Tuesday, February 25, 2014

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము (పద్యకథనము) చిలకమర్తి వేంకటసూర్యనారాయణ రెండవ కథ

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము
(పద్యకథనము)
చిలకమర్తి వేంకటసూర్యనారాయణ 
రెండవ కథ
33.  కం || విని కథను శౌనకాదులు
             మనుజావళి కె ట్లు తెలిసె మాన్యమహర్షీ!
             ఘనమైన వ్రతవిధాన 
             మ్మన విని సూతుండు పలికె నానందమునన్ 
34. కం || నారాయణుడారీతిగ
              నారదునకు (దెల్పి పంప నయగతి( దానున్
              ధారుణినుపదేశింపగ
              వారాణసి జేరె వృద్ధవసుధామరుడై

35 . సీ || కాశికానగరాన  కడుబీదపాఱుడై
                     నట్టి శతానందుడనెడి వాడు
           సంతానమధికమై సతము చింతిల్లుచు  
                     బిడియంబు విడనాడి బిచ్చమెత్తి
           చాల కష్టిoచినన్ సంసారముసరిగ
                       పోషింప(జాలక  పొగులు వేళ
            విష్ణుదేవుడపుడు వీక్షింఛి పాఱుని
                      యార్తిని పోగొట్టి యతని బ్రోవ
తే.గీ||మోదమలరంగనాతని ముందు నిలిచి
      కుశలమడిగి , మిగులకూర్మి యెసక
      మెసగ వ్రతము దెలిపెడు నెడల విధులు
      తెలియబలికిన పిదప నదృశ్యుడయ్యె
36 . కం ||        అంతయునటు దెలిపిన హరి
                    యంతర్ధానంబునొంద,నావిప్రుండ
                    త్యంతానందము నొందుచు
                    నింతికి నెరిగింప( గోరి యింటికి నేగెన్
37 . ఆ.వె ||   జరిగినట్టి కథను సతికి నెరింగించి
                 సత్వరముగపూ జసలుపనెంఛి
                 గడియ యుగము గాగ ( గడపుచు నాఱేయి
                 వేగుజాము లేచి విప్రుడంత
38 కం||  సరగున శుచియై భక్తిన్
             పరమాత్ముని మదిదలంచి భక్త ప్రియ! నీ
            కరుణను ధన మొదవినచో
            నెరపుదు   నీ వ్రతమువేడ్క  నిశ్చలభక్తిన్
39 కం || అని మనమున (దలపోయుచు
            చనె విప్రుడు బిచ్చమెత్తి చాలగ ధనముల్
           గొని గృహము జేరి , తృప్తిన్
          మనమలరగ భక్తియుక్త మానసుడగుచున్

40  ఆ.వె || ఇంటి నుండి  వేగ నిల్లాలు తోడుగా
        గంగయొడ్డు జేరి , ఘనవ్రతంబు
       దీక్ష తోడ సప్తదినములు గావించి   
      భోగభాగ్యములను పొందె నతడు
41 కం|| అదిమొదలుగ నా బాపడు
           సదమలమగు భక్తి  తోడ సత్యవ్రతమున్
           విధిమై నెరపుచు, తరచుగ
           నధికంబగుసిరులు శుభములనన్నియు  పొందెన్
42  ఆ.వె. || విప్రుడొక్క నాడు వేదయుక్తంబుగ
              సత్యవ్రతము సల్పు సమయమందు 
                కట్టెలమ్ము పేద కడు దప్పికంగొని
              మోపు వీధి యరుగు ముందు దించి
43 కం||    తిన్నగ గడపకడ నిలిచి
             కన్నులకింపార పూజ (గాంచిన పిదపన్
             సన్నగ విప్రుని తోడను
             విన్నపముగ నిట్లు బలికె వినయంబొలుకన్
44 కం || సదమల హృదయా ! మీరలు
            విధిగా నొనరించు వ్రతము విను కోరిక  నా
            మదినుదయించెను ముదమున
            విధము నెఱి0గింపుడనుచు వేడెన్ పాఱున్

45, కం || వెను వెంటనె యా విప్రుడు
             కనికరముగ తద్వ్రతంబుగావించు విధుల్ 
            వినిపించి వాంఛితమ్ముల
            కనువుగ నీ వ్రతము సల్పుమంచు వచించెన్
46 . ఆ.వె || విప్రవర్యు వలన విధివిధానమెఱి౦గి
                   కట్టెలమ్మునట్టి  కాపు తాను
                  గృహము జేరి యంత గృహిణికి నెఱి౦గింఛి
                  వ్రతము సలుపనతడు ప్రతిన బూనె
   47. కం || మరుదినమున నుదయంబున
                శిరమున మోపెత్తుకొనుచు చిత్తంబున ని
                ట్లరసెను అమ్మగ వచ్చెడి
                   వరధనమును వ్రాతము కొఱకె వ్యయమొనరింతున్
48. ఆ .వె || అనుచు తలచి యాతడత్యంత భక్తితో
                కట్టెలన్ని యమ్మె క్షణములోన
                అమ్మకమ్ము వలననధికమౌ పైకమ్ము
               నింపుగ సమకూడనిల్లు (జేరె
49. సీ|| కాపు తా భక్తితో ఘనముగా వ్రతమును
                 గావించి, క్రమమున కథనెఱి౦గి
            ఇలవేల్పుగా స్వామి నింటను నెలకొల్పి
                   శాంతిసౌభాగ్యవిస్ఫారుడగుచు
            ధనవంతుడై తాను  ధాత్రిని వెలుగొంది
                    యాయురారోగ్యసౌఖ్యమ్ములంది
           పుత్రపౌత్రాది సంపూర్ణ సంపదలెప్డు
                   తోరంబులై తులతూగు చుండ
ఆ.వె || ఇహమునందు తనయభీష్టముల్నెరవేర
           యర్థిజనులకెల్ల నార్తి బాపి
           గొప్ప కీర్తితోడ కొనియాడబడుచుండి
           పరమునందు విష్ణుపథము చేరె
రెండవకథ సంపూర్ణం
*****











No comments: