అర్థం- అంతరార్థం
సంస్కృతభాషలో ఒక
సూక్తి ఉంది . అదే౦టంటే –
ప్రాత: ద్యూతప్రసంగేన
మధ్యాహ్నే స్త్రీప్రసంగత:
రాత్రౌ
చోరప్రసంగేన కాలో గచ్ఛతి ధీమతాం
లోకంలో బుద్ధిమంతులైన వారు ఉదయం జూద౦ గురించి,
పగలంతా స్త్రీ గురించి , రాత్రంతా దొ౦గల గురించి చర్చిస్తూ కాలం గడిపేస్తారట.
ఇదెంత విడ్డూరం. ఇలాచేస్తే వాళ్ళు బుద్ధిమంతులెందుకౌతారు. బుద్ధిహీనులే ఔతారు. అపుడిది సూక్తి అవదు సుత్తే అవుతుంది . అందువల్ల
ఇది సూక్తి కాబట్టి దీని అర్థం వేరుగా గ్రహించాలి. ఎలాగో చూద్దాం.
ఇక్కడ ‘ద్యూతప్రసంగేన’ అనే మాట
మహాభారతాన్ని సూచిస్తుంది. మహాభారతకథకు కీలకం జూదమే కదా! అలాగే ‘స్త్రీప్రసంగత:’ అనే మాట రామాయణాన్ని
సూచిస్తుంది. రామాయణకథకు మూలం స్త్రీ(సీత)యే కదా!
ఇక ‘చోరప్రసంగేన’ అనే మాట
భాగవతాన్ని సూచిస్తుంది. భాగవతకథానాయకుడు నవనీతచోరుడైన శ్రీకృష్ణుడే కదా!
భారతీయసంస్కృతికి,
ఆధ్యాత్మికప్రగతికి భారత, రామాయణ, భాగవతాలు మూలస్త౦భాలు. మానవజీవిత౦లో సాధించవలసిన
ధర్మార్థకామమోక్షాలకు ఆకరాలు. ఈ మూడిటిలోనూ
ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించిన విషయాలున్నప్పటికి ప్రత్యేకంగా
శ్రీమద్రామాయణ౦ ధర్మానికి, శ్రీమద్భారతం అర్థకామాలకు,
శ్రీమద్భాగవతం మోక్షానికి ప్రామాణికాలు.
కాబట్టి ఈ మూడు గ్రంథాలను ప్రతి
వ్యక్తీ తప్పక చదవాలి. ఆకళింపు చేసుకోవాలి. ఆచరణలో పెట్టాలి. ఇవి కేవలం మతగ్రంథాలు
కావు. మానవుణ్ణి మహనీయునిగా మార్చే మహత్తరమైన గ్రంథాలు. అందుకే పండితపామరులందరికి నిత్యపారాయణగ్రంథాలు. ఆ గ్రంథాలన్నీ సంస్కృతభాషలో
ఉండడం వల్ల సంస్కృతభాష నేర్చుకుని అవి చదివితే
మంచిదే. ఒక వేళ స౦స్కృత౦ నేర్చుకునే అవకాశం లేకపోతే అనువాదాలను చదివి విషయం
గ్రహించవచ్చు . పరస్త్రీలను ఆశిస్తే ఎటువంటివారికైనా పతనం తప్పదని రామాయణం ,
అధర్మాన్ని ఆశ్రయిస్తే అధోగతి తప్పదని మహాభారతం, మానవుని ఆధ్యాత్మికప్రగతికి
భక్తిమార్గం రాచబాట అని భాగవతం సారా౦శరూప౦గా చెబుతాయి. కాబట్టి మానవులందరూ కుల, మత, జాతి, లింగ
వివక్షలేకుండా ఈ మూడుగ్రంథాలను చదివితే
మహనీయులు కాగలరనడంలో ఎటువంటి సందేహం లేదు.
No comments:
Post a Comment