Tuesday, May 20, 2025

ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా - డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

గుండుకెదురుగా తన గుండెను నిలిపిన ఆంధ్ర కేసరి  శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా వారి గురించి ముచ్చటగా మూడు విషయాలు .

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు  మేరు నగ సమాన ధీరులు . Be fearless అనే గీతావాక్యానికి ఆయనొక ఉదాహరణ. ఎవర్నీ లెక్క చేసేవారు కాదు. ఆయన గొప్ప న్యాయవాది. ఒకసారి ఆయన మద్రాసు హైకోర్టులో ఒక కేసు వాదిస్తున్నారు. జడ్జి ఆంగ్లేయుడు . వాదనంతా అయిపోయాక ఆయన టంగుటూరి వారితో ‘నువ్వు చెప్పిందంతా  ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాను, నాకేమీ అర్థం కాలేదు అన్నాడు హేళనగా .  ప్రకాశంగారికి చాల బాధ, కోపం రెండు వచ్చాయి. జడ్జని కూడ చూడ కుండా  అవును మరి ఆ రెండు చెవులకు మధ్యన ఉండ వలసిన మెదడు మీకు ఉండాలిగా మరి ,  అది లేదు,  అందుకే అర్థమై ఉండదు   అన్నారు. అందరు ఆశ్చర్యంతో చూశారు. జడ్జి సిగ్గుతో  తలొంచుకున్నాడు.

       శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు బాల్య స్నేహితులు. చిన్నప్పుడు  కలిసి చదువుకున్నారు. చాలకాలం కలసి మెలసి తిరుగుతూ ఉండేవారు. ప్రకాశంగారు న్యాయశాస్త్రం చదవడానికి విదేశాలకు వెళ్ళారు . ఆనాడు సముద్రయానం చేశాడనే  నెపంతో ఒక మఠాధిపతి ఆయనను వెలివేశారు. ఈ విషయం ప్రకాశంగారు ఒరేయ్! నన్ను పలానా మఠాధిపతి వెలివేశార్రా అని బాధతో చెప్పేరు . దానికి చిలకమర్తివారు ఆయన నిన్ను వెలివేసేదేంట్రా, నువ్వే ఆయన్ని  వెలివెయ్యమని సలహా ఇచ్చారు .

                 ఒకసారి బ్రిటీషు ప్రభుత్వం శ్రీ ప్రకాశం గారిని జైలులో నిర్బంధించింది . ఆ రోజు ఆ జైలును పర్యవేక్షించడానికి ఒక పోలీసు ఉన్నతాధికారి వచ్చాడు. ఆయన ఆంగ్లేయుడు . జైల్లో ఉన్న వారి నందరిని పరామర్శిస్తూ ప్రకాశంగార్ని చూసి ఇది వరకొక సారి నిన్ను ఇక్కడ చూసినట్టుందే  అన్నాడు హేళన చేస్తూ . అవును నువ్వు నన్నోక్కసారే  చూశావు, నేను మాత్రం నీ లాంటి వాళ్ళని రోజూ చాల మందిని చూస్తూ ఉంటాను అన్నారు.   అంతే ఆ అధికారి హతాశుడైపోయాడు.

శ్రీ ప్రకాశం పంతులుగారు ఆ రోజుల్లో ఒక పత్రికను నడుపుతూ ఉండేవారు. మహాత్మా గాంధి అతనిని కలిసినప్పుడల్లా ప్రకాశం, నువ్వు పత్రిక విరమించుకోవయ్యా!   అది నీకు సరైనది కాదు అంటు ఉండేవారు . కాని ఆయన విన లేదు . చివరికి ఆ పత్రిక వల్లనే ఆయన తాను కష్టపడి సంపాదించిన యావదాస్తిని పోగొట్టుకున్నారు . ఆయనకు అన్ని అవసరాలు అందరు తీరుస్తూ ఉండేవారు. చివరకు తిండి బట్ట కూడ సరిగా ఉండేవి కావు . అప్పుడను కున్నాడు . గాంధీగారు నాతో ప్రకాశం, పత్రిక నీ కొద్ద్దయ్యా అనేవారు . నేను నాకొచ్చే పాపులారిటీకి అసూయతో అలా అంటున్నారని నే ననుకునే వాడిని  . ఆయన మాట నేను వినలేదు. వినుంటే నాకీ దుర్గతి ఉండేది కాదు  అని పశ్చాత్తాపం చెందారు. 

                ఒకసారి ప్రకాశం పంతులు గారి నేతృత్వంలో ఒక పెద్ద సభ జరిగింది. గాంధీజీ కూడ హాజరయ్యారు . సభ పూర్తయ్యాక  గాంధీజీ ప్రకాశం గారితో ఖర్చుల వివరాలు జాగ్రత్తగా వ్రాస్తున్నావా ? అని అడిగారు . అపుడు ప్రకాశం గారు గాంధీజీతో “ మాకు , మీకు లాగా టాటాలు బిర్లాలు వెనకాల లేరు . నే నెవరికీ   లెక్క చెప్పవలసిన అవసరం లేదు ఖర్చంతా నాదే అన్నారు. గాంధీజీ నిర్ఘాంత పోయారు.    

ప్రకాశం గారు తన జీవిత చరమ దశలో  ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. చివరకు గుడివాడ నుండి విజయవాడ వెళ్ళాలన్నా   రైలు టిక్కట్టు ఎవరో తీయవలసి వచ్చేది . శ్రీ బెజవాడ గోపాల రెడ్డిగారు ఆయనకు అడిగినప్పుడల్లా సాహాయ్యం చేస్తూ ఉండేవారు .

ఒక ఆసక్తి కరమైన సంఘటన చెప్పి ముగిస్తాను . ప్రకాశంగారు ఒక పార్టీ ప్రచారం కోసం వెడుతున్నారు.

శ్రీ గోపాల రెడ్ది గారు దానికి పూర్తి వ్యతిరేకమైన మరొక పార్టీ ప్రచారం కోసం బయలు దేరారు.     

ఇద్దరు ఒక చోట కలిశారు. ప్రకాశంగారి కారులో ఒక్క చుక్క కూడ పెట్రోల్  లేదు . ఒరేయ్ రెడ్డీ కారులో పెట్రోలు ఐ పోయిందిరా! అన్నారు .  దానికేముంది గురువు గారు! అని పూర్తిగా పెట్రోలు కొట్టించి ఒకవేళ మరల ఐపోతే పొయించు కోడానికి కొంత డబ్బు జేబులో పెట్టేరట! ఆనాటి సంబంధాలు అంత గొప్పగా ఉండేవి.       ఏది ఏమైనా దేశంకోసం సర్వస్వాన్ని పోగొట్టుకున్న దేశనాయకుల్లో గాంధీజీ , రాష్ట్ర నాయకుల్లో ప్రకాశంగారు చెప్పు కోదగినవారు . వీరే కాదు ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు. వారంతా భరతమాత ముద్దు బిడ్డలు. ఈ జాతి ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేదు.  వారి ధైర్య  సాహసాలు దేశభక్తి అలవరచుకోవడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి.  ప్రకాశంగారి జీవితం నేటి రాజకీయనాయకులకు , సామాన్య జనానికి ఆదర్శం కావాలి.

ఇందులో కొన్ని విషయాలు మా A.N.R. కళాశాల పాలిటిక్స్ శాఖాధ్యక్షులైన శ్రీ S.V. నరసయ్యగారు స్వయంగా నాకు చెప్పినప్పుడు విని గుర్తు పెట్టుకున్నవి. ఆయన ఎంతటి మేధావి అంటే దేశరాజకీయాలు, ప్రపంచరాజకీయాలు చాల చక్కగా విశ్లేషించేవారు .  ఇక  మనం ఆయనతో కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం చేస్తున్నామనుకుందాం . రైలు ఏ ఊరిలో ఆగితే ఆ ఊరికి సంబంధించిన నియోజకవర్గం , ఎలక్షన్లలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎవరు గెలిచారు ? ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు అనే విషయాలను పూస గుచ్చినట్లుగా చెప్పగల ధీశాలి. గొప్ప వ్యక్తిత్వం గల వారు.   మాష్టారు! ఇవన్నీ మీకెలా గుర్తుంటాయండి! అని నేను అడిగినప్పుడు నాకున్న ఆసక్తి అటువంటిది  అని అనేవారు .        

   <><><>

No comments: