భారతీయ సనాతన ధర్మంలో , అధర్మ భీతి, -పాపభీతి, మాత్రమే ఉన్నాయి గాని దైవ భీతికి
స్థానం లేదు .
రచన : డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
భారతీయ సంస్కృతిలో దైవ భీతికి స్థానం లేదు. దైవం పట్ల ప్రేమ ఉండడమే భారతీయ
సంస్కృతి. ఈ ‘దైవ భీతి’ అనే విపరీత ధోరణి పాశ్చాత్య సంస్కృతుల వలననే మనకు సంక్రమించింది’ అని శ్రీ అరవిందుల వారు చెప్పారు. ఇక అనేక శతాబ్దాల పాటు పరాయి సంస్కృతులతో
మిళితమైన మనకు ఈ జాడ్యం అంటుకుంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, భారతీయ
సనాతనధర్మంలో ‘అధర్మభీతి’ ‘పాపభీతి’ మాత్రమే ఉన్నాయి. అందువల్ల, అధర్మం చెయ్యడానికి , పాపపుపని చెయ్యడానికి
మాత్రమే మనం భయపడాలి గాని; దేవునికి భయపడ కూడదు . దేవుని ప్రేమించాలి . దేవుడు
ప్రేమాస్పదుడు, ప్రేమ స్వరూపుడున్ను . దీన్ని
బట్టి, మనం చెడ్డ పని చెయ్యడానికి భయపడాలి గాని, దైవానికి
భయపడకూడదు. దైవానికి భయపడడం దైవాన్ని కించపరచడమే ఔతుంది. నిజంగా
ఆలోచిస్తే భయపెట్టే వాడు God అవడు, Dog మాత్రమే అవుతాడు .
ఇక మనం, మన చుట్టూ ఉన్న
కుటుంబాలను జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లలకు
తల్లి-దండ్రులపై ప్రేమ గల కుటుంబాలే సుసంపన్నంగా ఉన్నాయి , భయం గల కుటుంబాలు
తాత్కాలికంగా బాగానే ఉన్నా ఆ తరువాత సర్వనాశనం అయ్యాయి. ప్రేమకు, భయానికి చాల
వ్యత్యాసం ఉంది . ప్రేమ సహజమైనది , భయం కృతకమైనది. ఇదే ప్రేమకు, భయానికి మధ్య గల తేడా . ఇంకా విడమరచి
చెప్పవలసిన అవసరం లేదు. ఆలోచిస్తే అదే
తెలుస్తుంది . ఇక మనకు భయం ఉండవలసింది అధర్మం
పట్ల , అంటే తప్పు చెయ్యడానికి భయపడాలి . మనలో చాల మంది కొన్ని తప్పులు స్వయంగా
చేస్తారు, కొన్ని తప్పులు ఇతరుల వత్తిడికి భయపడి చేస్తారు .
తప్పు ఏ విధంగానూ, చేయకూడడు అనేది భారతీయధర్మం .
ఇక, మరో విషయం . సాధారణంగా ఉన్నత
వర్గం వారు మంచి పనులు చేస్తారని తక్కువ జాతి వారు అంటే తక్కువ స్థాయికి చెందినవారు నీచపు పనులు చేస్తారని అనుకుంటూ ఉంటాం . ఇది
కేవలం అపోహ మాత్రమే. ఉన్నతస్థాయికి చెందిన వారిలో చాల నీచులు ; నీచ స్థాయికి
చెందిన వారిలో చాల ఉన్నతులు ఉంటారనేది వాస్తవం .
ఈ విషయాన్ని చెప్పడానికి మన సంస్కృత నాటకాలలో ఒక సంఘటన కూర్చబడింది.
ఇంత అద్భుతమైన సంఘటన నాకు మరి ఎక్కడా ,
కనిపించ లేదు. సంస్కృత సాహిత్యంలో
‘మృచ్ఛకటికం’ అనే ఒక నాటకం ఉంది. అందులో నాయకుడు చారుదత్తుడు . అతని ఊరు
ఉజ్జయిని . ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడు , వృత్తి రీత్యా వ్యాపారి . కాని మితిమీరిన తన
దానగుణం వల్ల దరిద్రుడౌతాడు. ఆ నగరంలో నే ఒక వేశ్య ఉంటుంది . ఆమె పేరు వసంతసేన. వృత్తిరీత్యా వేశ్య, కాని ప్రవృత్తి రీత్యా పతివ్రత. ఆమె, దైవమందిరాల్లో నాట్యం చేస్తూ ఉంటుంది . ఆమె
చారుదత్తుని గుణగణాలు తెలుసుకుని అతనిని ప్రేమిస్తుంది.
ఆ రాజ్యంలో శకారుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు . అతడు, రాజు యొక్క ఉంపుడుగత్తె తమ్ముడు. ధన మదంతోను ,
అధికారమదంతోను అందరినీ బాధించే నీచాతినీచుడు.
ఒకసారి అతని, కన్ను, వసంతసేనపై
పడుతుంది. ఆమెను వేధిస్తూ ఉంటాడు . ఆమె మాత్రం ఎప్పటి కప్పుడు
అతని బారి నుండి తప్పించుకుంటూ ఉంటుంది .
ఒకనాడు ఆమె ఒక బండి ఎక్కి వెళ్ళడానికి బదులుగా పొరపాటున మరొక బండి
ఎక్కి వెళ్ళడం వల్ల శకారుడు విహరిస్తున్న ఉద్యానం లోనికి వెళ్ళిపోతుంది . అతడు
ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నిస్తాడు . ఆమె ప్రతిఘటిస్తుంది. తన కోరిక తీరక
పోవడంతో ఆమెను చంపెయ్యాలని అనుకుంటాడు . కాని తన చేతికి మట్టి అంటుకోకుండా తన దగ్గర కట్టు బానిసగా పనిచేసే సేవకుని, ఆ పని
చెయ్యమని ఆదేశిస్తాడు . వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇటువంటి
అరుదైన, అద్భుతమైన , సంభాషణ మరెక్కడా, నాకు కనిపించ లేదు.
శకారుడు తనలో అను కుంటుటున్నాడు (ఈ
ముసలి నక్కకు తప్పు చెయ్యడం అంటే భయం) సరే! ఒరేయ్, స్థావరకా! ఇలా రా !
నీకు బంగారు కడియం చేయిస్తానురా! అంటాడు.
స్థావరకుడు ‘ నేను ధరిస్తాను అంటాడు.
శకారుడు, వాడితో స్థావరకా!
నిన్ను బంగారు సింహాసనం ఎక్కిస్తాను అంటాడు.
స్థావరకుడు, ‘నేను ఎక్కి కూర్చుంటాను’
అంటాడు.
శకారుడు: వాడితో స్థావరకా! స్థావరకా! నీకు ఎంగిలి పెడతాను, అంటాడు.
స్థావరకుడు, శకారునితో ‘నేను తింటాను’ అంటాడు.
శకారుడు, వాడితో “ ఒరేయ్! సేవకులందరిలో నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను” అంటాడు.
స్థావరకుడు, “నేను అవుతాను” అంటాడు.
శకారుడు, అతనితో “నేను చెప్పింది నువ్వు చెయ్యాలిరా!” అంటాడు .
స్థావరకుడు, “ అన్నీ
చేస్తాను,
చేయకూడని పని తప్ప” అంటాడు.
అపుడు శకారుడు, వాడితో “
చేయకూడనిదంటు ఏదీ లేదు” అంటాడు .
స్థావరకుడు, “ఐతే చెప్పండి
చేస్తాను ” అంటాడు.
శకారుడు, వాడితో “ నువ్వు ఈ
వసంతసేనను, చంపెయ్యి” అని
ఆజ్ఞాపిస్తాడు .
అది విని స్థావరకుడు, “ అయ్యా ! నేను చేసిన పొరబాటు వలన ఈమె వేరే
ఎక్కవలసిన బండి మారి పోయి, ఈ బండి ఎక్కి ఇక్కడకు
వచ్చింది . జరిగిందానికి నేను బాధపడుతున్నాను ’ అంటాడు.
శకారుడు, వాడితో ‘అరే! నేను, నీకు
యజమానినిరా! ’ అంటాడు .
స్థావరకుడు, దానికి సమాధానంగా “ ఔనండి ! మీరు నా శరీరానికి మాత్రమే యజమాని
, నా శీలానికి మాత్రం కాదు . ఈ పని చెయ్యడానికి నాకు భయంగా ఉంది అంటాడు.
శకారుడు, వాడితో ‘నువ్వు నాకు సేవకుడివి కదా! , నీకు ఎందుకురా భయం? ఎవరికి
భయపడుతున్నావు ? అంటాడు.
స్థావరకుడు, శకారునితో “నేను పరలోకానికి భయపడుతున్నానండీ” అంటాడు .
పరలోకమా! అదేమిటి ? ఎలా
ఉంటుంది ? అని అడుగుతాడు శకారుడు .
అది, పాప, పుణ్యముల పరిణామరూపమండి! అంటాడు, స్థావరకుడు.
అలాగా! పుణ్య పరిణామం ఎలా
ఉంటుంది ? అని అడుగుతాడు, శకారుడు.
మీరు, బంగారంతోను , సకల సంపదలతోను
తులతూగుతున్నారు , ఇదే పుణ్య పరిణామం అంటాడు, స్థావరకుడు
మరి, పాప పరిణామం ఎలా ఉంటుంది ? అని
అడుగుతాడు, శకారుడు.
నేను, మీరు పెట్టే నీచమైన ఎంగిలి తింటూ మీకు ఊడిగం చేస్తున్నాను ఇదే పాప పరిణామం. అందువల్ల నేను తప్పు పని
చెయ్యను. అంటాడు స్థావరకుడు.
ఒరేయ్! నా మాట వినవా అని శకారుడు,
వాణ్ణి చచ్చేలా కొడతాడు.
ఈ శరీరం మీదే అని నేను ముందే అన్నానుగా ! నన్ను , కొట్టండి , చంపండి .
ఈ పని చెయ్యను గాక చెయ్యను, అని చెపుతూ ఇంకా ఏమంటున్నాడో వినండి .
ఏనాస్మి గర్భదాసో వినిర్మితో భాగధేయ దోషై:
అధికం చ న క్రేష్యామి తతో అకార్యం పరిహరామి. అంటాడు .
అయ్యా ! నేను ఇంతకు ముందు చేసిన పాపాల వలన మీకు కట్టు బానిసగా పుట్టి,
ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను. ఇంతకంటే
ఎక్కువగా పాపాలు పోగు చేసుకోలేను . అందు వల్ల
ఆమెను చంపను గాక చంపను అంటాడు .
ఒక ఉన్నతాధికారి ఎంత ప్రలోభపెట్టినా, భయపెట్టినా ధర్మం తప్పని జాతి
మనది. ఇది మన అందరికీ ఆదర్శం కావాలి.
ఎవడైనా తప్పు చేస్తే పాపఫలం అనుభవించ వలసిందే, ఏ దేవుడు, వాణ్ణి రక్షించడు.
దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ దేవుని ధర్మాలు. ఒక వేళ దీనికి విరుద్ధంగా ప్రవర్తించి దుష్టులను కూడ రక్షిస్తే
వాడు దైవం కాదు దయ్యమే అవుతాడు .
<><><>
No comments:
Post a Comment