Friday, August 7, 2015

అందుకే కాబోలు భయపడింది


అందుకే కాబోలు భయపడింది

చిలకమర్తి దుర్గాప్రసాదరావు   

సీతారాముల వివాహం చాల దివ్యంగా, భవ్యంగా జరిగింది. వివాహం తరువాత, భార్య భర్త పాదాలకు నమస్కరించడం ఒక రివాజు . కాని సీత ఆపని చెయ్యలేదు. సఖులు ఆమె దగ్గరకెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత హెచ్చరించినా ఆమె వినలేదు. సరే కార్యక్రమం అంతా సజావుగా జరిగిపోయింది. ఆమె రాముని పాదాలకు నమస్కరించకపోవడం మాత్రం అందరికి ఆశ్చర్యాన్నే కల్గించింది.

 

ఆ తరువాత కొన్నాళ్ళకు చెలులందరు ఆమెను కలసి ఏమమ్మా! మేమెంత బ్రతిమలాడినా నువ్వు ఆయనపాదాలకు ఎందుకు నమస్కారం పెట్టలేదు. కారణం ఇప్పటికైనా చెబుతావా చెప్పవా అని నిలదీశారు .  అపుడు ఆమె చెప్పిన సమాధానం చూడండి.

 

రామచంద్రప్రభువు పాదరజం సోకి రాతిగా పడిఉన్న మునిపత్ని నాతిగా మారిపోయిన సంగతి  ఆమె వివాహానికి కొన్నిరోజులు ముందే కొంతమంది మునులద్వారా ఆమె  విన్నదట. ఒకవేళ అదే  నిజమైతే తాను రామచంద్రమూర్తి  పాదాలకు నమస్కరిస్తే ఆతని పాదధూళి ఆమెకు తగులక పోదు. ఒక వేళ తగిలితే ఏ౦ జరుగుతుందో అనే భయంతో ఆమె ఆ ప్రయత్నం నుంచే విరమించుకుందట! ఎ౦త గడుసై౦ది సీత. ఎంత రమణీయమైనదీ  భావన.

 

శిక్షితాపి సఖిభి: నను సీతా

రామచంద్రచరణౌ న ననామ

కిం భవిష్యతి మునీశవధూవ

ద్బాలరత్నమిహ తద్రజసేతి.

(శుభాషిత రత్నభాండాగారం-page- 364/38)
           *****

No comments: