Wednesday, November 5, 2014

యోచనతో యాచన

యోచనతో యాచన
డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

అవి అనవేముడనే రాజు  రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజలు . ఒక నాడు  ఆయన  ఆస్థానానికి  ఒక  కవి వచ్చాడు . రాజును స్తుతిస్తూ  చాల అందమైన ఒక శ్లోకం ఆశువుగా ఇలా చెప్పాడు.
अनवेममहीपाल! स्वस्त्यस्तु तव बाहवे
आहवे रिपुदोर्दण्डचन्द्रमण्डलराहवे 
అనవేమమహీపాలస్వస్త్యస్తు తవ బాహవే
ఆహవే రిపుదోర్డండ చంద్రమండలరాహవే
అనవేమమహీపాల! యుద్ధంలో శత్రువుల భుజదండమనే  చంద్రమండలానికి రాహువు వంటిదైన నీ చేతికి జయము  కలుగుగాక అని ఆ పద్యం యొక్క అర్థం .
ఈ పద్యం విన్న రాజు, కవి పొగడ్తకు ముగ్ధుడై ముచ్చటగా మూడు వేలు ఇవ్వాలని అనుకున్నాడు. వెంటనే కవికి మూడువేల వరహాలు ఇమ్మని భటులను ఆజ్ఞాపించాడు. సొమ్ము సిద్ధమైoది.
రాజు మూడువేల వరహాలిస్తున్నాడని గ్రహిoచిన కవి రాజుతో ఓ మహారాజా! ఇది చాల అన్యాయం. ఎoదుకంటే నేనే  మీకు నాలుగువేలిచ్చాను కదా! మీరు నాకు మూడువేలివ్వడం  సబబుకాదన్నాడు.
నువ్వు నాకు నాలుగు వేలివ్వడమేoటి? అన్నాడు రాజు తనకు ఏమి అర్థంకాక . అపుడు కవి రాజుతో మీరే చూడండి మహారాజా!  అనవేమ లో  ఒక వే ఉంది. బాహవే  లో మరో వే ఉంది. అలాగే ఆహవే లో ఒక వే , రాహవేలో ఇంకొక వే మొత్తం నాలుగు వేలు లేవా!. అవి మీకు నేనిచ్చినవే కదా! అన్నాడు. రాజు ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు . సరే ! అటైతే ఐదు వేలు తీసుకోమన్నాడు కవిని . వెంటనే కవి మహారాజా ! మేము ఆఱువేలనియోగులము . మీరు   కేవలం ఐదువేలిచ్చి మమ్మల్ని అవమానిoచడమేమీ బాగుoడలేదన్నాడు. ఇక రాజుకు ఎందుకో  ఏడు సంఖ్య శుభం కాదనిపిoచింది . అందుకని  ఎనిమిది వేలివ్వడానికి సిద్ధమయ్యాడు. అపుడు కవి రాజుతో  రాజా! ఎనిమిది ఛిన్నాభిన్నమయ్యే  సoఖ్య. అలా ఇవ్వడం మీకూ మంచిది కాదు , తీసుకోవడం నాకూ మంచిది కాదు అనేసరికి రాజు తొమ్మిదివేలిచ్చి ఆ కవిని యథావిధిగా సత్కరించి పంపించాడు. ఈ విధంగా యోచనతో మూడురెట్లు ఎక్కువ పారితోషికం రాబట్టిన  కవి ప్రతిభ ప్రశంసనీయం.

                                     ****************

1 comment:

సుధామ said...

మీ బ్లాగ్ చాలా బావుంది ప్రసాదరావ్ గారూ! అనేక ఆసక్తి దాయక అంశాల సమాహారంగా మీ 'సారస్వతం'
ఆకట్టుకునేదిగా వుంది.బహుధా అభినందనలు