Monday, March 23, 2015

భక్తి-వైశిష్ట్యం

భక్తి-వైశిష్ట్యం
     డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
                                                                                                                   
      విద్యార్థులు పెరిగేకొద్దీ  విద్యాప్రమాణాలు అడుగంటుతున్నట్లే భక్తులు పెరిగే కొద్ది భక్తిభావం సన్నగిల్లుతోంది. భక్తిస్థానంలో వ్యక్తిగతహోదా, హంగులు, ఆర్భాటాలు చోటుచేసుకుoటున్నాయి. భక్తి కేవలం నామమాత్రంగానే మిగిలిపోతోoది. మంత్రాలు తక్కువ, తుంపర్లు ఎక్కువ అన్నట్లుగా భక్తి తక్కువ బడాయి ఎక్కువ అన్నట్లుంది నేటి ఆధ్యాత్మిక తత్త్వం.
         మానవుడు తన జీవితంలో సాధించవలసిన నాల్గు పురుషార్ధాలలో మోక్షం చాల ఉన్నతమైంది. మానవుడు తన యధార్ధస్వరూపమైన ఆత్మతత్వాన్ని తాను తెలుసుకోవడమే మోక్షం. ఆత్మసాక్షాత్కారరూపమైన ఈ మోక్షానికి మూడు సాధనాలున్నాయి.  అవి కర్మ, భక్తి, జ్ఞానo. కర్మ చిత్తశుద్ధికి తోడ్పడటం ద్వారా మోక్షసాధనమౌతుంది. కాని కర్మాచరణకు అంగ బలం అర్థబలం మొ || ఎన్నో కావాలి.  అంతేకాకుండా కర్మలు శాశ్వతమైన ఫలాన్ని ప్రసాదిoచ లేవు. అలాగే  వివేకం లేని వారికి కర్మలు బంధాన్నే కలగజేస్తాయి గాని మోక్షాన్ని చేకూర్చలేవు. ఇక నిష్కామకర్మ ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేస్తుంది గాని అది అందరికి ఆచరణసాధ్యం కాదు. ఇక జ్ఞానం మాటకొద్దాం.
        మానసికపరిణతి,  వివేకం లేని వారికి జ్ఞాన మార్గం కూడా ప్రమాదకరమైనదే. అది అహంకారాన్ని త్రుoచడానికి బదులు పెంచుతుంది. అంతేగాక నిత్యానిత్యవస్తువివేకం, ఇహపరసుఖభోగవిరక్తి, ఇంద్రియనిగ్రహం, (దమం) మనోనిగ్రహం, (శమం) కర్మఫలత్యాగం (ఉపరతి), సుఖదు:ఖాలు, ఆకలిదప్పికలు, శీతోష్ణములు, మానావమానములు మొ|| ద్వoద్వములను సహించడం (తితిక్ష) , గురువాక్యములందు, శాస్త్రవాక్యములయందు అచంచలమైన  విశ్వాసo(శ్రద్ధ), ఎల్లప్పుడు ఏమరుపాటు లేకుండా ఉండడం (సమాధానం) అనే ఆరు లక్షణాలు మరియు మోక్షంపట్ల విశేషమైన కోరిక (ముముక్షుత్వం) అనేవి ఉండి తీరాలి. అందువల్ల జ్ఞానమార్గం అసాధ్యం కాకపోవచ్చు గాని  కష్టసాధ్యo.
అందువల్ల కర్మ, జ్ఞాన, మార్గాలకన్న సులభతరమైన మార్గంగా భక్తిమార్గం చెప్పబడుతోంది. భక్తికి ద్రవ్యంతో గానీ ధనoతో గానీ పని లేదు. తెలివితేటలు  గానీ శాస్త్రపాండిత్యం గానీ అవసరం లేదు. జాతి, కుల, మత, వర్ణ, వయో వివక్ష అసలే లేదు. నిర్మలమైన మనస్సు, అచంచలమైన విశ్వాసం , సేవాసక్తి,  సమర్పణభావం ఉంటే చాలు . అందుకే-

ఏ వేదంబు పఠించేలూత? భుజగంబే శాస్త్రముల్ సూచె?తా
నే విద్యాభ్యాసనంబొనర్చె కరి? చెంచేమంత్రమూహించె? బో
ధావిర్భావనిధానముల్ చడువులయ్యా! కావు నీపాదసం
సేవాసక్తియె గాక జంతుతతికిన్  శ్రీ కాళహస్తీశ్వరా|
                                    (శ్రీకాళహస్తీశ్వరశతకం ధూర్జటి )
                 సాలెపురుగు, పాము, ఏనుగు, కిరాతుడు ఏ శాస్త్రమూ చదవకుండానే కేవలం సేవాభావంతోనే తరించారని పై మాటలలోని సారాంశం. అలాగే భక్తికి సిరిసంపదలతో పని లేదు. ఇది గమనించండి.

మార్గావర్తితపాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే
గండూషాంబునిషేచనం పురరిపో: దివ్యాభిషేకాయతే
కంచిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే
భక్తి:కిం న కరోత్యహో వచనరో భక్తావతంసాయతే

 అన్నారు శంకరభగవత్పాదులు శివానందలహరిలో:
ఆటవికుడైన ఆ తిన్నడికి దుమ్ము, ధూళిలో నిండిన పాదరక్షలే నిర్మల్యాన్ని తొలగించే కుంచెగా మారినవట. పుక్కిటపట్టిన నీరే అభిషేకజలం అయ్యిందిట. ఇక కొంచెం తిని ఎంగిలి చేసిన మాంసమే నైవేద్యమైoదట. ఆహా! భక్తి ఎంత గొప్పది! వనచరుడు భక్తాగ్రేసరుడయ్యాడని అని ఆశ్చర్యం ప్రకటించారు శ్రీశంకరులు మోక్షసాధనసామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ  అని
భక్తిమార్గవైశిష్ట్యాన్ని కొనియాడారు. అందువల్ల భక్తిమార్గం ఇతర మార్గాల కంటే ఎంతో అనుకూలమైoది.
            అంతే కాక మానవుడు తనకు భగవంతుడు మానవజన్మ ప్రసాదించినందుకు కృతజ్ఞత చెప్పుకొనే అవకాశం ఈ మార్గంలో ఉంది. అలాగే మానవుడు మాధవుడుగా ఎదగాలంటే భక్తిమార్గం ప్రమాదరహితమైన  సులభమార్గం. అంతేగాక భక్తి మానవుని పరిధుల్ని గుర్తు చేసి అహంకారాన్ని నిర్మూలిస్తుంది. సుఖదుఃఖాలకు అతీతునిగా చేసి జీవితం చీకు చింత లేకుండా సుఖంగా సాగేలా తోడ్పడుతుంది. భక్తుడెప్పుడు తనకేది జరిగినా భగవంతుని అనుగ్రహం గానే భావిస్తాడు కాబట్టి సుఖాలకు పొంగిపోడు, దు:ఖాలకు క్రుంగిపోడు. అతనికి ఎటువంటి మానసిక వత్తిడులు ఉండవు. ఈ ప్రపంచంలో ఎటువంటి మానసిక వత్తిడులు లేనివాడు ఎవడైనా ఉంటే వాడు భక్తుడు మత్రమే అయుoటాడు. ఎoదుకంటే నిజమైన భక్తునికి tension ఉండదు. tension ఉన్నవాడెవడు నిజమైన భక్తుడు కానేరడు.
ఈవిషయాన్ని నిరూపించే కథలు భాగవతంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఉదాహరణకు అంబరీషోపాఖ్యానం తీసుకుందాo. దుర్వాసుడు అoబరీషుని చంపమని ఒక శక్తిని సృష్టించి వదిలాడు. అది అoబరీషుని చంపడానికి ముందుకొచ్చింది . దాన్ని చూసినప్పటికీ ఆయన ఒక్కడుగు కూడ ముందుకు వెయ్యలేదట. ఎందుకంటే తనను రక్షిoచేవాడొకడున్నాడనే ధీమా. ఈ ఘట్టంలో వ్యాసమహర్షి న చచాల పదాన్ నృప: అంటారు. ఆ తరువాత చాల తతంగం జరిగింది. విష్ణువు తన భక్తుడైన అoబరీషుని రక్షిoచుకోడానికి సుదర్శనచక్రాన్ని పంపించాడు. అది ముందుగా శక్తిని చంపి ఆ తరువాత దూర్వాసమహర్షిని వెంబడించింది. ఆయన భయంతో అన్ని లోకాలు తిరిగితిరిగి సహాయం లభించక పోవడంతో చివరికి విష్ణుమూర్తి దగ్గరకే వచ్చి రక్షించమని వేడుకున్నాడు.
అప్పుడు విష్ణువు పలికిన మాటలు భక్తుడైన ప్రతి వ్యక్తీ గుర్తుపెట్టుకో దగినవి.
ఓమహర్షి! కొoతమంది భక్తులు నా హృదయం దొoగిలించి తీసుకుపోతారు. ఏనుగును త్రాళ్ళతో కట్టేసినట్లు  భక్తి అనే త్రాళ్ళతో నన్ను కట్టేస్తారు.  నేను వలల్లో చిక్కుకు పోతాను . నేనేమి చేయలేని  నిస్సహాయుడను . నువ్వు అంబరీషుణ్ణే వేడుకో . ఇప్పుడు నిన్ను అతనొక్కడే రక్షిoచగలడు అంటాడు

ఛలమున బుద్ధి మంతులగుసాధులు నా హృదయంబు లీల దొo
గిలికొని పోవుచుండుదురకిల్బిషభక్తిలతాచయంబులన్
నిలువగబెట్టికట్టుదురు నేరుపుతో మద కుంభి కైవడిన్
వలలకు చిక్కి భక్తజనవత్సలతన్ జన కుందు తాపసా !
(పోతన భాగవతo-- అంబరీషోపాఖ్యానం )      
         ఆ తరువాత ఆ మహర్షి అoబరీషుణ్ణి  వేడుకోవడం  ప్రమాదం నుంచి బయటపడడం జరుగుతుంది.   .

     ఇక భక్తి స్వరూప  స్వభావాలగురించి స్వల్పంగా తెలుసుకుందాం !
      నారద భక్తి సూత్రాలలో సా త్వస్మిన్ పరమప్రేమరూపా అని భక్తి స్వరూపం చెప్పబడింది. అది ప్రేమరూపమైనది. ప్రతిక్షణం వృద్ధి పొందేది. తైలధారవలె అవిచ్ఛిన్నమైనది. ఒక మూగవాడు రుచికరమైన పదార్థాన్ని తిని దాన్ని గూర్చి ఏ విధంగా ప్రకటించలేడో అదే విధంగా పరమ ప్రేమరూపమైన భక్తి అనుభవైకవేద్యమే గాని వర్ణించలేము. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లికి బిడ్డమీద ఉండేప్రేమ మనకు భగవంతుని మీద ఉంటే అదే భక్తి.
      శ్రీశంకరభగవత్పాదులు భక్తిస్వరూపాన్ని చాలా అందంగా అలంకారికంగా నిర్వచించారు.
అంకోలం నిజబీజసంతతిరయస్కాంతోఫలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభం
ప్రాప్నోతీహ యధా తధా పశుపతే:పాదారవిoదద్వయం  
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే.(శివానందలహరి )
          అంకోలం అనగా ఊదుగ చెట్టు. దాని విత్తనాలు ఒకానొక సమయంలో మరల చెట్టుకు అoటుకు పోతాయి. అలా అంకోల వృక్షాన్ని బీజాలు అంటిపెట్టుకుని ఉన్నట్లు, అ యస్కాంతమును సూది అంటుకుని యున్నట్లు, పతివ్రత ఎల్లప్పుడూ తన భర్తనే ఆశ్రయించిన విధంగా, లత ఎల్లప్పుడూ చెట్టునే పెనవేసికోనిన రీతిగా, నది ఎల్లప్పుడూ తన భర్త యగు సముద్రుని చేరునట్లుగా ఎవరి మనస్సు ఎల్లప్పుడు సర్వకాల సర్వావస్థలయందు పశుపతి యగు ఈశ్వరుని పాదారవిoదములందు లగ్నమగునో అదే భక్తి.
          పై రెండు ఉదాహరణలు బట్టి భక్తికి మనస్సేగాని మరేదీ ప్రధానం కాదని తెలుస్తోంది. లలితా సహస్రనామావళిలో అమ్మవారిని స్తుతిస్తూ అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా అన్నారు. కాబట్టి భగవంతుని అoతర్ముఖంగానే ఆరాధించాలి గాని బాహ్యమైన కార్యకలాపాలు ముఖ్యం కావు. అవి తగు మాత్రంగా ఉంటే ఉండొచ్చు గాని అధికం గాకూడదు. అంతేగాక తాను నమ్మిన దైవాన్ని అంతట, అందరియందు చూడగల్గడం నిజమైన భక్తుని లక్షణం. అందు వల్ల నిజమైన భక్తుడు ఏమతానికి చెందినవాడైనా ఇతర మతములను గాని, దైవములను గాని దూషించడు. భక్తి మానవతావిలువల్ని పరిరక్షించేదిగా ఉండాలి గాని కాలరాచేదిగా ఉండరాదు. సిద్ధాంతాలను వల్లె వేయడంకన్నా ఆచరించడానికి ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి. భక్తిభావం సంకుచితం కాక జాతికులమతాలకు అతీతoగా ఉండాలి. సకల జీవరాశులయెడ దయను చూపిoచడమే  భక్తికి పరాకాష్ఠ. దయగల హృదయమే భగవన్నిలయం. సమాజసేవే భగవదారాధనగా భావించాలి. మనస్సు భగవంతునకు మనిషి కర్తవ్యానికి అంకితం కావాలి.  ప్రతి భక్తుడు పోతనగారు చెప్పినట్లు

నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపారభూతదయయును
తాపసమందార నాకు దయ సేయ గదే!
       అని తన ఇష్ట దైవాన్ని ప్రార్ధించి భగవంతుని, భగవంతునిప్రతి రూపమైన సమాజాన్ని సేవించి తరించాలి. ఇది భక్తునికే సాధ్యం .అందువల్లనే మోక్షసాధన సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ .  అనేమాట సార్ధకమై౦ది.      


No comments: