గురువును మించిన శిష్యుడు
డాక్టర్: చిలకమర్తి దుర్గాప్రసాద రావు
ఆస్తికదర్శనాలు , నాస్తిక దర్శనాలు అని భారతీయదర్శనాలు రెండు విధాలు . వేద ప్రమాణాన్ని
అంగీకరించేవి ఆస్తికదర్శనాలు . అంగీకరించనివి నాస్తిక దర్శనాలు . చార్వాక, జైన , బౌద్ధ
దర్శనాలు నాస్తిక దర్శనాలు . కపిలుని సాంఖ్యం , పతంజలి యోగం , గౌతముని న్యాయం , కణాదుని
వైశేషికం, జైమిని పూర్వమీమాంస , వ్యాసుని ఉత్తరమీమాంస ఆస్తిక దర్శనాలు . పూర్వమీమాంసాశాస్త్రంలో రెండు శాఖలున్నాయి .
మొదటిశాఖకు ఆద్యుడు కుమారిలభట్టు . రెండవశాఖకు ఆద్యుడు ప్రభాకరమిశ్రుడు .
ప్రభాకరమిశ్రుడు మరెవరో కాదు , స్వయంగా కుమారిలభట్టు శిష్యుడే. ఒకసారి
కుమారిలభట్టు శిష్యులకు పాఠ౦
చెబుతున్నాడు. పాఠం మధ్యలో “ అత్ర తు నోక్తం తత్రాపి నోక్తం ఇతి పౌనరుక్తి: ” అనే పంక్తి
వచ్చింది . దాని అర్థం ఒకలా చూస్తే ఇలా వస్తుంది . అత్ర తు = ఇక్కడమాత్రం ; నోక్తం
(న+ఉక్తం) =చెప్పలేదు; తత్రాపి = అక్కడ కూడ; నోక్తం(న+ఉక్తం) =చెప్పలేదు ; ఇతి
=కాబట్టి ; పౌనరుక్తి: = రెండుసార్లు చెప్పడం జరిగింది . ఇక్కడ చెప్పలేదు , అక్కడ కూడ చెప్పలేదు కాబట్టి
పునరుక్తి అనే అర్థం వస్తోంది . ఎన్నిసార్లు చదివినా గురువుగారికి సమన్వయం కుదరడం
లేదు . తటపటాయిస్తున్నాడు . ఎలా సమన్వయ
పరచాలో తెలియడం లేదు . ఇప్పటి వాళ్ళైతే ముద్రణ దోషం printing mistake అనో తప్పుడు వాక్యం అనో కొట్టి పారేసేవారు. కానీ పూర్వం వాళ్ళు అలా చేసే వారు కాదు . ఎందు
కంటే ‘స్థితస్య గతి: చింతనీయా’ అనే నియమం మన సాంప్రదాయంలో ఉంది. అందువల్ల ఉన్నదాన్ని సమన్వయ పరచడానికి
ముందుగా అన్ని విధాల ప్రయత్నం చెయ్యాలి . ఎంత ప్రయత్నం చేసినా కుదరకపోతే ఆ తరువాత
ఏం చెయ్యాలో ఆలోచించాలి . ఇక్కడ ఎంత ఆలోచించినా సమన్వయ౦ కుదరడం లేదు . పాఠ౦ ముందుకు సాగడం లేదు . వాతావరణం చాల వేడివేడిగా
ఉంది . పూర్వకాలంలో అర్థం తెలియకపోయినా ఏదోవిధంగా బట్టీపట్టేసే విధానం లేదు . అర్థం తెలుసుకునే బట్టీ
పట్టాలి. ఆయన శిష్యుల్లో చాల చురుకైనవాడు
ప్రభాకరమిశ్రుడు . ఆయన వినయంగా ‘ గురువుగారూ! ఇక్కడ ఈ విధంగా సమన్వయం చేస్తే బాగుంటు౦దేమో ఒక్కసారి ఆలోచించండి’ అని ఒక సూచన
చేశాడు . గురువు శిష్యుని మాట కొట్టి పాఱేయలేదు, అవమానంగా భావించలేదు . ఎలా
సమన్వయం చెయ్యాలో చెప్పమని అడిగాడు . అప్పుడు శిష్యుడు అయ్యా! ఇలా సమన్వయం చేస్తే
బాగుంటుందని నా అభిప్రాయం అంటూ ఒక మార్గం సూచించాడు . అత్ర = ఇక్కడ ; తునా = ‘తు’ అనే పదం చేత; ఉక్తం=చెప్పబడింది ; తత్ర =అక్కడ ; అపినా= ‘అపి’ అనే పదం చేత ; ఉక్తం =చెప్పబడింది ; ఇతి = అందువల్ల ;పౌనరుక్తి : =
రెండుసార్లు చెప్పడం జరిగింది అని సమన్వయం చేశాడు. కుమారిలభట్టు
పరమానందభరితుడయ్యాడు. ఒక్కసారి శిష్యుణ్ణి కౌగలించుకున్నాడు . నువ్వేనాకు గురువువి
అని అభినందించాడు . నాటినుండి ఆయన మతం గురుమతంగా పేరు పొందింది.
ఇదే ఈ కాలంలో ఐతే ‘నాకే అర్థం కాలేదు , నీకేం తెలుస్తుంది పోరా!’ అనేవారు . నాకంటే మొనగాడివా అని కొట్టిపారేసేవారు. ఆయన అలా
చేయలేదు . మనసారా మెచ్చుకున్నారు . ఆయనకు అహం అడ్డురాలేదు . అంతటి విశాల హృదయం
ఆయనది . ఒకరిని మెచ్చుకోవాలంటే ఎంతో విశాల హృదయం ఉండాలి . బోద్ధారో
మత్సరగ్రస్తా: (అధ్యాపకులు అసూయాపరులు) అని భర్తృహరి ఎప్పుడో అన్నారు . మరో విషయం . ఇక్కడ ఇలా చెప్పడం వల్ల శిష్యుడు
చాల తెలివైనవాడని గురువు తెలివితక్కువ వాడని అర్థం కాదు . ఎంత గొప్పవారికైనా
ఒక్కొక్కప్పుడు కొన్ని విషయాలు స్పురి౦చక పోవచ్చు. ‘ముఖే ముఖే సరస్వతీ’ అన్నట్లు ఎవరిలో ఎటువంటి ప్రతిభ దాగిఉంటు౦దో ఎవరికీ తెలీదు . ఈ సంఘటన వల్ల మనం తెలుసుకోవలసి
న విషయాలు ఎన్నో ఉన్నాయి .
గురువు ఎల్లప్పుడూ విశాలమైన మనస్తత్త్వం కలిగి ఉండాలేగాని సంకుచితంగా ఉండకూడదు.
శిష్యస్యాపి గుణా: వాచ్యా : దోషా : వాచ్యా : గురోరపి (శిష్యుడైనా మంచి మెచ్చుకోవాలి , గురువైనా చెడు
విమర్శించాలి ). ఇది ఆదర్శవంతమైన
గురుశిష్య సంబంధం .
<*><*><*><*>
No comments:
Post a Comment