Monday, April 7, 2014

తెలుసుకుందాం

                                    తెలుసుకుందాం  
                           డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
గాడిద గుడ్డు కంకరపాసు :
సాధారణంగా మనకు తెలియని విషయాన్ని అదేదో గాడిదగుడ్డు కంకరపాసు అంటాం . ముఖ్యంగా గోదావరిజిల్లాల్లో ఇది వాడుకలో ఉంది . అసలు ఇది ఎలా వచ్చిందో కొంచెం తెలుసుకుందాం.
పూర్వం బ్రిటిషువారు మనదేశాన్ని పరిపాలించే రోజుల్లో కొంతమంది ఆంగ్లేయులు క్రైస్తవమతం ప్రచారం చెయ్యడానికి ఇల్లిల్లు   తిరుగుతూ ఉండేవారు. ఆరోజుల్లో మతప్రచారo ఆంగ్లభాషలో జరుగుతూ ఉండేది. ఎందుకంటే   వాళ్లకు తెలుగు రాదు. ఇక ఆ రోజుల్లో మన వారికి వాళ్ళ ఇoగ్లీషు తెలిసేది కాదు. మహిళలకు సహనం ఎక్కువ వాళ్లు విసుక్కోకుండ చెప్పిందంతా విoటారనే ఉద్దేశoతో  ముఖ్యంగా మగవారు ఇంటిలో లేని సమయాల్లో ఆడవాళ్ళకు మత౦ పరిచయం చెయ్యడానికి వచ్చేవారు. ఆడవారికి వాళ్ళ మాటలు అసలు అర్థమయ్యేవి కావు. మతప్రచారకులు ఇంగ్లీషులో God is good. Conquer peace అని ఏవేవో చెబుతూ ఉండేవారు .ఆడవాళ్ళకు అందులోనూ ముఖ్యంగా ఇంట్లో ఉoడే బామ్మలకు ఏమి తెలిసేదికాదు. అందువల్ల ప్రక్కన ఎవరైనా చిన్న పిల్లలుంటే ఏరా! అయనేo చెబుతున్నారు ? అని ఆడిగేవారు. పాపం వాళ్ళకీ ఏమీ అర్థమయ్యేది కాదు . అందువల్ల ఓహో అదా ! గాడిద గుడ్డు కంకరపాసు అనేవారు.      
మిరపకాయ :
భారతీయులు అనాది  కాలం నుంచి మిరియాన్ని వాడేవారు.  మిరపకాయ మనదేశానికి సంబంధించింది కాదు . విదేశాలనుండి దిగుమతైన వస్తువు. దానికి ఏo  పేరు పెడదామా అని ఆలోచించారు. మిరియానికి బదులుగా ఉపయోగించే కాయ  కాబట్టి  మిరియపుకాయ  అన్నారు . అదే క్రమంగా మిరపకాయగా మారిపోయింది . మిరియాన్ని సంస్కృతoలో మరీచము అంటారు. అది మిర్చిగా మారిపోయింది. అదే క్రమంగా  పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయి పోయాయి .
అగ్రహారం:
సాధారణంగా బ్రాహ్మణులు నివసించే ప్రదేశాన్ని అగ్రహారం అంటాం . ఆ పదం ఎలా తయారయిందో చూద్దాం. హరునకు సంబంధించింది హారం ఔతుంది. హరుడంటే శివుడు . అలాగే హరికి సంబంధించింది కూడా హారం ఔతుంది. హరి అంటే విష్ణువు . అగ్రే అంటే ముందుగా ( ఇరువైపులా ) హారములు కలది అనగా శివాలయము విష్ణ్వాలయము కలది అగ్రహారము     
అధ్వాన్నం:
ఏ వస్తువైన బాగా లేకపోతే అది చాల అధ్వాన్నంగా ఉంది అంటాం. అధ్వని అన్నం అంటే మార్గంలో లభించే అన్నం అని అర్థం . ఈ రోజుల్లో  కొంత మంది ఫాస్ట్ ఫుడ్ పేరుతో రోడ్డు మీద దొరికే  ప్రతి అడ్డమైన పదార్థాల్ని  తినేస్తున్నారు. కాని పూర్వం అలాగ బయట లభించే పదార్థాల్ని  ఎవరూ తినేవారు కాదు. చాల హీనంగా చూసేవారు.   అందుకే హీనమైనవస్తువును చాల అధ్వాన్నoగా ఉంది అనడం క్రమంగా వాడుకలోకి వచ్చేసింది.          
 హృదయం:
హృదయం అనే పదానికి గుండె అని అర్థం .  హరతి దదాతి యాపయతి ఇతి హృదయం అని మన ప్రాచీనులు ఆ పదానికి నిర్వచనం  చెప్పారు. హరతి అనగా హరించేది ( తీసుకునేది), దదాతి అంటే  ఇచ్చేది, యాపయతి అంటే అన్నిటికి ఇప్పిoచేది (సరఫరా చేసేది) కాబట్టి హృదయం అయ్యింది. హరతి లోoచి హృ దదాతి లోంచి యాపయతి లోoచి   తీసుకుని దీన్ని తయారు చేశారు.  గుండె శరీరoలోని అన్ని  భాగాల్లోoఛి రక్తం తీసుకుని, ఊపిరితిత్తులకందిoచి వాటి ద్వారా అన్ని శరీరభాగాలకు అందేలా చేస్తుంది. దీన్ని బట్టి రక్తప్రసారణసిద్ధాoతo భారతీయులకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలుసన డానికి ఇదొక ఉదాహరణ.

ఈ సిద్ధాoతం పాశ్చాత్యులకు 16 వ శతాబ్దంలో గాని తెలియలేదు. విలియం హార్వే (1578-1657) దీన్ని కనుగొన్నారు. మన భారత దేశం    వైజ్ఞానికరంగంలో చాల ముందంజలో ఉoదనడానికి ఈ ఒక్క  విషయం చాలు.   

No comments: