Monday, November 2, 2026

కార్యక్రమ నిర్వహణ - కొన్ని సూచనలు సేకరణ : డాక్టర్. చిలకమర్తి దుర్గా ప్రసాదరావు

 

కార్యక్రమ నిర్వహణ - కొన్ని సూచనలు

సేకరణ : డాక్టర్. చిలకమర్తి దుర్గా ప్రసాదరావు

మనం మన దైనందిన జీవితంలో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం . వాటిలో కొన్ని సాంఘికకార్యక్రమాలు , మరికొన్ని మతపరమైన కార్యక్రమాలు, ఇంకా కొన్ని ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాలు.

కార్యక్రమాలు ఏవైనా అవి సక్రమంగా జరగడానికి నిర్వాహకులు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాకాకుండా మన ఇష్టం వచ్చినట్లు నిర్వహిస్తే రసాభాస ఔతుంది.   

కార్యక్రమం ఏదైనా ఎవరు ఆక్షేపించని  విధంగా నిర్వహించడానికి మన పెద్దలు కొన్ని సామాన్యమైన  మార్గదర్శక సూత్రాలు చెప్పేరు.    

 అవేమిటో చూద్దాం .

1.                  కార్యక్రమ తేదీ , స్థలం , సమయం అందరితో సంప్రదించి జాగ్రత్తగా నిర్ణయించు కోవాలి.

2.                  ఎవరిని పిలవాలో ముందుగానే  ఒక పుస్తకంలో అకారాది క్రమంలో పేర్లు వ్రాసుకోవాలి.  వారి అడ్రస్ సు, పిన్ కోడ్ లేదా ఫోన్ నంబర్లతో సహా జాగ్రత్తగా వ్రాసుకోవాలి.

 

3.                  ఆహ్వాన పత్రాలు కొంచెం ముందుగానే అందరికి చేరే విధంగా పోస్టు చెయ్యాలి.   

4.                  పోస్టాఫీసు వారికి కూడా సమాచారం, ఆహ్వానం పంపాలి.

5.                  కార్యక్రమం సజావుగా జరగడానికి ఏయే అంశాలు ఎవరికి అప్పగించడానికి ఎవరు సమర్థులో  జాగ్రత్తగా ఆలోచించి నియామకం చెయ్యాలి. ఆ తరువాత వారి పనితీరును  పర్యవేక్షించడం  తప్ప కార్య నిర్వహణ  విషయంలో జోక్యం కలుగ చేసుకోకూడదు.

6.                  ఆ యా కార్యక్రమాలకు సంబంధించిన మౌలికమైన సదుపాయాలూ ముందుగా చేకూర్చాలి.    

7.                   సరైన వ్యక్తులకే బాధ్యతలు అప్పగించాలి. ఆ తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.

8.                  జనం, పెద్దమొత్తంలో వస్తారు కాబట్టి పారిశుధ్యానికి , అనుకోకుండా సంక్రమించే వ్యాధులను నివారించడానికి తగిన సిబ్బందిని ముందుగానే నియమించాలి.

9.                  కరెంటు పోయినా కార్యక్రమం ఆగిపోకుండా ఉండటానికి తగిన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి.

10.              కొంతమంది అదనపు సిబ్బందిని చేతులో ఉంచుకోవాలి.

11.              అతిథుల్ని ఆహ్వానించడం కోసం ఏర్పాటు చేసే వ్యక్తులు, స్త్రీ పురుషులను వేర్వేరుగా నియమించాలి. ముఖ్యంగా చాల ఎక్కువ మందితో పరిచయం ఉండి, చురుకుగా పని చేయగల  వారినే నియమించాలి. వారు ఆహ్వానించే విధానాన్ని అనుసరించి కార్యక్రమం విజయవంతం ఔతుంది.

12.              వివిధ కార్యక్రమాలు  నిర్వహించేటప్పుడు అందరికీ తెలిసే విధంగా కొన్ని కమిటీలను ఏర్పాటు చెయ్యాలి. కార్యక్రమం జరిగే ముందు , జరుగుతున్నప్పుడు, జరిగిన తరువాత ప్రెస్, న్యూస్ సిబ్బందిని ఆహ్వానించాలి.

13.              కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన విలువైన వస్తువులు భద్రపరచడానికి; సరైన సమయంలో అవసరమైన వారికి  అందించడానికి నమ్మకమైన వారిని నియమించుకోవాలి.

14.              వివాహం మొదలైన కార్యక్రమాల  విషయంలో వధూవరులకు సంబంధించిన బంధువులను ఆహ్వానించడానికి చాల బాధ్యత గల వారిని నియమించాలి. వారి అవసరాలు తీర్చడానికి అనువుగా వారి వద్దనే కొంత మందిని ఉంచే ఏర్పాట్లు చెయ్యాలి. కార్యక్రమం పూర్తయ్యాక వారిని సాదరంగా సాగనంపే ప్రయత్నాలు చెయ్యాలి.

15.             ఇక, ఏ కార్యక్రమానికైనా అన్నిఎర్పాట్లు ఒక ఎత్తైతే, అల్పాహారం, భోజనాల ఏర్పాట్లు మరో ఎత్తు. ఇదే చాల ప్రధానమైనదీ, కఠినమైనదీని. భోజనాలు, వడ్డన  బాగుంటే మిగిలిన లోటుపాట్లు ఎవరు పెద్దగా పట్టించుకోరు. భోజనాలు, వడ్డన బాగుండక పోతే మిగిలినవి ఎంత గొప్పగా ఉన్నా దెప్పిపొడుస్తారు. ఒక్కొక్కప్పుడు పదార్థాలున్నా, వడ్డన చేసేవారు ఉండరు. ఒక్కొక్కప్పుడు వడ్డించేవారు ఉంటారు, కాని  పదార్థాలు ఉండవు . ఆ రెండింటి మధ్య సమన్వయము చాల అవసరం. దానికి ఓర్పు, నేర్పు, నిరంతర పర్యవేక్షణ, చాల అవసరం .            

16.                అతిథులకు ఇచ్చే బహుమతులు ముందే సిద్ధం చేసి ఉంచుకోవాలి. వాళ్ళు వెళ్ళేముందు వెదుకులాట బాగుండదు. వాళ్ళు మన కోసం ఆగరు.  ఆపడం కూడ మర్యాద కాదు .  అందువల్ల, ఆ కార్యక్రమం ఒకే వ్యక్తి పర్యవేక్షణలో నడిపిస్తే చాల బాగుంటుంది . అలా కాకుండా

బాలనాయకం, బహునాయకం అన్నట్లుగా ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు ప్రవర్తిస్తే రసాభాస ఔతుంది.

17.              కార్యక్రమానికి వచ్చిన అతిథులు వెళ్లి పోయేటప్పుడు వారికి ప్రేమ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. మీ రాక కార్యక్రమానికి నిండుదనం చేకూర్చిందని ప్రశంసించాలి.  

18.              అవసరాన్ని బట్టి, వారు తమ ఇళ్లకు  చేరుకునేంత వరకు వారికి కావలసిన ఆహారపదార్థాలను సమకూర్చడం మర్యాద.

19.              అవసరమైన వారికి ప్రయాణ సౌకర్యాలు కూడా చేకూర్చగలగాలి.

20.              కార్యక్రమాలు పూర్తి అయ్యాకా,  వేదిక  ఖాళీ చేసే సమయంలో ఏ వస్తువు మరిచిపోని విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.   

21.              కార్యక్రమం పూర్తయ్యాక కార్యక్రమ  స్వరూపాన్ని అనుసరించి దేవునకు గాని, సభాసదులకు గాని, ప్రభుత్వానికి గాని , అతిథులకు గాని కృతజ్ఞతలు తెలియ జేసుకోవాలి.

22.              ముఖ్యఅతిథులకు పూలమాలలు , బహు మతులు ఇచ్చుకోవాలి.  

23.              వివాహం మొదలైన కార్యక్రమాలలో మనం, మనతో సమానమైన వారిని, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని , అలాగే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఆహ్వానిస్తాం.  ఎవరిని ఆహ్వానించినా వచ్చిన వారు అందరు మనకు సమానమే . ఆ విధంగా వారిని సమానంగా గౌరవించగలిగినప్పుడు మాత్రమే పిలవాలి . సమానంగా  సత్కరించ  లేకపోతే పిలవడం మానెయ్యాలి. మనం పిలవలేదని ఎవడూ, ఏమీ, అనుకోడు. పిలిచి అవమానించకూడదు .

24.               అతిథులు కూడ కొన్ని కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఉదాహరణకు,  ఒక వ్యక్తి మరో వ్యక్తిని పిలిచినప్పుడు పిలువబడిన వ్యక్తి తాను  హాజరు కాలేక పోతే తనకు బదులుగా మరో వ్యక్తిని పంపవచ్చు. కాని ఆ వ్యక్తిని ఎంపిక చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పంప బడే వ్యక్తి ఇద్దరి గౌరవాన్ని నిలబెట్టగలవాడు కావాలి.    

25.              అతి ముఖ్యమైన విషయం ఒకటుంది . అది ఏమిటంటే కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమం మొదలైన దగ్గర నుండి పూర్తయ్యే వరకు, చాల సహనంతో వ్యవహరించాలి. ఏ విషయం లోను ఆవేశపడకూడదు. ఆవేశం, అనర్థదాయకం; సహనం, శ్రేయో దాయకం .   ఇవి కేవలం కొన్ని మాత్రమే. మరికొన్ని మరోసారి .

<><><> 

 

No comments: