంగ్లభాషమీదున్న ప్రేమలో వెయ్యో  వంతు కూడ ఆంధ్రభాషపైన లేదు . ఈ విషయంలో వారి వారి తల్లిదండ్రులే చాల వరకు కారణమని చెప్పక తప్పదు. అందరు తమతమ మాతృభాషలు రావడం గొప్పగా భావిస్తుంటే తెలుగువారమైన మనం తెలుగు భాష రాకపోవడం గొప్పగా భావిస్తున్నాం . నిజంగా ఇది సిగ్గుచేటు .  మదర్ టంగ్ రాని వాడికి అదర్ టంగ్ రాదు. అమ్మ భాష రానివాడికి అన్యభాష సరిగా రాదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పూర్వం విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్వ్యక్తుల్ని పరిశీలిస్తే వారందరూ తెలుగు భాషలో  నిష్ణాతులని తేలింది. నేడు చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు తెలుగుభాష నేర్పిస్తే సమయం వేస్టు అయిపోతుందని ఆ సమయాన్ని కూడ ఆ౦గ్లభాషకు కేటాయిస్తే ఇంకా ప్రగతిని సాధిస్తారనే అపోహలో ఉన్నారు .  అమ్మభాష రాని వాడికి అన్య భాష రానే రాదు. ఈమధ్యనే ఒక సంఘటన జరిగింది. పొరుగూరిలో  ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి కాలేజి నుండి తన ఇంటికొచ్చాడు . ఇంటికి తీసుకొచ్చిన ఆటో డ్రైవరు  అరవై ఐదు రుపాయిలైందని అతనికి చెప్పాడు . అతనికి పాపం అరవై ఐదంటే ఎంతో అర్థం కాలేదు . అడగడానికి నామోషి. అందువల్ల చిల్లర లేదని అబద్ధమాడి, ఇ౦ట్లోకెళ్ళి వాళ్ళ తాతను అరవై ఐదుకి అర్థం అడిగి తెలుసుకొని డబ్బు చెల్లించాడు. ఇదీ నేటి పరిస్థితి. ఇదే కొనసాగితే కొన్నాళ్ళకి బస్సుల మీది తెలుగులో వ్రాసే ఊళ్ళ పేర్లు చదవలేక ఇబ్బంది పడవలసిన స్థితి వస్తుంది .  

 ఇక ఆంగ్లభాష విషయానికొద్దాం. ఆంగ్లబాషను చాల రాష్ట్రాలవారు భాషగా నేర్చుకుంటున్నారు. మనం మాత్రం మీడియం ద్వారా నేర్చుకుంటున్నా౦. రెంటికి చాల తేడా ఉంది . భాషగా నేర్పే వాళ్ళు మంచిపండితులై ఉండి ఆ భాషలోని మెలుకువలు, మర్మాలు నేర్పుతారు. ఇక మీడియం విషయానికొస్తే ప్రతి వాడు అధ్యాపకుడే . వారికేమి తెలీదు. పుస్తకంలో ఉన్న విషయాన్ని క్లాసుల్లో చదివేసి , బట్టీ పట్టించి మార్కులు పోసేస్తున్నారు.  క్లాసుల్లో కుక్కింగు; పరీక్షల్లో కక్కింగు నేటి పరిస్థితి .  అందువల్ల  ఇంగ్లీషులో ఒక చిన్న అప్లికేషన్ కూడ వ్రాయలేక పోతున్నాడు. అటు ఇ౦గ్లీషు, ఇటు తెలుగు రెండు రాక రెంటికి చెడ్డ రేవడుగా తయారౌ తున్నాడు. అందుకే "ఇంగ్లీషును కాటుకగా దిద్దుకో గాని ఒళ్లంతా పూసుకోకు నల్ల బడతవు" అన్నారు శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు.

ఒక విద్యార్థి,  ప్రిన్సిపాల్ కి  లీవులెటరు వ్రాస్తూ please grant me leave for today as I am suffering from mouth motions అని వాశాడు . వా౦తి అనే దానికి ఏ పదం  వ్రాయాలో తెలియక  mouth motions  అని వ్రాశాడు . వాడి సంగతేమోగాని ఆ లెటర్ చదివి ప్రిన్సిపాల్ వా౦తి చేసుకున్నాడు .

ఇక కొంతమంది మిత్రులు తమకు తెలిసో, లేక తెలియకో  తెలుగును సులభం చెయ్యాలంటే కొన్ని వర్ణాలు తొలగించాలనే వాదన చేస్తూ ఉన్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఒక విద్యాశాఖాధికారి (D.E.O) గారు నా దగ్గరకు వచ్చి శకటరేఫ అంటే బండిఅరసున్న మొదలైన వర్ణాలు తొలగించాలని వాదించారు. నేనన్నాను, ఏమండి!  enough, committee మొ||   పదాలకు అన్ని అక్షరాలు అవసరమా?    కొన్ని తిసేయ్యొచ్చు కదా! తీసిచూడండి,  ఏ౦ జరుగుతుందో చూద్దాం అన్నాను.  ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేదు. అందువల్ల తెసేయడం పరిష్కారంకాదు.    శకటరేఫ (ఱ) విషయానికొద్దాం . బండి ర ఉపయోగించకుండ నీరు అంటే water,  ఉపయోగించి నీఱు అంటే ashes (బూడిద). పాఱు అంటే ప్రవహించడం పారు అంటే పారడం. ఒక అవధానంలో ఒకాయన అడిగారు . మనం బయలుదేరేటప్పుడు నక్క, కుడి ప్రక్క పారితే మంచిదా ఎడమ ప్రక్క నుండి పారితే మంచిదా అని . దానికి సమాధానంగా అవధాని గారు ఎటు పారినా పరవాలేదు మన మీద చి౦దకుండా ఉంటే చాలు అన్నారు.

ఇక అరసున్న విషయానికొద్దాం. వెలుగులో అరసున్న ఉంటే ప్రకాశం అని అర్థం.  (వెలు(గు).  ఒకవేళ అరసున్న లేకపోతే వెలుగు అనే పదానికి ‘ముళ్లకంచె’ అని అర్థం . చీకు అనే పదంలో అరసున్న ఉంటే గ్రుడ్డి అని అర్థం . నన్నయ గారు ధృతరాష్ట్రుని ‘చీ(కురాజు’ అనడం మనం గమనించవచ్చు. అరసున్న లేక పోతె ఆ పదానికి చీకిపోవడం అనే అర్థం వస్తుంది. అందువల్ల వాటిని మనం పిల్లలకు నేర్పినా నేర్పక పోయినా పరవా లేదు గాని తీసెయ్యడం మాత్రం చాల తప్పు . ఈ మధ్య కొంతమంది మహా ప్రాణ వర్ణాలు (ఖ,ఘ మొదలైనవి ) తొలగించమని అంటున్నారు. ఇప్పుడు తెలుగు భాషామతల్లి కనీసం కొన ఊపిరితోనైనా ఉంది. ఆ మహాప్రాణవర్ణాలు తొలగిస్తే, ప్రాణమే కోల్పోతుంది .

ఇక మరికొంత మంది టైము టిక్కెట్టు రోడ్డు మొ|| పదాలు వాడుతున్నాం . మనం మాట్లాడేది తెలుగే కాదు అని పిచ్చిపిచ్చిగా  వాదిస్తున్నారు.`ఇది చాల తప్పుడు అభిప్రాయం ఎందుకంటే Time అనేది ఆంగ్లపదం గాని టైము తెలుగుపదమే అవుతుంది . అలాగే Ticket ఆంగ్ల పదం, టిక్కెట్టు మాత్రం తెనుగు పదమే. అలాగే Road ఆంగ్లపదం  రోడ్డు తెలుగుపదమే.

భాషలో తత్సమం- తద్భవం- దేశ్యం- గ్రామ్యం అనే నాలుగు రకాల పదాలుంటాయి.  ‘రామ’ అనే సంస్కృతపదం తీసుకుని మనం రాముడు చేసుకున్నాం . అది తత్సమం . అగ్ని అనే పదం ,  ‘అగ్గి’ అయింది అది తద్భవం . ‘అక్క’ ‘అన్న’ మొదలైన పదాలు దేశ్యాలు అవి మన స్వంత పదాలు. అవి కాకు౦డ వస్తాడు ,  లెగుస్తాడు, కూకుంటాడు మొదలైనవి గ్రామ్యపదాలు . ఇక టైము రైలు మొ || అన్యదేశ్యాలు. ఇవన్ని తెలుగు పదాలే కాబట్టి వాటిని తెలుగుపదాలు కావనడం సాహసం . తొలగి౦చాలను కోవడం అవివేకం . 

భాష, ఎంత పెరిగితే అంత గొప్పదవుతు౦ది. అయ్యయ్యో! అమ్మాయి పెద్దదై పోతోంది పెద్దదైతే మరలా బట్టలు కుట్టి౦చాలి అని ఎవరైనా బాధ పడతారా! . పైగా ఆనందిస్తారు.  పెరిగే కొద్ది ఆనందంతో కొత్త బట్టలు కొట్టిస్తారు. ఎందుకంటే పెరుగుదల సహజం పెరగక పోవడం అసహజం  . అంగ్లభాష చూడండి ప్రపంచంలో ఉండే అన్ని భాషాపదాల్ని తనలో కలుపుకు౦టూ ఎంత విస్తృతంగా పెరిగిందో. ‘జనన్నాథ’ అనే పదాన్ని Juggernaut గా మార్చుకుని తనలో ఇముడ్చుకుంది . పండిత pandit అయింది . అలాగే gaddi గద్ది (సంహాసనం)   మొదలైన కొన్ని వందల, వేల  పదాలకు తన నిఘంటువులో స్థానం కల్పి౦చింది . ప్రతి సంవత్సరం నిఘంటువుల్ని, వ్యాకరణాన్ని మార్చుకుంటూ పోతోంది . మనం ఆ పనే చెయ్యాలి .

ఇక ఇంగ్లీషు భాష రాకపోతే ప్రగతి ఆగిపోతుందని వాది౦చేవాళ్ళు కొంతమంది లేక పోలేదు. భాష నేర్చుకుందాం తప్పు లేదు . కాని మన భాషను పోగొట్టుకుని మాత్రం కాదు .

కొంత కాలం క్రిత౦  మా గురువులైన ఆచార్య పోచంచర్ల శ్రీరామముర్తి గారు  జర్మని వెళ్ళారు . వాళ్లకు ఇంగ్లీషు రాదు, వీరికి జర్మన్ భాష రాదు. కాలం ఎలాగో గడిచి పోయింది, ఎవరికీ ఏమి రాకపోయినా కాలం ఆగదు కదా   . ఆయన, తిరిగి స్వదేశానికి వస్తున్నప్పుడు వారితో “మీకు ఆంగ్లం రాదు . నేర్చుకోవాలని ఎప్పుడు అని పి౦చలేదా! ఆంగ్లం రాకపోతే అభివృద్ధి సాధ్యమా ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా వారు మాకేమవసరం ప్రపంచంలో ఎవరు ఏ పుస్తకం వ్రాసినా అనతికాలంలోనే మాకు దాని జర్మన్ అనువాదం మా చేతిలో ఉంటుంది . ఆంగ్లం నేర్చు కోవడం మాకేమీ  అవసరం లేదు పొమ్మన్నారు . 

          దురదృష్టవశాత్తు అటువంటి అవకాశం మనకు  లేదు . అందువల్ల  మనం ఇ౦గ్లీషు నేర్చుకుంటే గాని డాక్టర్స్ కాలేం, ఇ౦జనీర్సు కాలేం . ఇదే ఆంగ్లభాషా వ్యామోహానికి ఒక ప్రథాన కారణం.  అందువల్ల మనం జర్మన్ దేశీయులమార్గాన్ననుసరి౦చాలి.

ఇక ఫ్రాన్సు  దేశం,  బ్రిటన్ కు చాల చేరువలో ఉంది . అందువల్ల ఆంగ్లం వాళ్ళ భాషను ఎక్కడ కబళించి వేస్తుందో అన్న భయంతో ఎన్నో ఆంక్షలు విధించారు . ఉదాహరణకి నేను విన్న, ఒక విషయం చెపుతాను . ఫ్రాన్సులో,  కార్యాలయాల్లో ఎవరైనా ఇ౦గ్లీషులో ఉత్తరం వ్రాస్తే  అది చి౦పి పారేస్తారు. లేకపోతే వాళ్ళ భాష అంతరించి ఇప్పటికి ఎన్నో శతాబ్దాలు అయు౦డేది.

మరికొంతమంది  ఉరుమురిమి మంగల౦ మీద పడిందన్నట్లుగా   సంస్కృతభాషమీద విరుచుకు పడుతున్నారు. పాపం! అదేం చేసింది తెలుగును పెంచి పోషించడం, అభివృద్ధి చేయడం తప్ప. గాంధీమహాత్ముడు అన్నారు Sanskrit is like river Ganges to our country if it is dried up all regional languages will lose their vitality and power.

అందువల్ల సంస్కృతాన్ని ద్వేషించడం జాతిని, జాతి పితను అవమానించడమే అవుతుంది.  

కాబట్టి  ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉండాలి. ఎక్కడ లోపం ఉందో అక్కడ సవరించాలి . రోగం ఒకటి వైద్యం మరొకటి కాకూడదు. ఒక ప్రక్క మాతృభాషను ఉద్ధరించాలి అంటూనే  ఇంగ్లీషు చదివేవారి పట్ల మక్కువ చూపిస్తుస్తున్నా౦. ఇది సబబు కాదు. తెలుగును ప్రోత్సహించాలి వారికి ప్రభుత్వ సంస్థల్లో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి  .  కాబట్టి సమస్యకు ఏది మూల కారణమో తెలుసుకుని దాన్ని గమనించి నివారించ కలిగితే, భాషారక్షణ అభివృద్ధి పెద్ద పనే౦ కాదు. భాష రక్షణకు అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిద్దాం . తెలుగులెంక, ​శ్రీ తుమ్మల సీతారామ మూర్తి గారి ఆవేదనా పూరితమైన పద్యంతో ముగిస్తాను.

బెంగాలీ కృతికర్త పాదములకర్పి౦చున్నమస్కారము

ప్పొంగున్  పారశిలేఖినీ విలసనంబుల్సూ చి రావయ్య నా 

బంగారంబ యటంచు నాంగ్లకవి నాహ్వానించు నేపాపమో! 

రంగా మెచ్చడు తెల్గుబడ్డ కవి సమ్రాట్టున్ స్వదేశీయునిన్  .​

మాతృభాషను రక్షించుకుందాం , ఆత్మ గౌరవాన్ని కాపాడు కుందాం . నమస్కారం .

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

9897959425.

 

><><><>< 

 

 

Saturday, August 30, 2025

అనుభవాలు-జ్ఞాపకాలు Part-12 రచన: డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                                                                    అనుభవాలు-జ్ఞాపకాలు

Part-12

రచన:

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

శ్రీ రాజీవగాంధీ భారతప్రధానిగా ఉంటున్న రోజుల్లో ,   U.G.C వారు ఉనతవిద్యాప్రణాళికలో రిఫ్రెషర్ కోర్సుల పేరుతొ ఒక స్కీమును మొదలుపెట్టారు . దాని ప్రకారం ప్రతి అధ్యాపకుడు తన జ్ఞానాన్ని పెంపొందిం చుకోవడం కోసం ఒక orientation-course,   మూడు refresher-courses విధిగా చెయ్యాలి. నాకు కూడ ఈ  కోర్సులు చేసే అవకాశం వచ్చింది . orientations courseలో అన్ని విషయాలకు సంబంధించిన అధ్యాపకులు ఉంటారు. ఇక refresher course మాత్రం  ప్రత్యేకించి ఆ సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. ఈ స్కీము ప్రకారం ఆయా విశ్వవిద్యాలయాల్లో నియమించబడిన ఒక విభాగం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది . వారు, అనేక ప్రాంతాల నుండి నిష్ణాతులైన పండితులను    రప్పించడం, వివిధ విషయాలపై ఉపన్యాసాలు ఇప్పించడం చేస్తారు . అవి చాల ఆసక్తికరంగా ఉంటాయి. వారి  ఉపన్యాసాల  తరువాత వారు చెప్పిన విషయాల పై చర్చ జరుగుతుంది.

ఒకసారి ఆంధ్రవిశ్వవిద్యాలయం ఒక వక్తను పిలిచారు . ఆయన Israil దేశంలోని ఒక విద్యాసంస్థలో ఆచార్యునిగా పనిచేస్తున్నారు. వారిని ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా    ఆహ్వానించారో, లేక ఆయన ఏ పని మీదనైనా ఈ దేశం వస్తే ఆయనను అక్కడకు  రమ్మని పిలిచారో,  నాకు సరిగా గుర్తు లేదు గాని ఆయన స్వీకరించిన అంశం మాత్రం అద్భుతమైనది. అది ఏమిటంటే, నత్కీరుని కథ,  తమిళంలోనూ , తెలుగులోనూ,   ఎలా ఉంది వాటిలోని భేదాల తులనాత్మక పరిశీలన. ఈ కథ శ్రీకాళహస్తి మాహాత్మ్యము లో మనకు కనిపిస్తుంది . కవి ధూర్జటి .

ఆయన ఆ చరిత్రను తులనాత్మకంగా, చక్కగా వివరించారు . నాకు నత్కీరుడు ఎవరో తెలుసు గాని ,  తమిళంలో ఆ కథ ఎలా ఉందో మాత్రం తెలియదు. . ఇక మిగిలిన వారిలో చాల మందికి  నత్కీరుడు అంటే ఎవరో కూడ తెలియదు .

పూర్వకాలంలో,  పాండ్యరాజు ఆస్థానంలో పన్నెండు మంది మహాకవులు ఉండేవారు. వారు అందరు శైవ సిద్ధాంత విజ్ఞానంలో సముద్దండ పండితులు .  వారిలో నత్కీరుడనే వాడు ఒకడు. ఆ దేశంలో ఒకప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి దొరకదు . ఆ దేశం లోని ఒక ఊరిలో ఒక శివార్చకుడు ఉంటాడు . ఆయన,  ఆకలికి సహించలేక ఆ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోడానికి సిద్ధమౌతాడు.    తనకు సెలవిమ్మని శివుని వేడుకుంటాడు .  అపుడు పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై ఒక పద్యం వ్రాసి ఇచ్చి అది రాజుకు చూపించమని  , సభలో చదవమని,  అలా చేస్తే రాజు ఎంతో కొంత  ధనం ఇస్తాడని,  ఆ ధనంతో సుఖంగా జీవించ వచ్చునని,  నచ్చ చెపుతాడు . ఆ శివార్చకుడు శివుని మాటను కాదనలేక  ఆయన, తనకు  వ్రాసి ఇచ్చిన పద్యాన్ని తీసి కొని వెళ్ళి, సభలో వినిపిస్తాడు  . ఆ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే స్త్రీల యొక్క  కేశపాశాలు సహజంగానే సౌరభం కలిగి ఉంటాయని. సభలో ఉన్న నత్కీరుడు అది విని, అది తప్పు అని,  కవితా ధర్మానికి  విరుద్ధమని  వాదిస్తాడు .    ఆ శివార్చకుడు వినయంతో,  అయ్యా! ఈ కవిత నాది కాదు, ఆ పరమేశ్వరుడే నాకు స్వయంగా వ్రాసి ఇచ్చాడు . అందులోని తప్పొప్పులు నాకు తెలియవు ,  సాక్షాత్తుగా ఆ శివుడు వ్రాసి ఇస్తే నేను చదివానని వివరిస్తాడు . ఆ తరువాత ఆ  శివార్చకుడు అవమానంతో, సిగ్గుతో, తలవంచుకుని  అక్కడి నుండి వెళ్ళిపోతాడు . వెంటనే శివుని చేరుకొని  ఓ శివా! నిన్ను నమ్మి నేను అవమానాల పాలయ్యాను . ఔనులే! ప్రతివాడు,  తాను నేర్చిన  విద్య మీద ఆధారపడి జీవించాలి, అంతే గాని  పరుల విద్యను నమ్ముకొని జీవిస్తే నా లాగే అవమానాల పాలు కాక తప్పదు. నిన్ను నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అయినా నా దురదృష్టం అలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే . నేను బయటకు పోయి, ముష్టి ఎత్తుకుని జీవిస్తాను. నాకు సెలవు ఇప్పించు అని వేడుకుంటాడు. శివుడు,  జరిగిన దానికి బాధపడి రాజాస్థానానికి వచ్చి కవితలో ఎక్కడ తప్పు ఉందో చెప్పమని రాజసభలో  అడుగుతాడు. నత్కీరుడు మునుపటి లాగే ఆక్షేపిస్తాడు . అప్పుడు శివుడు, అతనితో  గిరిజాదేవి కేశపాశాలు సహజ గంధాలు అంటాడు. నత్కీరుడు శివునితో ‘ఆమె కేశపాశాలు సహజ గంధాలు కావచ్చు,  ఇది మానవులకు వర్ణించుట  సబబు  కాదు, “ఇటువంటి లూలామాలపు  మాటలు చాలులే ”  అని శివుని కూడ ఆక్షేపిస్తాడు. శివుడు అతనికి తన మూడవ కన్ను చూపిస్తాడు. అపుడు నత్కీరుడు శివునితో “నీ తల చుట్టూ కళ్ళున్నా నేను భయపడను, నీ చేష్టలు కట్టిపెట్టు” అని నిలదీస్తాడు. శివుడు కోపించి నీకు కుష్ఠువ్యాధి సంక్రమిస్తుంది అని శపిస్తాడు . ఆ తరువాత నత్కీరుడు శివుని పాదములపై పడి తన అపరాధాన్ని క్షమింపుమని, శాపము తొలగు మార్గము తెలియజేయుమని, కోరగా శివుడు  అతనితో కైలాస శిఖరము చూచినప్పుడు మాత్రమే శాపము తొలగునని చెప్పి అదృశ్యమౌతాడు . నత్కీరుడు కైలాస దర్శనానికి బయలుదేరి  జంబునాథ శివలింగాన్ని, ఆ  తరువాత   అరుణాచలేశ్వరుని , కాంచీ క్షేత్రాన్ని నెల్లూరులో ఉన్న పెన్నానదిని , గుండ్లకమ్మను,  సమస్త పుణ్య క్షేత్రాలు తిరిగి, తిరిగి చివరకు, కృష్ణ వేణిని , గౌతమిని, పిఠాపురాన్ని , సింహాచల క్షేత్రాన్ని , శ్రీ కూర్మం , గోకర్ణం, పురుషోత్తమ క్షేత్రాన్ని , కటకాన్ని , జలేశ్వరాన్ని, నందనేశ్వరం, గగనేశ్వరం, గయా క్షేత్రం, గంగానదిని , విశ్వేశ్వరుని, విశాలాక్షిని, దర్శించి ఉత్తర దిక్కులో ప్రయాణం చేస్తూ ఒక భయంకరమైన అటవీ ప్రదేశంలో ప్రవేశిస్తాడు.  అక్కడ ఒక భూతానికి చిక్కుకుంటాడు . ఆ భూతం నత్కీరుని ఒక గుహలో దాచింది.  నత్కీరుడు ఒక్క కుమారస్వామి మాత్రమే ఆ భూతాన్ని చంపగలడు అని తెలుసుకొని ఆయనను ప్రార్థిస్తాడు .  కుమారస్వామి ఆ నత్కీరుని ప్రమాదం నుంచి రక్షిస్తాడు. అప్పుడు నత్కీరుడు కుమారస్వామితో ! స్వామీ !  నేను అజ్ఞానంతో  చాల తప్పు చేసి శివుని శాపానికి గుఱి అయ్యాను.  . నేను ఇప్పటికే చాల అలసిపోయాను కైలాస శిఖరాన్ని ఎలా చూడ గలను ?  నాకు శాపం ఎలా తొలగిపోతుంది ? అని అడుగుతాడు. అప్పుడు కుమారస్వామి నత్కీరునితో,  ఏమయ్యా! ఆ శివుడు కైలాసం అన్నాడు గాని ఉత్తర దిక్కులో ఉన్న కైలాసమని ప్రత్యేకంగా చెప్పలేదు కదా!

అందువల్ల అంతే మహత్త్వము కలిగిన,    దక్షిణ కైలాసంగా పేరుపొందిన,  శ్రీకాళహస్తిని దర్శించి నచో నీ శాపం తొలగి పోతుందని చెప్పగా నత్కీరుడు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దైవానుగ్రహానికి పాత్రుడై, శాపం నుంచి విముక్తుడు ఔతాడు.  తన వ్యాధిని పోగొట్టుకుంటాడు . ఇదీ సంగ్రహంగా కథ .   ఈ వృత్తాంతం ద్వారా ఎంత పండితునకైనా అహంకారం, దైవదూషణ తగదని గ్రహించాలి .           ఇక ఎక్కడో ఇజ్రాయిల్  దేశం నుంచి వచ్చిన  ఆ పండితుడు  ఈ కథను , స్వల్పమయిన మార్పులతో ఉన్న తమిళ కథను తులనాత్మకంగా వివరించి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇది తలుచుకున్నప్పుడు పసి హృదయానికి కల్లలు, రస రాజ్యానికి   ఎల్లలు లేవని పలికిన డాక్టర్ . సి . నారాయణ రెడ్డి గారి మాట తిరుగులేని సత్యం అనిపిస్తుంది .

            <><><>

Wednesday, August 27, 2025

ఆంధ్రులు-అద్వైత వేదాంత సేవ అధ్యాయం-3 -ఉత్తర-మీమాంసాదర్శనం

 

ఆంధ్రులు-అద్వైత వేదాంత సేవ

అధ్యాయం-3

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

భాషాప్రవీణ , వేదాంత విద్యాప్రవీణ ,

M.A. (సంస్కృతం), M. A. (తెలుగు)

M.A. (తత్త్వశాస్త్రం), Ph. D (సంస్కృతం) 

 

ఉత్తర-మీమాంసాదర్శనం

మనం ఇంతకు ముందు పూర్వ మీమాంసా దర్శనం దాని స్వరూపం, ఉద్దేశ్యం, లక్షణాలు గురించి సంగ్రహంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం . ఇప్పుడు ఉత్తరమీమాంసాదర్శనం గురించి తెలుసుకుందాం . దీనికే వేదాంత దర్శనమని మరో పేరు కూడ ఉంది . వేదాంతము అంటే ఉపనిషత్తు .

వేదం ముందుగా కర్మల యొక్క ప్రాధాన్యాన్ని వివరించి చిట్టచివరకు కర్మల వలన పరమప్రయోజనం నెరవేరదని, అది ఆత్మ జ్ఞానం వల్లనే కలుగుతుందని స్పష్టం చేసింది. అంతేగాక ఉత్తర మీమాంసా దర్శనం  ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు అత్యద్భుతంగా ప్రతిపాదించింది . అందుకే ఇది అన్ని దర్శనాలలో అత్యుత్తమ దర్శనంగా చెప్పబడుతూ ఉంది.

ఈ వేదాంత దర్శనం, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు , భగవద్గీత అనే ముక్కాలి పీటపై నిలిచి ఉంది . ఆత్మా వా అరే ద్రష్టవ్య: , శ్రోతవ్య: , మంతవ్య: , నిదిధ్యాసితవ్య: అంటుంది ఉపనిషత్తు .

ఆత్మదర్శనం కోసం శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి , నిదిధ్యాసనం చెయ్యాలని ఆ మాటలకు అర్థం .

శ్రవణ స్థానీయాలు ఉపనిషత్తులు ,  మనన స్థానీయాలు బ్రహ్మసూత్రాలు, నిదిధ్యాసనం కోసం భగవద్గీత .   

 శ్రోతవ్య: శ్రుతి వాక్యేభ్య: మంతవ్యశ్చోపపత్తిభి: మత్వా చ సతతం ధ్యేయ: ఏతే దర్శన హేతవ: అని పెద్దల మాట.

    ఉపనిషత్తులు 108 లభిస్తున్నా పది ఉపనిషత్తులను చాల  ప్రముఖమైనవిగా పెద్దలు అంగీకరించారు .

ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరి:,

ఐతరేయం, చ ఛాందోగ్యం, బృహదారణ్యకం, దశ . ఉపనిషద్ ఋషులు ద్రష్టలు . వారు ఆత్మ పదార్థాన్ని అనేక కోణాలలో దర్శించడం వల్ల

అనేక రూపాలలో  కనిపించింది . ఉదాహరణకి  హిమాలయ పర్వతాలు భారత దేశం వైపు నుంచి చూస్తే ఒక లాగా , పాకిస్తాన్ నుంచి చూస్తే మరో లాగా , చైనా నుంచి చూస్తే ఇంకో లాగా బర్మా నుంచి చూస్తే మరో విధం గాను కనిపిస్తాయి . చూసే కోణంలో తేడా గాని పర్వతాలు అవే. అలాగే ఉపనిషత్తులు ఆత్మ స్వరూపాన్ని వర్ణిస్తూ “మనసైవ అనుద్రష్టవ్య:” అంటే ఆత్మను మనస్సుతోనే దర్శించాలి, అని ఒక చోట చెప్పి  మరొక చోట “ యన్మనసా న మనుతే అంటే మనస్సుతో తెలుసుకోలేము అని చెపుతుంది . ఒక చోట ‘తదేజతి’ అంటే ఆత్మ కదులుతుంది అని చెప్పి వెంటనే    ‘తన్నైజతి’ ఆత్మకు చలనం లేదు అంటుంది . అలాగే ‘తద్దూరే’ అంటే, ఆత్మ చాల దూరంలో ఉంది అని చెప్పి వెను వెంటనే  ‘త దు అన్తికే’ అంటే అది చాల దగ్గరలో ఉంది అంటుంది.  ఇవి పైకి పరస్పర విరుద్ధాలు గా కనిపిం చినా అవి విద్ధాలు కావు .  ఆ వైరుధ్యాన్ని తర్క బద్ధంగా తొలగించడం కోసం బ్రహ్మ సూత్రాలు రచించారు బాదరాయణ మహర్షి. వేదాంతవాక్యాలనే పువ్వులను సూత్రాలనే త్రాళ్ళతో దండగా  కూర్చారని శ్రీ శంకరులు స్వయంగా చెప్పడం మనం గమనిస్తాం . ‘బదరము’ అంటే రేగి చెట్టు . వ్యాసుడు రేగి చెట్ల వనంలో నివసించడం చేత ఆయనకు బాదరాయణుడు అని పేరు. వచ్చింది.  జీవునకు బ్రహ్మత్వాన్ని ప్రతిపాదించే సూత్రాలు  బ్రహ్మ సూత్రాలు, అవి 555.

బాదరాయణులు తమ బ్రహ్మ సూత్రాల్లో అంతకు ముందున్న కొంతమంది ఆచార్యుల అభిప్రాయాలను సమీక్షించారు . ఆ సిద్ధాంతాలను ‘ఆర్షవేదాంతము’ అని పిలుస్తారు. ఇక శ్రీ శంకరులకు ముందే సుందర పాండ్యుడు, ద్రవిడాచార్యుడు, బ్రహ్మనంది, భర్తృప్రపంచుడు , భర్తృహరి మొదలైన ఆచార్యులు ఎందరో ఉన్నారు. బ్రహ్మ సూత్రాలకు శ్రీశంకరులకు ముందే ఉపవర్షాచార్యుల వారు వ్యాఖ్యానం వ్రాశారని అది జ్ఞాన కర్మ సముచ్చయ వాదాన్ని సమర్థిస్తుందని పెద్దలు చెపుతున్నారు. ఈయన క్రీస్తు పూర్వం రెండు ఒకటి శతాబ్దాల మధ్యకాలంలో నివసించారని సాంప్రదాయ వాదుల విశ్వాసం . ఈ గ్రంథం నేడు మనకు లభించడం లేదు .

ఇక భగవద్గీత 700 శ్లోకాలతో కూడినది . ఇది ఉపనిషత్తులకు  సారాంశము కావడం వల్ల  ఈ మూడు గ్రంథాలు వేదాంత దర్శనానికి మూల గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి.   

అన్ని ఇతర దర్శనాలు తార్కికమైన  ఆలోచనపై ఆధారపడితే వేదాంత దర్శనం శ్రుతికి అనుకూలమైన తర్కం మరియు అనుభవంపై ఆధారపడింది .

ఉదాహరణకి మనం ఒక వస్తువును చూస్తున్నాం అనుకుందాం . కన్ను చూడడం లేదు; అలాగే ఒక శబ్దం వింటున్నామనుకుందాం , చెవి వినడం లేదు . అలాగే ఎవరితోనో మాట్లాడుతున్నాం  అనుకుందాం . నోరు మాట్లాడడం లేదు. ఒక చోటి నుండి మరొక చోటికి నడిచి వెడుతున్నామనుకుందాం . కాళ్ళు నడవడం లేదు. అదే వాస్తవమైతే శవం కూడ ఆయా పనులు చెయ్యాలి . కాని అలా జరగడం లేదు. కాబట్టి దేహము , ఇంద్రియాలకు అతీతమైన ఒక (శక్తి) పదార్థం వీటి ద్వారా ఈ   అన్ని పనులు చేస్తోంది. అందుకే ‘నేను ఎవరిని చూస్తున్నానో అతనితోనే మాట్లాడు తున్నాను’ అని మనం అంటాం. కాని వాస్తవానికి ఇక్కడ చూసే కన్ను  జ్ఞానేంద్రియం,  మాట్లాడే నోరు కర్మేంద్రియం  . అ రెండు వేరు . కాని ఈ రెంటికి ‘నేను’తో సంబంధం.   

ఇంకో ఉదాహరణ.  ‘నా ఇల్లు’ అంటే ‘నేను’ వేరు ‘ఇల్లు’ వేరు . అలాగే ‘నా కన్ను’ అంటాం . అంటే ‘కన్ను’ వేరు, నేను వేరు . నా చేయి అంటాం. దీన్ని బట్టి చేయి వేరు నేను  వేరు . అలాగే నా శరీరం అనగా శరీరం వేరు నేను వేరు .

అలాగే ఇంట్లో ఒక వ్యక్తి  మరణిస్తే వాడు పోయాడు అంటాం లేదా ఆమె పోయింది అంటాం . కాని శరీరం అక్కడే ఉంది . దీన్ని బట్టి శరీర, ఇంద్రియాలకు అతీతంగా ఒక శక్తి దాగి ఉందనే మాట స్పష్టం ఔతోంది . అదే మన అసలైన స్వరూపం అంటుంది వేదాంత శాస్త్రం .

 ఇక ‘నేను లేను’ అని ఎవడు అన లేడు. ఎవడైతే  ‘నేను లేను’  అని అంటాడో వాడి మాట “మా అమ్మ గొడ్రాలు”   అనే మాట వంటిది. వాళ్ళ అమ్మ గొడ్రాలైతే వాడేలా పుడతాడు? పుట్టడు కదా!  ఇక  నేను అనేది ఆత్మగా నిజం. కాని మనం  దాన్ని మన శరీరంతోను , ఇంద్రియాలతోను  కలగాపులగం చేసి నేను  లావుగా ఉన్నాను, నేను కుంటి వాణ్ణి, నేను గ్రుడ్డివాణ్ణి, నేను చెవిటి వాణ్ణి,  నేను మూగవాణ్ణి అని అనుకుంటున్నాం . ఆత్మకు ఇవేమీ లేవు . కాబట్టి శరీర, ఇంద్రియ ధర్మాలను ఆత్మయందు మనం ఆరోపించుకుని వ్యవహరిస్తున్నాం .  

ఇక అద్వైత సిద్దాంతంలో బ్రహ్మమే సత్యం . ఈ జగత్తు మిథ్య . జీవుడు బ్రహ్మ కంటే భిన్నుడు కాదు . ఇక్కడ మిథ్య అంటే అది లేదని కాదు . దానికి సంబంధించిన అసలైన వాస్తవ రూపం తెలియగానే అంతవరకు ఉన్న తప్పుడు జ్ఞానం తొలగిపోతుంది అని అర్థం . ‘ సమ్యగ్ జ్ఞాన బాధ్యత్వం మిథ్యాత్వమ్’ అని శాస్త్రం చెప్పింది.

ఒక వ్యక్తి మసక మసక చీకటిలో నడుస్తూ ఒక త్రాడుపై కాలు వేశాడు. ఆ త్రాటిని పాముగా పొరబడ్డాడు . వెంటనే చెమటలు, నోటి నుండి నురగలు రావడం మొదలౌతాయి.

ఆ తరువాత మరో వ్యక్తి అక్కడకు వచ్చి దీపపు కాంతిలో దాన్ని చూపించి అది పాము కాదు త్రాడు మాత్రమె అని చెప్పగానే అంత వరకు ఆవరించి యున్న భయమంతా తొలగిపోతుంది.

ఇక్కడ శాస్త్రం ఏమి చెపుతుందంటే ముందుగా లేనిది, ఆ తరువాత లేనిదీ మధ్యలో కూడ లేదని, అది కేవలం భ్రాంతి మాత్రమె అని చెపుతుంది .

‘ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేsపి తత్తథా

వితథై: సదృశా: సంత: అవితథా ఇవ లక్షితా:’       బ్రహ్మ నిర్గుణమైనది, అపరిమితమైనది , ఆనంద రూపమైనది, అయినప్పటికీ శరీరంలో ఉండి, శరీరంతో తాదాత్మ్యం చెందటం వలన నేను అనే భావనను కలిగిస్తోంది. ఇక తానుగా ఉంటున్న ఆత్మను నేనుగా భావించడమే అన్ని అనర్థాలకు మూలం .    శరీరంలో ప్రత్యగాత్మ రూపంలో ఉన్న జీవుడు పరమాత్మకంటే భిన్నుడు కాడు అని శ్రీశంకరుల అద్వైతం , ఇక ఈ శరీరంలో గల జీవుని యందు అంతర్యామిగా పరమేశ్వరుడున్నాడని శ్రీరామానుజుల విశిష్టాద్వైతం , జీవుడు, పరమేశ్వరుడు వేర్వేరని శ్రీమధ్వాచార్యుల  ద్వైతం చెపుతున్నాయి . ఆ సిద్ధాంతాలన్నీ ప్రస్తుతం అప్రస్తుతం .  

వేదాంతశాస్త్రం ఈ ప్రపంచానికందించిన ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం అప్రస్తుతం కాదు .

ఉపనిషత్తు “వాచారంభణం వికారో నామధేయం , మృత్తికేత్యేవ సత్యం” అనే ఒక అమూల్యమైన మాట పలికింది . అదేమిటంటే పేరు, ఆకారం, కేవలం వ్యవహారం కోసమే అందులో ఉండే వస్తువు ఒక్కటే అని ఆ మాటలకు అర్థం . మట్టితో చేసిన పాత్రలయొక్క నామ, రూపాలు  వేరైనా మట్టి ఒక్కటే.

      ఉదాహరణకు మనం ఒక బంగారు ఆభరణం ముక్కు దగ్గర ధరిస్తే అది ముక్కుపుడకని, చెవికి పెట్టుకుంటే కుండలం  అని, మెడలో తగిలించుకుంటే హారమని, నడుమునకు బిగించుకుంటే అది  ఓఢ్యాణమని అంటాం . వాటి రూపం , పేరు మాత్రమె వేరు, కానీ అంతా బంగారమే. అలాగే భారతదేశానికి తూర్పున ఉన్నది బంగాళాఖాతమని, దక్షిణాన ఉన్నది హిందు మహాసముద్రమని , పశ్చిమాన ఉన్నది అరేబియా సముద్రమని వివిధమైన పేర్లతో పిలుస్తాం. వాస్తవానికి అంతా నీరే. పేర్లు కేవలం వ్యవహారం కోసమే. అలాగే భగవంతుని మనం ఏ పేర్లతో పిలుస్తున్నా ఆయనలోని సచ్చిదానందరూపం ఒకటే. పేర్లు పట్టుకుని కొట్టుకు చావకండి అంటుంది ఉపనిషత్తు.

ఈ విషయాన్నే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథమైన ఋద్వేదం “ ఏకం సద్విప్రా: బహుధా వదంతి ” అని నొక్కి చెప్పింది . ఉన్న పదార్థం ఒక్కటే , దానిని భిన్న భిన్న వ్యక్తులు భిన్న భిన్న విధాలుగా చెపుతున్నారు అని ఆ మాటలకు అర్థం .     

 

ఇక ఈ అద్వైత వేదాంత శాస్త్రం, ఆకాశం కంటే ఉన్నతమైనది , సముద్రం కంటే లోతైనది, భూమండలం కంటే విశాలమైనది .  కొన్ని వేల గ్రంథాలతో కూడి ఉంది . అవి సూత్ర గ్రంథాలు, వివరణ గ్రంథాలు , వ్యాఖ్యానాలు , ఉప వ్యాఖ్యానాలు, ఖండన, మండనాత్మక గ్రంథాలుగా మనకు లభిస్తున్నాయి .

ఈ అద్వైత సిద్ధాంతంలోనే భామతీ ప్రస్థానం, వివరణ ప్రస్థానం , వార్తిక ప్రస్థానం అనే భిన్న భిన్నమైన  అభిప్రాయాలతో కూడిన ప్రస్థానాలున్నాయి. వారు కొన్ని సిద్ధాంతాలలో పరస్పరం విభేదించినప్పటికి జీవ, బ్రహ్మైక్య విషయంలో ఏకాభిప్రాయమే ఉండడం వల్ల అద్వైతసిద్ధాంతానికి ఎటువంటి విఘాతం కలుగ లేదు. ఇక ఈ సిద్ధాంత వ్యాప్తికి ఆంధ్రులు చేసిన కృషి సంస్తుతి పాత్రం . అవన్నీ ముందు ముందు తెలుసుకుందాం.     

<><><>