అందం - అనవద్యం – ఆరాధ్యం
డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాద రావు
సాధారణంగా కవులు స్త్రీలను శృంగారవస్తువులుగా
వర్ణించడం పరిపాటి. ఒక కవి అందుకు భిన్నంగా ఒక యువతిని శృంగారపరంగా వర్ణిస్తూనే అందమైన ఆమె అవయవాలను పుణ్యక్షేత్రాలతో పోలుస్తూ ఆమెను పవిత్రతకు నిలయమైన ఒక సౌందర్యరాశిగా,
తీర్చిదిద్దాడు. ఇది ప్రతిభావంతులైన
కవులకే సాధ్యం. ఎంత బాగా వర్ణి౦చాడో
చూడండి.
మధ్యం విష్ణుపదం. ఆమె నడుము విష్ణు
పదమట. విష్ణుపదమంటే విష్ణువు యొక్క స్థానమని ఒక అర్థం, ఆకాశం అని మరో అర్థం. ఇక్కడ నడుమును ఆకాశంతో
పోల్చడం వల్ల అది చాల సూక్ష్మంగా, సన్నగా,
నాజూకుగా ఉందని తాత్పర్యం. సన్నని నడుము సౌందర్య చిహ్నం .
కుచౌ శివపదం. ఇక పాలి౦డ్లు శివపదాలట. ఇక్కడ శివపదాలంటే శివుని
నిలయాలని ఒక అర్థం, పర్వతాలని మరో అర్థం. ఆమె పాలిండ్లు పర్వతాల్లా ఉన్నతంగా ఉన్నాయని తాత్పర్యం
.
వక్త్రం విధాతు: పదం. ముఖం బ్రహ్మపదమట. అంటే బ్రహ్మ యొక్క
పుట్టినచోటని ఒక అర్థం. మరో అర్థం పద్మం . ముఖం పద్మంలా ఉందని తాత్పర్యం .
ధమ్మిల్ల: సుమన: పదం.
ఆమె కేశపాశములు లేక జడ కొప్పు సుమన: పదం అంటే దేవతలకు
నిలయమని ఒక అర్థం, పువ్వులకు నిలయమని మరోఅర్థం. ఆమె తలనిండా పూలు పెట్టుకుంటుంది.
ప్రవిలసత్కా౦చీ నిత0బస్థలీ
ఇక ఆమె జఘనం మొలనూలు (బంగారు ఒడ్డాణం)తో
ప్రకాశిస్తోంది అని ఒక అర్థం, కామాక్షి
దేవలకు నిలయమైన కాంచీపట్టణం అని మరో అర్థం . వాణీ చేన్మధురా
ఇక్కడ ఆమె వాక్కు మధురం అని ఒక అర్థం, కృష్ణుని నివాసమైన మధురానగరం
అని మరో అర్థం .
అధరోరుణధర:
ఇక అధర: అరుణధర:
అనడం చేత ఆమె పెదవి ఎర్రనైనది అని ఒక
అర్థం, అది పరమపవిత్రమైన అరుణాచలం అని మరొక అర్థం .
శ్రీరంగభూమిర్వపు:
అందమైన ఆమె శరీరం రంగభూమి, అంటే రంగనాథుడు వేంచేసియున్న పుణ్యక్షేత్రమని ఒక
అర్థం. భోగవిలాసాలకు క్షేత్రమని మరో అర్థం.
ఈవిధ౦గా ఆమె సