Friendship is of six characteristics
షడ్విధం స్నేహలక్షణం
షడ్విధం స్నేహలక్షణం
డాక్టర్ . చిలకమర్తి
దుర్గాప్రసాదరావు
ఈ సమాజంలో కొంతమంది
స్నేహానికే విలువిస్తారు, స్నేహితులనే నమ్ముతారు బంధువులను
నమ్మరు. మరికొంతమంది బంధుత్వానికే విలువిస్తారు,
వారినే నమ్ముతారు, స్నేహితుల్ని అంతగా పట్టించుకోరు . సాధారణంగా బంధుత్వం కంటే
స్నేహానికే విలువిచ్చేవారు సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే స్నేహం స్వంత
సెలక్షను. మనం మనకిష్టమైన వాళ్లనే స్నేహితులుగా ఎన్నుకుంటాం కాబట్టి వారు
ఎటువంటివారైనా మనకు నచ్చుతారు . అందుకే ముత్యాలొక చోటికి నత్తగుల్లలొక చోటికి
చేరతాయని పెద్దలు చెబుతూ ఉంటారు . ఇక
బంధుత్వం భగవంతుని బలవంతపు సెలక్షను . మన ఇష్టానిష్టాలతో పనిలేదు . వారు మంచివారైతే చేరదీస్తాం. చెడ్డవారైతే దూరంగా ఉంచుతాం . ఇక
మిత్రులు మన సెలక్షను కాబట్టి ఈ క్రింది లక్షణాలున్న వారిని సెలెక్ట్ చేసుకోవాలి .
మన పెద్దలు మంచి స్నేహానికి ఆరు లక్షణాలు చెప్పారు.
దదాతి
ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి
భుంక్తే భోజయతే
చైవ షడ్విధం స్నేహలక్షణం (హితోపదేశం )
కొంతమంది చూడండి.
అందరికి ఏవేవో ఇస్తూ ఉంటారు కాని ఎవరేమిచ్చినా పుచ్చుకోరు . మరికొ౦తమంది ఎప్పుడూ ఏదో
ఒకటి పుచ్చుకోవడమేగాని ఎవరికీ , ఎప్పుడు , ఏదీ ఇవ్వరు . మేమొస్తే మాకేం ఇస్తారు
, మీరొస్తే మాకేం తెస్తారు అనే మంత్రాన్నే వల్లిస్తూ ఉంటారు . కొంతమంది వాళ్ళ
ఇబ్బందులు చెబుతూ ఉ౦టారే గాని మన సంగతులు పట్టించుకోరు . కొంతమంది మన రహస్యాలు, మన సంగతులు అడుగుతారే
గాని వాళ్ళ విషయాలు మనకి చెప్పరు, చాల గోప్యంగా ఉంచుతారు . కొంతమంది ఇతరులు పెట్టినవి తింటారే గాని వారికి ఏమి పెట్టరు . ఎంగిలిచేత్తో కాకిని తోలితే దానికి
ఒక మెతుకు ఎక్కడ అందుతుందో అని ఎంగిలి చెయ్యి కూడ విదపరు. కొంతమంది అందరికి అన్ని
తినిపిస్తో ఉంటారు గాని ఎవరేమిచ్చి తినమన్నా తినరు . ఇటువంటి స్నేహం ఆదర్శవంతమైన స్నేహం
అనిపించుకోదు . ఎవరిమధ్య స్నేహం ఇవ్వడం , తీసుకోవడం , రహస్యాలు చెప్పడం ,
తెలుసుకోవడం , ఆహారం తినడం , తినిపించడమనే ఆరు అంశాలతో ఎల్లప్పుడూ నడుస్తుందో అది
ఆదర్శవంతమైన స్నేహం అనిపించుకుంటుంది . అసలు సిసలైన స్నేహంలో ఆత్మాధిక్యానికి గాని
(superiority) ఆత్మన్యూనతాభావానికి
(inferiority) కి గాని ఎటువంటి తావు లేదు
. అలా ఉన్నప్పుడే స్నేహం పదికాలాలపాటు నిలుస్తుంది , పదిమందికి ఆదర్శప్రాయం
అవుతుంది . అటువంటి ఆదర్శవంతమైన స్నేహాన్ని ఆహ్వానిద్దాం , ప్రోత్సహిద్దాం .
మహాభారతంలోని ద్రోణ-ద్రుపదుల స్నేహం అధమస్నేహానికి ; భాగవతంలోని కృష్ణ కుచేలుర
మధ్య గల స్నేహం ఉత్తమస్నేహానికి ఉదాహరణలుగా చరిత్రప్రసిద్ధి పొందాయి. అధమస్నేహానికి
దుష్ఫలితాన్ని ద్రోణద్రుపదులు; ఉత్తమస్నేహానికి సత్ఫలితాన్ని కృష్ణకుచేలురు అనుభవించడం
మనకు తెలుసు . మంచి స్నేహితుణ్ణి
ఎంచుకుందాం మంచిస్నేహం పంచుకుందాం .
Good friends are rare. Keep them
with care.
No comments:
Post a Comment