Saturday, March 15, 2025

 

ఆంధ్రులు - అద్వైతసేవ

అధ్యాయం -1

ఆంధ్రుల ప్రాచీనత చరిత్ర- సంస్కృతి-ప్రశస్తి

డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఆంధ్రదేశం ఆంధ్రభాష

ప్రముఖకవిపండితుడు ఆలంకారికుడు దార్శనికుడు నైన శ్రీఅప్పయ్య దీక్షితులవారు ఆంధ్రుల గొప్పదనాన్ని ప్రశ౦సిస్తూ ఆంధ్రుడుగా  పుట్టడంఆంధ్రభాష మాట్లాడగలగడం ఎంతో తపస్సు వలన గాని సిద్ధించదన్నారు.

 

ఆంధ్రత్వమాంధ్రభాషా చ ప్రాభాకరపరిశ్రమ:

తత్రాపి యాజుషీశాఖా నాsల్పస్య తపస: ఫలం

 

ఆంధ్రపదం జాతివాచకంగాభాషావాచకంగాదేశవాచకంగాను మూడు విధాలుగా  మనకు కనిపిస్తోంది . ఆంధ్రజాతి చాల ప్రాచీనకాలం నుంచే   ఉందానడానికి  ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి. వేదాల్లోనూరామాయణ మహాభారతాల్లోనుపురాణాల్లోను బౌద్ధగ్రంథాల్లోను ఆంధ్రులప్రసక్తి కనిపిస్తో౦ది. మొట్టమొదటగా ఆంధ్రశబ్ద ప్రయోగం ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయబ్రాహ్మణంలో లబిస్తోంది .

  ఆ కథ ఇలా ఉంది. పూర్వం హరిశ్చంద్రుడు అనే మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు . కాని యజ్ఞం పూర్తికావడానికి ముందుగానే యజ్ఞంలో  బలి కావలసిన పశువు మరణించింది . దానికి ప్రాయశ్చిత్తంగా హరిశ్చంద్రుడు ఒక నరపశువును బలి ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. ఆయన నరపశువును కొనడానికి కావలసిన ధనం సమకూర్చుకుని ఇల్లిల్లు తిరుగుతూ చివరకు ఋచీకుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఋచీకుని భార్య సత్యవతివిశ్వామిత్రుని సోదరి. ఆమెకు ముగ్గురు పిల్లలు. మొదటివాడు శున: పుచ్ఛుడురెండోవాడు శునశ్శేఫుడుమూడోవాడు శునో లాంగూలుడు. హరిశ్చంద్రుడు ఆ దంపతులను చేరుకొని  వాళ్ళు అడిగినంత ధనం  ఇస్తానని ఆ ముగ్గురిలో ఒకరిని తనకిమ్మని కోరాడు . ఋచీకుడు తన  పెద్దకుమారుణ్ణి  ఇవ్వడానికి నిరాకరించగా అతని భార్య సత్యవతి మూడవ కుమారుణ్ణి ఇవ్వడానికి నిరాకరించింది. ఇక రెండవవాడైన శునశ్శేఫుని విషయంలో  ఇద్దరు అభ్యంతరం చెప్పకపోయే సరికి  అతనికి హరిశ్చంద్రుని వెంట వెళ్ల వలసిన పరిస్థితి  ఏర్పడింది.   ప్రేమలేని  ఇటువంటి తల్లిదండ్రుల మధ్య జీవించేకంటే యజ్ఞంలో మరణి౦చడమే మేలనుకున్నాడు. హరిశ్చంద్రుని వెంట బయలుదేరదానికి సిధ్ధమయ్యాడు శునశేఫుడు. హరిశ్చంద్రుడు ఋచీకునకు చెల్లించవలసిన ధనం చెల్లించి శునశ్శేఫుని తనవెంట తీసుకుపోతున్నాడు.  శున: శేఫునకు దారిలో తపస్సు చేసుకుంటున్న తన మేనమామ విశ్వామిత్రుడు కనిపించేసరికి   మామయ్యా! నన్ను రక్షించు  అని అతని కాళ్ల మీద పడి సాష్టాంగనమస్కారం చేశాడు . విశ్వామిత్రుడు జరిగింది తెలుసుకుని  అతని మీద జాలి పడి , అతనికి బదులుగా హరిశ్చంద్రుని  అనుసరించి వెళ్ళమని  తన కుమారులను బ్రతిమలాడాడు. కాని ఏ ఒక్కడు అంగీకరించలేదు. అందరు నిరాకరించారు. అపుడు విశ్వామిత్రుడు వాళ్ళపై కోపించి శపించాడు. అలా విశ్వామిత్రునిచే శపించబడిన వారిలో  ఆంధ్రుడు ఒకడు. దీన్నిబట్టి ఆంధ్రులు విశ్వామిత్రసంతతి అని తెలుస్తోంది.  ఆ తరువాత  విశ్వామిత్రుడు శునశ్శేఫునికి కొన్ని మంత్రాలు ఉపదేశి౦చగా ఆ మంత్రాలను జపించి ఇంద్రుని సంతృప్తి పరచి ఆపదను౦చి బయట పడ్డాడు.  

ఈ విధంగా  వేదకాలం నుంచి ఆంధ్రజాతి ఉనికి కనిపిస్తున్నప్పటి సంస్కృత సాహిత్యానికి వారు చేసిన కృషి వివరించడానికి తగినన్ని ఆధారాలు మనకు దొరకలేదు. మనకు లభించిన మొదటి గ్రంథం ఆపస్తంబమహర్షి కూర్చిన గృహ్యసూత్రాలు.  ఆయన చెప్పిన ఆత్మలాభాన్న పరం విద్యతే కించిత్    అనే వాక్యం అద్వైతవేదాంతశాస్త్రానికి మూలస్తంభంగా నిలుస్తోంది.

భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్రప్రాంతం సుసంపన్నమైన  సంస్కృతికివారసత్వ సంపాదకు నిలయం. గతంలో ఇది భౌగోళికంగా ఒకటే అయినా పరిపాలన సౌలభ్యం కోసం కోస్తఆంధ్ర , తెలంగాణ, రాయలసీమ అని మూడు భాగాలుగా  విభజించబడింది. ఈ కోస్తాప్రాంతం  సరస్వతితోను,  రాయలసీమ పార్వతితోను తెలంగాణను లక్ష్మితోనూ , పోలుస్తూ ఉండేవారు.  ఇది శ్రీశైలద్రాక్షారామకాళేశ్వరాలనే మూడు శివక్షేత్రాల మధ్యలో ఉండడం వల్ల త్రిలి౦గదేశంగా ప్రసిద్ధి పొందింది.  ప్రతాపరుద్రుని ఆస్థానంలోగల  కవిపండితుడు,  గొప్ప ఆలంకారికుడు అయిన విద్యానాథుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని వర్ణిస్తూ ఇలా అంటాడు.

 

యైర్దేశస్త్రిభిరేష యాతి మహతీ౦ ఖ్యాతిం త్రిలి౦గాఖ్యాయా

యేషాం కాకతిరాజకీర్తివిభవై: కైలాసశైల: కృత:

తం దేవా: ప్రసరత్ప్రసాదమధురా: శ్రీ శైల కాళేశ్వర

ద్రాక్షారామనివాసిన: ప్రతిదినం త్వ చ్చ్రేయాసే జాగ్రతు

( విద్యానాథుని ప్రతాపరుద్రీయం  పుట -151)

 

 ప్రాచీన  ఆంధ్రదేశపుటెల్లలు నేటి ఎల్లలతో కొంతవరకు భిన్నంగా కనిపించినా ప్రస్తుత ఆంధ్రదేశం కన్నా అది విశాలమైనదిగా చెప్పవచ్చు. విద్యానాధుని వర్ణన ప్రకారం ఆంధ్రదేశానికి పశ్చిమాన్ని మహారాష్ట్ర తూర్పున కళింగఉత్తర౦లో కన్యాకుబ్జందక్షిణదిశలో పాండ్యదేశం సరిహద్దులుగా ఉన్నట్లు తెలుస్తోంది .

 

పశ్చాత్పురస్తాదపి యస్య దేశౌ ఖ్యాతౌ మహారాష్ట్రకళింగదేశౌ

అవాగుదక్పాండ్యకకన్యకుబ్జౌ దేశస్స తత్రాస్తి త్రిలింగనామా

ఇక ఆంధ్రదేశపు భౌగోళికపరిస్థితులువాతావరణ స్థితిగతులు;  జ్ఞానసంపాదనకువిద్యాభివృద్ధికి  అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా పాడిపంటలకు నిలయంగా ఉండి దక్షిణదేశపు ధాన్యాగారంగా పేరు పొందింది.  ఈ ప్రాంతం, లౌకిక మరియు పారలౌకిక జ్ఞానసంపాదనకు,  జ్ఞానవ్యాప్తికి కూడ అనుకూలంగా ఉంది. ఎంతోమంది చరిత్రకారులు  ఆంధ్రదేశం యొక్క గొప్పదనాన్ని వేనోళ్ళ కొనియాడారు. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు రచనలను, కాకతీయవంశానికి చెందిన రుద్రమదేవి పాలనలో ఈ దేశం సందర్శించిన వెన్నిస్  యాత్రికుడు మార్కో పోలో రచనలను పరిశీలిస్తే మనకెన్నో విషయాలు తెలుస్తాయి. ప్రాచ్యపాశ్చాత్య దేశాలకు సంబంధించిన ఎంతోమంది  గొప్పవ్యక్తులు ఆంధ్రుల  భాష, సంస్కృతివారసత్వ౦ ముదలైన విషయాలకు   సంబంధించిన ఎన్నో  ప్రశంసలు కురిపించారు. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయల ( AD1509-29) గొప్పతనం  వర్ణిస్తూ సుప్రసిద్ధ పాశ్చాత్య చరిత్రకారుడు బార్బోసా ఇలా అంటాడు.

 " ఆ కృష్ణదేవరాయలు కాలంలో ప్రతి పౌరుడు క్రైస్తవుడు గాని యూదువంశీయుడు మూరు వంశీయుడుగాని లేక హితేన్ దేశీయుడు గాని  ఎటువంటి బాధవత్తిడి లేకుండా చాల స్వేచ్చగా జీవించేవారు. రాజురాజుతో బాటుగా ప్రజలు అందరిని సమానంగా చూసేవారు . అందరు పరస్పరం ప్రేమతో మసలుకునే వారు

[The Wonder That Was India, vol-2, saa rizvee p-87]

ఇక సాహిత్యం మాటకొస్తే ఆంధ్రులు దాదాపు అన్ని శాస్త్రాల్లోను సమృద్ధిగా రచనలు చేశారు. ప్రముఖ విమర్శకుడు మరియు దక్షిణభారత దేశం లోనే గొప్ప ఇండాలజిస్ట్ గా పేరుపొందిన  Dr.V.Raghavan గారి మాటల్లో చెప్పాలంటే  సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల యోగదానం  రాసి లోను వాసిలోను కూడ  గొప్పదిగానే ఉంది. కావ్యాల్లో ఆంధ్రుల స్తోత్ర కావ్యాలు , ప్రశస్తి కావ్యాలు లఘుకావ్యాలు అసంఖ్యాకంగా కనిపి స్తున్నాయి. ఎన్నో మహాకావ్యాలు ఆంధ్రులు వెలువరించారు. ఎంతోమంది కవయిత్రులు,  రచయిత్రులు  కావ్యాలు,  చారిత్రకకావ్యాలు వెలయించారు. వివిధ శాస్త్రాల్లో ఆంధ్రులు వెలువరించిన   సంస్కృత రచనలు విఖ్యాతిని పొందాయి. అలంకారశాస్త్రంలో విద్యానాధుని ప్రతాపరుద్రీయం అందరి మన్ననలు పొందింది. అనేక శాస్త్రాల్లో వెలువడ్డ ఆంధ్రులరచనలు భారతదేశంలో పలుచోట్ల  సంబంధితశాఖల్లో అధ్యయనాల్లో పాఠ్యాంశాలుగా  గౌరవం సంపాదించాయి . సాయణాచార్యుల  వ్యాఖ్యానం లేకుండా వేదాధ్యయనం ; పంచదశి జీవన్ముక్తివివేకం  లేకుండా అద్వైతవేదాంతశాస్త్రాధ్యయనం తర్కసంగ్రహం లేకుండా తర్కశాస్త్ర అధ్యయనం మనం ఊహి౦చలేం.  ఇక జగన్నాథపండితరాయల రసగంగాధారం   అలంకారశాస్త్రానికే మకుటాయమానం . మల్లినాథుని వ్యాఖ్యానాలతోనే సంస్కృతపంచకావ్యాల  అధ్యయనం ప్రారంభం అవుతుంది . (forward by Dr. V. Raghavan, Contribution  of Andhra to Sanskrit Literature by Dr. P. Sriramamurthy, Published by Andhra University, Waltair. Series No:-105m 1972), ఇప్పటివరకు సంస్కృతసాహిత్యానికి ఆంధ్రుల సేవలు స్థూలంగా తెలుసుకున్నాం.  ఇప్పుడు అద్వైత వేదాంతానికి ఆంధ్రుల సేవలు  కొంచెం విస్తృతంగా తెలుసుకుందాం .

అద్వైత వేదాంత౦-ఆంధ్రుల సేవ

 వేదాంతమంటే  వేదాల యొక్క సారాంశ రూపమైన  ఉపనిషత్తులు. ఇక బ్రహ్మసూత్రాలుఉపనిషత్తుల అభిప్రాయాలను  తర్కబద్ధంగా ప్రతిపాదించడం వల్ల;  భగవద్గీతను  ఉపనిషత్తుల సారాంశరూపంగా పేర్కొనడం వల్ల  ఈ మూటిని కలిపి వేదాంతదర్శనంగా పరిగణించారు.  ఇది భారతీయతత్వశాస్త్రంలోని ఆస్తిక దర్శనాలలో ఒక ప్రముఖమైన  స్థానం ఆక్రమించి౦ది. మొత్తం వేదాంతశాస్త్రం ఒక  భవనం అనుకుంటే  ఆ భవనం ప్రధానంగా ఈ మూడు స్తంభాలపైన నిలిచి ఉంది . ఈ మూడిటిని ప్రస్థానత్రయం అని పిలుస్తారు.   వీటిని ఆధారం చేసుకుని వరుసగా శంకరాచార్యులు అద్వైతసిద్ధాంతాన్ని, రామానుజాచార్యులు విశిష్టాద్వైతసిద్ధాంతాన్నిమధ్వాచార్యులు ద్వైతసిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇవేగాక మరెన్నో సిద్ధాంతాలు మరికొంతమంది

 స్థాపించారు. ఇక ప్రజాబాహుళ్య౦లోనుపండితలోకంలోనూ అద్వైతసిద్ధాంతం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది . అద్వైతాన్ని (బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాsపర: ) అని సారాంశరూపంగా చెప్పొచ్చు. బ్రహ్మమొక్కటే సత్యం జగత్తు మిథ్య అంటే శాశ్వతమైన నిజం కాదు ఇక  జీవుడు బ్రహ్మము  కంటే వేరు కాదు అని అర్థం. ఇక్కడొక విషయం  పేర్కొనడం  అసమంజసం కాకపోవచ్చు. దక్షిణ భారతదేశం జ్ఞానపారమ్యాన్ని బోధించిన ఆచార్యులకు  ప్రసిద్ధివహించింది. వేదాంతశాస్త్రానికి ప్రధాన ఆచార్యులైన శంకరులురామానుజులుమధ్వాచార్యులుశ్రీకంఠుడువల్లభాచార్యులు వీరందరూ దక్షిణభారతీయులు కావడం ఒక విశేషం . శంకరులు కేరళదేశంలోనూ , రామానుజులు తమిళదేశంలోను, మధ్వాచార్యులు కన్నడదేశంలోను జన్మించారు. శ్రీకంఠుడు మరియు వల్లభాచార్యులు కూడ ఆంధ్రదేశీయులే. ఈ సందర్భంలో  శ్రీ కోటవేంకటాచలం అనే  ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు, రామానుజమధ్వాచార్యుల  ఇంటిపేర్లను బట్టి వారి పూర్వీకులు ఆంధ్రులని నిర్ణయించారు.( Andhrula puttupurvottaralu &Jambudvipamu , Author:- Sri Kota Venkataachalam , publication:- Aarya Vijnana Granthamaala )శ్రీ  రామానుజుల ఇంటిపేరు ఆసూరి శ్రీ మధ్వాచార్యుల ఇంటిపేరు నడిమింటి. ఈ పేర్లు రెండు  వారి పూర్వీకులు ఆంధ్రులని నిరూపించడానికి దోహదం చేస్తున్నాయి. రామానుజుల తండ్రి ఆసూరి కేశవయజ్వతల్లి కాంతిమతి. రామానుజులు1017 క్రీ.శ. జన్మించారు. ఇక మధ్వాచార్యుల జన్మస్థలం  ఉడిపి సమీపంలో గల  రజతపీఠ౦. ఇది  ఒక ప్రసిద్ధ అద్వైత మఠం గల  శృంగేరి కి  సమీపంలో ఉంది . ఈయన తండ్రి మధ్యగేహభట్టు. తల్లి వేదవతి.  శుద్ధాద్వైతమత ప్రవర్తకులు  వల్లభాచార్యులు [ఎ.డి 1481-1533] కూడ ఆంధ్రదేశానికి చెందినవారే.  ఆయన యాజ్ఞనారాయణ భట్టు వంశీయులు. నింబార్కుడను మరో పేరుగల నింబాదిత్యులు ఆంధ్రదేశీయులే . బహుశా ప్రస్తుత బళ్ళారి  జిల్లాలో గల నింబపురం వీరి జన్మస్థల౦ కావచ్చును. వీరు రచించిన వేదాంతపారిజాతసౌరభమనే  వ్యాఖ్యానం శుద్ధాద్వైతతత్త్వాన్ని వివరిస్తుంది . ఆంధ్రదేశంలో  అద్వైతవేదాంత  ప్రారంభసూచన కాకతీయుల పాలనలో  కనబడుతుంది. A.D1163 నాటి హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయం మీద ఒక శాసనం ఉంది. ఈ శాసనరచయిత అచింతే౦ద్ర దేవుడు . ఆయన రామేశ్వరపండితుని  కుమారుడు. ఆయన తన  చిన్నతనం  నుండి కాకతీయుల ఆస్థానంలో ఉండేవాడు.[; పద్యం-4 కార్పస్ 3] ఆయన అద్వాయామృతయతి  శిష్యుడు భారద్వాజసగోత్రుడు. అద్వయామృతయతి అనే ఈ  పేరు  కాకతీయుల కాలంలో అద్వైత ప్రాముఖ్యాన్ని సూచిస్తోంది. అదేవిధంగా అన్నంభట్టు తండ్రి మేలిగిరి మల్లినాథుని బిరుదైన అద్వయాచార్యతిరుమల  అలాగే కురుంగంటి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆశ్రమనామం అద్వైతానంద తీర్థ ఆ రోజుల్లో అద్వైత ప్రాముఖ్యాన్ని ల్లడిస్తున్నాయి. ఈ సందర్భంలో అద్వైతసిద్ధాంతంసంరక్షణ కోసం కృషి చేసిన ఎంతోమంది ఆంధ్ర పండితుల సేవలు వివరించవలసిన అవసర౦  ఉంది. వారందించిగ్రంథాలు మూడు వర్గాలుగా విభజించవచ్చు: 

1 స్వతంత్ర గ్రంథాలు

2.వ్యాఖ్యానాలు

3. లఘుగ్రంథాలు

చిత్సుఖుడు రచించిన తత్త్వప్రదీపిక స్వతంత్ర గ్రంథానికి ఒక ఉదాహరణ. గుండయభట్టు అనే పండితుడు శ్రీ హర్షుడు రచించిన అత్యంత క్లిష్టమైన ఖండనఖండఖాద్య౦ అనే గ్రంథానికి  ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం వ్రాశారు. ఇది వ్యాఖ్యానగ్రంథాలకు ఒక ఉదాహరణ. లఘుగ్రంథాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇవిగాక అద్వైతేతర మతాల్ని ఖండిస్తో రచించిన ఎన్నోస్వతంత్ర రచనలున్నాయి.. ఇవిగాక అదనంగా, అనేక రచనలు ఇటివల కాలంలో వెలువడ్డాయి. అదేవిధంగా ఎన్నో మఠములుగురుకులాలుఇతర ఉన్నతవిద్యాసంస్థలు, సంస్థానాలుపండితులు అద్వైత  వేదాంతశాస్త్ర ప్రగతికిపరిరక్షణకు,  ప్రచారానికి  అపారమైన కృషి చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అద్వైత వేదాంతానికి ఆంధ్రులు చేసిన సేవలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి . ఆ విషయాలన్ని  మనం  అంచెలంచెలుగా తెలుసుకుందాం .

<><><><><>

ఆంధ్రులు-అద్వైత సేవ అధ్యాయం 2 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

 ఆంధ్రులు-అద్వైత సేవ

                            అధ్యాయం 2

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

                 

అద్వైత సిద్ధాంతం ఆవిర్భావం వికాసం

  అద్వైత సిద్ధాంతానికి ఆంధ్రులు చేసిన  సేవలు గురించి   చర్చి౦చుకునే ముందు  భారతీయ దర్శనాల్లో అద్వైతసిద్ధాంత౦  యొక్క స్థానాన్ని గురించి  క్లుప్తంగా చర్చి౦చుకుందాం.

ప్రసిద్ధ ఆచార్యుల ద్వారా నిరూపించబడిన తాత్విక చర్చలు,  సిద్ధాంతాలు దర్శనాలని పిలుస్తారు. దృశ్యతే హ్యాత్మా అనేన ఇతి దర్శనం అని దర్శన పదవ్యుత్పత్తి . దీని ద్వారా ఆత్మను  చూడవచ్చు అని అర్థం .   దర్శనాలు నాస్తిక దర్శనాలు,  ఆస్తిక దర్శనాలని  రెండు రకాలుగా  ఉన్నాయి.

వేదం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించేవి ఆస్తికదర్శనాలు అంగీకరించనివి నాస్తిక దర్శనాలు.

చార్వాక,  జైనదర్శనాలు, బౌద్ధంలోగల మాధ్యమిక, యోగాచార, సౌత్రా౦తిక,   వైభాషిక శాఖలు;  ఈ మొత్తం  ఆఱు నాస్తిక దర్శనాలు. ఇక సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వోత్తర మీమాంసలు ఆస్తిక దర్శనాలు.

1. చార్వాక దర్శనం :

   ఈ దర్శన స్థాపకుడు బృహస్పతి. అతని ముఖ్య శిష్యుడే చార్వాకుడు. ఈ దర్శనం యొక్క ప్రధానలక్షణాలు:

ఎ) భూమి, నీరు, అగ్ని, గాలి అనే నాలుగే మూల తత్త్వాలు. ఆకాశం తత్త్వం కాదు. దానికి ఉనికి లేదు.

బి) చైతన్యం అనేది ఈ నాలుగు తత్త్వాల కలయిక వలన పుడుతుంది.

సి) ఆత్మ శరీరం కంటే భిన్నం కాదు. అది శరీరంతో పాటే పుట్టి దాంతో పాటే నశిస్తుంది. ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి లేదు.

డి) ప్రత్యక్షప్రమాణ౦ ఒక్కటే జ్ఞానానికి  ముఖ్య ఆధారం.

ఇ) భగవంతుడు లేడు.

ఎఫ్ ) అర్థ౦, కామ౦ ఈ రెండే పురుషార్థాలు.

జి) మరణమే ముక్తి.

2. జైన దర్శనం :

 జైనదర్శన ప్రవర్తకులు తీర్థంకరులు. ఇది చాల ప్రాచీనమైన దర్శనం. ఋషభదేవుని మొదలు వర్థమాన మహావీరుని వరకు గల ఇరువది నలుగురు తీర్థంకరులు ఈ దర్శన ప్రవర్తకులు .  రాగ, ద్వేషములను జయించు మార్గమును బోధించడం జైనమత సారం. జినుడు అంటే సర్వజ్ఞుడు, రాగ, ద్వేషములు  జయించిన వాడు, ఎటువంటి దోషములు లేనివాడు, పూజింప దగిన వాడు, యథార్థ మైన వస్తు స్థితిని వివరించే దేవుడు, అతడే పరమేశ్వరుడు అని అర్థం .

సర్వజ్ఞ:  జితరాగాది దోష:  త్రైలోక్య పూజిత: యథాస్థితార్థవాదీ చ  దేవ: స: పరమేశ్వరః

 ఎ) చైతన్యమే ఆత్మ యొక్క స్వభావం.

బి) అహింసా, సత్యం . అపరిగ్రహం,  దొంగిలించకుండుట, బ్రహ్మచర్యం మొదలైనవి  జైనమతం యొక్క ఆచరణాత్మక  సిద్ధాంతాలు.

సి. 1. స్యాదస్తి , 2. స్యాన్నాస్తి, 3. స్యాదస్తి చ నాస్తి చ , 4. స్యాదస్తీతి వక్తవ్య:5. స్యాన్నాస్తితి  వక్తవ్య:6. స్యాదస్తి నాస్తీతి చ వక్తవ్య: 7. స్యాదస్తి నాస్తీతి చావక్తవ్య: అనే సప్తభంగి నయం ఈ  జైనమత మూలసిద్దాంతం .   

3. బౌద్ధ దర్శనం:

1.          బౌద్ధదర్శన ప్రవర్తకుడు గౌతమబుద్ధుడు. ఆయన తీవ్రమైన తపస్సు చేసి  ఆర్య సత్యములను గ్రహించారు . ఆ తరువాత ధర్మమునుపదేశించారు.

అ. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే మూడు త్రి రత్నములు. ఇదే మతసారం.

ఆ.  నాలుగు ఆర్య సత్యాలు -  1.దు:ఖం 2. దుఃఖకారణం 3.దుఃఖనివృత్తి 4. దుఃఖనివృత్తిమార్గాలు .

ఇ.  ఇనయపిటకము, సుత్తపిటకము, అభిధమ్మ పిటకము అనే మూడు బౌద్ధ దర్శనానికి మూల గ్రంథాలు.

ఈ. కాలాంతరంలో బౌద్ధ మతం హీనయానం, మహాయానం అనే రెండు శాఖలు గాను, ఆ తరువాత మాధ్యమికులు, యోగాచారులు, సౌత్రాంతికులు, వైభాషికులు అని నాలుగు శాఖలుగా విడిపోయింది.

ఒక్కొక్క శాఖ నుండి కొన్ని వందల గ్రంథాలు వెలిశాయి. నాగార్జునుడు, ధర్మకీర్తి యోగాచార సిద్ధాంత ప్రవర్తకులు . ఈ బౌద్ధమతం మరెన్నో శాఖలుగా విస్తరించి భారతదేశమునందే కాక ఎన్నెన్నో విదేశాల్లో వ్యాప్తిలో ఉంది. మాధ్యమికులు సర్వశున్యవాదులు . యోగాచారులు బాహ్యార్థశూన్య వాదులు.  సౌత్రాంతికులు బాహ్యార్థానుమేయ వాదులు. వైభాషికులు బాహ్యార్థ ప్రత్యక్ష వాదులు.

సూర్యుడు అస్తమించడం వలన  సదాచారవంతునకు, గృహిణికి, దొంగకు, వేశ్యకు వారి వారి సంస్కారాన్ని బట్టి వేరు వేరు భావాలు కలిగినట్లే బద్ధభగవానుడు ఒకే విషయం బోధించినా అది భిన్న భిన్న వ్యక్తులకు భిన్న భిన్న విధాలుగా అర్థమైంది. కొంతమంది సర్వం క్షణిక కమన్నారు; కొంతమంది సర్వం స్వలక్షణ మని మరి  కొంతమంది సర్వం శూన్యం అన్నారు.

 <><><>