Saturday, June 27, 2015

తుమ్మల వారి కమ్మని పద్యం

తుమ్మల వారి కమ్మని పద్యం
ధునిక తెలుగుకవులలో శ్రీతుమ్మల సీతారామమూర్తి గారు సుప్రసిద్ధులు. ఆయన ఋషివంటి కవి. కవులలో ఋషి. జన్మ స్థలం అప్పికట్ల . వారికి తెలుగులెంక అనే బిరుదు కూడ ఉంది. దేశభక్తిని పెంపొందించే ఎన్నో కావ్యాలు రచించారు. రాష్ట్రగాన౦తో జాతిని జాగృతం చేశారు. జాతిపితను మహాకావ్యంలో బంధించి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గార్కి అంకితమిచ్చి జాతి ఋణ౦ తీర్చు కున్నారు.  ఒకసారి తుమ్మల వారికి నిడుబ్రోలులో  పౌరసన్మానం చాల ఘనంగా జరిగింది. ఎందరో పురప్రముఖులు, కవులు, కళాకారులు  ఆ సన్మానసభకు హాజరయ్యారు.  ఆనాటి సభకు ప్రముఖ పార్లమెంటు సభ్యులు ఆచార్య రంగా కూడ విచ్చేశారు. ఆయన రాక తుమ్మలవారికే కాదు సభాసదులందరికి ఆశ్చర్యం కలుగజేసింది. ఎ౦దుకంటే ఆచార్య రంగా గారు కేంద్రమంత్రి, బహుముఖప్రజ్ఞాశాలి, బహుకార్యభారమగ్నులున్ను. అటువంటి ఆయన రాకకు సంభ్రమాశ్చర్యాలు ప్రకటిస్తూ తుమ్మలవారు చెప్పిన పద్యం చాల మనోహరంగా ఉంటుంది . ఆ పద్యాన్ని పరికించండి .

కడపన్నిద్దురలేచి హస్తిపురిలోకాఫీని సేవించి చా
రెడు రొట్టెన్ కైరో కడన్నమిలి ప్యారిస్ పూటకూటింటిలో
కడుపున్ని౦పి హితోక్తులాడును ట్రుమన్ కల్పించు  దర్బారున    
నిడుబ్రోలీసుతుడెట్లు వచ్చె జననీ! నీ నేర్పు గాకు౦డినన్
 
శ్రీ ఆచార్య రంగా దినచర్య ఇలా ఉ౦టుంది. ఆయన కడపలో నిద్రలేస్తారట. ఢిల్లీలో కాఫీ త్రాగుతారట . కైరోలో అల్పాహారం తీసుకు౦టారట. ప్యారిస్ లోని ఏదో చిన్నహోటల్లో ఇ౦త తిని ట్రుమన్ తో ముచ్చటలాడతారట. అంతటి బహుకార్యవ్యాపృతుడు ఈ సన్మానసభకు విచ్చేయడం దైవానుగ్రహ౦ కాక మరే౦టి?.       








Thursday, June 25, 2015

అర్థం- అంతరార్థం

అర్థం- అంతరార్థం 
సంస్కృతభాషలో ఒక సూక్తి ఉంది . అదే౦టంటే
ప్రాత: ద్యూతప్రసంగేన మధ్యాహ్నే స్త్రీప్రసంగత:
రాత్రౌ చోరప్రసంగేన కాలో గచ్ఛతి ధీమతాం   

లోకంలో  బుద్ధిమంతులైన వారు ఉదయం జూద౦ గురించి, పగలంతా  స్త్రీ గురించి  , రాత్రంతా దొ౦గల గురించి చర్చిస్తూ కాలం గడిపేస్తారట. ఇదెంత విడ్డూరం. ఇలాచేస్తే వాళ్ళు బుద్ధిమంతులెందుకౌతారు. బుద్ధిహీనులే ఔతారు.  అపుడిది సూక్తి అవదు సుత్తే అవుతుంది . అందువల్ల ఇది సూక్తి కాబట్టి దీని అర్థం వేరుగా గ్రహించాలి. ఎలాగో చూద్దాం.
ఇక్కడ ద్యూతప్రసంగేన అనే మాట మహాభారతాన్ని సూచిస్తుంది. మహాభారతకథకు కీలకం జూదమే కదా! అలాగే స్త్రీప్రసంగత: అనే మాట రామాయణాన్ని సూచిస్తుంది. రామాయణకథకు మూలం స్త్రీ(సీత)యే కదా!  ఇక చోరప్రసంగేన అనే మాట భాగవతాన్ని సూచిస్తుంది. భాగవతకథానాయకుడు నవనీతచోరుడైన శ్రీకృష్ణుడే కదా!
భారతీయసంస్కృతికి, ఆధ్యాత్మికప్రగతికి భారత, రామాయణ, భాగవతాలు మూలస్త౦భాలు. మానవజీవిత౦లో సాధించవలసిన ధర్మార్థకామమోక్షాలకు ఆకరాలు.  ఈ మూడిటిలోనూ ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు  సంబంధించిన విషయాలున్నప్పటికి ప్రత్యేకంగా శ్రీమద్రామాయణ౦ ధర్మానికి, శ్రీమద్భారతం అర్థకామాలకు, శ్రీమద్భాగవతం మోక్షానికి ప్రామాణికాలు.  కాబట్టి ఈ మూడు గ్రంథాలను  ప్రతి వ్యక్తీ తప్పక చదవాలి. ఆకళింపు చేసుకోవాలి. ఆచరణలో పెట్టాలి. ఇవి కేవలం మతగ్రంథాలు కావు. మానవుణ్ణి మహనీయునిగా మార్చే మహత్తరమైన గ్రంథాలు. అందుకే పండితపామరులందరికి  నిత్యపారాయణగ్రంథాలు. ఆ గ్రంథాలన్నీ సంస్కృతభాషలో ఉండడం వల్ల సంస్కృతభాష నేర్చుకుని అవి చదివితే  మంచిదే. ఒక వేళ స౦స్కృత౦ నేర్చుకునే అవకాశం లేకపోతే అనువాదాలను చదివి విషయం గ్రహించవచ్చు . పరస్త్రీలను ఆశిస్తే  ఎటువంటివారికైనా పతనం తప్పదని రామాయణం , అధర్మాన్ని ఆశ్రయిస్తే అధోగతి తప్పదని మహాభారతం, మానవుని ఆధ్యాత్మికప్రగతికి భక్తిమార్గం రాచబాట అని భాగవతం సారా౦శరూప౦గా చెబుతాయి.  కాబట్టి మానవులందరూ కుల, మత, జాతి, లింగ వివక్షలేకుండా ఈ మూడుగ్రంథాలను చదివితే  మహనీయులు కాగలరనడంలో ఎటువంటి సందేహం లేదు.  

  
        










Sunday, June 21, 2015

పవిత్ర జీవనానికి పన్నెండు సూత్రాలు

పవిత్ర జీవనానికి పన్నెండు సూత్రాలు

మానవజీవితం చాల సంక్లిష్టమైంది. ఎన్నో ఒడుదుడుకులు, లాభనష్టాలు ఎదురౌతూ ఉంటాయి. అటువంటి సంక్లిష్టమైన జీవితం సాఫీగా, సుఖమయంగా సాగాలంటే కొన్ని నియమాలననుసరింఛి జీవించాలి.  అందుకోసం మన పెద్దలు ఎన్నో మార్గదర్శక సూత్రాలు ఏర్పరిచారు. భర్తృహరిమహాకవి అవన్నీ ఏక౦ చేసి ఒకే శ్లోకంలో పొందు పరిచాడు. అవే౦టో క్రమంగా పరిశీలిద్దాం .

1. మొదటిసూత్ర౦ -  అత్యాశను విడిచిపెట్టడం (తృష్ణాం  ఛి౦ది).
మానవుడు ఆశాజీవి. ఆశపడడం తప్పు కాకపోవచ్చునేమో గాని అత్యాశమాత్రం  ఖచ్చితంగా తప్పు. కోరికలకు అంత౦ లేకపోవడం చేత అవి తీర్చుకోడానికి మానవుడు పడే ప్రయాసకు కూడ అంతం ఉండదు. అంతే కాక  ఆశకు దాసులైనవారు ఈ సకలప్రపంచానికి దాసులే అవుతారు. ఇక ఎవరు ఆశను అదుపులో ఉ౦చుకు౦టారో వారికి ఈ ప్రపంచం అంతా అదుపులోనే ఉ౦టు౦దని మన పెద్దల అభిప్రాయం . అందుకే --
ఆశాయా: యే దాసా: తే దాసా: సర్వలోకస్య
ఆశా యేషా౦ దాసీ తేషాం దాసాయతే లోక:   --అన్నారు. కాబట్టి మానవుడు తన అవసరాలను తగ్గించుకుని వానికే పరిమితమై జీవిస్తే ఎటువంటి బాధ ఉండదు. అలాకాకుండా కోరికలు పెంచుకు౦టూ పోతే ఇ౦ద్రియాలచే ఆయాసపెట్టబడినవాడై సుఖాలకు దూరమౌతాడు. కాబట్టి కోరికలు సాధ్యమైనంత తగ్గించుకోవాలి.

2. రెండో సూత్రం - సహనాన్ని అలవరచుకోవడం (భజ క్షమాం)
మానవజీవితం సుఖదు:ఖాల మిశ్రమం . సుఖం శాశ్వతంగా ఉండదు, అలాగే దు:ఖం కూడ శాశ్వతం కాదు. ఒకదాని వెంట మరోటి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్రతీకారవా౦ఛలేకుండా , విచారం లేకుండా , దు:ఖాల్ని అనుభవించడమే సహనం . దీన్నే తితిక్షా అని కూడ పిలుస్తారు. దీనికి మించిన సాధనం మఱొకటి లేదు . న తితిక్షా సమమస్తి సాధనమ్ అంటారు భారవి మహాకవి.

3. మూడో సూత్రం - మదాన్ని మట్టుపెట్టడం. (జహి మదం)
  అహంకారం వల్ల మనిషి మత్తుడౌతాడు. వివేకాన్ని కోల్పోతాడు. చివరకు నాశనమౌతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితి లోను అహంకారానికి  తావివ్వకూడదు. అహంకారం  పతనానికి తొలిమెట్టు.   

4. నాల్గో సూత్రం పాపపు పనుల యందు ఆసక్తి కనపరచకపోవడం (పాపే రతిం మా కృథా:)
 ఇది చాల ముఖ్యమైనది . మంచిపనులు చెయ్యకపోయినా పరవా లేదు గాని చెడ్డ పనులెన్నడు చెయ్యకూడదు. మనం చేసిన పాపపుణ్యముల ఫలితం మనమే ఎప్పుడో ఒకప్పుడు , ఎక్కడో ఒక చోట అనుభవి౦చక తప్పదు. మనం సమాజంలో ఒక విచిత్రం  చూస్తూ ఉంటాం . అదేమిటంటే కొంతమంది చెడ్డవాళ్ళు చెడ్డపనులు చేస్తూనే ఎన్నో సుఖాలనుభవిస్తూ ఉంటారు; అలాగే మంచివాళ్ళు మంచిపనులు చేస్తున్నప్పటికీ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కనిపిస్తారు. ఇది మనం జీర్ణి౦చుకోలేం. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెడ్డవాళ్ళని మనం చెప్పుకుంటున్న వాళ్ళు పూర్వం ఎప్పుడో ఒకప్పుడు మంచిపనులు తప్పక చేసి ఉంటారు. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక ఇప్పుడు చేస్తున్న పాపాలకు మరో జన్మలో ఫలితం అనుభవించకతప్పదు. అలాగే ఈ జన్మలో మంచిపనులు చేస్తున్నప్పటికి ఇప్పుడు బాధలుపడుతున్నవాళ్ళు గతంలో చెడ్డపనులు చేసినవారే అయుంటారు. వాని ఫలమే ఈ బాధలు. నేడు చేస్తున్న మంచిపనులకు రాబోయే జన్మలో ఫలం తప్పక లభిస్తుంది. అందువల్ల  అవశ్యమనుభోక్తవ్యం కృత౦ కర్మ శుభాశుభం. అన్నారు మన పెద్దలు. ఒక్కొక్కప్పుడు పాపపుణ్యాల ఫలితం వెంటనే అనుభావి౦చక తప్పదు. అతిదారుణమైన పాపం, అతి ప్రసిద్ధ మైన పుణ్యం చేస్తే వాటిఫలితం ఈ లోకంలోనే మూడు సంవత్సరాల్లో గాని,మూడు నెలల్లో గాని, మూడు పక్షాల్లో గాని మూడు రోజుల్లో గాని అనుభావిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్రిభిర్వర్షై : త్రిభిర్మాసై: త్రిభి: పక్షై: త్రిభిర్దినై:
అత్యుత్కటై: పుణ్యపాపైరిహైవ ఫలమశ్నుతే.
ఎవరి పుణ్యపాపాలకు వారే బాధ్యులు . ఎవడు ఫ్లగ్ లో వేలు పెడితే వాడికే షాక్ కొడుతుంది గాని మరొకడికి కాదు. పాపపు పనులకు దూరంగా ఉండాలి.    

   5.  ఐదవ సూత్రం సత్య౦  పలకడం (సత్యం బ్రూహి).
ఒక్క ఏనుగు పాదంలో అన్ని జంతువుల పాదాలు ఇమిడి యున్నట్లే సత్యంలో సమస్తధర్మాలు ఇమిడి ఉ౦టాయి. సత్యానికి మించిన ధర్మం మఱొకటి లేదు. అందుకే సత్యాన్నాస్తి పరో ధర్మ: అన్నారు . కాబట్టి ఎట్టి పరిస్థితిలోను అబద్ధం చెప్పకూడదు. ఇక్కడొక ధర్మసూక్ష్మం కూడ లేకపోలేదు. ఏది సత్యం ఏది అసత్యం అనే విషయానికొస్తే  సమాజానికి హాని చేకూర్చే సత్యం కన్నా సమాజానికి మేలు కల్గించే అసత్యం మిన్న.  చెడ్డ ఉద్దేశ్యంతో మాట్లాడే  సత్యం కూడ అసత్యమే అవుతుంది. అలాగే మంచి ఉద్దేశ్యంతో మనం ఒక వేళ అబద్ధం చెప్పిన అది సత్యంతో సమానమే అవుతుంది .
అంతా ఉద్దేశ్యంలోనే ఉంది. మహాభారతంలో ఒక ఘట్టం పరిశీలిద్దాం. భారతయుద్ధ౦ జరుగుతోంది. ఆ యుద్ధంలో ద్రోణాచార్యులవార్ని చంపాలంటే ఆయనకొక విచారకరమైన వార్త తెలియజెయ్యాలి. ఎవరికైనా పుత్రమరణ౦ కంటే విచారకరమైన వార్త మరేదీ ఉండదు. అందువల్ల ద్రోణాచార్యుల పుత్రుడైన అశ్వత్థామ మరణించాడనే వార్త తెలియజేయమని ధర్మరాజుని కోరారు. కాని అబద్ధం చెప్పడానికి ధర్మరాజు నిరాకరించాడు. అపుడు పాండవులు భీముని చేత అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును చంపించి అశ్వత్థామ హత: కుంజర: అని చెప్పమన్నారు . ధర్మరాజు అ౦గీకరి౦చాడు. అలాగే చేశాడు . అప్పుడు కుంజర: అనే పదం ద్రోణునకు వినపడకుండా జాగ్రత్త పడ్డారు వారందరూ.   అశ్వత్థామ మరణించాడని భావించిన  ద్రోణుడు అస్త్రసన్యాసం చెయ్యగా ధృష్టద్యుమ్నుడు అతన్ని చంపాడు. ఇక్కడ వాస్తవానికి ధర్మరాజు అబద్ధమేమీ ఆడలేదు. కాని  ఉద్దేశ్యం మాత్రం ద్రోణుని చంపాలనే కోరిక.  అందువల్ల ధర్మరాజు రథం అంతకు ముందు వరకు భూమిని తాకకుండా నడిచేది . కాని అసత్యదోషంవల్ల అప్పటినుంచి భూమికి తాకుతూనే నడవడం మొదలైంది.
 అలాగే దీర్ఘరోగంతో బాధపడుచున్న ఒక రోగి డాక్టర్ దగ్గరకెళ్ళి పరీక్షి౦చుకుంటే డాక్టర్ అన్ని పరీక్షలు చేసి మీకేరోగం లేదు ఆరోగ్యంగానే ఉన్నారని చెబితే అది అసత్యమైనప్పటికి రోగిని పదికాలాల పాటు బ్రతికిస్తుంది, బ్రతికినంతకాలం  ఉల్లాస౦గా ఉంచుతుంది కాబట్టి డాక్టర్ కి అసత్యదోషం అంటదు.            

6. ఇక ఆరవ సూత్రం సత్పురుషుల జీవనమార్గాన్ని అనుసరించడం (అనుయాహి సాధుపదవీ౦)
సత్యం  ఒక్కటే అయినా  ఆ సత్యాన్ని భిన్నభిన్న మతాలు , భిన్న భిన్న శాస్త్రాలు దేశకాలాలకనుగుణంగా అనేకరకాలుగా నిర్వచిస్తున్నాయి. వాటిని తర్కిస్తూ వాదవివాదాలకు దిగకు౦డ మహాత్ముల మార్గాన్ని అనుసరించడమే మనకు శ్రేయస్కరం. అందువల్ల మహాజనో యేన గత: స పంథా:  అని పెద్దల అభిప్రాయం .

7. ఏడవ సూత్రం - పండితులను సేవించడం (సేవస్వ విద్వజ్జనం)
 పండితులను సేవించడం వల్ల వారి వలన ఎన్నో ధర్మాలను , ధర్మసూక్ష్మాలను గ్రహి౦చగలుగుతా౦.-దాని వల్ల  జీవితం సుఖవంతం ఔతుంది. 

8. ఎనిమిదో సూత్రం -  గౌరవి౦చవలసిన వారిని గౌరవించడం (మాన్యాన్మానయ ).
సాధారణంగా మన కంటే పెద్దవారిని మనం తప్పని సరిగా గౌరవించాలి. మన కుటుంబంలోను, చుట్టుప్రక్కల సమాజంలోను ఎంతోమంది మనకంటే పెద్దవారు౦టారు. వారందరి పట్ల ఎంతో గౌరవపుర్వకంగా వ్యవహరి౦చవలసిన బాధ్యత మనకుంది . వారి పట్ల ఏ మాత్రం అమర్యాదగా ప్రవర్తించినా  అది మనకెంతో ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. గౌరవి౦చదగినవారిని గౌరవి౦చకపోతే నీకు రావలసిన శ్రేయస్సుకు అవరోధం కలుగుతు౦దంటాడు కాలిదాస మహాకవి తన రఘువంశంలో (ప్రతిబధ్నాతి హి శ్రేయ: పూజ్యపూజావ్యతిక్రమ:) అందువలన పెద్దల్ని గౌరవి౦చడం ఎంతో అవసరం. మనం వారికి సేవలు చేయలేకపోయినా నోరార ప్రేమగా పలకరించి నమస్కారం చేస్తే మనకొచ్చే నష్టమేమి లేదు . ఇక దాని వల్ల వాళ్ళు పొందే సంతోషం మనకు కొండంత అండగా నిలుస్తుంది. అందువల్ల ఎప్పుడు పెద్దల్ని గౌరవిస్తూ ఉండాలి. పెద్దల్ని గౌరావించకపోతే మనం వారి వలన పొందవలసిన లాభం పొందలేం.

9. ఇక తొమ్మిదో సూత్రం శత్రువును కూడ ప్రేమించి గౌరవించడం (విద్విషోప్యనునయ)
ప్రతి వ్యక్తీ శత్రువును కూడ ప్రేమించే స్థాయికెదగాలి. మనకిష్టమైన మిత్రుల్ని ప్రేమి౦చడంలో గొప్పదనమేమి లేదు.  మనశత్రువుల్ని సైతం ప్రేమి౦చగలగడమే గొప్పదనం . అందుకే-
 ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరి౦పంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక  సేయువాడె నేర్పరి సుమతీ అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన.
శత్రువుకి ఉపకారం చేస్తే ఒక్కొక్కప్పుడు చెడ్డవాణ్ణి కూడ మంచివానిగా మార్చే అవకాశం చిక్కుతుంది.       

10. ప్రఖ్యాపయ ప్రశ్రయం (వినయం అలవరచుకోడం)
ఎంతగొప్పవానికైన వినయం ఉ౦డి తీరాలి. వినయం లేకపోతే ఎంతటి గోప్పవ్యక్తినైన ఎవరూ గౌరవించరు.  ఒక మనిషి  గొప్పవాడు కాకపోయినా అతన్ని అందరు గొప్పవాడంటే అతను గొప్పవాడుగా గుర్తి౦పబడతాడు. దేవే౦ద్రుడైనప్పటికి తన గొప్పదనం తానే చెప్పుకుంటే అందరికి చులకనై పోతాడు.
( పరై: ప్రోక్తా: గుణా: యస్య నిర్గుణోsపి గుణీ భవేత్
 ఇంద్రోsపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితై: గుణై:)     అందుకే వినయం అలవరచుకోవాలి.  

11. కీర్తిం పాలయ ( కీర్తిని పె౦పొందించుకోవడం)  శరీరానికి ఆత్మ ఎంత ముఖ్యమో వ్యక్తిత్వానికి కీర్తి అ౦తే ముఖ్యం.  మనిషి అపకీర్తి పాలైతే బ్రతికున్నా చచ్చినట్లే, కీర్తి మంతుడైతే మరణించినా జీవి౦చినట్లే. అందుకే నర: పతితకాయోsపి యశ:కాయేన జీవతి అన్నారు పెద్దలు. మనిషి భౌతికంగా మరణించినా కీర్తి శరీరంతో శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాడు.  అందువల్ల కీర్తిని రక్షించుకోవాలి. మచ్చ రాకుండా చూసుకోవాలి.

12. దు:ఖితే కురు దయా౦ ( దీనుల పట్ల దయ చూపడం)
  మనం ఎన్నో దానధర్మాలు చేస్తూ ఉంటాము . చేసేటప్పుడు పుచ్చుకునే వాడికి యోగ్యతా ఉందా లేదా అని విచారి౦చ౦. ఉన్నవాడు లేనివాడు కూడ ఉన్నవాడికే పెట్టాడు అన్న మాదిరిగా మనం మనకంటే ఉన్నతంగా ఉన్నవాడికి దానధర్మాలు చేస్తాం ,లేనివాడికి చెయ్యం . ఎ౦దుకంటే ఉన్నవాడికి చేస్తే మనకు గౌరవం లభిస్తుందని, మనకెప్పుడైన ఆ వ్యక్తి ఉపయోగపడతాడని మన భావన. కాని ప్రతిఫలాన్ని ఆశింఛి చేసే ఏ దానమైన  లేక సహాయమైన  సరైందనిపించుకోదు. 
అందుకే శ్రీశంకరాచార్యులవారు దేయం దీనజనాయ చ విత్తం  అన్నారు.  సముద్రంలో కురిసే వర్షం వ్యర్థం . కడుపునిండిన వానికి భోజనం పెట్టడం వ్యర్థం . సమర్థునకు దానం చెయ్యడం వ్యర్థం .  అలాగే పట్టపగలు వెలిగింఛిన దీపం వ్యర్థం.
వృథా వృష్టి: సముద్రేషు వృథా తృప్తస్య భోజనం
వృథా దానం సమర్థస్య వృథా దీపం దివాపి చ
కాబట్టి దీనులకే దానధర్మాలు చెయ్యాలి, కడుపు నిండిన వారికి కాదు. ఈ భావాలన్నీ వివరించే భర్తృహరి శ్లోకం చూడండి.
 తృష్ణాం  ఛి౦ది భజక్షమాం జహి మదం పాపే రతిం మా కృథా:
సత్యం బ్రూహ్యపయాహి సాదుపదవీ౦ సేవస్వ విద్వజ్జనం
మాన్యాన్మానయ విద్విషోప్యనునయ ప్రఖ్యాపయ ప్రశ్రయం
కీర్తిం పాలయ దు:ఖితే కురు దయామేతత్సతాం చేష్టితం    




Saturday, June 13, 2015

పతనం నుంచి కాపాడే పన్నెండు సూత్రాలు

పతనం నుంచి కాపాడే పన్నెండు సూత్రాలు
(Twelve tips to protect from down fall)

ఏదైనా ఒక దాన్ని  సంపాదించడం ఒక ఎత్తైతే సంపాదించినదాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఏ పొరబాటు చేస్తే ఏది చెయ్యి జారి పోతుందో మహాకవి భర్తృహరి చాల సంగ్రహ౦గా, సమగ్రంగా, ఆసక్తికరంగా ఒకేఒక్క శ్లోకంలో వివరించాడు. ఆయా పొరబాట్లు జరగకుండా జాగ్రత్తపడడం కోసం ముందుగా అవే౦టో తెలుసుకుందాం.
1.        దౌర్మన్త్ర్యాన్నృపతి: వినశ్యతి ( చెడ్డ మంత్రి వల్ల రాజు నశిస్తాడు)
రాజు  ఎంతసమర్థవంతుడైనా మంత్రి మంచివాడు కాకపొతే రాజు నష్టపోతాడు. ఈ నియమం అన్నిటికి వర్తిస్తుంది .  అందువల్ల ఒక నాయకుడు గాని లేక అధికారి గాని  మంచివారిని, సమర్థవంతులను సలహాదారులుగా నియమి౦చుకు౦టేనే రాజ్యం గాని సంస్థ గాని పదికాలాల పాటు సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుంది . లేక పొతే ఆనతి కాలంలోనే పతనమైపోతు౦ది.    
2.         యతిస్సంగాత్ ( సన్యాసి సంగం వల్ల పతనమౌతాడు)
ఇక సన్యాసికి ఏవ్యక్తి పట్ల ఏ వస్తువు పట్ల వ్యామోహం  ఉండకూడదు. వ్యామోహం ఉంటే అది బంధానికి(attachment) దారితీస్తుంది. అందువల్ల సన్యాసి ప్రపంచంలో ఉంటూనే దాని పట్ల ఎటువంటి వ్యామోహం లేకుండా సర్వసంగ పరిత్యాగిగా
ఉండాలి. తామరాకుపై నీటి బొట్టులా , కొబ్బరికాయలో కురిడీలా నిర్లిప్తంగా ఉండాలి . తామరాకుపై ఉన్న నీటిబొట్టు ఆకును  అంటుకోకుండా ; అదే విధంగా కురిడీ కొబ్బరికాయలోనే ఉన్నా దాన్ని అంటి పెట్టుకోకుండా ఎలా ఉంటుందో సన్యాసి కూడ అలాగే ప్రపంచంలో మన ముందు మనలాగే మసలుతున్నా అన్నిటికి అతీతంగా ఉండాలి . లేకపోతే పతనం కాక తప్పదు. సన్యాసి ఎల్లప్పుడూ దేనితోను మానసికసంబంధం పెట్టు కోకూడదు .
3.        సుతో లాలనాత్ ( పుత్రుడు గారాబం చెయ్యడం వల్ల చెడిపోతాడు)

పిల్లవాడు ఎక్కువ గారాబం చెయ్యడం వల్ల నష్టపోతాడు . ప్రేమ వేరు గారాబం వేరు . అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమి౦చొచ్చు, కాని గారాబం చెయ్యకూడదు. పిల్లలు మంచి చేస్తే అభినంది౦చాలి అలాగే  తప్పు చేస్తే శిక్షించాలి. తప్పును తప్పుగా చెప్పాలి ఒప్పును ఒప్పుగా చెప్పాలి . వాళ్ళని మెప్పి౦చడం కోసం తప్పుని ఒప్పుగా చెప్పకూడదు. ఒక వేళ తాత్కాలికంగా మన మాటలు వాళ్ళని  నొప్పించినా ఆ తరువాత వాళ్లకు జ్ఞానోదయమై మనని మెచ్చుకుంటారు. అలా కాకుండా మనం తప్పుని ఒప్పుగా సమర్థిస్తే  ఆ తరువాత వాళ్ళు కష్టాలపాలైనప్పుడు మనల్ని తిట్టుకుంటారు. అందువల్ల పిల్లలను లాలన చేయకూడదు  ప్రేమపుర్వకమైన క్రమశిక్షణలోనే పెంచాలి.       
4.        విప్రోsనధ్యయనాత్ ( విప్రుడు వేదాలు చదవకపోవడం వల్ల నష్టపోతాడు) 
ప్రతి బ్రాహ్మణుడు కనీసం ఆరు ధర్మాలు పాటించాలి . వేదాలు చదవడం( అధ్యయనం)   , చదివించడం  ( అధ్యాపనం) ; యజ్ఞాలు చెయ్యడం ( యజనం ), యజ్ఞాలు చేయించడం (యాజనం), దానం చెయ్యడం (దానం), దానం పుచ్చుకోవడం ( ప్రతిగ్రహం ) . ఈ ఆరింటిలో మొదటిది వేదాలు చదవడం . కాబట్టి బ్రాహ్మణుడు వేదాలను చదవకపోవడం వల్ల నష్ట పోతాడు. అందువల్ల వేదాధ్యయనం ఎన్నడు విడిచిపెట్టరాదు.
5. కులం కుతనయాత్ (చెడ్డకుమారుని వల్ల వ౦శ౦ అపవిత్రమౌతుంది)
చెడ్డ సంతానం వల్ల వంశప్రతిష్ఠ దెబ్బతింటుంది . ఇది స్త్రీ పురుషులిద్దరికి వర్తిస్తుంది . పురుషుడు చెడ్డవాడైతే కేవలం తన వంశానికే అపకీర్తి కలుగుతుంది. ఇక స్త్రీ  చెడ్డదైతే అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి కూడ చెడ్డపేరు వస్తుంది. అందువల్ల వంశగౌరవాన్ని కాపాడడంలో పురుషుని కంటే స్త్రీకే ఎక్కువ బాధ్యత ఉంది. అందువల్ల స్త్రీ పురుషుని కంటే ఎక్కువ అప్రమత్తంగా మెలగాలి.
6.     శీల౦ ఖలోపాసనాత్  ( చెడ్డవారితో సహవాసం చెయ్యడం వల్ల శీలం మలినమౌతుంది)
ఏ  వ్యక్తి అయినా  కేవలం తాను మంచివాడైతే సరిపోదు. తనతో మసలేవారు కూడ మంచివారు కావాలి. ఎ౦దుకంటే  మన నడవడి మనతో ఉ౦డేవారి నడవడి మీద ఆధారపడి  ఉంటు౦ది. ఆంగ్లంలో Tell me who your friend is. I shall tell you what you are అనే సామెత ఈ విషయాన్నే సూచిస్తుంది . అందువల్ల సౌశీల్యాన్ని కాపాడుకోవాలంటే దుష్టులకు దూరంగా ఉండాలి.  

7.      హ్రీర్మద్యాత్  ( మద్యపానం వలన ఆత్మగౌరవం దెబ్బతింటుంది)
 మద్యపాన౦ ఒక దుర్వ్యసనం దానివల్ల మనిషి శారీరకంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఎంతోనష్టపోతున్నాడు. అతనితో పాటు కుటుంబసభ్యులందరూ కూడ అవమానాల పాలౌతారు. అందువల్ల ఆత్మగౌరవం , కుటుంబమర్యాద రక్షి౦చుకోవాలంటే మద్యపానవ్యసనం నుండి బయటపడాలి . 
8.      అనవేక్షణాదపి కృషి:  ( సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వ్యవసాయం దెబ్బతింటుంది)
ఇక్కడ కృషి అనే పదం కేవలం వ్యవసాయానికే కాదు, ప్రతి పనికి వర్తిస్తుంది. వ్యవసాయం మాటకొద్దాం . అది విత్తులు నాటిన నాటినుంచి పంట ఇంటికి చేరే౦త వరకు అడుగడుగునా అప్రమత్తతతో పర్యవేక్షిస్తూనే ఉండాలి. ఈనగాచి నక్కలపాలన్నట్లుగా చెయ్యకూడదు. ఎప్పుడు, ఎక్కడ ఏమరుపాటుగా ఉన్నా నష్టపోక తప్పదు. అలాగే మనం ఏపని ప్రారంభించినా అది పూర్తిగా విజయవంతమయ్యే వరకు జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం సిద్ధిస్తుంది.   
9.       స్నేహ: ప్రవాసాశ్రయాత్  (దూరంగా (విదేశాలకు) వెళ్ళిపోవడ౦వల్ల స్నేహం సన్నగిల్లుతుంది)
 స్నేహం అనేది దగ్గరగా ఉన్నప్పుడే పెరుగుతుంది.  దూరమైపోతే క్రమక్రమంగా     తరిగిపోతుంది. స్నేహం వేరు మైత్రి  వేరు . స్నేహితుడు వేరు మిత్రుడు వేరు. ఉదాహరణకు ఒక క్లాసులో అందరూ ఒకరికొకరు స్నేహితులే . కాని ప్రతి వ్యక్తికీ మిత్రులు ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. మనకు కొన్ని వేలమంది స్నేహితులు౦డొచ్చు. కాని జీవితకాలంలో కనీసం ఒక మిత్రుణ్ణి  పొందగలిగితే వాడు ధన్యుడే .  మంచి మిత్రుణ్ణి  సంపాదించుకోవడం అ౦త కష్టమైన పని . కొన్ని వేలమంది స్నేహితులున్నా వాళ్ళల్లో మిత్రుడు  ఒక్కడైనా ఉంటాడో ఉండడో చెప్పలేం.  
10.                         మైత్రీచాప్రణయాత్  ( ప్రేమ లోపిస్తే మైత్రి  క్షీణిస్తుంది)
ఇంతకు ముందే స్నేహితునికి మిత్రునికి మధ్య ఉండే తేడా గురించి చెప్పుకున్నాం. తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం  యత్ అంటాడు భర్తృహరి . సుఖదు:ఖాలలో ఒకరి నొకరు విడువకుండా ఉండేవారే  మిత్రులు. వారికి శారీరాలే వేరు, ఆత్మ ఒకటే . అలా ఉ౦డే వారే మిత్రులు. వారిద్దరిని అలా కట్టి పడేసేది ప్రేమ మాత్రమే. ప్రేమ లక్షణాన్ని ఆరు విధాలుగా చెబుతారు మన పెద్దలు .
దదాతి ప్రతిగృహ్ణాతి, గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి
భు౦క్తే భోజయతే చైవ  షడ్విధం ప్రీతిలక్షణం
అని ప్రీతి లక్షణాన్ని పేర్కొన్నారు.    ప్రతి వ్యక్తీ తన మిత్రుడికి  ఇవ్వాలి, మిత్రుని నుంచి తీసుకోవాలి ; అతని దగ్గర తినాలి , అతనికి తినిపించాలి ; అతని రహస్యాలు అడిగి తెలుసుకోవాలి , అతనికి తన రహస్యాలు చెప్పాలి. ఈ ఆరు ఉ౦డాలంటే పవిత్రప్రేమ అవసరం అవుతుంది. ఇది తప్పనిసరి . దీన్నే  ప్రణయం అంటాం . ఆ ప్రణయం కరువైతే మైత్రి కనుమరుగౌతు౦ది. అది పరస్పరం ఇరువురి మధ్య కొనసాగుతూనే ఉండాలి.       
11. సమృద్ధిరనయాత్  ( అవినీతి వలన సంపదలు నశిస్తాయి) మనం సంపాది౦చే సంపద  ధర్మబద్ధమై౦ది కావాలి . ఏమాత్రం అధర్మం చోటు చేసుకున్నా మన౦ స౦పాది౦ఛిన ధనంతో బాటు మన పూర్వీకులు సంపాదించిన సంపదలు కూడ చేజారి పోతాయి . అందువల్ల మనం ఇతరులకు ఎటువంటి కష్టాన్ని కల్గి౦చకుండా, ప్రతి అడ్డమైన వాడికి తలవంచకుండా, ధర్మమైన మార్గాన్ని విడిచిపెట్టకుండా సంపాదించే ధనం స్వల్పమైనా అది ఎక్కువే   అని మన పెద్దలు చెప్పారు . 
అకృత్వా పరసంతాపం, అగత్వా ఖలనమ్రతాం
అనుత్సృజ్య  సతాం వర్త్మ యత్స్వల్పమపి తద్బహు
 
               12. త్యాగాత్ప్రమాదాద్ధనం  ( మితిమీరిన దానం వల్ల జాగరూకత లోపించడం వల్ల  సంపదలు తరిగిపోతాయి)
                ఇక ధనం సంపాదించడం ఒక ఎత్తైతే సంపాదించిన ధనాన్ని రక్షించు కోవడం మరో ఎత్తు. మితిమీరిన దానం వల్ల, అజాగ్రత్త వలన ధనం చేజారి పోతుంది. దానం చేస్తే తప్పు లేదు. చెయ్యాలి కూడ . కాని దానికో హద్దు ఉంది. అవసరాల్ని తీర్చే దానం చెయ్యొచ్చు గాని గొప్పకోసం శక్తికి మించి దానం చెయ్యడం పనికి రాదు. అందువల్ల వివేకాన్ని కోల్పోకుండా దానం చెయ్యాలి. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరి౦చడం వలన కూడ ధననష్టం వాటిల్లుతుంది . అ౦దువల్ల శక్తికి లోబడి  పేదసాదలకు దానధర్మాలు చేస్తూ జాగ్రత్తగా మెలగడం వల్ల ధనం నిలుస్తుంది.       

 దౌర్మన్త్ర్యాన్నృపతి: వినశ్యతి యతిస్సంగాత్సుతో లాలనాత్
విప్రోsనధ్యయనాత్కులం కుతనయాచ్ఛీల౦ ఖలోపాసనాత్
హ్రీర్మద్యాదనవేక్షణాదపి కృషి: స్నేహ: ప్రవాసాశ్రయాత్
మైత్రీచాప్రణయాత్సమృద్ధిరనయాత్త్యాగాత్ప్రమాదాద్ధనం
              (నీతిశతకం భర్తృహరి)