Friday, April 17, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా రచన:- శ్రీ శంకరాచార్యులు-Part-1

 

ప్రశ్నోత్తర రత్నమాలికా

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .

ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

పార్ట్ 1

1.      ప్రశ్న : భగవన్ కిముపాదేయం ?

గురువర్యా ! ఏది అనుసరించ దగినది? 

సమాధానం : గురువచనం

గురువు చెప్పిన మాట  అనుసరించ దగినది.  

2.      ప్రశ్న : హేయమపి కిం?

ఏది విడిచిపెట్టదగినది?

సమాధానం : అకార్యం

చేయకూడని పని చేయరాదు .  

3.      కో గురు:?

ఎవరు గురువు? 

 సమాధానం: అధిగతతత్త్వ:, శిష్య హితాయోద్యత: సతతమ్.

 తత్త్వము తెలిసినవాడు , ఎల్లప్పుడూ శిష్యుల హితమునే కోరుతూ ప్రవర్తించేవాడున్ను.  

4.      ప్రశ్న :  కిం కర్తవ్యం విదుషాం ?

పండితులు  చేయవలసిన పని ఏది ? సమాధానం : సంసార సంతతిచ్ఛేద:

జన్మమరణ రూపమైన సంసార నివృత్తి కోసం ప్రయత్నం చెయ్యాలి .

5.      ప్రశ్న : కిం మోక్షతరో: బీజం?

ఏది మోక్షమనే వృక్షానికి బీజం?

సమాధానం: సమ్యక్ జ్ఞానం క్రియాసిద్ధం. ఆత్మానాత్మ వివేచనరూపమూ, అవిద్యానివృ త్తిక్రియా రూపమైన ఆత్మసాక్షాత్కారాత్మక జ్ఞానం.   

6.      ప్రశ్న:   క: పథ్యతర:?

మేలు కలిగించునది  ఏది ?

సమాధానం :  ధర్మ:

ధర్మము చాల మేలు కలిగించును .

Part-2

7.       ప్రశ్న :- క: శుచి: ఇహ?

ఈ లోకంలో ఎవడు పవిత్రుడు?   

సమాధానం :- యస్య మానసం శుద్ధం

(ఎవడి మనస్సు నిర్మలంగా ఉంటుందో అతడే పవిత్రుడు)

8.      ప్రశ్న :- క: పండిత:?

ఎవడు పండితుడు ?

సమాధానం : వివేకీ ( యుక్తాయుక్త వివేచనాత్మకమైన జ్ఞానం గలవాడు )

ప్రశ్న :- కిం విషం? ఏది విషము

 అవధీరణా గురుషు

గురువులను/పెద్దవారిని అవమానించడం /వ్యతిరేకించడం విషంతో సమానం .

9.      ప్రశ్న :- కిం సంసారే సారం

ఏది సంసారం లో సారభూతమైనది  

సమాధానం :

బహుశోపి చిన్త్యమానం ఇదమేవ

అందరు అన్ని వేళలా ఇదే ఆలోచిస్తూ ఉన్నారు . కొందరికి సారవంతంగా కనిపిస్తోంది మరికొందరికి నిస్సారంగా గోచరిస్తుంది .  

10. ప్రశ్న :- కిం మనుజేషు ఇష్టతమం? ఏది  మానవలోకంలో అందరికి  ప్రీతిపాత్రమైనది .  

సమాధానం:-  స్వపరహితాయ ఉద్యతం జన్మ

ఎవని జన్మ తనను ఉద్ధరించుకుంటు ఇతరులకు ప్రయోజనాన్ని చేకురుస్తుందో అటువంటి జన్మ ప్రీతిపాత్రమైనది.   

11. ప్రశ్న :- మదిరేవ మోహజనక: క: మాదకద్రవ్యం వలే మత్తు కలిగించేది ఏది?

సమాధానం <>స్నేహ: ఇక్కడ స్నేహ: అంటే రాగం , బంధం అని అర్థం . బంధం అంటే attachment. మనిషి అన్ని పనులను బంధం లేకుండానే detached గా ఉంటూనే నిర్వర్తించాలి . బంధం ప్రమాదకరం .

12. ప్రశ్న :-  కే చ దస్యవ:?

ఎవరు దొంగలు?

సమాధానం : విషయా: ఇంద్రియసుఖాలు

ఇంద్రియ సుఖాలు తాత్కాలికంగా గొప్పగా కనిపించినా చివరకు పతనానికి దారితీస్తాయని గీతలో భగవానుడు ‘ధ్యాయతో విషయాన్ పుంస:” అనే శ్లోకంద్వారా పూసగుచ్చి నట్లుగా వివరించడం మనందరికీ తెలిసిందే.    

సౌందరనందంలో ఒక చోట బుద్ధుడు అంటాడు .

ద్విషద్భి: శత్రుభి: కశ్చిత్ , పీడ్యతే త్యజ్యతే s పి వా

ఇంద్రియై: బాధ్యతే నిత్యం సర్వత్ర చ సదైవ చ

ఎవడైనా ఆగర్భశత్రువు చేతికి చిక్కినప్పుడు అతడు శత్రువుచే చంపబడవచ్చు లేదా శత్రువుచే దయతో విడిచిపెట్టబడవచ్చు. (పాకీస్థాన్ సైన్యానికి చిక్కి ప్రాణాలతో బయటపడ్డ భారతీయ జవాన్లు శ్రీ నచికేత, శ్రీ అభినందన్లు) కాని ఇంద్రియాలకు చిక్కితే ఎవ్వరు, ఎప్పుడు, ఎక్కడ బయటపడ్డ దాఖలాలు లేవు. ఇంద్రియాలు అంత ప్రమాదకరమైనవి, ఎవరినీ వదలవు.            

13. ప్రశ్న:- కా భవవల్లీ

ఏది సంసారమనే తీగ

సమాధానం :- తృష్ణా

తీవ్రమైన కోరిక    

14. ప్రశ్న :- కో వైరీ?

ఎవరు శత్రువు?  -

సమాధానం :- యస్తు అనుద్యోగ:

ఏ పని చేయని సోమరి వాడు సమాజానికి శత్రువు  

15. ప్రశ్న :- కస్మాత్ భయం ఇహ?

ఈ లోకంలో మానవులకు దేని వలన భయము ?

సమాధానం : - మరణాత్ మరణము వలన

16. ప్రశ్న :- అంధాత్ ఇహ కో విశిష్యతే ? గ్రుడ్డి వాని కంటే ప్రమాదకారి ఎవరు ?

            సమాధానం : రాగీ (రాగం కలవాడు), అంటే కోరికలతో బంధించబడినవాడు  .

17. ప్రశ్న :-  క: శూర:? ఈ లోకంలో ఎవడు శూరుడు ?

సమాధానం :- య: లలనా లోచనబాణై: న వ్యధిత:

ఎవడైతే స్త్రీల క్రీగంటి చూపులకు లొంగక స్థిరంగా ఉంటాడో వాడే శూరుడు .

18. ప్రశ్న : పాతుం కర్ణాన్జలిభి: కిమమృతమిహ యుజ్యతే?

ఈ లోకంలో చెవులార వినుటకు ఏది అమృతంలా ఉంటుంది ?

సమాధానం:  సదుపదేశ:

మంచి ఉపదేశము

19. కిం గురుతాయా: మూలం ?

ఈ లోకంలో గొప్పతనానికి ఏది కారణం . ఎవడు గొప్పవాడు .

సమాధానం :- యదేతదప్రార్థనం నామ

తనకోసం ఎవరిని , ఏదీ అడగకపోవడమే గొప్పదనానికి కారణం . అటువంటి వాడే మహాత్ముడు .  

20. కిం గహనం ?

ఈ లోకంలో చాల గహనమైన విషయమేది ?

సమాధానం :- స్త్రీ చరితం

స్త్రీల స్వభావాన్ని , మనస్సును అర్థం చేసుకోవడం చాల గహనమైన విషయం .  

21. ప్రశ్న :- క: చతుర: ?

ఈ లోకంలో ఎవడు చతురుడు ?

సమాధానం : యో న ఖండిత: తేన

స్త్రీల స్వభావాన్ని, మనస్సును  తెలుసుకోవడంలో ఎటువంటి తొట్రుపాటు పడనివాడు .

ఒకసారి ఒక భక్తుడు ఎంతో కష్టపడి తీవ్రమైన తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు.  భగవంతుడు నాయనా! ఎంతో తీవ్రమైన తపస్సు చేసి నన్ను మెప్పించావ్. నీకేం కావాలి అని అడిగాడు . స్వామీ! నేను ఎక్కడో అమెరికాలో పని చేస్తున్నాను. నా భార్య లండన్ లో ఉంటున్నది . తరచుగా కలుసుకోడం కుదరడం లేదు . మీరు దయతో ఈ రెండు దేశాలకు సముద్రగర్భం లో మార్గం ఏర్పాటుచేస్తే మేం అప్పుడప్పుడు ఒకరినొకరు కలుసుకునే వీలుంటుంది . నా కోరిక తీర్చండి అని అడిగాడు.   దానికి స్వామి నాయనా! నీ కోరిక సబబే,  బాగానే ఉంది. కాని దానికి కొన్ని లక్షల టన్నుల సిమెంటు , ఇనుము , ఇసుక , కొన్ని వేల మంది పనివారు కావాలి అది సాధ్యమయ్యే పని కాదు అని తిరస్కరించాడు. పోనీలే స్వామీ ! అది సాధ్యం కాక పొతే నా భార్య మనస్సులోని అభిప్రాయాన్ని తెలుసుకునే వరం ప్రసాదించండి అని ప్రాధేయపడ్డాడు. అపుడు స్వామి కంగారు పడి, ఏమయ్యా! ఇంతకు ముందు ఏం వరం అడిగావ్? మరోసారి చెప్పు ఎలాగో ఒకలాగ దానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు.      

22. ప్రశ్న :- కిం దు:ఖం?

ఏది దు:ఖము?

         సమాధానం :-  అసంతోష:

            సంతృప్తి  లేకపోవడమే దు:ఖము .

23. ప్రశ్న :- కిం లాఘవం?

ఈ లోకంలో చాల నీచమైనది ఏది ?

సమాధానం : అధమతో యాంచా

ఒక అధముని యాచించుటయే ఈ లోకంలో చాల నీచమైన పని. అందుకే భారతీయ సనాతన ధర్మం “ నీచాశ్రయో న కర్తవ్య: కర్తవ్యో మహాదాశ్రయ: “ అంటుంది . ఎన్నడు నీచజనులను అంటే నీచమైన బుద్ధి గలవారిని ఆశ్రయించ కూడదు, మహాత్ములనే ఆశ్రయించాలి.    మేఘసందేశంలో ఒక సందర్భంలో  కాళిదాసు याञ्चामोघा वरमधिगुणे नाsधमे लब्धकामा అంటాడు. ఒక నీచుని ఆశ్రయించి పని చేయించుకోవడం కన్నా, ఒక ఉత్తముని ఆశ్రయించి లేదనిపించుకోవడమే మిన్న .        

24. ప్రశ్న : కిం జీవితం ?

జీవితం ఎటువంటిది ?

సమాధానం :- అనవద్యం

పవిత్రమైనది , విలువైనదీని

25. ప్రశ్న :- కిం జాడ్యం ? ఏది జాడ్యం అనిపించుకుంటుంది .

సమాధానం:- పాఠితోsపి అనభ్యాస: ఎంత చెప్పినా వినకపోవడం  ఎంత తెలిసినా ఆచరణలో పెట్టలేకపోవడమే జాడ్యం. మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాడు . పోయేటప్పుడు ఏదీ తీసుకుపోడు. పాపం, పుణ్యం ఈ రెండే తన వెంట వస్తాయి . కాని ఇవన్నీ తెలిసినా ఆచరణలో పెట్టకపోవడమే జాడ్యం .   ధర్మా ధర్మ విచక్షణ లేకుండ అన్నిటి కోసం వెంపరలాడటం, వాటిని ధర్మం బద్ధంగా పొందడానికి బదులు  అధర్మానికి కూడ  పాల్పడుతూ ప్రవర్తించడమే జాడ్యం .    

26. కో జాగర్తి ?  ఎవడు ఏమరు పాటులేకుండ మసులు కుంటాడు.  

సమాధానం :- వివేకీ.  మంచి చెడుల తారతమ్యం తెలిసిన వాడు.  

27. ప్రశ్న:-  కా నిద్రా ?

ఏది నిద్ర . నిద్ర అంటే ఏమిటి ?

సమాధానం : మూఢతా జంతో: వివేకం కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తించడమే నిద్ర .

28. ప్రశ్న:-  నలినీదలగత జలవత్తరలం కిం ? ఏది తామరాకుపై నీటి వలె చాల చంచలమైనది?

సమాధానం :- యౌవనం , ధనం చ ఆయు:  వయస్సు , ధనం, ఆయుష్షు .

29. ప్రశ్న:-   కథయ పున: కే శశిన: కిరణసమా:? ఈ లోకంలో ఎవరు చంద్రకిరణాల(వెన్నెల) వలె ఆహ్లాదాన్ని/ఆనందాన్ని కలిగిస్తారు ?

సమాధానం : సజ్జనా: ఏవ సత్పురుషులు మాత్రమే.

No comments: