అభినందనమందార మాల
శ్రీ అనిపెద్ది జగన్నాథ శాస్త్రి గారు రచించిన
“ భావతరంగాలు”
ఒక విహంగ వీక్షణ సమీక్ష
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
భాషాప్రవీణ , వేదాంత విద్యాప్రవీణ , పి.ఓ.యల్,
ఎం.ఏ ( సంస్కృతం ) ఎం .ఏ ( తెలుగు) ఎం . ఏ
(తత్త్వశాస్త్రం )
పిహెచ్.డి (సంస్కృతం )
3/106, ప్రేమ్ నగర్ , దయాల్ బాగ్ , ఆగ్రా
-282౦౦5
ఉదయం తు శతాదిత్యా: ఉదయం త్వి౦దవశ్శతం
న వినా కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:
అన్నారు పెద్దలు. వందమంది
సూర్యులు ఉదయి౦చు గాక . అలాగే వందమంది చంద్రులు ఉదయి౦చుగాక. మానవునిలో
దాగిన అజ్ఞానమనే చీకటి కవి వాక్కువలన మాత్రమే తొలగిపోతుంది.
కవి వాక్కుకి అంతశక్తి ఉంది . ఎందుకంటే అది
ప్రతిమనిషినీ ఆలోచింపచేస్తుంది . అందుకే Byron అనే ఆంగ్లకవి ఇలా అంటారు.
But words are things and a small
drop of ink
Falling, like dew upon a thought,
produces
That which makes thousands, perhaps
millions think.
(Don Juan, canto III, st.88.
అటువంటి ఆలోచనాత్మకమైన కవిత్వాన్ని కూర్చడంలో
నేర్పరి మా మిత్రుడు జగన్నాథశాస్త్రి . కాసేపు మా ఇరువురి గతంలోకీ వెళుతున్నా .
మేం
శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఓరియంటల్ కళాశాల(పాలకొల్లు)లో చదువుకున్నాం
. మాది college కే
రెండో బ్యాచ్. అధ్యాపకులందరు మమ్మల్ని చాల ఇష్టపడుతూ ఉండేవారు . ప్రేమగా చూస్తూ
ఉండేవారు . కాలేజీ అంతా ఒక కుటుంబంలా ఉండేది . కళాశాల ఏర్పడక పూర్వం మాకు దేవస్థానంగదుల్లో
క్లాసులు జరుగుతుండేవి. భాషాప్రవీణ (ఎంట్రన్స్) లో మాకు శ్రీ మండలీక వేంకటరావుగారు
అన్ని పాఠాలు చెప్పేవారు . ఆయన ఆనాడు పిల్లలకు ప్రైవేట్లు చెబితే చాల డబ్బు
వచ్చేది . కాని ఆయన అవన్నీ వదులుకుని మాకు పాఠాలు చెప్పేవారు . వారి ఋణ౦ మేం ఎన్ని
జన్మలెత్తినా తీర్చు కోలేనిది . ఇక కళాశాలగా
వెలిశాక శ్రీ లంక విశ్వేశ్వర
సుబ్రహ్మణ్యం( principal)గారు
మాకు కాదంబరి, అభిజ్ఞానశాకుంతలం, శ్రీనాథుని కావ్యాలు చెప్పేవారు. శ్రీ వేదుల సుందరరామశాస్త్రి గారు (
వీరు విశ్వవిఖ్యాతవ్యాకరణ శాస్త్రవేత్త శ్రీ తాతా రాయడు శాస్త్రిగారి
యను౦గుశిష్యులలో ఒకరు, భాష్యాంతవైయాకరణి) మాకు సిద్ధాంతకౌముది బోధించేవారు. శ్రీ
మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు తెనుగువ్యాకరణం, సాహిత్యం బోధించేవారు . శ్రీ సోమంచి
సత్యనారాయణ గారు మృచ్ఛకటికం మొదలైన నాటకాలు , డాక్టర్ . శ్రీపాద కృష్ణమూర్తి గారు
ప్రాచీన , ఆధునిక సాహిత్యాలు, శ్రీ వీరుభొట్ల కుటుంబ సత్యనారాయణ గారు శివార్పణం
వంటి ఆధునికపద్యగ్రంథాలు బోధించేవారు. ఇక అప్పటినుంచే జగన్నాథశాస్త్రి భావకవిత్వాన్ని
, అభ్యుదకవిత్వాన్ని బాగా చదివి వంటపట్టించుకున్న వ్యక్తి. ఆ రోజుల్లోనే ఎప్పుడు శ్రీశ్రీ గారి కవితల్ని వల్లె వేస్తూ
ఉండేవారు. జగన్నాథశాస్త్రి రెండో బెంచ్ లో కూర్చుని భావకవిత్వం , అభ్యుదకవిత్వం
చదువుతూ తన్మయత్వంతో తలొంచుకుని కూర్చున్నప్పుడు
ఒక్కొక్కసారి మా గురుదేవులు మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారికి కనిపించేవాడు కాదు. అప్పుడాయన “జగన్నాథ స్వామిన్ ! నయనపతగామీ
భవతు మే” ( ఓ జగన్నాథస్వామీ ! నా కంటికి
కని పించవయ్యా! ) అంటూ ఉండేవారు. పాలకొల్లు
ఎంతో మంది వదాన్యశేఖరులకు పుట్టినిల్లు .
శ్రీ యుతులు రేపాకవారు , అత్యం వారు
, అద్దేపల్లి వారు వందలాది విద్యార్థులకు, తదితరులకు ఉచిత భోజనవసతి చేకూర్చేవారు
. మేం అక్కడ భోజనం చేస్తూ కాలేజీలో
చదువుకునే వాళ్ళం . అధ్యాపకులందరు
మమ్మల్ని సుతనిర్విశేషంగా ప్రేమించేవారు . వారి దాతృత్వంలోను , అధ్యాపకుల
నేతృత్వంలోను కొంత విద్య నేర్చుకున్నాం .
అదంతా రామలిమ్గేశ్వరుని దయ. అందుకే
ఆరామంబులకెల్ల మిన్నయగు క్షీరారామమందుండి ని
న్నారాధించుట(జేసి మాకు హిత
విద్యాబుద్ధులబ్బెన్ నిజం
బౌరా ! నీ మహిమల్ నుతి౦చుట శక్యంబౌనె
మాబోంట్లకున్
క్షీరారామపురీ విహార రసికా! శ్రీ
రామలి౦గేశ్వరా!
అని అనుకుంటూ ఉంటా .
ఇక విద్యార్ధులమైన మేం అందరు కలిసే ఉన్నా జగన్నాథశాస్త్రి,
మల్లాది సాంబశివరావు , నేను చాల సన్నిహితంగా మెలిగే వాళ్ళం . వాళ్లిద్దరిలోను
ఒక్కొక్క ప్రత్యేకత ఉండేది . శ్రీ శ్రీ గారిమీద కోపంతో ఎవరైనా మహాప్రస్థానం , ఖడ్గసృష్టి మొదలైన
గ్రంథాలను ఎవరికీ కనిపి౦చకుండా దాచేస్తే జగన్నాథశాస్త్రి యథాతథంగా అప్పగి౦చగల
ధీమంతుడు . ఇక సాంబశివరావు ఏ పద్యానికైనా విశేషార్థం చెప్పగలిగే ప్రజ్ఞాపాటవాలు
గలవాడు. అతను నేడు ఈ లోక౦ విడిచి మాకు పుట్టెడు శోకం మిగిల్చాడు . ఇక జగన్నాథశాస్త్రికి నాటి ను౦చీ
భావకవిత్వం, అభ్యుదయకవిత్వం పట్ల గల ఆసక్తి దినదినాభివృద్ధి చెంది
కావ్యరచనకు దోహదం చేసింది.
ఇక ‘భావతరంగాలు’ జగన్నాథశాస్త్రి గారి
ద్వితీయపుత్రిక . ఇందులో సుమారు డెబ్బది యారు కవితాఖండికలున్నాయి . అవన్నీ
ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతను
సంతరి౦చుకున్నవే. అవన్నీ ప్రకృతివర్ణనలు , తాత్త్వికచింతన , మానవసంబంధాలు ,
విద్య అనే నాలుగు భాగాలుగా విభజి౦చొచ్చు .
ఇది ఆధునికకవిత్వమే ఐనా రచయిత వినాయక , శంకరుల ప్రార్థనలతో ప్రాచీన సాంప్రదాయాన్ని
పాటించడం ఒక విశేషం . ఇక గ్రంథం విషయానికొస్తే ‘ఆశ’ అనే ఖండికలో ఆశ
మనిషిని బందీగా చేస్తుందని శ్రమ, సంతృప్తి జీవితానికి నిండుదనం చేకూరుస్తాయనే
జీవితపరమార్థాన్ని వివరించారు . ‘దివ్యత్వం’ అనే కవితలో ఆత్మ, శరీరాలను
మథించడం వల్ల జన్మ, మృత్యు, జరాతాపాల్లేని అమృతత్వం సిద్ధిస్తుందని చెప్పడం ఆయన ఆధ్యాత్మికభావాల
పరిపక్వతకు ఒక ఉదాహరణ. ‘శిశిరకాంత’
భావనా శక్తికి అద్దం పట్టేదిలా ఉంది . ‘ఆమె’ ఖ౦డికలోని ఊహాసు౦దరి
కవిత్వానికి దోహదం చేసి౦దనిపిస్తుంది. ‘మక్షిక’ అనే కవితలో జీవితాన్ని
శ్లేష్మ౦లో ఈగలా పోల్చడం చాల బాగుంది . ‘సాహిత్యం’ అనే కవితలో సాహిత్యం వసుధైకకుటుంబభావనకు
దోహదంచేస్తుందని, మానవతావిలువలు , మంచిచెడులు తెలిపి అంతులేని సంతృప్తిని కలిగిస్తుందని , సాహిత్యంతో తదేకమై , మమైకమైతే సమగ్రప్రపంచాన్ని చూసిన చిత్తంబున మనగల్గుతామని
చెప్పడం ప్రత్యక్షర సత్యం . ఇక ‘విశ్వవిద్యాలయం’ కవిత ద్వారా పుట్టినదగ్గర
నుంచి మరణించే వరకు మనిషికి విశ్రాంతి
లేదని చదువు , సహనం ఓర్పు సంతోషాన్ని కలిగిస్తాయని వివరించారు .‘స్నేహం’ అనే
ఖండికలో
ముడివడిన మనస్సు ఘన సంఘటిత తమస్సు
విశ్వమున కొక యశస్సు విడివడిన మనస్సు
లవణ యుత పయస్సు , కలహమున కొక హవిస్సు’ అని
స్నేహం యొక్క పారమ్యాన్ని విశ్లేషించారు . ‘ఓంకారం’ ‘సన్ననిరేఖ’ ‘ భగవాన్’ మొదలైన ఖండికలు
ఆధ్యాత్మిక చింతనకు ఉదాహరణ.
‘జీవితం’ అనే ఖండికలో జీవిత సత్యాలను
వివరించారు . కష్టాలలో కృంగక సుఖాలలో పొంగక సమభావంతో ఉండాలని ఉద్బోధించారు . జీవితం
అటు ప్రమాదకరమని, ఇటు ప్రమోదకరమని చెపుతూ అంటీఅంటని విధంగా గెంటుకురావాలని చెప్పడం
పండిన అనుభవానికి నిండైన ఉదాహరణ.
‘నాటకం’ అనే కవిత ద్వారా ‘బ్రతుకులో నటించడం
కన్నా హేయముంటు౦ది ఈ లోకంలో’ అంటారు .
‘చిన్నోడ’ ఖండిక ద్వారా భారతదేశ గతవైభవాన్ని ఎలుగెత్తి చాటేరు.
‘గ్రంథాలయం’
ఖండికలో “చీకట్లోంచి వెలుగుకు రమ్మనేది గ్రంథం ; విషయపరిజ్ఞానాన్ని పెంచేది
గ్రంథం; జ్ఞానతృష్ణను తీర్చే చలివేంద్రం గ్రంథం;
కావ్యమాలికలన్నీ సరస్వతీదేవి కంఠాభరణాలే;
లోకకల్యాణానికి దేవాలయాలు -- అని చె ప్పడం
ఎంతో మనోజ్ఞంగా ఉంది .
‘నాలుక’ లో నాలుకను
వర్ణిస్తూ:
‘పలుకులరాణి నృత్యకళావేదిక నాలుక ;
నాలుక జాపితే ఆరోగ్యం తెలుస్తుంది ,
నాలుక జారితే అనర్థాలు కలుగుతాయి’ అంటారు . బాపు గారి బొమ్మను వర్ణిస్తూ ‘ గుండె
లోతుల్లోని భావాన్ని చూపుల్లో చూపే బాపు బొమ్మ , చిరునవ్వుల కొమ్మ ‘ అంటారు . అలాగే
‘సంఘాన్ని వెదకి చూసి సౌమ్యాన్ని నేర్చుకో’
‘ సర్వత్రా దైవాన్ని చూడు ‘ తెలుగే ఊపిరి తెలుగు భాష మఱువకు, ‘ మేల్కొన్నహృదయం మేలిమి బంగారములే ‘ ‘ప్రతిభారతీయుడు విశ్వ కల్యాణానికి పచ్చ
తోరణమే’ మొదలైన మాటలు రసభావాలకు మూటలు , సమాజప్రగతికి బాటలు. స్థాలీపులాకన్యాయంగా
కొన్ని ఖండికలు మాత్రమే విశ్లేషించడం జరిగింది . ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా
వ్యాసవిస్తరభయంవల్ల ఇంతటితో విరమిస్తున్నా .
ఈ కవితాసంపుటి భావితరాన్ని అందులోనూ యువతరాన్ని
ప్రగతిపథం వైపు నడిపిస్తుందని విశ్వసిస్తూ , జగన్నాథశాస్త్రిగారి కలం నుండి
మరెన్నో కావ్య ఖండికలు వెలువడాలని మనసారా ఆకాంక్షిస్తూ.... దుర్గాప్రసాద
రావు .
No comments:
Post a Comment