Saturday, December 15, 2012

ధీరుడే మోక్షార్హుడు


ధీరుడే మోక్షార్హు డు
డాక్టర్. చిలకమర్తి.దుర్గాప్రసాదరావు.
dr.cdprao @gmail.com
09897959425
సమస్త జీవకోటిలో మనిషికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మానవుడు తన జీవితంలో సాధించవలసిన వాటిని పురుషార్థాలని అంటారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అని నాలుగు. వీటిలో మోక్షం ఉత్తమ పురుషార్థం. అది కేవలం ఆనందస్వరూపమే కాదు శాశ్వతమైనది కూడ. మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్లనే అది లభిస్తుంది. ఉదాహరణకి మనం ఒక వస్తువుని చూస్తున్నామనుకుంటే చూసేది కన్ను మాత్రమే కాదు. ఒక శబ్దాన్ని వింటున్నామనుకుంటే వినేది చెవి మాత్రమే కాదు. అలాగే మనం ఒకరితో మాట్లాడుతున్నామనుకుంటే మాట్లాడేది నోరు మాత్రమే కాదు. రోడ్డు మీద నడుస్తున్నామనుకుంటే నడిచేవి కాళ్లు మాత్రమే కాదు. ఒకవేళ ఆవే అయితే శవంకూడ చూడగలగాలి. కాని చూడదు. కారణం కళ్లు లేకకాదు. చూసేది కళ్లు కావు కాబట్టి. అదేవిధంగా శవం కూడ వినాలి, కాని వినదు . ఎందుకంటే వినేవి చెవులు కాదు కాబట్టి . అలాగే నడిచేవి కాళ్లుకావు . ఒకవేళ కాళ్లే అయితే శవం కూడ నడవగలిగుండేది. దీన్ని బట్టి మనకో విషయం స్పష్టంగా తెలుస్తోంది. అదేంటంటే మన శరీరంలో ఉండే ఒకే ఒక పదార్థం వివిధ సాధనాల ద్వారా ఈ పనులన్నీ చేసుకుపోతోంది. ఒకే విద్యుత్తు లైటు ద్వార వెలుగుతోంది , ఫేను ద్వారా తిరుగుతోంది, రేడియో ద్వారా మాట్లాడుతోంది, టి.వి ద్వారా మాటలతో బాటు బొమ్మలు కూడ చూపిస్తోంది. కాని వీటన్నిటిలో ప్రవహించే విద్యుత్తు మాత్రం ఒక్కటే. అలాగే ఒకే చైతన్య శక్తి అనేక ఇంద్రియాల ద్వార అనేక విధములైన పనులు చేసుకుంటూ పోతోంది. చేసేది మాత్రం ఒక్కటే. మన అనుభవంలో ఉన్న ఒక మరొక విషయాన్ని పరిశీలిద్దాం. “నేను దేన్ని చూస్తున్నానో దాన్నే ముట్టుకుంటున్నాను" అని మనం అంటాం . ఇక్కడ వాస్తవానికి చూసేది కన్ను ముట్టుకునేది చేయి. కన్ను జ్ఞానేంద్రియం, చేయి కర్మేంద్రియం . రెండు వేరు వేరు. కాని ఈ రెంటికి 'నేను'తో ముడిపెట్టి మాట్లాడుతున్నాం. అలాగే ' నేను దేన్ని పట్టు కున్నానో దాన్నే రుచిచూస్తున్నాను' అని అంటాం . ఇక్కడ పట్టుకునేది చెయ్యి రుచి చూసేది నాలుక . రెండు వేరు వేరు. కాని ఆ రెంటికి నేనుతో ముడిపెట్టి మాట్లాడుతున్నాం. దీన్ని బట్టి వివిధ ఇంద్రియాల ద్వార వివిధ పనులు నిర్వహిస్తున్నది ఒక్కటేనని మాత్రం స్పష్టం అవుతోంది. అదే ఆత్మ . అదే మన అసలు స్వరూపం . మిగిలినవన్నీ దానికి తొడుగులే. అది శరీరంలో ఉంటే శివం బయటికి పోతే మిగిలేది శవం. దాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అదే మానవ జీవిత లక్ష్యం. అదే పరమార్థం . మానవ జీవితానికి అంతకంటే అధికమైన ప్రయోజనం వేరేదీ లేదని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. ( ఆత్మలాభాన్న పరం విద్యతే కించిత్ )

ఈ సృష్టిలో మోక్షం పొందే అర్హత మనిషికి మాత్రమే ఉంది, వేరెవరికి లేదు. మనుషుల్లో కూడ కొంతమందికే ఉంది. అందుకే వేలకొలది మానవుల్లో ఒకడు మాత్రమే నా కోసం ప్రయత్నం చేస్తాడని , అలా ప్రయత్నం చేసే వేలమందిలో ఒక్కడు మాత్రమే నన్ను సరిగా తెలుసుకోగలుగుతున్నాడని గీతలో చెప్పబడింది.
"మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వత:”
దీన్ని బట్టి మోక్షం చాల ఉన్నతమైందని అది పొందగలిగేవారు చాల తక్కువమంది మాత్రమే ఉంటారని తెలుస్తోంది. అంతే గాక ఆ వ్యక్తిని ' కశ్చిత్' అనే పదంతో శాస్త్రాలు సూచిస్తున్నాయి. దానికి 'ఒకానొకడు' అని అర్థం . కుల, మత, దేశ, జాతి, లింగ వివక్షలేని ఒక వ్యక్తిని ఆ పదం సూచిస్తోంది. దీన్ని బట్టి మోక్షానికి కులం గాని , మతం గాని, దేశం గాని, జాతి గాని, స్త్రీపురుష భేదం గాని ఆటంకాలు కావని స్పష్టంగా తెలుస్తోంది. కాని ఒక్క లక్షణం మాత్రం తప్పకుండ ఉండాలని ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ లక్షణం ఏమిటంటే ధీరత్వం . ఉపనిషత్తులు కొన్ని వందలసార్లు ఆ పదాన్ని ప్రయోగించాయి.
'కశ్చిద్ధీర: ప్రత్యగాత్మానమైక్షత్
ఆవృత్త చక్షు: అమృతత్త్వమిచ్ఛన్'
అంటోంది కఠోపనిషత్తు.
ఇంద్రియాలు సాధారణంగా బహిర్ముఖంగా ఉండి బాహ్యమైన విషయాలనే ఆకర్షిస్తాయి. ఉదాహరణకు కన్ను బయటనున్న వస్తువుల్నే చూస్తుందిగాని శరీరం లోపలున్న వస్తువుల్ని చూడ లేదు. అలాగే చెవి బయట నున్న శబ్దాల్నే వింటుంది గాని శరీరం లోపలనుండి వినిపించే శబ్దాల్ని వినలేదు. మిగిలిన నాలుక , ముక్కు , చర్మం కూడ ఇదే స్థితిలో ఉన్నాయి. బాహ్య ప్రవృత్తి వాటి సహజధర్మం. అటువంటి బాహ్యప్రవృత్తి కలిగిన ఇంద్రియాలను అంతర్ముఖం చేయగలిగిన ధీరుడైన వ్యక్తి మాత్రమే అమృతత్వ రూపమైన మోక్షాన్ని పొందగలుగుతున్నాడు. అందువల్ల ధీరత్వమే మోక్షానికి ప్రధానమైన అర్హత అనడంలో ఎటువంటి సందేహం గాని భిన్నాభిప్రాయం గాని లేదు.
ఇక ధీరత్వం అంటే ఏంటో తెలుసుకుందాం. కాళిదాస మహాకవి తన కుమారసంభవంలో ధీరత్వమంటే ఏమిటో 'వికారహేతౌ సతి విక్రియంతే
యేషాం న చేతాంసి త ఏవ ధీరా:' అని చాల చక్కగ వివరించాడు.
మనస్సు వికారం( ప్రలోభం/కలత) చెందడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి ప్రేరేపిస్తున్నప్పటికి ఎవరి మనస్సు ఎటువంటి వికారమూ పొందకుండ నిశ్చలంగా ఉంటుందో అటువంటి వాడే ధీరుడు. దీన్ని బట్టి బాహ్య ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలున్న ప్పటికి ఎవరు ఎటువంటి ఆకర్షణలకు లొంగక అమృతత్త్వాన్ని కోరుకుంటూ మనస్సును ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుంటాడో అటువంటివానికి అంతరాత్మ దర్శనం కలిగి మోక్షం లభిస్తుందని శాస్త్రాలన్నీ వివరిస్తున్నాయి.
కాబట్టి ప్రతి వ్యక్తి అనిత్యమైన బాహ్యప్రపంచం పట్ల వ్యామోహం విడిచిపెట్టి , ఆకర్షణలకు లొంగక ఇంద్రియాలను మనస్సును అంతర్ముఖం చేసుకుని ఆత్మసాక్షాత్కారరూపమైన పరమార్థాన్ని పొందడమే మోక్షం . ఇదే మానవజీవితపరమార్థం. ఇది కష్ట సాధ్యం కావచ్చునేమో గాని అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే మన మహర్షులు కష్ట సాధ్య మైనవి చెప్పి ఉండొచ్చు గాని అసాధ్యమైనవి ఎన్నడూ చెప్పలేదు. ఇక లక్ష్యం చాల ఉన్నతమైనదైనప్పుడు దాన్ని సాధించడానికి కొంత కష్టపడడంలో తప్పేమీలేదు. కాబట్టి మనం ఈ మార్గంలో ముందుకు సాగుదాం. లక్ష్యాన్ని సాధిద్దాం. ఇంతకు మోక్షం అంటే మరేదో కాదు జన్మమరణ చక్రం నుంచి బయట పడడమే. చక్రానికి ఆదిలేదు అంతంలేదు. మనం ఎన్నో లన్మలెత్తాం . ఇంకా ఎన్నోజన్మలెత్తాలి. ఎప్పుడు మొదలైనదో తెలీదు ఎప్పుడు ముగుస్తుందో కూడ తెలీదు. అందుకే దీన్ని సంసారచక్రం అన్నాం. ఆత్మ జ్ఞానం వల్ల మాత్రమే ఈ సంసారచక్రం నుంచి బయట పడ గలుగుతాం . వేరే మార్గం లేదు.


No comments: