Thursday, October 17, 2024

అనుభవాలు – జ్ఞాపకాలు-3 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

అనుభవాలు – జ్ఞాపకాలు-3

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                      నాకెందుకో ఇద్దరు వ్యక్తుల్ని తలుచుకుంటే మనస్సులో చాల అసూయ కలుగుతుంది. ఒకరు శ్రీ అబ్దుల్ కలాం గారు, రెండోవారు రతన్ టాటా గారు . ఏమి జీవితం!  ఎంత త్యాగనిరతి!  ఎటువంటి దేశభక్తి! ఎంతటి నిష్కళంకవ్యక్తిత్వం వీరిద్దరిదీ!  ఇద్దరూ భారతమాత ముద్దుబిడ్డలే, ధన్యజీవులే. భర్తృహరి ఒక మాట అంటాడు.

స జాతో యేన జాతేన యాతి వంశ: సమున్నతిం

పరివర్తిని సంసారే మృత: కో వా న జాయతే ?   

     ఎవని పుట్టుకచేత వంశమంతా పావనమౌతుందో అతని పుట్టుకే సార్థకం, అదే నిజమైన పుట్టుక. పుట్టలోని చెదలు పుట్టవా! గిట్టవా! అన్నట్లుగా ఎంతమంది పుట్టడం లేదు, ఎంతమంది చావడం లేదు, ఎంతమంది పెక్కుమార్లు చస్తూ పుడుతూ ఉండడం లేదు!

 ప్రస్తుతం నేనిచ్చిన క్రమంలో ద్వితీయుడైనా ఆర్థికంగా దేశానికి పరిపుష్టిని; దానధర్మాది సేవలద్వారా తుష్టిని చేకూరుస్తూ దేశప్రగతికి తోడ్పడిన అద్వితీయుడు  శ్రీ  రతన్ టాటా గారు. వారి గురించి ప్రస్తావిస్తాను.

నేనెప్పుడు విశాఖపట్టణం వెళ్ళినా కొంతమంది గురువులు,  మిత్రులు కనిపిస్తారనే ఆశతో నేను చదువుకున్న ఆంధ్రవిశ్వవిద్యాలయ సంస్కృత విభాగానికి వెళ్ళడం పరిపాటి . సుమారు  రెండు మూడేళ్లకు పూర్వం (తేదీ సరిగా గుర్తు లేదు ) విశాఖ వెళ్ళినప్పుడు అనుకోకుండా సంస్కృత విభాగానికెళ్ళాను. వెళ్ళాక తెలిసింది ఆ రోజు పుర్వవిద్యార్థుల సమావేశ శుభదినమని. ఆచా ర్య K. గాయత్రీదేవి గారు నన్ను కూడ లోపలికి రమ్మని పిలిచారు. కార్యక్రమంలో నేను కూడ పాల్గొన్నాను. సాయంకాలం విద్యార్థులను address చెయ్యడానికి శ్రీ రతన్ టాటా వస్తున్నారని చెప్పారు.  నా ఆనందానికి అవధులు లేవు . ఎందుకంటే నా లాంటి వాడికి అటువంటి వ్యక్తిని చూడడమే కష్టసాధ్యం. ఇక  ఆయనే స్వయంగా వస్తున్నారంటే        

 ఎంత అదృష్టం! ఆయన రావడానికి ఒక గంట ముందే అక్కడికెళ్ళి కూర్చున్నా. సాయంకాలం సమయానికి ముందే ఆయనొచ్చారు. సమారు ముప్పై ఐదు, నలభై  నిముషాల పాటు  అద్భుతంగా ప్రసంగించారు. సభ వేలాది మందితో కిక్కిరిసి ఉంది. ప్రతి విద్యార్థి  కదలకుండా వారి సందేశం విన్నారు. వారు నా బోటివానికి కూడ సులభంగా అర్థమయ్యే Simple English లో ప్రసంగించారు. మనం పురాణాల్లో దధీచి , కర్ణుడు మొదలైన వారిని గురించి వింటాం .     

   శ్రీ రతన్ టాటా గారి దయ దాతృత్వం గమనిస్తే అవన్నీ నిజమే అనిపిస్తాయి. ఆయన దేశ ప్రజలకు చేసిన సేవలు అందరికీ పరిచితాలే . ఇక నాకున్న  సాంకేతిక జ్ఞానం చాల స్వల్పం కావడం వల్ల దూరం నుంచి  వారి ఫొటోలు కొన్ని   తీసుకో గలిగానే, గాని వారి సందేశం రికార్డు చేసుకోలేకపోయాను. నిజంగా ఆయన ధన్యజీవి. ఆయన మనదేశంలో పుట్టినందుకు మనమందరం ధన్యులం.

వారి మరణ వార్త విని నేను ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాను . ఇవన్నీ మీకు పంచే నా  ప్రయత్నమే ఇది

                  <><><>

 

No comments: