Friday, September 10, 2021

A Unique Poem on Lord Vinayaka

 

A Unique Poem on Lord Vinayaka

                          Dr. Ch. DurgaprasadaRao 

 

मातामहमहाशैलं महस्तदपितामहम्

कारणं जगतां वन्दे कण्ठादुपरि वारणम्   [dprc1] 

(Author - not known to me)

Maataamaha mahaashailaM

mahastadapitaamahaM

kaaraNaM jagataaM vande

KaNThaadupari vaaraNaM

 I salute the God (Vinayaka) who has the great Himalaya as his Matamaha (mother’s father) , who has no pitaamaha ( father’s father), who has an elephant head on his neck and who is said to be the creator of the worlds.

मातामहमहाशैलं =who has the great mountain as his matamaha (mother’s father)

अपितामहम् = one , who has no grandfather (Father’s father)

जगतां = for all the worlds

कारणं = cause. by being the creator

कण्ठात् +उपपरि = on the upper part of the neck  

वारणम्   [dprc2] = who has elephant head

तत्+मह:= That great being

वन्दे = I salute.

I salute that great being whose matamaha ( mother’s father) is the great Himalaya , who does not have pitaamaha ( Father’s father) , who has elephant’s head on his neck and who is said to be the creator of all the worlds.

 

మాతామహ మహాశైలం మహస్తదపితామాహం

కారణం జగతాం వందే కంఠాదుపరి వారణం   

మాతామహ మహాశైలం= గొప్పపర్వతమే ( హిమాలయం ) మాతామహుడుగా ( తల్లికి తండ్రి )   కలవాడు  

 అపితామాహం = పితామహుడు (తండ్రికి తండ్రి) లేనివాడు

జగతాం = సర్వలోకాలకు

కారణం = కారణ భూతమైనవాడు (సృష్టికర్త )

కంఠాత్+ ఉపరి= కంఠo పైన

 వారణం= ఏనుగు (ముఖం ) గల

 తత్+మహ: = ఆ తేజస్సునకు  

వందే = నమస్కరించు చున్నాను


పర్వతరాజైన హిమవంతుడే మాతామహుడుగా కలవాడు , పితామహుడు లేనివాడు ,

 కoఠముపైన ఏనుగు (తల) కలిగినవాడు , సర్వలోకాలకు సృష్టికర్తయైన 

( గాణాపత్యులు వినాయకుని సృష్టికర్తగా భావిస్తారు)  ఆ గొప్పతేజస్సుకు నేను నమస్కారం చేస్తున్నాను .  

 

Thursday, June 10, 2021

హృద్యం-తెనుగు పద్యం 6 ( సిద్ధాంతమేదైన నా రక్షణ బాధ్యతనీదే )

 

 హృద్యం-తెనుగు పద్యం 6

( సిద్ధాంతమేదైన నా రక్షణ బాధ్యతనీదే )

                                             డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు .

                          గతతరానికి సంబంధించిన తెలుగు  కవులలో శ్రీచిలకమర్తి . లక్ష్మీనరసింహం పంతులుగారొకరు. వారు కేవలం కవి మాత్రమే కాదు చారిత్రక పరిశోధకులు  , నాటకకర్త,  నిష్కళంక దేశభక్తులు , సంఘ సంస్కర్త  , ఆంగ్లేయుల నెదిరించిన తొలి తెలుగు కవి. ఆయన రచించిన గయోపాఖ్యానం ఆనాడే ఒక లక్ష ప్రతులు అమ్ముడయ్యాయంటే ఆయన కవిత్వం ఎంత ప్రజారంజకంగా ఉండేదో మనం ఊ హిoచుకోవచ్చు. ఆయన F.A చదువుతున్నప్పుడు ఆయనకు రెండు కళ్ళు పోయాయి . ఆయనను Andhra Milton అనికూడా కొంత మందిపిలుస్తారు .

                         శ్రీ చిలకమర్తి వారి పద్య రచనా సౌ౦దర్యానికి “ కృపా౦భోనిధి” శతకం  ఒక పరాకాష్థ . ఇది మొట్టమొదటి సారిగా సంఘ సంస్కర్త రాజారామమోహన్ రాయ్ గారి నిర్యాణ శతాబ్ది సందర్భంగా 1933 లో తెలుగువారికి లభించింది .

   తరువాత ఎన్నో ఏళ్ళకు శ్రీయుతులు Y.S.నరసింహా రావు , Dy.E.o. s. సుబ్బరాజు, ప్రముఖ సాహితీ విమర్శకులు    అక్కిరాజు రామాపతిరావుగార్ల ప్రోత్సాహంతో శ్రీ యుతులు గంధం సుబ్రహ్మణ్యం, పురాణపండ శ్రీనివాసు గార్ల  సహకారంతో శ్రీ పెరుమాళ్ళ రఘునాథ్ గారు ఈ గ్రంథాన్ని మనకందించారు .

ఒక పద్యాన్ని పరిశీలిద్దాం . ఈ పద్యo ద్వారా భారతీయ తత్త్వశాస్త్రంలోని ఎన్నో విషయాలు  వారికి కరతలామలకాలని  తెలుస్తోంది .

 

ద్వైతుల్ జెప్పెడి భంగి నన్యుడనొ దేవా నేను , నీకంటె న

ద్వైతుల్ జెప్పెడి మాడ్కి నీశ్వరుడనో  తల్పన్ విశిష్టాఖ్యుల

ద్వైతుల్ చెప్పునటుల్ మరొక్కడనొ నే భావిo పనెట్లైన నీ    

చేతన్ రక్షణమొంద నర్హుడజుమీ శ్రీ మత్ కృపా౦భో నిధీ!

 

ఓ పరమ దయాళుడా !

ద్వైతులు చెప్పిన విధంగా నువ్వు నేను వేరు కావచ్చు, అద్వైతులు చెప్పిన విధంగా నువ్వు నేను ఒకరే కావచ్చు , అలాగే విశిష్టాద్వైతులు చెప్పిన ప్రకారంగా నువ్వు నాలో అంతర్యామివి  కావచ్చు. అదంతా నాకు తెలియదు నన్ను రక్షించవలసిన బాధ్యత మాత్రం నీదే సుమా ! అని కవి ఒక ప్రక్క చాల అమాయకంగా, మరో ప్రక్క చాల గడుసుగా ప్రార్థించడం ఈ పద్యంలోని విశేషం .

ఎంత అందంగా ఉందీ పద్యం. ఇక స్వల్పంగా సిద్దాంతాల గురించి తెలుసుకుందాం . వేదాంత శాస్త్రానికి ఉపనిషత్తులు , బ్రహ్మసూత్రాలు , భగవద్గీత అనేవి ఆధార గ్రంథాలు . ఇక ఉపనిషత్తులకు తార్కికపరమైన వ్యాఖ్యానం బ్రహ్మ సూత్రాలైతే ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత. ఈ మూడు ఆధారం చేసుకుని శ్రీశంకరాచార్యులు అద్వైతసిద్ధాంతాన్ని నెలకొల్పారు. వారు  “సర్వం ఖల్విదం బ్రహ్మ  నేహ నానాస్తి కించన” మొదలైన అద్వైతపరమైన శ్రుతులను స్వీకరించి జీతాత్మకు పరమాత్మకు మధ్య ఏకత్వాన్ని ప్రతిపాదించారు . ఒక ‘బూందీలడ్డు’ ఉదాహరణగా తీసుకుoటే మొత్తం లడ్డు పరమాత్మ అoదులో ఉన్న బూందీ పలుకు  జీవాత్మ. ఇది అర్థం చేసుకోడానికి   నేను     చెప్పే ఉదాహరణ, అంతేగాని అద్వైత సిద్ధాంత మంటే బూందీ లడ్డు అనుకోకండి. ఇక లడ్డులో ఎటువంటి మాధుర్యాది గుణాలున్నాయో అవన్నీ  ఒక్కొక్క బూందీపలుకు  లోను ఉన్నాయి . ఎటొచ్చీ   పరిమాణంలో SIZE లోనే తేడా ఉoది. అలాగే పరమేశ్వరునిలో ఉండే సత్- చిత్- ఆనందాది గుణాలు జీవునిలో కూడా ఉన్నాయి.   

  ఇక శ్రీ రామానుజాచార్యులవారు. “ఆత్మనా అనుప్రవిశ్య, నామరూపే వ్యాకరవాణి”, “ఆత్మానం అంతరో యమయతి “ మొదలైన శ్రుతులను  ప్రథానంగా స్వీకరించి భగవంతుని అంతర్యామిగా ప్రతిపాదించారు. ఆయన సిద్దాంతం బట్టి

శరీరం , ఆ శరీరంలో జీవుడు , ఆ జీవునిలో అంతర్యామిగా

పరమేశ్వరుడు అని  three steps  ఉన్నాయి . మనం సులభంగా అర్థం చేసుకోవాలనుకుంటే సోడాబుడ్డి శరీరం , అందులో ఉన్న ద్రవం జీవుడు, గోళీ అంతర్యామి . సృష్టికి ముందే ఈశ్వరుడు నేను సకల జీవ , జడ పదార్థాల్లోను అంతర్యామిగా  ప్రవేశిస్తానని ప్రతిజ్ఞ చెయ్యడం వల్ల జీవ విశిష్టమైన (అంతర్యామిగా) ఉన్న పరమేశ్వరునకు సృష్టికర్తకూ ( బేదం లేక పోవడం వల్ల ఇది విశిష్టాద్వైతo అయ్యింది . ఆయన ఈయన ఒకరే కదా!

  ఇక మనం ద్వైతసిద్ధాతం పరిశీలిద్దాం  శ్రీ మధ్వాచార్యుల వారు “ ద్వా సుపర్ణా సయుజా: సఖాయా: సమానం వృక్షం పరిషస్వజాతే: తయోరన్య: పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభి చాకశీతి “ మొదలైన శ్రుతులు తీసుకుని జీవునికి పరమేశ్వరునికి భేదం  ప్రతిపాదిం చారు . వారి అభిప్రాయం ప్రకారం ఈ ప్రపంచంలో ఐదు భేదాలున్నాయి .

1.                            పరమేశ్వరుడికి జీవుడికి మధ్య  భేదం

2.                            జీవుడికీ జీవుడికి మధ్య  బేదం

3.                            జీవుడికి  జడపదార్థానికి మధ్య  భేదం

4.                            జడానికి జడానికి మధ్య భేదం

5.                            జడానికి పరమేశ్వడుడికీ మధ్య  భేదం  

ఈ విధంగా పంచ భేద వాది ఆయన.

ఇటువంటి మహాకవుల  భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిoచకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .    

 

Monday, May 31, 2021

హృద్యం-తెనుగు పద్యం -5

 

హృద్యం-తెనుగు పద్యం -5

(అమ్మా -నాన్న  నీకప్పగి౦చారు నీదే బాధ్యత)

                                      డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

గత శతాబ్దానికి చెందిన తెనుగు శతక కవులలో  శ్రీ   శరభేo ద్రకవి ఒకరు.  ఆయన శ్రీ కాలళహస్తి శతకాన్ని రచించారు. ఆయన బాణాలస వంశానికి  చెందిన వారు. విశ్వకర్మకుల భూషణుడు . తండ్రి పేరు భద్రయ. ఇందులో 107 పద్యాలున్నాయి. అన్నీ చంపకోత్పలాలే. ఎక్కువ పద్యాలు ఐదు పాదాలతో కూడి ఉన్నాయి.

ఈ శతకాన్ని యస్ .వి. గోపాల్ అండ్ కో.. ఆనంద భారతీ ముద్రాక్షరశాల ( మద్రాసు) లో  1950 లో ముద్రించారు .  ఎన్నో శివపురాణ కథలు ఇందులో మనకు కనిపిస్తాయి.  ఈ శతకం  ఆయన  ప్రతిభకు ఒక దర్పణoగా నిలుస్తోంది . ముందుగా పద్యం . ఈ శతకంలో కొన్ని ముద్రణ దొషాలు కూడ కనిపిస్తున్నాయి.

తత్తర నన్ను గన్న తలిదండ్రులె యెత్తుక ముద్దులాడి నీ

పొత్తున డించి యీశ్వరుడు పోషణ చేయునటంచు గట్టిగా

దత్తము చేసినారు గురుదైవము నిద్దరు నాకు నీవె సా

క్షాత్తు నిజస్వరూపమును గన్నుల జూపుము కాoక్ష దీర సం

రక్షక ! కాళహస్తిబుధరంజిత సాంబశివా!  మహా ప్రభో   !      

 ఓ సాంబశివా ! స్వయంగా నన్ను కన్న నా తలిదండ్రులే  నువ్వే నన్ను రక్షించి , పోషించాలని నన్ను నీకు దత్తత చేసి వెళ్లి పోయారు. అప్పటినుంచి గురువు , దైవo  ఆ రెండు నాకు నువ్వే   కాబట్టి నీ యథార్థ స్వరూపాన్ని సాక్షాత్తుగా  నాకు చూపించు. దైవం , గురువు వీరిద్దరిలో దైవంకన్న గురువు మిన్న అన్నారు పెద్దలు . ఎ౦దుకంటే దైవం గురువును చూపించలేక పోవచ్చు గాని గురువు దైవాన్ని చూపించగలడు. నాకు గురువు దైవం ఈ రెండు నువ్వే కాబట్టి నీ దర్శనం నాకు ప్రసాదించమని ఆవేదనతో చెప్పిన ఈ పద్యం చాల హృదయం గమం .

ఇటువంటి మహాకవుల  భావనల ను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .    

 

Friday, May 28, 2021

హృద్యం-తెనుగు పద్యం -4 (ఒకరికి కుడుములు మరొకరికి ఇడుములు)


  

హృద్యం-తెనుగు పద్యం -4

(ఒకరికి కుడుములు మరొకరికి ఇడుములు)


డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

గత శతాబ్దానికి చెందిన తెనుగు కవులలో  శ్రీ మాధవపెద్ది బుచ్చి సు౦దరరామశాస్త్రి గారొకరు . ఆయన  గొప్ప శివభక్తులు . ఆయన తమ జీవితమంతా కటిక పేదరికంతోను , కష్టాలతోను  గడిపి ఉంటారని ఈ శతకం లోని కొన్ని పద్యాల వల్ల  మనకు తెలుస్తోంది. శివుణ్ణి ఎంత చమత్కారంగా దెప్పి పొడుస్తున్నారో గమనిస్తే కవి గారి ఆవేదన పాఠకుల మనస్సులో మెదిలి గుండె కరిగి నీరై పోతుంది . భక్తీ , ఆవేదన , ఈసడింపు, ఆశాభావం , నిరాశ,  వెక్కిరి౦పులతో కూడిన  ఈ శతకం  ఆయన  ప్రతిభకు ఒక దర్పణoగా నిలుస్తోంది . ముందుగా పద్యం .

 

ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టిదే నీకు చా

లకకాబోలును సృష్టి చేసితివి ఈ లంబోదరుo గూడ తీ

గకు కాయల్  బరువౌన కానీ , కుడుముల్ కల్పించి యవ్వానికే

లొకొ  యివ్వానికి నొక్క మైని యిడుముల్  మోల్పిo తు మృత్జయా !

ఓ శివా నీకు ఒక లంబోదరుడైన పుత్రుడు( వినాయకుడు ) న్నాడు  చాలడా . మరలా మరొక లంబోదరుణ్ణి (నన్ను) సృష్టించావు .  తీగకు కాయలు బరువుకాదు  . నువ్వు ఆయనకు కుడుములు కల్పిమ్చావు నాకు మాత్రం  యిడుములు (కష్టాలు ) మొలిపిస్తున్నావు . ఇదెక్కడి న్యాయం . నువ్వే చెప్పు అన్నాడు .

ఇటువంటి చమత్కారాలని మనం నేటి తరానికి వివరించాలి .  

ఇటువంటి మహాకవుల  భావనల ను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .       

 

Thursday, May 27, 2021

హృద్యం-తెనుగుపద్యం -3 (నరుడే నారాయణుడు)

 

హృద్యం-తెనుగుపద్యం -3

(నరుడే నారాయణుడు)


డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

గత తరానికి చెందిన తెనుగు కవులలో శ్రీ గుర్రం జాషువ గారొకరు. కరుణ రసాన్ని  ఆలంబనగా చేసుకొని తన  కవితా శక్తిని లోకకళ్యాణానికి వెచ్చించి కృతకృత్యుడైన మహాను భావుడాయన.

సాటి మనిషిని మనిషిగా చూడలేని ఈ సాంఘిక వ్యవస్థను, మత దురాచారాలను ఆయన విశేషంగా దుయ్యబట్టారు. “నరుని కష్ట పెట్టి నారాయణుభజించు ధర్మ శీలురున్న ధరణి మనది”  అని ఆక్రోశించారు .

దేవుని పేరుతో, భక్తి ముసుగులో మానవత్వం  మంటగలిసి పోవడం ఆయన  సహిoచలేకపోయారు. నిజమే! మానవత్వం మనిషితో పాటు పుట్టింది . మతం మనిషి పుట్టిన కొన్ని లక్షల సంవత్సరాల తరువాత పుట్టింది . ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే రీతిలో  మతం మానవత్వాన్నే మఱచిపోయేలా చేస్తోంది . ఇక జాషువ గారిలో ఒక ప్రత్యేకత ఉంది. .  తప్పు ఎవరు చేసినా నిందించారు. మంచి ఎక్కడున్నా మెచ్చు కున్నారు.

ఇక ప్రస్తుత విషయానికొద్దాం . మానవత్వాన్ని కాలరాచే మత మౌఢ్యాన్ని ఎంత తీవ్రంగా ఖండిం చారో చూద్దాం .  ముందుగా పద్యం .

 

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయి౦ త్రు గాని దు:

ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్

మెదుకువిదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్ల దే

 వతలెగ బడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే !

( గబ్బిలం - శ్రీ గుర్రం జాషువ)


ఈ జనం విగ్రహాలపెళ్లిళ్లకు, ఊరేగిo పులకు  వేలాది,  లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు గాని ఆకలితో అలమటిస్తున్న పేదల , ఫకీరుల శూన్యమైన భిక్షాపాత్రల్లో ఒక్క మెదుకు కూడ విదల్పరు. వీళ్ళ వంతు రావాలంటే ముప్పై మూడుకోట్ల  దేవలల్ని ముందుగా  సంతృప్తి పరచాలి . అది జరిగే పని  కాదని  , వీళ్ళ ఆకలి కూడ త్వరలో తీరేదీ కాదని కవి తన ఆవేదనని వ్యక్తం చేశారు.   

     ఈ పద్యం మత ఛాందసవాదులకు ఒక కను విప్పు కావాలని జాషువ గారు రచించారు. ఇది మతాన్ని విమర్శించడం కాదు, మనిషిని మనిషిగా గుర్తించలేని కొంత మంది వ్యక్తుల పోకడలను నిరసి౦చడమే. ఇటువంటి వారు అన్ని మతాల్లోను ఉంటారు.  వారికి  మానవత్వపు విలువలు తెలియ జేయడానికే  ఈ పద్యం .

ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .        

 

Wednesday, May 26, 2021

 

          హృద్యం-తెనుగు పద్యం -2

   నాణ్యమైన ముక్తికి నాలుగే మార్గాలు

                                                  డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు .

గతతరానికి సంబంధించిన తెలుగు  కవులలో శ్రీచిలకమర్తి . లక్ష్మీనరసింహం పంతులుగారొకరు. వారు కేవలం కవి మాత్రమే కాదు చారిత్రక పరిశోధకులు  , నాటకకర్త  నిష్కళంక దేశభక్తులు , సంఘ సంస్కర్త  , ఆంగ్లేయుల నెదిరించిన తొలి తెలుగు కవి. ఆయన రచించిన గయోపాఖ్యానం ఆనాడే ఒక లక్ష ప్రతులు అమ్ముడయ్యాయంటే ఆయన కవిత్వం ఎంత ప్రజారంజకంగా ఉండేదో మనం ఊ హిoచుకోవచ్చు. ఆయన F.A చదువుతున్నప్పుడు ఆయనకు రెండు కళ్ళు పోయాయి . ఆయనను Andhra Milton అనికూడా కొంత మంది చెపుతారు.

శ్రీ చిలకమర్తి వారి పద్య రచనా సౌ౦ దర్యానికి “ కృపా౦భోనిధి” శతకం  ఒక పరాకాష్థ . ఇది మొట్టమొదటి సారిగా సంఘ సంస్కర్త రాజారామమోహన్ రాయ్ గారి నిర్యాణ శతాబ్ది సందర్భంగా 1933 లో తెలుగువారికి లభించింది .

  తరువాత ఎన్నో ఏళ్ళకు శ్రీయుతులు Y.S.నరసింహా రావు , Dy.E.o. s. సుబ్బరాజు, ప్రముఖ సాహితీ విమర్శకులు    అక్కిరాజు రామాపతిరావుగార్ల ప్రోత్సాహంతో శ్రీ యుతులు గంధం సుబ్రహ్మణ్యం , పురాణపండ శ్రీనివాసు గార్ల  సహకారంతో శ్రీ పెరుమాళ్ళ రఘునాథ్ గారు ఈ గ్రంథాన్ని మనకందించారు .

ఒక పద్యాన్ని పరిశీలిద్దాం .

వేదంబుల్ తలక్రిందుగా ( జదువనీ, విప్రాళికిన్ భక్తి గో

భూదానంబులు లొసంగనీ ,    బహు మఖంబుల్ సేయనీ  నిష్ఠమై

రాదమ్మోక్షము సత్ప్రవర్తనము , నైర్మల్యంబు , శాంతంబు నీ

పాదధ్యానము లేని వారలకు దేవా! శ్రీ కృపాoభోనిధీ |   

  

వేదాలు తలక్రిందుగా చదివినా మోక్షం లభించదు. బ్రాహ్మణులకు , భూదానం , గోదానం లాంటి ఎన్ని దానాలు చేసినా ముక్తి కలుగదు . ఎంతో నిష్ఠతో యజ్ఞాలు, యాగాలు చేసినా ముక్తి కలుగదు  .  సత్ప్రవర్తన, నిర్మలమైన మనస్సు , శాంతం , భగవంతుని పాదధ్యానం ఈ నాలుగే మార్గాలు .

ఈ నాలుగు అలవరచుకుo టే దాన ధర్మాలు , క్రతువులు చేయవలసిన పని లేదు , ఈ నాలుగు అలవడక పొతే దానధర్మాలవల , యజ్ఞాలవల్ల వీసమైనా ప్రయోజనం లేదు .

ఈ పద్యం నిజమైన ఆధ్యాత్మిక విలువలు గలది. నేటి మతమౌఢ్యానికి ఈ పద్యం ఒక ఔషధం. ఈ పద్యంలో ఉన్న అంశాలను ఆచరించి ప్రచారం చెయ్యాలి.     

ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే  ఈతరం  రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .