Wednesday, November 6, 2024

శ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రి గారి చతుర భాషణలు - శ్రీమతి పంతుల ప్రేమసుధ

          శ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రి గారి చతుర భాషణలు

శ్రీమతి పంతుల  ప్రేమసుధ

శ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రి గారు భద్రయ్యశాస్త్రి గారి కుమారులు. మల్లయ్యశాస్త్రి గారు  పిఠాపురం సంస్థానంలో ఆస్థాన పండితులుగా పని చేశారు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె . ఇక నేను, వారి మూడవ కుమారుడైన నరసింహారావుగారి పుత్రికను. నా పేరు పంతుల ప్రేమసుధ. నేను ఆ విధంగా మల్లయ్యశాస్త్రి గారికి మనుమరాలను.

ఇక మా తాత గారు ఎంతో హాస్యచతురులు . వారి హాస్యచతురత అందరిని అబ్బురపరిచేది.

ఆయన పిఠాపురం ఆస్థానంలో ఉన్నప్పుడు రాజావారి కోరికపై బ్రహ్మసుత్రాలను తెనుగులోనికి అనువదించారు. ఇక వారి మేనల్లుడైన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించిన కొన్ని గ్రంథాల పీఠికల్లో వారి హాస్యచతురత గురించి కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. మా నాన్న గారు కూడ అప్పుడప్పుడు వారి హాస్యరసపూరితమైన ఛలోక్తులు చెపుతూ ఉండేవారు. నాకు గుర్తున్న కొన్ని విషయాలు మీకు తెలియ జేస్తాను.

ఆయన ఒకసారి ఎక్కడికో నడిచి వెడుతుంటే పల్లకిలో పోతూ ఎదురైన ఒకాయన పంతులు గారూ! ఈ రోడ్దు చిత్రాడ పోతుందా అనడిగారట. ఇది ఎక్కడికీ పోదు, నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉందన్నారట. ఆ మాటలకు పల్లకి మోసే బోయీలందరు పగలబడి నవ్వు కున్నారట.

ఒకరోజు ఒకాయన ఇంటికొచ్చి అయ్యా ! నాదీ, మా అబ్బాయిదీ ఒకే నక్షత్రం ఏదైనా దోషం ఉంటే చెప్పండి అని అడిగాడట. దానికి సమాధానంగా ఆయన నాది మా అబ్బాయిది కూడ ఒకే నక్షత్రం ఇద్దరు గుండ్రాళ్ళల్లా ఉన్నాం అన్నారట. వెంటనే వారి పెద్దబ్బాయిని పిలిచి చూపించారట. ఇక ఆయన వెళ్లిపోబోతుంటే ఆయన్ని ఒక్క క్షణం ఆపి వాళ్ళ అబ్బాయిని   అద్దం తెమ్మని అడిగారట . ఆయాన తెచ్చారు.  ఆ తరువాత అతనితో ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు అన్నారట. ఆయన ఆశ్చర్యంతో అయ్యా! నన్నెందుకు ఆగమన్నారు? అని అడిగినప్పుడు ఏమీ లేదండి! మీరు బుర్రలు తీసి బుర్రలు పెడుతూ ఉంటారని ఊళ్లో అందరు అనుకుంటుంటే చాలసార్లు విన్నాను. అందుకే ఎందుకైనా మంచిదని అద్దం తెప్పించుకుని నా బుర్ర చూసుకుంటున్నాను. బుర్ర నాదే, మార లేదు, ఇక   మీరు వెళ్ళవచ్చు అన్నారు. ఆ వచ్చిన వ్యక్తి  ఆయన చమత్కారానికి మెచ్చుకుని లోలోపలే ఆనందిస్తూ వెళ్లి పోయారట.

ఒకసారి పిఠాపురం రాజావారు శాస్త్రిగారిని ఆస్థానానికి రమ్మని కబురు చేసి   గుఱ్ఱంబగ్గీ కూడ పంపించారు . శాస్త్రి గారు బగ్గీ ఎక్కి వెళ్ళడానికిష్టపడక దాన్ని వెనక్కి పంపించేసి కాలినడకనే ఆస్థానానికి వెళ్ళేరు. కొంచెం ఆలస్యమైంది. రాజుగారు ఆయనతో శాస్త్రి గారూ!  మీరు  ఎలా వచ్చారు అని అడిగినప్పుడు ,    వీరంతా బండెక్కి వస్తే, నేను ఎండెక్కి  వచ్చానని చమత్కరించారు. ఆ సమాధానం విని రాజావారితో సహా మిగిలిన వారంతా ఆనందంగా నవ్వుకున్నారట.

ఒకసారి శాస్త్రిగారి అక్క భోజనానికి పిలుస్తూ భోజనానికి సమయం అయిందా అని అడిగినప్పుడు నా సమయం పది , నీ సమయం  పదకొండు, అది  అంత తొందరగా అవదు గాని నాకు ముందు భోజనం వడ్డించు అనేవారట.

శాస్త్రి గారి అక్కగారికి ఒక ఎకరం పొలం ఉండేది. అయితే అవతల మరొక వ్యక్తికి ఆ పొలాన్ని ఆనుకుని మరి కొంత పొలం ఉండేది  . ఒక సారి ఆ వ్యక్తి ఆ పోలాన్ని తనకు వ్రాసి ఇమ్మని ఆయనడిగాడట. దానికి సమాధానంగా శాస్తి గారు అది స్త్రీధనం ఆ పొలం గురించి  ఏమీ అడగొద్దు  అన్నారట.     

శాస్త్రిగారు ఆ ఊరిలో అందరికీ తెలిసిన వారు కావడం చేత ఒక సారి ఎవరో వారి అక్కగారిని భోజనానికి పిలిచి భోజనం తరువాత ఒక కాగితం మీద ఆవిడ వ్రేలి ముద్రలు తీసుకుని పంపించేశారు. ఆవిడకు చదువు రాకపోవడం వల్ల అడిగిన చోట వ్రేలిముద్రలు వేసేసింది. ఆవిషయం ఇంటికొచ్చి చెప్పింది. శాస్త్రి గారికి విషయం అంతా అర్థమైoది. అక్కా ! నువ్వు బాధపడకు. నీకు ఒక ముసుగు భగవంతుడు వేస్తె,  వీళ్ళు రెండో ముసుగు వేశారు . నేను బ్రతికున్నంత కాలం నిన్ను పోషిస్తాను. నీకు ఏ లోటు రానివ్వను, జరిగిందానికి విచారించకు   అని ఓదార్చారు. అలాగే ఆమెను జీవితాంతం ఆదుకున్నారు. ఈ విధంగా శాస్త్రిగారి మాటలు ఎంతో చమత్కారభరితంగా ఉండేవి. శత్రువు కూడ నొచ్చుకోకుండా మెచ్చుకునే విధంగా ఉండేవి. ఈ కాలంలో వారు సజీవంగా మన మధ్య లేకపోయినా వారు రచించిన  బ్రహ్మసూత్రభాష్య అనువాదం అజరామరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.   నాకు జ్ఞాపకమున్న కొన్నిటినే ఇందులో వివరించ గలిగాను.  అటువంటి సున్నితమైన హాస్యం ఈ రోజుల్లో  కరువౌతోంది.

             <><><>

No comments: