శ్రీ సుబ్రహ్మణ్య శతకము
రచన :- పేరి వేంకట సూర్యనారాయణ మూర్తి (అప్పాజీ)
సమీక్ష : డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
అందరిచేత ముద్దు ముద్దుగా అప్పాజీ పేరుతో పిలవబడే సూర్యనారాయణమూర్తి నాకు M.A.లో సహాధ్యాయి. ఉద్యోగం వేరువేరు ప్రదేశాల్లో చేస్తున్నా ఇంటర్
బోర్డు పుణ్యమా అని నాటి నుంచి కొన్ని దశాబ్దాల వరకు మేమిద్దరం సంవత్సరానికి ఒకటి రెండుసార్లు విధిగా
కలుసుకునే వాళ్లం. మా స్నేహం ఎటువంటి దనగా
అతను పలకరిస్తే నేను పులకరిస్తాను. అలాగే
నేను పలకరిస్తే ఆతను పులకరిస్తాడు. మావి పులకరింతతో
కూడిన పలకరింపులు . పలకరింపులతో కూడిన పులకరింతలు
. మా మిత్రుడు సామాన్యుడు కాదు, గురుకులక్లిష్టుడు. అందువల్ల నాకు చాల ఇష్టుడు . గురువుల దగ్గర
, తండ్రిగారి దగ్గర సంస్కృతాంధ్ర భాషలు చక్కగా చదివినవాడు. సైన్సు లోను గణితంలోను
కూడ చాల గట్టివాడని ఆయన బాల్యమిత్రులు చెప్పగా విన్నాను. అతనిలో నాకు నచ్చిన మరో
మంచి గుణం పితృభక్తి , పెద్దలపట్ల విధేయత. ఇక ‘పేరి’ అనేది పండిత వంశానికి పర్యాయపదం . ఎన్నో శాస్త్రాల్లో పేరు మోసిన ఉద్దండ పండితులు ఆ వంశంలో జన్మించారు. “అచట పుట్టిన చిగుఱుకొమ్మైన చేవ”
అన్న పెద్దన్న గారి వచనం ఉండనే ఉంది. ఇతను కూడ పాండిత్యంలో ఈ కాలం వాళ్ళ కెవ్వరికీ
తీసిపోడు.
నాకు మంచి అధ్యాపకునిగా మాత్రమే తెలుసు . ఈ మధ్యనే ఎన్నో కవితలు కూడ వ్రాస్తున్నాడు. ఎంతో మంది కవి
పండితులతో అతనికి పరిచయం ఉంది .
ఇక
వేదపురుషుని నుండి షడంగాలు పుట్టినట్లుగా వేదవేద్యుడైన
పరమేశ్వరుని నుండి షణ్ముఖుడుద్భవించాడు. ఈయన కారణజన్ముడు. తండ్రిని మించిన తనయుడు
. వినాయకుడు తండ్రికి తగ్గ తనయుడైతే ఈయన తండ్రిని మించిన తనయుడు. ఆయన కొన్ని
సందర్భాల్లో తండ్రికి కూడ ఉపదేశం చేసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. తండ్రికి సాధ్యం కాని
తారకుని వధ అతనికి సాధ్యమైంది . అందుకే ఆయన కారణ జన్ముడు.
ఇక మా మిత్రుడు రచించిన శ్రీ సుబ్రహ్మణ్య శతకము ఈ మధ్య నా కంటపడింది. వృత్తాలు వ్రాసే వ్యక్తి
కందపద్యాలు ఎంచుకున్నాడు. బహుశా ఆయన స్కందుడు (కందస్వామి) కాబట్టి కందాన్ని
ఎంచుకుని ఉండవచ్చు. ఇది వందకు పైగా అందమైన
కందపద్యాలతో స్కందుని స్తుతిస్తూ హృదయానందం చేకూరుస్తోంది . భక్తి భావాలు రేకెత్తించేదిగా
ఉంది. ప్రతిపద్యం లోను సుబ్రహ్మణ్యేశ్వరుడు,
ఆయన నెరవేర్చిన కార్యాలు గుర్తుకొచ్చే
విధంగా వివిధ నామాలతో స్తుతిస్తూ వ్రాయడం ఒక విశేషం . ‘సోమరసేష్ట’, ‘సోరగరూప’ వంటి
వినూత్న ప్రయోగాలు కూడ శతకంలో ఉన్నాయి.
ఈ శతకంలో అనేకమైన పేర్లతో వల్లీనాథుడు కొలువున్న క్షేత్రాలన్నీ జ్ఞప్తికి తీసుకొచ్చారు.
ఆయన తండ్రికే సలహాలిచ్చే తనయుడని
చెప్పుకున్నాం . దానికి సంబంధించిన ఒక చమత్కార మైన కథ ఇది.
కుమారస్వామి తన తండ్రియైన
పరమశివుని దగ్గఱకెళ్లాడు. ఏరా! ఎందుకొచ్చావు? పనేంటి? అన్నాడాయన . నాన్నా! అమ్మకి కోపం వచ్చింది. నీ నెత్తి మీదున్న గంగను
వెంటనే విడిచి పెట్టెయ్యి అన్నాడు. పార్వతికి ఎందుకు
కోపమొచ్చిందో శివునికర్థమయ్యింది. గంగ పార్వతికి సవతి కదా
అందుకే అయి ఉంటుంది అనుకున్నాడు. సరే లేరా! ఆవిడ ఎప్పటి నుంచో నా నెత్తి
మీద కూర్చుంది. ఇప్పుడు ఎక్కడ వదలాలి? ఎలా వదలాలి? నువ్వే చెప్పు అన్నాడు. వెంటనే ఆవేశంతో కుమారస్వామి
ఆఱు ముఖాలు ఇలా చెయ్యి నాన్నా అన్నాయట. ఆఱు ముఖాలు ఒకసారే 'అంభోధి',
'జలధి',
'పయోధి'
, 'ఉదధి',
'వారాన్నిధి',
'వారిధి', ఇలా వివిధ పదాలతో ఒకే అర్థం
వచ్చేలాగ "సముద్రంలో వదిలెయ్యి నాన్నా!" అని సమాధానం చెప్పాయట.
అంబా కుప్యతి తాత!మూర్ధ్ని విధృతా గంగేయ
ముత్సృజ్యతాం
విద్వన్ షణ్ముఖ! కా గతిర్మమ చిరం మూర్ధ్ని
స్థితాయా: వద
కోపావేశవశాదశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధిర్జలధి:పయోధిరుదధిర్వారాన్నిధిర్వారిధి:
ఆ విషయం అలా ఉంచుదాం . ఈ కావ్యంలో 132 కందపద్యాలున్నాయి. అన్ని
స్తుతి పరాలే . ఆ పద్యాలను నేను పొందుపరచడం లేదు . ఇక అక్కడక్కడ ఒకటి రెండు దోషాలు
దర్శనమిచ్చాయి . దానికి కారణం నా అజ్ఞానం గాని , అతని అనవధానత గాని లేక అవి ముద్రారాక్షసాలు గాని కావచ్చు. ఏది
యేమైనా “నడచుచు నుండువారి చరణంబులకే కద! రాళ్ల తాకుడుల్” అన్న సామెత
లాగ దోషాలు వ్రాసే
వాళ్ళకే వస్తాయి గాని ఏమీ వ్రాయని నాలాంటి వాళ్ళ కెందుకొస్తాయి?
ఈ గ్రంథం విద్యాధికులైన శ్రీ
తోపెల్ల. బాలసుబ్రహ్మణ్యశర్మగారి ఆధ్వర్యవంలో జరిగిన పండితసభలో ఆవిష్కారింపబడటం
మరో విశేషం . ఇది భగవద్భక్తులకు ముఖ్యంగా శివకుమార భక్తులకు నిత్య పారాయణ గ్రంథంగా
ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం
లేదు. ఈయన మరెన్నో గ్రంథాలు రచించి ఆంధ్ర
సారస్వతానికి పుష్టిని తుష్టిని చేకూర్చాలని ఆశిస్తూ ---
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు