కోస్తా ఆంధ్రలో తెలుగు సాహిత్య వికాసం
డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు
వ్యవహారంలో లేకపోయినా, సాహిత్యసృష్టి జరక్కపోయినా ఎంతగొప్ప భాషైన సరే
పదికాలాలపాటు మనుగడ సాగించలేదు.
అందువల్ల తెలుగు మాట్లాడటంతో బాటుగా తెలుగుసాహిత్యం పట్ల ఎక్కువ మక్కువ
పెంచుకోవాలి. అందుకోసం ముందుగా సాహిత్యం యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకోవాలి.
మనదేశంలో తెలుగుమాట్లాడే వారి సoఖ్య ద్వితీయస్థానంలో ఉన్నా అద్వితీయమైన సాహితీసంపద
ఈ భాషలో ఉంది. ఈ కోస్తాప్రాంతం నెల్లూరు, ప్రకాశం, గుoటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి,
తూర్పుగోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం అనే తొమ్మిది జిల్లాలుగా
విస్తరించి ఉంది. అనాదిగా ఈ కోస్తాప్రాంతం సహజవనరులతోనూ, సారవంతమైన భూములతోను కూడి
ఉండడం వల్ల, వ్యవసాయానికే కాక సాహితీవ్యవసాయానికి కూడ వీలు కలిగిoచే విధంగా ఉంది.
ఈ ప్రాంతానికి మరొక ప్రత్యేకత కూడ లేకపోలేదు. మిగిలిన ప్రాంతాలు ఎంతో కొంత పొరుగు
భాషా సాoకర్యాన్ని పొంది తమ రూపురేకల్ని కొoత మార్చుకున్నాయి. కాని కోస్తాప్రాంతం
ఎట్టి సాoకర్యం పొందకుండా భాషా స్వరూపాన్ని
చాల వరకు యథాతథంగా నిల్పుకో గలిగింది. ఇక్కడ అన్యభాషా సాంకర్యం తప్పని చెప్పడం
తాత్పర్యం కాదు. సాoకర్యం లేదని చెప్పడమే తాత్పర్యం. ఎoదుకంటే సాంకర్యం అనివార్యం
.
ఇక ‘కోస్తా ఆంధ్రలో
తెలుగుసాహిత్య వికాసం’ అనే అంశాన్ని
సమీక్షిoచి వ్యాసం వ్రాయడమంటే మహాసముద్రాన్ని చిన్నకూజాలో పట్టి చూపిoచడం వంటి
సాహసమే ఔతుంది . ఈ సాహసానికి మన్నిoచ వలసిoదిగా కోరుతున్నాను.
తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోడానికి ఆధారభూతమైన శాసనాలు చాలవరకు
కోస్తాప్రాంతంలో లభించడం ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
నందంపూడి శాసనం, యుద్ధమల్లుని బెజవాడశాసనం, అద్దంకి
పండరంగని శాసనం సుప్రసిద్ధశాసనాల్లో కొన్ని ఉదహరింపదగినవి. తెలుగుభాష అతి ప్రాచీనమే అయినా తెలుగుకావ్యచనకు
శ్రీకారం చుట్టిన ఘనత కోస్తాప్రాంతానికే దక్కింది. అంతవరకు శాసనరూపoలో రాగిరేకులకు
రాతిపలకలకు పరిమితమైన ఆంద్రసరస్వతికి నిర్దుష్టం.
నిర్దిష్టం అయిన రూపురేకలు దిద్దిన ఘనత చాళుక్యరాజు రాజరాజనరేంద్రునికి, రాజధానియగు
రాజమహేంద్రవరంలో వెలసిన నన్నయ్యగారికే దక్కింది.
అంతకుముందున్న
ఆంధ్రరాజులెవ్వరును గ్రంథరచనకు ప్రోత్సాహo కల్పించినట్లు కానరాదు. దేవభాషోద్యానవనంలోఉన్న భారతపారిజాతాన్ని తెలుగుతోటలో
నాటిన నారాయణుడు నన్నయ్యయే (నారాయణ శబ్దభవం నన్నయ) కాదు దాన్ని వికసింపచేసినట్టి నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానకవి తిక్కన, అద్దంకి నేలిన ప్రోలయవేమారేడ్డి
ఆస్థానకవి ఎర్రన. ఈ ముగ్గురు ఈ ప్రాంతనివాసులు కావడం ఈ ప్రాంతం చేసుకొన్న సుకృతంగా
చెప్పక తప్పదు. అదేవిధంగా శివకవులయుగంలో పండితత్రయంగా పేరుపొందినముగ్గురిలో శ్రీ మల్లికార్జున పండితుడు తూర్పుగోదావరిజిల్లా ద్రాక్షారామనివాసి. శ్రీపతి పండితుడు కృష్ణాజిల్లా విజయవాడ
వాస్తవ్యుడు కావడం చేత శైవపారమ్యాన్ని తెలిపే సాహిత్యానికి కూడ ఈ ప్రాంతమే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మీదత్తవరప్రసాదుడు,
యుగకర్త అయిన శ్రీనాధమహాకవి మార్గదేశికవితాప్రక్రియలను రెంటిని చేపట్టి సమకాలీన, అర్వచీనకవులను ప్రభావితంచేసిన మహామనీషి. ఆయన వారిధితటీక్రాల్పట్టణవాస్తవ్యుడగుటచే కోస్తాప్రాంతీయుడే. ఆ యుగoలో సుప్రసిద్ధులైన
అనంతామాత్యుడు మొ||కవులు కోస్తానివాసులే. తెలుగుసాహిత్యచరిత్రలో
స్వర్ణయుగంగా భావిస్తున్న రాయలకాలంలోను ఆ
తరువాత దక్షిణాంధ్రయుగంలోను వెలసిన కవులలో చాలమంది కోస్తాప్రాంతనివాసులే. వారు తమ
కవితాచాతుర్యంతో నవరసాల్ని పండించి ఆంధ్రసరస్వతికి తుష్టిని, పరిపుష్టిని
చేకూర్చినవారే. ముందు తెనాలిరామలింగడుగా
కొండవీడు దుర్గాధ్యక్షుడైన నాదెండ్ల గోపన్నమంత్రికి; ఆ తరువాత రామకృష్ణునిగా రాయల ఆస్థానానికి వన్నె
తెచ్చిన పాండురంగమహాత్మ్యకర్త, అయ్యలరాజు
రామభద్రుడు, మాదయ్యగారిమల్లన్న, నెల్లూరి ఆడుపడుచు
మొల్ల, అచ్చతెలుగుకావ్యంతో బాటు అనేకగ్రంథాలు
రచించి కవిసార్వభౌమబిరుదు పొందిన కూచిమంచి జగ్గకవి (తిమ్మన సోదరుడు)
కోస్తాప్రాంతపు కవీశ్వరులే. వీరే కాక మరెంతోమంది కోస్తా జిల్లాలకు చెందినవారే.
ప్రాచీనాంధ్రసాహిత్యం పుట్టిన ఆ రాజమహేoద్రవరంలోనే కొన్ని వందల సంవత్సరాల తరువాత
ఆధునికకావ్యప్రాదుర్భావం కూడ జరగడం కాకతాళీయమే అయినా గమనింపదగ్గ విషయం. ఆంగ్లేయుల
రాకతో పరస్పరభావవినిమయం జరిగింది. దాంతో సాహిత్యం ప్రక్రియావైవిధ్యంతో పలుపుంతలు
త్రొక్కిoది. శ్రీ కందుకూరి వీరేశలింగం గారు కధానికను మినహాయిస్తే అన్ని ప్రాచీన, ఆధునిక ప్రక్రియలను చేపట్టిన మహామనీషి.
ఆయన ప్రాచీనులలో ప్రాచీనుడు, అర్వాచీనులలో
అర్వా చీనుడు. ఇంచుమించు అదే సమయంలో
విశాఖజిల్లా రాయవరంలో పుట్టి విజయనగరంలో మెట్టిన శ్రీ గురజాడ తనకలాన్నే ఖడ్గంగా
ఉపయోగించి అనర్ధాన్ని కల్గించే సంఘధోరణులను వ్యతిరేకిస్తూ కావ్యాలు, కధానికలు
నాటకాలు వెలువరించారు. ఈయన్ని యుగకర్తగా
భావించేవారు కూడ కొంతమంది లేకపోలేదు. మరోప్రక్క రాజమహేoద్రవరనివాసి శ్రీ చిలకమర్తి
రసవంతమైన కావ్యనాటకాలు అందించిడంతో బాటుగా భారతమాతను కీర్తిస్తూ తెల్లవారిని
నిరసిస్తూ ఎన్నో పద్యాలను రచించారు. ప్రజలలో దేశభక్తిని, రాజకీయ చైతన్యాన్ని
రేకెత్తించారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి ప్రభావానికైనా లోనుగాని కవి ఆధునికయుగంలో
ఒక్కరు కూడ లేరనడం స్వభావోక్తే గాని అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఆనాటి కవిత్రయానికే గాక ఈ ఆధునికకవిత్రయానికి
జన్మనిచ్చిన కోస్తాప్రాంతం ఎంతో ధన్యమైనది. .
. ఒక ప్రక్క భావవిప్లవం పెల్లుబుకుతోంటే మరోప్రక్క భాషావిప్లవం
కదం తొక్కింది. కోనసీమలో పుట్టి శ్రీకాకుళాన్ని పునీతం చేసిన పర్వతాలపేట నివాసి
శ్రీ గిడుగు రామమూర్తి వ్యావహారికభాషోద్యమానికి సృష్టికర్త అయ్యారు. జీవితాంతం వ్యావహారిక
భాషాభివృద్ధికై కృషిచేశారు. ఈ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వారిలో గురజాడ వారు కూడ
ఉన్నారు. వీరిద్దరి ప్రభావంతో ఎ౦తోమంది వ్యవహారికభాషా ప్రేమికులయ్యారు. సాహిత్యం
గ్రాంధికభాషాశృంఖలాలను ఛేదించుకొని స్వేచ్ఛావాయువులు పీల్చుకొoది. భాషాపటిమ అంతగా
లేకపోయినా భావపటిమగల ఎంతోమంది కవులకు ఈ
ఉద్యమం చేయూతనిచ్చింది. దీంతో తెలుగుసాహిత్యం లెక్కకు మిక్కుటమైన ప్రక్రియలతో విరాడ్రూపాన్ని
సంతరించుకుంది.
ఆంగ్లేయుల పాలనలోను, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాచరికం అంతరించిపోయినా
రాజవంశీయులలో సాహితీతృష్ణ మాత్రం అంతరించిపోలేదు. ఒక ప్రక్క సంస్థానాధీశ్వరులు వేఱొకప్రక్క
జమీందార్లు ఎంతోమంది కవులను పండితులను పోషిoచి వివిధశాస్త్రాలే కాక అనేక
కవితాప్రక్రియలు విస్తరిల్లడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కారణభూతులయ్యారు. పిఠాపురం,
పెద్దాపురం, బొబ్బిలి, విజయనగరం, ఉయ్యూరు, పార్వతీపురo, వే౦కటగిరి, నరసరావుపేట, నూజివీడు,
అమరావతి, లక్కవరం, పోలవరం, సంస్థానాలు కోస్తా ప్రాంతంలో గల సంస్థానాల్లో కొన్నిమాత్రమే.
బహుముఖప్రజ్ఞాశాలి, రామాయణ, భారత, భాగవతాలను యధామూల౦ అనువదించిడమే కాక వందకు పైగా
గ్రంధరాజములను వెలయించిన శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా పొలమూరులో
పుట్టి కృష్ణాజిల్లా ముక్త్యాల సంస్థానానికి వన్నె తెచ్చినవారే. చతుష్షష్టికళలను ఆపోశన
పట్టినవారే. మచిలీపట్నం వాస్తవ్యులైన శ్రీ కాశీ కృష్ణ మాచార్యులు; ఆద్యతనా౦ధ్రకవిప్రపంచనిర్మాతలై,
ఇటు గద్వాలటు చెన్నపట్టణము వరకు గల స0స్థానాధీశ్వరులను పద్యకవితామాధుర్యంలో ఓలలాడిoచి, పద్యాన్ని శ్రోతలహృదయాలల్లో
పునఃప్రతిష్ఠాపించిన తిరుపతివేంకటకవులలో శ్రీ దివాకర్ల తిరుపతిశాస్త్రి గారు (ప||గో||జిల్లా-
యండగండి), శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు (తూ||గో||జిల్లా-కడియం), రామకృష్ణకవులు: కొప్పరపుకవులు;
వేoకటపార్వతీశకవులు, దేవులపల్లి సోదరులు, తిరుపతివేoకటకవుల శిష్యులైన కవిసమ్రాట్ విశ్వనాధ, పింగళి-కాటూరి కవులు; శ్రీవేలూరి
శివరామశాస్త్రి మొదలైనవారు పైన పెర్కొన్న వివిధ ఆస్థానాల్ని పునీతం చేసిన కవీశ్వరులే.
సoస్థానాధీశుల హయాంలో వివిధకవితాప్రక్రియలతో బాటుగా, యక్షగానప్రక్రియ,
అనేక జానపదకళారూపాలు ఆవిర్భవించి దేశమంతా విస్తరించాయి. అవధానకళ అన్నిదిశలా
విస్తరించి ప్రజలందరకు సాహిత్యం పట్ల మక్కువను పెంపోదించి౦ది.
ఆంధ్రదేశాన్ని హాస్యరసప్లావితం చేస్తూ సింహత్రయంగా పేరొందిన చిలకమర్తి, మొక్కపాటి,
పానుగంటి వారే గాక మునిమాణిక్యం మొ||వారు కోస్తా వాస్తవ్యులు కావడం ఒక అరుదైన
విశేషo.
పందొమ్మిది ఇరవై శతాబ్దాల సంధికాలంలో స్వదేశీ విదేశీ భాషలసంపర్కం, పరస్పరభావవినిమయం
వల్ల భావకవిత్వం ప్రాదుర్భవించింది .ఈ ధోరణికి స్పూర్తిదాత శ్రీ రాయప్రోలు (బాపట్ల
తాలూకా గార్లపాడు), వ్యాప్తి చెందించిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
(తూ||గో||జిల్లా ,చంద్రంపాలెం), ఆదిరించిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ (కృష్ణాజిల్లా
నoదమూరు), కవికోకిల దువ్వూరి రామిరెడ్డి (నెల్లూరు ), ఎంకి పాటలకర్త నండూరి
సుబ్బారావు, సౌందరనందo కర్తలైన పి౦గళి-కాటూరి కవులు, గౌతమీకోకిల శ్రీ వేదుల
సత్యనారాయణ మొ||వారు కోస్తా ప్రా౦తీయులు కావడంచేత
ఈ ఉద్యమానికి కూడ ఈ ప్రాంతమే కేంద్రబిందువైoది.
కొంత కాలానికి తెలుగు సాహిత్యం భావకవితాదోరణులకు స్వస్తి చెప్పి అభ్యు దయపధంవైపునకు
మళ్ళింది. దీనికి కోస్తాజిల్లా వారైన శ్రీ. శ్రీ,
,శ్రీరంగం నారా యణబాబువంటి ప్రముఖులు మూలస్తంభాలుగా నిలిచారు.
బహుభాషాకోవిదులు శ్రీ తల్లావజ్ఝుల శివశoకరశాస్త్రి
తెలుగులెంక
శ్రీతుమ్మల సీతారామమూర్తి చౌదరి , కరుణశ్రీ , కవికోకిల
జాషువ గుoటూరు జిల్లాకి చెందిన వారే.
బహుముఖప్రజ్ఞాశాలి శ్రీ ద్రోణoకి అప్పలస్వామి (విజయనగరం )మొ||ప్రముఖులందరు కోస్తా
ప్రా౦తీయులే.
ఆధునికభావవిప్లవానికి, నాస్తికోద్యమానికి శ్రీకారం చుట్టి పెంచిపోషించిన ఘనత
కోస్తాజిల్లాకవులకే దక్కింది . అంగలూరు వాస్తవ్యులు శ్రీ త్రిపురనేని రామస్వామి
చౌదరి, శ్రీ ఉన్నవ లక్శ్మీనారాయణ (గుంటూరు) మొ||వారు ప్రధమగణ్యులుగా చెప్పుకోవచ్చు
. ఆధునికయుగంలో స్మృతికావ్య (Elegy) ప్రక్రియను ఉద్ధరించిన ఘనత కోస్తాకవులకే
దక్కింది. కృష్ణశాస్త్రి, విశ్వనాధ, జాషువ మొ||వారు ఈ ప్రక్రియను ఆదరించినవారిలో కొందరు.
ఇక పదసాహిత్యం మాటకొస్తే ఆనాటి క్షేత్రయ్య (కృష్ణాజిల్లా)యే కాక ఒకనాటి
ఆదిభట్ల నారాయణదాసు (విజయనగరం); ఈనాటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ (తూ||గో||జిల్లా) మొ||వాగ్గేయకారులు కోస్తాప్రాంతం అందించిన
ఆణిముత్యాలు. వీరిలో శ్రీఆదిభట్ల హరికథాసాహిత్యాన్ని సృష్టించిపండిత పామరులను కూడ ఉర్రూతలూగిoచారు.
నేడు ఆంధ్రదేశoలో ఉన్న భాగవతారులకు భాగవతారిణులకు
స్ఫూర్తిదాత కావడమే కాక ఒక హరికథాకళాశాలస్థాపనకు ప్రధాన కారకులయ్యారు.
పేరడికవిత్వానికి
ఆద్యులైన శ్రీ జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి మచిలీట్టణవాస్తవ్యులు కావడం వల్ల ఈ
ప్రక్రియకు నాంది పలికిన ఘనత కోస్తాకే దక్కింది. అలాగే వచనపద్యరచనలో ప్రముఖులైన
నయాగరా, శ్రీ కుందుర్తి, శ్రీ బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం మొదలైన
వారు గుంటూరు జిల్లా అందించిన మణిదీపాలు.
ఇక కధాసాహిత్యవిషయానికొస్తే తొలి కావ్యమైన దశకుమారచరిత్ర రచయిత కేతనయే కాదు ఒకనాటి గురజాడ కలం నుండి
జాలువారిన దిద్దుబాటు మొదలుకొని ఖండాంతరాల్లో
కీర్తినార్జి౦చిన పాలగుమ్మి పద్మరాజూ గారి గాలివాన వంటి ఎన్నో రచనలకు ఈ
కోస్తాప్రాంతమే కేంద్రమైంది. కథలు,
కథానికలు సామాజికసమస్యలకు దర్పణాలు కావడంతో ప్రజలందఱకు చేరువయ్యాయి. శ్రీపాద
సుబ్రహ్మణ్యశాస్త్రి , చలం , బుచ్చిబాబు, గొపీచoద్, అడవిబాపిరాజు, రా.వి.శాస్త్రి,
కాళీపట్నం రామారావు మొ||వారందఱు కోస్తాప్రాంత రచయితలే. అన్ని రంగాల్లో వలె ఈ రంగంలో
కూడ పురుషులతో బాటు స్త్రీలు కూడ ఉన్నారు. శ్రీయుతలు తెన్నేటి హిమలత, యద్దనపూడి
సులోచనా రాణి , ముప్పాళ్ల రంగనాయకమ్మ , నాయని కృష్ణకుమారి , ఊటుకూరి
లక్ష్మీకాంతమ్మ మొదలగువారు వైవిధ్యంతో కూడిన తమ రచనలతో కోస్తాప్రాంతానికి వన్నె
తెచ్చిన రచయిత్రులే.
ఇక విమర్శన రంగం పరిశీలిస్తే శ్రీయుతులు మల్లంపల్లి సోమశేఖశర్మ ( ప|| గో||
జిల్లా), వేటూరి ప్రభాకరశాస్తి ( కృష్ణాజిల్లా –పెదకళ్లేపల్లి) తిమ్మావజ్ఝల కోదండరామయ్య ( నెల్లూరు),
చిలుకూరి వీరభద్రరావు ( ప|| గో| జిల్లా ) చిలుకూరి- నారాయణ రావు ( విశాఖపట్టణం ) నిడదవోలు
వేంకటరావు ( విజయనగరం ) నేలటూరి వేంకట
రమణయ్య (నెల్లూరు) ఖండవల్లి
లక్ష్మీరంజనం (తూ|| గో|| జిల్లా ) డా|| కే. బి . కృష్ణ ( గుoటూరు) మొదలగు వారు కోస్తా ప్రాంతం వారే. అలాగే
బాలసాహిత్యానికి ఎంతో కృషి చేసిన శ్రీయుతులు చింతా దీక్షితులు , బి.వి.
నరసింహారావులు, నేడు బాలసాహిత్యరంగంలో అహర్నిశలు
కృషిచేస్తున్న గుడివాడ వాస్తవ్యులు శ్రీ హనుమంతు రామచంద్రం గారు కూడ
ఇక్కడివారే.
తెలుగులో 19వ శతాబ్దం ఉత్తరార్థంలో గాని నాటకరచన ప్రారంభం కాలేదు. మనం
తెలుగులో తొలినాటకంగా భావించే ‘మంజరీమధుకరీయo’ రచయిత శ్రీ
కోరాడ శ్రీరామచంద్రశాస్త్రి అమలాపురం తాలూకా కేశనకుర్రు గ్రామవాస్తవ్యులగుటచే నాటకరంగంలొ
కూడ ఈ ప్రాంతమే ముండడుగు వేసిందని చెప్పుకోవచ్చు. తరువాత ఎంతోమంది గ్రాంథిక,
వ్యావహారిక భాషల్లో ఎన్నెన్నో నాటకాలు రచించారు. కన్యాశుల్కం, పాoడవోద్యోగవిజయాలు,
గయోపాఖ్యానం , బొబ్బిలియుద్ధo, పద్మవ్యూహం , వరవిక్రయం , చింతామణి మొదలైన ప్రసిద్ధ
నాటకాలకు పుట్టినిల్లు ఈ కోస్తాప్రాంతం. కాబట్టి నాటకరంగ ఉత్పత్తి, వికాసాలకు కూడ
ఈ ప్రాంతమే కేంద్రబిందువనడం అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో నాటికలకు, వ్యాసరచనలకు కూడ ఈ ప్రాంతం
కేoద్రబిoదువయింది. పౌరాణిక, సాంఘిక ,చారిత్రిక నవలలు పుంఖానుపుoఖాలుగా ఇక్కడ
నుండే వెలువడ్డాయి .
ఇక దళితసాహిత్యానికి , స్త్రీవాదసాహిత్యానికి కూడ ఈ ప్రాంతమే ముందడుగు
వేసింది. ఆనాటి “ మంచి యన్నది మాలయైతే మాల నేనగుదున్” అన్న గురజాడ వారి మాట నేడు దళితసాహిత్యానికి పెట్టని
కోటగా నిలిచింది. కోస్తావాస్తవ్యులు శ్రీ ఉన్నవ లక్ష్మీనరసింహం గారి మాలపల్లి దళిత
సాహిత్యానికి పెద్దపీట వేసింది. ప్రారంభంలో దళితసాహిత్యాన్ని దళితేతరులే
సృష్టిoచారు. కాని రాను రాను నేడు దళితులు “ మా సమస్యల్ని మీరు ఉత్ప్రేక్షించకండి మేమే మా సమస్యల్ని
సూటిగా చెప్పుకుంటాం “ అంటూ
ముందుకొస్తున్నారు. అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తున్నారు.
అదే విధంగా స్త్రీవాదసాహిత్యాన్ని వెలువరించిన శ్రీ గుడిపాటి వెంకటచలం
కోస్తాజిల్లాకు సంబంధించిన వారే. నేడు స్త్రీవాదసాహిత్యాన్ని స్వయంగా స్త్రీలే
రచిస్తున్నారు. వారిలో చాలమంది కోస్తాప్రాంతానికి చెందినవారే.
నేడు ఎన్నో దేశీయ , విదేశీయ కవితాప్రక్రియలు కోకొల్లలుగా
తెలుగుసాహిత్యంలో చోటు చేసుకుంటున్నాయి . మినీకవిత్వం, నానీలు, మామీలు, టుమ్రీలు,
హైకూలు మొ|| ప్రక్రియలు సాంఘికసమస్యలను అద్దంపట్టి చూపిoచడమే కాకుండా
పరిష్కారముద్ర కూడ సూచించేవిగా ఉన్నాయి. కవిపండిత ప్రకాoడులలో శ్రీ యుతులు వెంపరాల సూర్యనారాయణ
శాస్త్రి , రావూరి వేoకటేశ్వర్లు, శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ మొదలైన వారందరూ కోస్తా
ప్రాoతీయులే.
ఇక విద్యావ్యాసoగవిషయానికొస్తే ఎంతోమంది సాహిత్యాధ్యాపకులు గ్రంథరచనతో
బాటుగా తమ బోధన పటిమతో శిష్యకోటిహృదయాలలో
సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నారు. వీరిలో కొంతమంది శ్రీ మల్లంపల్లి
శరభయ్య, శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారు, డాక్టర్ శ్రీపాద కృష్ణమూర్తి , శ్రీ
వేదుల సుoదరరామశాస్త్రి,
శ్రీ నూతులపాటి రాఘవరావు, శ్రీమాన్ అత్తిలి గోపాలకృష్ణమాచార్యులు మొ||
వారిని పేర్కోవచ్చు. ఇక సాహితీపటిమకు పట్టుగొమ్మలైవిలసిల్లే ప్రాచ్యకళాశాలలు
మూడొoతులు కోస్తా జిల్లాల్లోనే ఉన్నాయి. గ్రంథవిస్తరభితిచే ఈ వ్యాసంలో కొంతమంది
వ్యక్తులనే పేర్కోడం జరిగింది . వీరే గాక మరెందరో కోస్తాప్రాo తీయులున్నారు.
వారందరిని పేరు పేరున పెర్కొనలేక పోతున్నందుకు
విచారిస్తూ
శ్రీత్యాగరాజస్వామిమాటల్లో అనగా ఎందఱో మహానుభావులు
.అందరికి వందనాలు అని అంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను. ఈ విధంగా కోస్తాప్రాంతం
అనాదిగా , అవిచ్ఛిన్నంగా సాహితీపరిమళాలను వెదజల్లడంలో ముందంజలోనే ఉంది .
(మారిస్ స్టెల్లా కళాశాల( అటానమస్ ) విజయవాడ వారి సౌజన్యంతో ...)
No comments:
Post a Comment