పతనం నుంచి కాపాడే
పన్నెండు సూత్రాలు
(Twelve
tips to protect from down fall)
ఏదైనా ఒక దాన్ని సంపాదించడం ఒక ఎత్తైతే సంపాదించినదాన్ని
నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఏ పొరబాటు చేస్తే ఏది చెయ్యి జారి పోతుందో మహాకవి భర్తృహరి
చాల సంగ్రహ౦గా, సమగ్రంగా, ఆసక్తికరంగా ఒకేఒక్క శ్లోకంలో వివరించాడు. ఆయా పొరబాట్లు
జరగకుండా జాగ్రత్తపడడం కోసం ముందుగా అవే౦టో తెలుసుకుందాం.
1.
దౌర్మన్త్ర్యాన్నృపతి: వినశ్యతి ( చెడ్డ మంత్రి
వల్ల రాజు నశిస్తాడు)
రాజు
ఎంతసమర్థవంతుడైనా మంత్రి మంచివాడు కాకపొతే రాజు నష్టపోతాడు. ఈ నియమం
అన్నిటికి వర్తిస్తుంది . అందువల్ల ఒక
నాయకుడు గాని లేక అధికారి గాని మంచివారిని, సమర్థవంతులను సలహాదారులుగా నియమి౦చుకు౦టేనే రాజ్యం గాని సంస్థ గాని పదికాలాల
పాటు సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుంది . లేక పొతే ఆనతి కాలంలోనే పతనమైపోతు౦ది.
2.
యతిస్సంగాత్
( సన్యాసి సంగం వల్ల పతనమౌతాడు)
ఇక సన్యాసికి ఏవ్యక్తి పట్ల ఏ వస్తువు
పట్ల వ్యామోహం ఉండకూడదు. వ్యామోహం ఉంటే
అది బంధానికి(attachment) దారితీస్తుంది. అందువల్ల సన్యాసి ప్రపంచంలో ఉంటూనే దాని
పట్ల ఎటువంటి వ్యామోహం లేకుండా సర్వసంగ పరిత్యాగిగా
ఉండాలి. తామరాకుపై నీటి బొట్టులా ,
కొబ్బరికాయలో కురిడీలా నిర్లిప్తంగా ఉండాలి . తామరాకుపై ఉన్న నీటిబొట్టు ఆకును అంటుకోకుండా ; అదే విధంగా కురిడీ కొబ్బరికాయలోనే
ఉన్నా దాన్ని అంటి పెట్టుకోకుండా ఎలా ఉంటుందో సన్యాసి కూడ అలాగే ప్రపంచంలో మన ముందు
మనలాగే మసలుతున్నా అన్నిటికి అతీతంగా ఉండాలి . లేకపోతే పతనం కాక తప్పదు. సన్యాసి
ఎల్లప్పుడూ దేనితోను మానసికసంబంధం పెట్టు కోకూడదు .
3.
సుతో లాలనాత్ ( పుత్రుడు గారాబం చెయ్యడం
వల్ల చెడిపోతాడు)
పిల్లవాడు ఎక్కువ గారాబం చెయ్యడం వల్ల
నష్టపోతాడు . ప్రేమ వేరు గారాబం వేరు . అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని
ప్రేమి౦చొచ్చు, కాని గారాబం చెయ్యకూడదు. పిల్లలు మంచి చేస్తే అభినంది౦చాలి
అలాగే తప్పు చేస్తే శిక్షించాలి. తప్పును
తప్పుగా చెప్పాలి ఒప్పును ఒప్పుగా చెప్పాలి . వాళ్ళని మెప్పి౦చడం కోసం తప్పుని
ఒప్పుగా చెప్పకూడదు. ఒక వేళ తాత్కాలికంగా మన మాటలు వాళ్ళని నొప్పించినా ఆ తరువాత వాళ్లకు జ్ఞానోదయమై మనని
మెచ్చుకుంటారు. అలా కాకుండా మనం తప్పుని ఒప్పుగా సమర్థిస్తే ఆ తరువాత వాళ్ళు కష్టాలపాలైనప్పుడు మనల్ని
తిట్టుకుంటారు. అందువల్ల పిల్లలను లాలన చేయకూడదు ప్రేమపుర్వకమైన క్రమశిక్షణలోనే పెంచాలి.
4.
విప్రోsనధ్యయనాత్
( విప్రుడు వేదాలు చదవకపోవడం వల్ల నష్టపోతాడు)
ప్రతి బ్రాహ్మణుడు కనీసం ఆరు ధర్మాలు
పాటించాలి . వేదాలు చదవడం( అధ్యయనం) , చదివించడం ( అధ్యాపనం) ; యజ్ఞాలు చెయ్యడం ( యజనం ), యజ్ఞాలు
చేయించడం (యాజనం), దానం చెయ్యడం (దానం), దానం పుచ్చుకోవడం ( ప్రతిగ్రహం ) . ఈ
ఆరింటిలో మొదటిది వేదాలు చదవడం . కాబట్టి బ్రాహ్మణుడు వేదాలను చదవకపోవడం వల్ల నష్ట
పోతాడు. అందువల్ల వేదాధ్యయనం ఎన్నడు విడిచిపెట్టరాదు.
5. కులం కుతనయాత్
(చెడ్డకుమారుని వల్ల వ౦శ౦ అపవిత్రమౌతుంది)
చెడ్డ సంతానం వల్ల వంశప్రతిష్ఠ
దెబ్బతింటుంది . ఇది స్త్రీ పురుషులిద్దరికి వర్తిస్తుంది . పురుషుడు చెడ్డవాడైతే కేవలం
తన వంశానికే అపకీర్తి కలుగుతుంది. ఇక స్త్రీ
చెడ్డదైతే అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి కూడ చెడ్డపేరు వస్తుంది.
అందువల్ల వంశగౌరవాన్ని కాపాడడంలో పురుషుని కంటే స్త్రీకే ఎక్కువ బాధ్యత ఉంది. అందువల్ల
స్త్రీ పురుషుని కంటే ఎక్కువ అప్రమత్తంగా మెలగాలి.
6.
శీల౦ ఖలోపాసనాత్ ( చెడ్డవారితో
సహవాసం చెయ్యడం వల్ల శీలం మలినమౌతుంది)
ఏ
వ్యక్తి అయినా కేవలం తాను
మంచివాడైతే సరిపోదు. తనతో మసలేవారు కూడ మంచివారు కావాలి. ఎ౦దుకంటే మన నడవడి మనతో ఉ౦డేవారి నడవడి మీద ఆధారపడి ఉంటు౦ది. ఆంగ్లంలో Tell me who your friend is.
I shall tell you what you are అనే సామెత ఈ విషయాన్నే సూచిస్తుంది . అందువల్ల సౌశీల్యాన్ని
కాపాడుకోవాలంటే దుష్టులకు దూరంగా ఉండాలి.
7.
హ్రీర్మద్యాత్
( మద్యపానం వలన ఆత్మగౌరవం
దెబ్బతింటుంది)
మద్యపాన౦ ఒక దుర్వ్యసనం దానివల్ల మనిషి
శారీరకంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఎంతోనష్టపోతున్నాడు. అతనితో పాటు కుటుంబసభ్యులందరూ
కూడ అవమానాల పాలౌతారు. అందువల్ల ఆత్మగౌరవం , కుటుంబమర్యాద రక్షి౦చుకోవాలంటే
మద్యపానవ్యసనం నుండి బయటపడాలి .
8.
అనవేక్షణాదపి
కృషి: ( సరైన పర్యవేక్షణ లేకపోవడం
వల్ల వ్యవసాయం దెబ్బతింటుంది)
ఇక్కడ కృషి అనే పదం కేవలం వ్యవసాయానికే
కాదు, ప్రతి పనికి వర్తిస్తుంది. వ్యవసాయం మాటకొద్దాం . అది విత్తులు నాటిన
నాటినుంచి పంట ఇంటికి చేరే౦త వరకు అడుగడుగునా అప్రమత్తతతో పర్యవేక్షిస్తూనే
ఉండాలి. ఈనగాచి నక్కలపాలన్నట్లుగా చెయ్యకూడదు. ఎప్పుడు, ఎక్కడ ఏమరుపాటుగా ఉన్నా
నష్టపోక తప్పదు. అలాగే మనం ఏపని ప్రారంభించినా అది పూర్తిగా విజయవంతమయ్యే వరకు
జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం సిద్ధిస్తుంది.
9.
స్నేహ: ప్రవాసాశ్రయాత్ (దూరంగా (విదేశాలకు) వెళ్ళిపోవడ౦వల్ల
స్నేహం సన్నగిల్లుతుంది)
స్నేహం
అనేది దగ్గరగా ఉన్నప్పుడే పెరుగుతుంది.
దూరమైపోతే క్రమక్రమంగా
తరిగిపోతుంది. స్నేహం వేరు మైత్రి వేరు . స్నేహితుడు వేరు మిత్రుడు వేరు. ఉదాహరణకు
ఒక క్లాసులో అందరూ ఒకరికొకరు స్నేహితులే . కాని ప్రతి వ్యక్తికీ మిత్రులు ఒకరో
ఇద్దరో మాత్రమే ఉంటారు. మనకు కొన్ని వేలమంది స్నేహితులు౦డొచ్చు. కాని జీవితకాలంలో కనీసం
ఒక మిత్రుణ్ణి పొందగలిగితే వాడు ధన్యుడే .
మంచి మిత్రుణ్ణి సంపాదించుకోవడం అ౦త కష్టమైన పని . కొన్ని వేలమంది
స్నేహితులున్నా వాళ్ళల్లో మిత్రుడు ఒక్కడైనా
ఉంటాడో ఉండడో చెప్పలేం.
10.
మైత్రీచాప్రణయాత్ ( ప్రేమ లోపిస్తే మైత్రి
క్షీణిస్తుంది)
ఇంతకు ముందే స్నేహితునికి మిత్రునికి
మధ్య ఉండే తేడా గురించి చెప్పుకున్నాం. తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం యత్ అంటాడు భర్తృహరి . సుఖదు:ఖాలలో
ఒకరి నొకరు విడువకుండా ఉండేవారే మిత్రులు.
వారికి శారీరాలే వేరు, ఆత్మ ఒకటే . అలా ఉ౦డే వారే మిత్రులు. వారిద్దరిని అలా కట్టి
పడేసేది ప్రేమ మాత్రమే. ప్రేమ లక్షణాన్ని ఆరు విధాలుగా చెబుతారు మన పెద్దలు .
దదాతి
ప్రతిగృహ్ణాతి, గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి
భు౦క్తే భోజయతే
చైవ షడ్విధం ప్రీతిలక్షణం
అని ప్రీతి లక్షణాన్ని
పేర్కొన్నారు. ప్రతి వ్యక్తీ తన మిత్రుడికి
ఇవ్వాలి, మిత్రుని నుంచి తీసుకోవాలి ; అతని
దగ్గర తినాలి , అతనికి తినిపించాలి ; అతని రహస్యాలు అడిగి తెలుసుకోవాలి , అతనికి
తన రహస్యాలు చెప్పాలి. ఈ ఆరు ఉ౦డాలంటే పవిత్రప్రేమ అవసరం అవుతుంది. ఇది తప్పనిసరి
. దీన్నే ప్రణయం అంటాం . ఆ ప్రణయం కరువైతే
మైత్రి కనుమరుగౌతు౦ది. అది పరస్పరం ఇరువురి మధ్య కొనసాగుతూనే ఉండాలి.
11. సమృద్ధిరనయాత్ ( అవినీతి వలన సంపదలు నశిస్తాయి) మనం
సంపాది౦చే సంపద ధర్మబద్ధమై౦ది కావాలి .
ఏమాత్రం అధర్మం చోటు చేసుకున్నా మన౦ స౦పాది౦ఛిన ధనంతో బాటు మన పూర్వీకులు
సంపాదించిన సంపదలు కూడ చేజారి పోతాయి . అందువల్ల మనం ఇతరులకు ఎటువంటి కష్టాన్ని
కల్గి౦చకుండా, ప్రతి అడ్డమైన వాడికి తలవంచకుండా, ధర్మమైన మార్గాన్ని విడిచిపెట్టకుండా
సంపాదించే ధనం స్వల్పమైనా అది ఎక్కువే
అని మన పెద్దలు చెప్పారు .
అకృత్వా పరసంతాపం, అగత్వా ఖలనమ్రతాం
అనుత్సృజ్య సతాం వర్త్మ యత్స్వల్పమపి తద్బహు
12. త్యాగాత్ప్రమాదాద్ధనం ( మితిమీరిన దానం వల్ల జాగరూకత లోపించడం
వల్ల సంపదలు తరిగిపోతాయి)
ఇక ధనం సంపాదించడం ఒక ఎత్తైతే సంపాదించిన
ధనాన్ని రక్షించు కోవడం మరో ఎత్తు. మితిమీరిన దానం వల్ల, అజాగ్రత్త వలన ధనం చేజారి
పోతుంది. దానం చేస్తే తప్పు లేదు. చెయ్యాలి కూడ . కాని దానికో హద్దు ఉంది. అవసరాల్ని
తీర్చే దానం చెయ్యొచ్చు గాని గొప్పకోసం శక్తికి మించి దానం చెయ్యడం పనికి రాదు.
అందువల్ల వివేకాన్ని కోల్పోకుండా దానం చెయ్యాలి. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరి౦చడం
వలన కూడ ధననష్టం వాటిల్లుతుంది . అ౦దువల్ల శక్తికి లోబడి పేదసాదలకు దానధర్మాలు చేస్తూ జాగ్రత్తగా మెలగడం
వల్ల ధనం నిలుస్తుంది.
దౌర్మన్త్ర్యాన్నృపతి: వినశ్యతి యతిస్సంగాత్సుతో
లాలనాత్
విప్రోsనధ్యయనాత్కులం కుతనయాచ్ఛీల౦ ఖలోపాసనాత్
హ్రీర్మద్యాదనవేక్షణాదపి కృషి: స్నేహ: ప్రవాసాశ్రయాత్
మైత్రీచాప్రణయాత్సమృద్ధిరనయాత్త్యాగాత్ప్రమాదాద్ధనం
(నీతిశతకం –భర్తృహరి)
No comments:
Post a Comment