ఆంధ్రులు-అద్వైత సేవ
అధ్యాయం 2
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
అద్వైత సిద్ధాంతం – ఆవిర్భావం – వికాసం
అద్వైత సిద్ధాంతానికి ఆంధ్రులు చేసిన సేవలు గురించి చర్చి౦చుకునే ముందు భారతీయ దర్శనాల్లో అద్వైతసిద్ధాంత౦ యొక్క స్థానాన్ని
గురించి క్లుప్తంగా చర్చి౦చుకుందాం.
ప్రసిద్ధ ఆచార్యుల ద్వారా నిరూపించబడిన తాత్విక చర్చలు, సిద్ధాంతాలు దర్శనాలని పిలుస్తారు. “దృశ్యతే హ్యాత్మా అనేన ఇతి దర్శనం” అని దర్శన పదవ్యుత్పత్తి . దీని ద్వారా ఆత్మను చూడవచ్చు అని అర్థం . ఈ దర్శనాలు నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలని రెండు రకాలుగా ఉన్నాయి.
వేదం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించేవి ఆస్తికదర్శనాలు అంగీకరించనివి నాస్తిక దర్శనాలు.
చార్వాక, జైనదర్శనాలు, బౌద్ధంలోగల మాధ్యమిక, యోగాచార, సౌత్రా౦తిక, వైభాషిక శాఖలు; ఈ మొత్తం ఆఱు నాస్తిక దర్శనాలు. ఇక సాంఖ్య,
యోగ, న్యాయ,
వైశేషిక, పూర్వోత్తర మీమాంసలు ఆస్తిక దర్శనాలు.
1. చార్వాక దర్శనం
:
ఈ దర్శన స్థాపకుడు బృహస్పతి. అతని ముఖ్య శిష్యుడే
చార్వాకుడు. ఈ దర్శనం యొక్క ప్రధానలక్షణాలు:
ఎ) భూమి, నీరు,
అగ్ని, గాలి అనే నాలుగే మూల తత్త్వాలు. ఆకాశం తత్త్వం కాదు. దానికి ఉనికి లేదు.
బి) చైతన్యం అనేది
ఈ నాలుగు తత్త్వాల కలయిక వలన పుడుతుంది.
సి) ఆత్మ శరీరం
కంటే భిన్నం కాదు. అది శరీరంతో పాటే పుట్టి దాంతో పాటే నశిస్తుంది. ఆత్మకు
ప్రత్యేకమైన ఉనికి లేదు.
డి)
ప్రత్యక్షప్రమాణ౦ ఒక్కటే జ్ఞానానికి ముఖ్య
ఆధారం.
ఇ) భగవంతుడు లేడు.
ఎఫ్ ) అర్థ౦, కామ౦ ఈ రెండే
పురుషార్థాలు.
జి) మరణమే ముక్తి.
2. జైన దర్శనం :
జైనదర్శన ప్రవర్తకులు తీర్థంకరులు. ఇది చాల ప్రాచీనమైన దర్శనం. ఋషభదేవుని
మొదలు వర్థమాన మహావీరుని వరకు గల ఇరువది నలుగురు తీర్థంకరులు ఈ దర్శన ప్రవర్తకులు
. రాగ, ద్వేషములను
జయించు మార్గమును బోధించడం జైనమత సారం. జినుడు అంటే సర్వజ్ఞుడు, రాగ, ద్వేషములు జయించిన వాడు, ఎటువంటి దోషములు లేనివాడు, పూజింప
దగిన వాడు, యథార్థ మైన వస్తు స్థితిని వివరించే దేవుడు, అతడే పరమేశ్వరుడు అని
అర్థం .
సర్వజ్ఞ: జితరాగాది దోష: త్రైలోక్య పూజిత: యథాస్థితార్థవాదీ చ దేవ: స: పరమేశ్వరః
ఎ) చైతన్యమే ఆత్మ యొక్క స్వభావం.
బి) అహింసా, సత్యం . అపరిగ్రహం, దొంగిలించకుండుట, బ్రహ్మచర్యం మొదలైనవి జైనమతం యొక్క
ఆచరణాత్మక సిద్ధాంతాలు.
సి. 1. స్యాదస్తి
, 2. స్యాన్నాస్తి, 3. స్యాదస్తి చ నాస్తి చ , 4. స్యాదస్తీతి వక్తవ్య:5. స్యాన్నాస్తితి
వక్తవ్య:6. స్యాదస్తి నాస్తీతి చ వక్తవ్య:
7. స్యాదస్తి నాస్తీతి చావక్తవ్య: అనే సప్తభంగి నయం ఈ జైనమత మూలసిద్దాంతం .
3. బౌద్ధ దర్శనం:
1.
బౌద్ధదర్శన
ప్రవర్తకుడు గౌతమబుద్ధుడు. ఆయన తీవ్రమైన తపస్సు చేసి ఆర్య
సత్యములను గ్రహించారు . ఆ తరువాత ధర్మమునుపదేశించారు.
అ. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే మూడు త్రి రత్నములు. ఇదే మతసారం.
ఆ. నాలుగు ఆర్య సత్యాలు - 1.దు:ఖం 2. దుఃఖకారణం 3.దుఃఖనివృత్తి 4. దుఃఖనివృత్తిమార్గాలు .
ఇ. ఇనయపిటకము, సుత్తపిటకము, అభిధమ్మ పిటకము అనే
మూడు బౌద్ధ దర్శనానికి మూల గ్రంథాలు.
ఈ. కాలాంతరంలో
బౌద్ధ మతం హీనయానం, మహాయానం అనే రెండు
శాఖలు గాను, ఆ తరువాత మాధ్యమికులు, యోగాచారులు,
సౌత్రాంతికులు, వైభాషికులు అని నాలుగు శాఖలుగా విడిపోయింది.
ఒక్కొక్క శాఖ
నుండి కొన్ని వందల గ్రంథాలు వెలిశాయి. నాగార్జునుడు, ధర్మకీర్తి యోగాచార సిద్ధాంత ప్రవర్తకులు . ఈ బౌద్ధమతం మరెన్నో శాఖలుగా
విస్తరించి భారతదేశమునందే కాక ఎన్నెన్నో విదేశాల్లో వ్యాప్తిలో ఉంది. మాధ్యమికులు సర్వశున్యవాదులు
. యోగాచారులు బాహ్యార్థశూన్య వాదులు. సౌత్రాంతికులు బాహ్యార్థానుమేయ
వాదులు. వైభాషికులు బాహ్యార్థ ప్రత్యక్ష వాదులు.
సూర్యుడు అస్తమించడం
వలన సదాచారవంతునకు, గృహిణికి, దొంగకు,
వేశ్యకు వారి వారి సంస్కారాన్ని బట్టి వేరు వేరు భావాలు కలిగినట్లే బద్ధభగవానుడు
ఒకే విషయం బోధించినా అది భిన్న భిన్న వ్యక్తులకు భిన్న భిన్న విధాలుగా అర్థమైంది.
కొంతమంది సర్వం క్షణిక కమన్నారు; కొంతమంది సర్వం స్వలక్షణ మని మరి కొంతమంది సర్వం శూన్యం అన్నారు.
<><><>
No comments:
Post a Comment