అమ్మో! సంక్రాంతి
బాబోయ్! సంక్రాంతి
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
సంక్రాంతి అంటే చిన్నాప్పటి నుంచి నాకు
సరదాగానే అనిపించినా ఎందుకో హృదయాంత రాళంలో కొంత బాధ చోటు చేసుకునేది. సంతోషం ఎందుకంటే
ఇది అన్ని పండుగల వంటిది కాదు . సహజమైన
పండుగ. మనది వ్యవసాయ ప్రథానమైన దేశం . రైతు కష్టపడి పండించిన పంట ఇంటికి
చేరుతుంది. సుఖ,సంతోషాలు సమాజంలో వెల్లి విరుస్తాయి . ఇక వ్యవసాయపు పనుల్లో ఉపయోగించగా మిగిలిన పదార్థాలను
, వ్యర్థమైన చెత్త, చదారాన్ని భోగిమంటల్లో
వేస్తారు. దానితో పరిసర వాతావరణం పరిశుద్ధ మౌతుంది. చేతి కందిన పంటలతో దానధర్మాలు,
విందులు, వినోదాలతో జనం చాల ఉల్లాసంగా, ఆహ్లాదంగా
ఉంటారు.
ఇక విచారం ఎందుకంటే దానికి రెండు కారణాలు . మొదటి కారణం కోడి పందేలు
, రెండో కారణం జంతు బలులు.
“అన్నమన్నే ప్రతిష్ఠితం” అనే
ధర్మాన్ని బట్టి ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి మరొక దానికి అన్నం ఔతుంది . ఇక ‘అన్నం’
అనే మాటకు మన పెద్దలు అర్థం ఎంత బాగా చెప్పేరో
గమనించండి . అద్యతే అత్తీతి అన్నం ( తినబడేది, తినేది కాబట్టి అది
అన్నం ఔతుంది) . ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఎదో మరొక ప్రాణి అన్నం ఔతోంది.
ఉదాహరణకు పిల్లి ఎలుకను తింటే ఆ పిల్లిని
మరో జంతువు తింటుంది. ఇక చరా చరాత్మకమైన ఈ
సమస్తసృష్టిని తనలో లయం చేసుకునే వాడు పరమేశ్వరుడు . అందుకే ఆయనను ‘అత్తా’ అని
పిలుస్తారు . ‘అత్తా’ చరాచర గ్రహణాత్’ ఆని బ్రహ్మ సూత్రాలు
చెపుతున్నాయి. ఇక సృష్టిలో హింస అనివార్యం అనేది కాదనలేని సత్యం . కాని మిగిలిన జంతువులకు మరో మార్గం లేదు . అవి
మరో జంతువుపై ఆధారపడక తప్పదు. కాని మనిషి అలా కాదు . తాను స్వయంగా ఆహారం పండించి ఉత్పత్తి చేసుకోగలడు. జంతువులనే చంపి
తినవలసిన లేదు .
ఇక చెట్లకు కూడ ప్రాణం ఉందని అవి కూడ
స్పందిస్తాయని జగదీశ్ చంద్రబోసు నిరూపించారు కదా! అని అన వచ్చు. కాని జంతువులకు ఏ విధమైన వాటికి
నాడీ వ్యవస్థ ఉందో అటు వంటిది వాటికి లేదు అని శ్రీ అరవిందువారు ఒక చోట చెప్పినట్లుగా గుర్తు . స్పందన వేరు,
బాధతో కూడిన స్పందన వేరు . Every reaction need not be necessarily out of pain అంటా రాయన. ఎవరైనా మన వెనుక నుంచి వచ్చి భుజం మీద చెయ్యి వేస్తే వెనుకకు తిరుగుతాం అది స్పందనే కాని బాధతో కూడింది
కాదు. ఏది ఏమైనా ఏదో ఒక దానిని ఆహారంగా చేసు కోక పొతే మానవజాతి మనుగడ కష్టం.
ఇక ప్రకృతి మన అవసరాలను తీర్చగలదు, ఆశను మాత్రం
తీర్చలేదు అన్నారు మహాత్మా గాంధీ. ఆయన మాటల్లోనే చెప్పాలంటే Nature can satisfy your need but not your greed.
ఇక మనం ఆహారం కోసం , వినోదం కోసం, సౌందర్యం
కోసం, ఫేషన్ల కోసం, ఆరోగ్యావసరాల కోసం ఎన్నో జంతువుల్ని ఎన్నో విధాలుగా మట్టు
పెడుతున్నాం. మరికొంత మంది దేవతా ప్రీతికోసం కూడ చంపుతున్నారు. దేని కోసం, ఏ జంతువును,
ఏ దేశంలో , ఎవరు, ఎప్పుడు ఎలా క్రూరంగా చంపు తున్నారో తెలుసు కుంటే గుండె చేరువై
పోతుంది. ఆహారం కోసం చంపడాన్ని ఒక వేళ మనం కాదనలేక పోయినా
ఆ హింస సాధ్యమైనంత సునాయాసంగా జరగాలి. It should be as humanly as possible, but not as cannily as possible.
ఇక కోడి పందేల విషయానికొద్దాం . నేను నా
చిన్నతనంలో s యానాం లో 5 వ తరగతి చదువు కుంటున్నప్పుడు మొదటి సారిగా చూశాను. మనం వినోదం కోసం వాటిని క్రూరంగా హింసిస్తున్నాం
అని నాకు అప్పుడే అనిపించింది .
కోడి పందేల్లో నెగ్గిన వారు సంతోషిస్తారు
, ఓడిన వారు తాత్కాలికంగా బాధపడతారు. ఇక్కడ
నెగ్గిన కోడి, ఓడిన కోడి రెండు బాధపడతాయి. ఒక విధంగా ఆలోచిస్తే ఓడిన కోడితో
పోలిస్తే నెగ్గిన కోడి పరిస్థితి చాల దారుణం. కొంతమంది ఓడిన కోడిని దోరగా వేయించుకుని కూరగా చేసుకుని తింటారు. నెగ్గిన కోడి గాయాలు మానే వరకు మూగవేదన
అనుభవిస్తూనే ఉంటుంది. పూర్వకాలంలో కొంతమంది రాజులు అనాగరికంగా వినోదం కోసం మనుషుల్ని (కోడి పుంజులుగా) వాడుకునే
వారు. వారు కత్తులతో పొడుచుకుని చస్తుంటే వీరు పైశాచికంగా ఆనందిస్తూ ఉండేవారు. The death on the arena మొదలైన సినిమాల్లో ఇవి మనం చూడవచ్చు. ఒకరి విషాదం మనకు వినోదం కాకూడదు . అది పాశవికమైన వినోదమే ఔతుంది. ఇటువంటి ఆచారాలకు
మనం స్వస్తి చెప్పాలి . కొన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఎన్ని జాగ్రత్తలు
తీసుకుంటున్నా ప్రభుత్వం కన్ను కప్పి కొంతమంది ఇవి కొనసాగిస్తూనే ఉన్నారు. కర్తా
, కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక: అన్నట్లుగా అవి ఏర్పాటు చేసే వారు , ఆమోదించే
వారు, చూసేవారు , తప్పట్లు కొట్టేవారు ఈ నలుగురు పాపంలో పాలు పంచుకుంటారు.
ఇందులో ఎటువంటి సందేహం లేదు .
నా స్నేహితుడు ఒకసారి అన్నాడు . WWW మొదలైన కార్యక్రమాలెన్నో ఉన్నాయి కదా! వాటికి లేని అభ్యంతరం కోడి పందేలకు ఎందుకని
. కాని ఆ రెండు ఒకటి కావు. అక్కడ organise
చేస్తున్న వాళ్లు , చూస్తున్న వాళ్ళు , దెబ్బలు కొట్టిన వాళ్లు , దెబ్బలు తిన్న వాళ్ళు
అందరు మనుషులే. అందుకు సిద్ధంగానే ఉన్నారు. కాని ఇక్కడ వేరు ఆనందం ఒకరిది , బాధ మరొకరిది
(మూగ ప్రాణులది) తేడా లేదా అన్నాను.
మరో స్నేహితుడు ఇది మనకు
ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయమే కదా! అన్నాడు.
నేనన్నాను ప్రాచీనమైన వన్నీ మంచివీ కాదు ,
నుతన మైనవన్నీ చెడ్డవీ కాదు. మనిషి ఎప్పటికప్పుడు మంచి, చెడులను బేరీజు వేసుకుని చూసుకోవాలని వేరొక సందర్భంలో మన పెద్దలు
చెప్పేరు.
పురాణమిత్యేవ న సాధు సర్వం
న చాsపి కావ్యం నవమిత్యవద్యం
సంత: పరీక్ష్యాన్యతరద్భజంతే
మూఢ: పరప్రత్యవనేయ బుద్ధి: ( భాసమహాకవి )
ఇక మహాభారతం లోని మాండవ్య ముని కథ , యముడు విదురుడుగా జన్మించిన ఘట్టాలను
పరిశీలిస్తే వినోదం కోసం మూగ ప్రాణిని హింసించడం ఎంత ప్రమాద కరమో తెలుస్తుంది. మనం
హేతువాదాన్ని ఉపయోగించి కథను కొట్టి
పారేసినా అందులోని తాత్పర్యం గ్రహించడం
ముఖ్యం.
ఇక వినోదం కోసం జంతువులను భాగస్వాములుగా
చేసి వాటికి హాని కలుగ కుండా మనం ఆనందించ గల
ఎన్నో కార్యక్రమాలు మనం స్వయంగా రూపొందించుకోవచ్చు.
ప్రాణి హింస మానండి. ప్రకృతిని పరిరక్షించండి.
<><><>
No comments:
Post a Comment