చకారకుక్షి
డా||
చిలకమర్తి దుర్గాప్రసాదరావు
ఒకసారి
కాళిదాసమహాకవి కాశీనగరం సందర్శించాడు. అన్ని దేవాలయాల్లో ఉండే దేవీదేవతలకు
నమస్కరిస్తూ పోతున్నాడు. ఒకప్రదేశంలో వ్యాసభగవానుని విగ్రహం కనిపించింది. ఎందుకో
ఆయనకు నమస్కరిo చాలనిపిoచలేదు సరిగదా ఆక్షేపించాలనిపిoచింది. ఆయన బొడ్డులో వ్రేలు
పెట్టి ‘చకారకుక్షి’ ‘చకారకుక్షి’ అని ఆక్షేపణ
చేశాడు . అంతే వ్రేలు ఆ విగ్రహం బొడ్డులో ఉండిపోయింది. ఎంత లాగినా బయటకు రావడం
లేదు. వ్రేలు బయటకు తీసుకోవడానికి
చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంక చేసేదేమీ లేక తన తప్పు క్షమించమని మనసులోనే
ప్రార్థించాడు. వ్రేలు బయటకు వచ్చేసింది. ఆ విగ్రహం లోంచి సాక్షాత్తు
వ్యాసభగవానుడు ప్రత్యక్షం అయ్యాడు. వెంటనే కాళిదాసు ఆయన పాదాలను తాకి నమస్కరించాడు.
వ్యాసుడు సంతోషించి ‘నాయనా! ఎందుకు
నన్ను అలా ఆక్షేపి౦చావు?’
అనడిగాడు. స్వామీ! మీరు వ్రాసిన మహాభారతం చదివాను.
“ధర్మజ: చ భీమ: చ
అర్జున: చ నకుల: చ సహదేవ: చ”
అని గ్రంథమంతా ‘చ’ అనే అక్షరాలే. అవన్నీ
వ్యర్థపదాలే. అన్నీ ప్రోగుచేసి మరో చోట వ్రాస్తే అదో పెద్ద గ్రంథమౌతుoది. ఏమిటి
స్వామీ ఇదంతా ! మీ పొట్ట కోస్తే అన్నీ చకారాలే అనిపిస్తోంది. అందుకే ఆక్షేపిoచానన్నాడు.
అపుడు
వ్యాసుడు ‘నాయనా!
నువ్వు అనుకుoటున్నట్లు అవన్నీ వ్యర్థపదాలు కావు, వాటికి సార్థకత ఉంది . సరే! నా సంగతలా ఉంచు. నేనొక అంశం నీకిస్తాను. చకారం
లేకుండా అది పూర్త చెయ్యి’
అన్నాడు. సరే అన్నాడు కాళిదాసు. వ్యాసుడు కాళిదాసుతో ‘ ద్రౌపదికి
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని ఐదుగురు భర్తలు కదా! వారిమధ్యగల
పరస్పరసంబంధాన్ని వివరిస్తూ, ‘చ’ అనే అక్షరం
ఉపయోగిoచకుండ శ్లోకం చెప్పమని అడిగాడు. కాళిదాసు ఏమి తడుముకోకుండా:
ద్రౌపద్యా: పాండుతనయా:
పతిదేవరభావుకా:
న
దేవరో ధర్మరాజ:
సహదేవో
న
భావుక:
(ద్రౌపదికి
ధర్మరాజు, భీముడు , అర్జునుడు , నకులుడు , సహదేవుడు; భర్తలు , బావలు మరదులు ఔతారు . ధర్మరాజు
ఎప్పుడు మరిది కాడు. సహదేవుడు ఎన్నడు బావ కాడు).
ద్రౌపదికి
ఐదుగురు భర్తలున్నా ఒక సంవత్సరం అంతా ఒకరితోనే ఉంటుంది. ఇది నియమం. ఆమె ధర్మరాజుతో
ఉన్నప్పుడు ఆయన భర్త. మిగిలిన నలుగురు మరదులౌతారు. భీమునితో ఉన్నప్పుడు ధర్మరాజు బావ
ఔతాడు , అర్జున,నకుల,సహదేవులు మరదులౌతారు. ఇక సహదేవునితో ఉంటున్నప్పుడు పై నలుగురు
బావలౌతారు. కాని ధర్మరాజు ఎన్నడూ మరది కాదు , సహదేవుడు ఎన్నడూ బావ కాడు.
ఇక వ్యాసుడు
కాళిదాసు ప్రతిభకు సంతోషించి,
ఆశీర్వదించి, అదృశ్యమయ్యాడు.
ఆంధ్రపురాణకావ్యరచయిత
శ్రీమధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు నన్నయగారి రచనారీతిని ప్రశంశిస్తూ ఈ
విషయాన్ని ఎంత అందంగా ఉట్టంకిoచారో
స్వయంగా చూడండి.
వ్రాసినదానినింజెరిపి
వైవని బాస ‘చకారకుక్షి ’ యౌ
వ్యాసకవీశు
బోలక మహాగిరినిసృతగాంగనిర్ఝరీ
భాసురశయ్యలో
తనకు వంపులు సొంపులు దిద్దు కాళికా
దాసుని
బోలె గంటమును దాలిచె నన్నయ క్రొత్త తెన్నునన్
ఈ
వ్యాసంలోని తాత్పర్యం కాళిదాసుని ప్రశంసించడమే గాని వ్యాసభగవానుని కిoచపరచడం
మాత్రం కాదని గ్రహింప ప్రార్థన.
******
No comments:
Post a Comment