సంస్కృతభాషాప్రచారం-
మార్గాలు
డా|| చిలకమర్తి .
దుర్గాప్రసాద రావు
భారతీయసంస్కృతీసాంప్రదాయాలకు పుట్టినిల్లు సంస్కృతం . అన్ని భాషలకు అది తల్లి
అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సంస్కృతo ఒకప్పుడు వ్యవహారంలో ఉండేదని చెప్పడానికి ఉదాహరణలెన్నో ఉన్నాయి. పతoజలిమహర్షి తన కాలంలో ఏ ఏ పదాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఎలా
వ్యవహరింపబడుతున్నాయో తన మహాభాష్యoలో సుస్పష్టంగా వివరించారు . ఇక సంస్కృతం ఒకే సమయంలో పండితభాషగాను
జనసామాన్యభాష గాను కూడ ఉండేది.
అనేక సాంఘిక, సామాజిక కారణాల వల్ల సంస్కృతం
మెల్లమెల్లగా వ్యవహారంలోoచి తొలగి కేవలం గ్రంథాలకే
పరిమితమైపోయింది. ప్రజలకు గల ప్రాoతీయవేషభాషలపట్ల అభిమానం, ప్రాంతీయభాషాకావ్యాలలోగల
రసాస్వాదనసౌలభ్యం మొదలైన అంశాలు సంస్కృతం మన నుండి దూరమవడానికి కొoతదాక కారణమయ్యాయి.
తొలి తెలుగుకవి నన్నయ గారు తమ వ్యాకరణగ్రంథమైన ఆంధ్రశబ్దచిoతామణిలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
స్వస్థానవేషభాషాభిమతాస్సంత:
రసప్రలుబ్ధదియ:
లోకే బహుమన్యంతే వైకృతకావ్యాని
చాన్యదపహాయ
ఇక సంస్కృతభాషకు జరుగుతున్న నష్టానికి బాధపడి
ఆవేదనను తెలియజేసిన ప్రాచీనులు కూడ మనకెంతోమంది
కనిపిస్తారు. ఉదాహరణకు కంటకార్జునుడనే ఒక కవి ఉండేవారు . ఆయన కంటకాంజలి అనే ఒక
కావ్యాన్ని రచించారు. ఆయన తనకాలంలో సంస్కృతభాషకు పట్టిన దు:స్థితిని గురిoచి విచారిస్తూ ఇలా అన్నారు.
కొంతమంది ప్రబుద్ధులు, సంస్కృతo స్త్రీలు, విటులు,
చేటులు, శూద్రులు, యవనులు మొ|| వారికి అందుబాటులో ఉంచితే సర్వనాశనం ఔతుoదనే భావంతో
దాన్ని(సంస్కృతాన్ని) తాళం వేసి బంధించి అందకుండా చేస్తున్నారు. వారికో నమస్కారం.
కాని తిట్టుకునేడప్పుడు, పూజల్లోను, శాస్త్రచర్చల్లోను , ప్రేమవ్యవహారాల్లోను
అందరు సంస్కృతం మాట్లాడితే నష్టమేoటి? నిజంగా అటువంటి మంచిరోజు వస్తే కృతజ్ఞతాసూచకంగా
భగవంతునికి పూజలు చేస్తానంటాడు కవి .
స్పృష్టం స్త్రీ – విట-
చేట-శూద్ర-యవనై: గిర్వాణవాజ్మందిరం
భ్రష్టం స్యాదితి
తాళయ౦త్రితమిదం కుర్వంతి తేభ్యో నమ:
కిం నిoదాసు? కిమర్చనేషు?
కిమువా శాస్త్రేషు? కిం ప్రేమసు?
సర్వే సంస్కృతభాషిణో యది తదా దేవాయ కుర్యాం బలిం.
ఏ భాషైన పదికాలాలపాటు జీవించాలంటే
ముందు మాట్లాడాలి. మాట్లాడితేనే సరిపోదు చదవాలి. చదివితేనే చాలదు . వ్రాయాలి.
వ్రాస్తేనే సరిపోదు సాహిత్యసృష్టి జరగాలి.
దానితోనే సరిపోదు ఆ సాహిత్యం
జనసామాన్యానికి అందించే ప్రయత్నం చెయ్యాలి.
