మఱువబోకు చిలకమర్తి మాట
(మొదటిభాగం)
చిలకమర్తి వేంకట సూర్యనారాయణ
నరసాపురం
౧. కోటి విద్యలన్ని కూడు గుడ్డకె గాని
నీకు మోక్షమిచ్చి సాక లేవు దైవచింత లేక తరియింప సాధ్యమా
మఱువబోకు చిలకమర్తి మాట
౨. పరుల మనసు నొవ్వ పలుకబోకెప్పుడు
కష్టమొచ్చినపుడు కలత వీడి
చిత్తశుద్ధి కలిగి సేవించు దైవాన్ని
మఱువబోకు చిలకమర్తిమాట
౩.ఎంత శత్రువైన ఇంటికేతెంచుచో
కనికరించి పంపు కలత వీడి
సత్యధర్మములను సతతంబు పాటించు
మఱువబోకు చిలకమర్తి మాట
౪. కాయమెన్ని మార్లు గంగలో ముంచినా
కడు శ్రమించి వేగ కాశికేగ
దైవ చింతలేక దక్కునే మోక్షంబు
మఱువబోకు చిలకమర్తిమాట
౫. ధర్మయుక్తమైన ధనమునార్జించుము
చెడ్డపనుల మనసు చేరనీకు
నిర్మలత్వమొంది యితరుల ప్రేమించు
మఱువబోకు చిలకమర్తిమాట
౬. చెడ్డ వారితోడ స్నేహంబు విడనాడు
మంచియందు నీవు మనసు నిల్పు
చింత వీడి సతము శివుని నారాధించు
మఱువబోకు చిలకమర్తిమాట
౭. నిండుభక్తి తోడ నిమిషమైనను గాని
దైవచింత మాని ధనము కొఱకు
వెతలతోడ సతము వెంపరలాడకు
మఱువబోకు చిలకమర్తిమాట
౮.మనసునందు దాగు మలినంబు కడిగేసి
చిత్తమందు పరమ శివుని నిల్పి
ఫలము కోరకుండ ప్రార్థింప క్షేమంబు
మఱువబోకు చిలకమర్తి మాట
౯. సకలజీవులందు సమబుద్ధి చూపించి
నిండుభక్తి మదిని నిల్పి వేగ
దివ్యమైన మనము దేవునిపై నిల్పు
మఱువబోకు చిలకమర్తిమాట
౧౦. చెడ్డ వారి తోడ స్నేహంబు చేయకు
మదిని మంచినిల్పి మసలుకొనుము
నిముషమైన శివుని నిరతము సేవించు
మఱువబోకు చిలకమర్తిమాట
౧౧.గతముచేసుకొన్న కర్మంబు చేతను
కలిగె కష్ట మనుచు కలతవీడు
దేవునెపుడు నీవు తెగడ ధర్మము కాదు
మఱువబోకు చిలకమర్తిమాట
౧౨. తల్లి కడుపునుండి ధరణికి దిగునాడె
మెచ్చి తోడ వచ్చు మృత్యు వెపుడు
కాలమఱసి నిన్ను కమ్మగ భక్షించు
మఱువబోకు చిలకమర్తిమాట
౧౩. పరులభాగ్యమరసి బాధలనొందకు
నీకు కలిగి నపుడు నిక్క బోకు
చిత్తశుద్ధి తోడ జీవించు హాయిగా
మఱువబోకు చిలకమర్తిమాట
౧౪.తిట్టినట్టి నాల్క దివ్యంబుగానుండు
శిక్షననుభవించు చెంప తాను
చెడ్డ వారి జేర చేకురు ఫలమిదే
మఱువబోకు చిలకమర్తిమాట
౧౫. ముఖ్యమైన పనిని మున్గి యున్నను గాని
కదలలేని బాధ కల్గి యున్న
నిముషమైన శివుని నిలుపుము మదిలోన
మఱువబోకు చిలకమర్తిమాట
౧౬. కొంప మునుగు పనులు కోటి యున్నను గాని
కదలలేని స్థితిని కలిగి యున్న
నిముషమైన శివుని నిలుపుము మదిలోన
మఱువబోకు చిలకమర్తిమాట
౧౭. నిన్ను సృష్టి జేసి నిరతంబు పాలించు
దైవమున్నదనుచు తలచి మదిని
అన్యచింత వీడి యతనినే సేవించు
మఱువబోకు చిలకమర్తిమాట
౧౮. సబ్బు సెంటు పూసి చక్కగా దేహాన
రంగు బట్ట కట్టి హంగు సేయ
మదిని దాగియున్న మలినంబు తొలగునా
మఱువబోకు చిలకమర్తిమాట
౧౯. కన్న వారినెపుడు కష్టబడనీయక
పట్టెడన్న మిడెడుడు నట్టి వాన్కి
శివుని పూజ వేరె సేయంగపనియేమి
మఱువబోకు చిలకమర్తిమాట
౨౦ తాను తప్పు చేయు మానవుడిలలోన
తప్పు కొనెడి వేఱె దారి లేక
తెలివితోడ నింద దేవునిపై మోపు
మఱువబోకు చిలకమర్తిమాట
౨౧. కూడు గుడ్డ కొఱకు కుందుచు నిరతంబు
చేయరాని పనులు చేయనేల
నారు పోయు వాడు నీరేల మానును
మఱువబోకు చిలకమర్తిమాట
౨౨.కర్ర చేతబూని గట్టిగ బుట్టపై
శక్తి కొలది కొట్టి చితకబాద
పాముకేమి భయము పరికించు మదిలోన
మఱువబోకు చిలకమర్తి మాట
౨౩. శివుడు పైకి పోవ శిథిలమై దేహంబు
శవము గాను మారు సత్యమిదియె
ప్రాణమున్న శివము లేనిచో శవమౌను
మఱువబోకు చిలకమర్తి మాట
౨౪. విద్య లేని వాడు వింతపశువైనచో
చదువుకున్న వాడు సంతపశువు
విద్దె లోని మర్మ మిద్దియే తెలియంగ
మఱువ బోకు చిలకమర్తి మాట
౨౫. పెక్కు పుస్త కంబు లొక్కమాటి కన్న
ఒక్క పుస్తకంబు పెక్కు మార్లు
చదువనబ్బు నీకు చక్కని జ్ఞానంబు
మఱువబోకు చిలకమర్తి మాట
****************
No comments:
Post a Comment