Monday, October 27, 2014

3 ‘R’s

3 R’s
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
                          dr.cdprao@gmail.com

విద్య యొక్క ప్రథాన లక్ష్యం  అందరికి చదవడం , వ్రాయడం , లెక్కించడం నేర్పడమే . ఆ తరువాతే మిగిలినవన్ని .  వీటిని 3 Rs అంటాం. ఒకటి reading, రెండు writing, మూడు arithematics. మనం సాంకేతికంగా  ఎంతో అభివృద్ధి సాధించి  ఉoడవచ్చునేమో గాని చాల అవసరమైన మరియు సహజమైన ఈ మూడు ప్రతిభలను కోల్పోయాం. ఒక ప్రసిద్ధవిద్యావేత్త చెప్పినట్లు ఎలక్ట్రానికి మీడియా ఈ మూడుశక్తుల్ని సర్వనాశనం చేసేసింది
             మొదటిది చదవడం. నేటితరం యువతీయువకుల్లో పుస్తకాలు చదివే అలవాటు క్రమక్రమంగా తగ్గిపోతోంది.  ఉదాహరణకి T.V లో వార్తలు చూడడం మొదలు పెట్టిన మనిషి, పేపరు చదవడం క్రమంగా తగ్గించేశాడు. ఇంటర్నెట్ అలవాటు పడ్డాక  మిగిలిన పుస్తకాలు కూడా చదవడం  మానేశాడని చెప్పుకోవచ్చు. ఈ విధంగా  చదివే అలవాటు చాల వరకు తగ్గిపోయినట్లే చెప్పాలి. చదువు తగ్గిపోతే మెదడుకి పని తగ్గి ఆలోచనా శక్తి క్షీణిస్తుంది. ప్రతిభ కుంటుపడుతుంది.  
                           ఇక రెండో విషయానికొద్దాం . అది వ్రాయడం . ఈ తరంలో ఫోన్లు  ముఖ్యంగా  సెల్ ఫోన్లు  వచ్చాక వ్రాయడం కూడా చాల వరకు తగ్గింది. ఉత్తరం వ్రాసే అలవాటు పూర్తిగా పోయింది . ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరం చచ్చిపోయిందనవచ్చు  . ఇక తప్పదు కాబట్టి పరీక్షలొక్కటే విద్యార్థులు వ్రాస్తున్నారు.   అవి కూడ  కుక్కింగు-కక్కింగుపద్ధతిలోనే జరుగుతున్నాయి అన్నారొకాయన. అంటే క్లాసురూములో కుక్కుకోవడం, పరీక్షహాలులో కక్కుకోవడం అన్న మాట.   అందులోనూ ఆధునికపరీక్షావిధానం వ్రాతను ప్రోత్సహించేదిగా కనబడడం లేదు . ఒక్క పదంలో సమాధానాలు , అవునా/కాదా సమాధానాలు, MULTIPLE CHOICE మొదలైనవి వ్రాత నేర్చుకోడానికి అంత ప్రోత్సాహకరమైనవి కావు . ఈ మధ్య ఒకాయన ‘ఒక T.V ఛానల్ నిర్వహించిన పోటీలలో  చాల ఎక్కువ మార్కులు సంపాదించాడు . చివరన ఆయన్ని   ఇంటర్వ్యు  చేస్తూ  అయ్యా! తమరి తండ్రి గారి పేరు చెప్పమని అడిగారట . ఆయనేమి మాట్లాడకుండా నవ్వుకుంటున్నాడు . ఇంటర్వ్యు  చేస్తున్నాయన ఏమండి!  ఏమి మాట్లాడరేంటి ? అనడిగాడు . ఏం మాట్లాడను. మీరు మా నాన్న పేరడిగారు గాని ఒకటి, రెండు , మూడు, నాలుగు  అని ఏమి ఆప్షన్లు ఇవ్వకుండా కూర్చున్నారు  ఆన్నాడు. ఇది పైపైకి హాస్యంగా కనిపిస్తున్నా లోలోపల ఎంతో ఆవేదన  దాగి ఉంది .  