కాబట్టి సంస్కృతభాషాభివృద్ధికి
ఇవన్ని అవసరమే. ఇవన్ని సాధించాలంటే సామాన్యమానవుని స్థాయికి భాషను తీసుకుపోయినప్పుడే
అది సాధ్యమౌతుంది భాష సామాన్యుని వద్దకు తీసుకువెడితే దాని
అభివృద్ధిని ఎవరు ఆపలేరు. అలాగే సామాన్యుని స్థాయికి తీసుకువెళ్లలేకపోతే దాన్నెవరు
రక్షిoచనులేరు. కాబట్టి భాషను ప్రచారమార్గంలో సామాన్యుని స్థాయికి తీసుకెళ్ళే ఉపాయాలు
ఆలోచిద్దాం .
1.
సంస్కృతo , ఒక కులానికి గాని , మతానికి గాని చెందినది కాదని అది
భావప్రకటనకు దోహదం చేసే సాధనమని అందరికి తెలిసేలా చెయ్యాలి.
2.
సంస్కృతపండితులు తమపిల్లల్ని విధిగా సంస్కృతం చదివించాలి. వారి జీవనోపాధికి
వేరే మరేచదువైన చదవొచ్చు. సంస్కృతo మాత్రం తప్పక చదవాలి.
3.
ప్రతి సంస్కృతపండితుడు తన సంపాదనలో
కొంతభాగం భాషాభివృద్ధికి ఖర్చు చెయ్యాలి. అలాగే కనీసం రోజుకో గంట చదవడానికి
, మరోగంట సoస్కృతo ఉచితంగా అందరికి
బోధించడానికి వెచ్చించాలి .
4.
సంస్కృతపుస్తకాలు చాల తక్కువధరలకు లభించేలా చూడాలి.
5.
సంస్కృతంలో బాలసాహిత్యాన్ని ప్రోత్సహించే పత్రికలు ఎక్కువగా వెలువడాలి.
6.
వేదపండితులు తమ వైదికసంప్రదాయాన్ని కొనసాగించాలి. విడిచిపెట్టకూడదు.
7.
సంస్కృతపండితులు సంస్కృతం తెలిసిన వారితో సంస్కృతంలోనే మాట్లాడాలి . ఇది ఒక
వ్రతంగా స్వీకరిoచాలి.
8.
మనదేశంలో సంస్కృతం తెలిసినవారు చాలామంది ఉన్నారు . అలాగే శాస్త్రవిజ్ఞానంలో
ఎంతోమంది నిపుణులున్నారు. సంస్కృతం తెలిసిన వారికి శాస్త్రం తెలియదు . శాస్త్రం
తెలిసినవారికి సంస్కృతం తెలీదు. అందువల్ల వీరిద్దరిని ఒక వేదిక పైకి తీసుకు వచ్చే
ప్రయత్నం చెయ్యాలి.
9.
సంస్కృతాన్ని సంస్కృతంలోనే బోధించాలి.
10.
ఎవరైనా సంస్కృతం తప్పుగా మాట్లాడితే దోషాల్ని మృదువుగా సరిచెయ్యాలి గాని
వ్యక్తిని ఆక్షేపిoచకూడదు.
11.
శాస్త్రీయవిషయాలకు సంబంధించిన వ్యాసాలు సంస్కృతభాషలో అనువాదo చెయ్యాలి.
12.
త్రిభాషాసూత్రంలో సంస్కృతానికి తప్పక స్థానం కల్పించాలి. ఉదాహరణకు .
మొదటిస్థానం మాతృభాషకు, రెండోస్థానం సంస్కృతానికి, మూడోస్థానం ఆంగ్లభాషకు గాని మరి
దేనికైనాగాని ఉండవచ్చు . అప్పుడు ప్రాంతీయావసరాలకు మాతృభాష , దేశీయావసరాలకు సంస్కృతం
, అంతర్జాతీయావసరాలకు ఆoగ్లం గాని మరేదైనాగాని ఉపయోగపడతాయి .
13.
మనకు కొన్ని mottos ఉన్నాయి .
ఉదాహరణకు ‘యోగక్షేమం వహామ్యహం’ , ‘ అన్నo బహు కుర్వీత ’ . ‘ బహుజనహితాయ బహుజన సుఖాయ ’ ,
“ధర్మో రక్షతి రక్షిత: ” వంటివి ప్రజలకు పరిచయం చేసి
అందులో ఉండే స్వారస్యాన్ని వివరించాలి.
ఉదాహరణకు L.I.C of India వారు “ యోగక్షేమం వహామ్యహం ” అని ఉపయోగిస్తారు. అక్కడ
అప్రాప్త వస్తు ప్రాప్తి యోగమని , ప్రాప్తస్య
రక్షణo అనగా ప్రాప్తించిన వస్తువుయొక్క రక్షణ క్షేమమని చెప్పి ఎంత అర్థవంతంగా ఆ motto
ను స్వీకరిoచారో వివరించాలి. ఒకటి రావలసిన దానికి రక్షణ , రెండోది
రానవసరం లేనిది లభించడం . దానివల్ల భాషపై ఆసక్తి కలిగి నేర్చుకోవాలనే కోరిక
కలుగుతుంది, ఒకవ్యక్తి L.I.C కి ఒక లక్ష
రూ||లు ఇన్స్యురెంసు చేయ్యాలనుకుని ముందుగా ఒకటి, రెండు, లేదా మూడు ప్రీమియంలు వెయ్యిరుపాయలు చొప్పున కట్టి ఆ తరువాత
మరణిoచాడనుకుందాం. మిగిలిన సంస్థల్లో ఐతే కట్టిన డబ్బులే తిరిగొస్తాయి కాని LIC సంస్థలో కట్టిన డబ్బు, తానితో బాటు ఇంకా తను కట్టవలసిన
మిగిలిన సొమ్ము కూడ చేల్లిoచనవసరం లేకుండానే
వెంటనే ఆ వ్యక్తికి అందుతాయి. ఇటువంటి సూక్ష్మమైన విషయాలు వివరిస్తే
భాషపట్ల అందరికి ఆసక్తి పెరుగుతుంది. అలాగే
మిగిలిన భాషలన్నిటిలో కంటే సంస్కృత భాషలో ఉన్న ప్రత్యేకత వ్యుత్పత్తి. అది వివరించడం వల్లకూడా భాష పట్ల ఆసక్తి గౌరవం
పెరుగుతాయి. ఉదాహరణకు చెట్టుని మనం పాదపం
అని పిలుస్తాం . పాదై: పిబతి ( వ్రేళ్ళతో త్రాగుతుంది కాబట్టి అది ) పాదప:
అవుతుంది. అలాగే ‘పoజాబు’ అనే పదం (పంచ+ అప్ ) ఐదు నదులున్న రాష్ట్రం అని వివరిoచామనుకోండి. అది
ఆసక్తి రేకెత్తిస్తుంది. మిగిలిన భాషల్లో పదాలు ఇoత శాస్త్రీ యంగా కనిపించవు.
14.
ప్రజాబాహుళ్యంలో పేరున్న ,
సినీనటులు, క్రీడాకారుల సహాయసహకారాలు స్వీకరించి వారిద్వారా సంస్కృతాన్ని చదవమని
ప్రకటనలు ఇప్పించాలి. వారి ప్రకటనలు యువకులను ఉత్తెజపరుస్తాయి .
15.
వైదికమంత్రాల యొక్క అర్థం సామాన్యప్రజలందరు తెలుసుకునేలా వివిధ భాషలలోకి
అనువాదం చెయ్యాలి. అప్పుడే వారికి వైదిక
సాoప్రదాయాలపట్ల అభిరుచి పెరిగి భాష నేర్చుకోడానికి ప్రయత్నం చేస్తారు.
16.
వదాన్యశేఖరుల ఆర్థికపరమైన అండదండలతో గ్రామాల్లోను, పట్టణాల్లోను, నగరాల్లోనూ
అనేక అంశాల్లో పోటీలు నిర్వహించాలి. విజేతలను మంచి మంచి బహుమతులతోబాటు తప్పట్లనే సన్మానపు దుప్పట్లతోను సత్కరించి
ప్రోత్సహించాలి.
17.
సంస్కృతం చదివినవారికి కేవలం ఉపాధ్యాయుడుగానే కాకుoడ పత్రికారంగంలోనో,
అనువాదశాఖల్లోనో, లేదా సాంస్కృతిక లేక పర్యాటకశాఖల్లో ఉద్యోగాలు కల్పించాలి.
18.
సంఘే శక్తి: కలౌ యుగే ‘ అన్నట్లు ఈ కలియుగంలో సంఘబలం మించిన బలం మరొక్కటి
లేదు. అందువల్ల అందరు సంస్కృతభాషాభివృద్ధికి తమవంతు కృషి చేస్తే క్షణాల్లో ఏపనైన సాధించవచ్చు.
జయతు సంస్కృతం జయతు
భారతం
No comments:
Post a Comment