ఎoదుకంటే ఒక భాష పదికాలాలపాటు జీవించాలంటే కేవలం మాట్లాడితేనే  సరిపోదు .  ఆ భాష  చదవడం, వ్రాయడం  ద్వారా ఆ భాషలో కొంత సాహిత్యసృష్టి  జరిగితేనే భాష బ్రతుకుతుంది. లేకపోతే ఆ భాష ఎంతోకాలం మనుగడ సాగించలేదు.  అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు చదవడం వ్రాయడం నేర్పాలి. ముందుగా మాతృభాషలో  నేర్పాలి. ఆ తరువాతే మిగిలిన భాషల్లో . ఎoదుకంటే మదర్ టంగ్ రానివాడికి అదర్ టంగ్  రాదు . ఒక వేళ వస్తుందనుకుoటే అది అపోహ మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు .
   మనదేశంలో మిగిలినవారిసంగతెలా ఉన్నా తెలుగువారికి మాతృభాష, సంస్కృతుల పట్ల గౌరవం, అభిమానం ఉండవలసినంతగా లేవనడం నిర్వివాదాంశం.                       ఈ సంగతి ప్రస్తావిస్తూ కీర్తిశేషులు శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారు తమ ఆవేదనను  ఇలా వ్యక్తం చేశారు .
 బెంగాలీ కృతికర్త పాదములకర్పించున్నమస్కారము
 ప్పొంగున్ పారశిలేఖినీ విలసనంబుల్ సూచి రావయ్య! నా
బంగారంబయటంచునాం గ్ల కవి నాహ్వానించు నే పాపమో
రంగా! మెచ్చడు తెన్గుబిడ్డ కవిసమ్రాట్టున్ స్వదేశీయునిన్.
ఇక మూడోది గణితజ్ఞానం. ఇంట, బయట వ్యవహారాలు చక్కబెట్టడానికి కూడికలు, తీసివేతలు , గుణకారాలు , భాగహారాల పరిజ్ఞానం ఎంతో అవసరం . పూర్వం ఏమి చదువుకోని ముసలమ్మలు కూడా ఈ లెక్కలన్నీ నోటితోనే లెక్కలుకట్టి  చెప్పేవాళ్ళు . కాని మనం నేడు చిన్నచిన్న లెక్కలకు  కూడా calculators వాడుతున్నాం. లెక్కలు కట్టలేకపోవడం ఒక విషయమైతే మాతృభాషలో అంకెలు తెలియకపోవడం మరో విషయం.   ఈ మధ్యనే డిగ్రి చదివిన ఒక అబ్బాయి ఆటో ఎక్కి ఇంటికి వచ్చాడు . ఆటో నడిపిన వ్యక్తి ఇంటికి తీసుకోచ్చాక అరవై ఐదు రూపాయలు ఇమ్మన్నాడు. వాడికి అది అర్థం కాలేదు . ఒక వైపు అర్థం కాలేదని చెప్పలేక,  మరో వైపు ఎంత  ఇవ్వాలో  తెలియక  డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఇంట్లోదూరి  అరవై ఐదు అనే మాటకు అర్థం SIXTY FIVE అని వాళ్ళ తాత చెబితే తెలుసుకుని అప్పుడు డబ్బులిచ్చాడు . అంతే కాకుండా  ఇప్పటికీ నూటికి తొంబై మంది తమ CELL PHONE నంబరు మాతృభాషలో తడుముకోకుండా చెప్పలేకపోవడ చాల సిగ్గుచేటు. బాధాకరమైన విషయం. 
కాబట్టి ప్రతి వ్యక్తి మాతృభాషను ప్రోత్సహించడంతో బాటుగా పైన పేర్కొన్న ఈ మూడిటి విషయంలోనూ తగు శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే మన సభ్యతాసంస్కృతులు నిలబడతాయి. మన చదువుకొక అర్థం పరమార్థం చేకూరతాయి.










No comments: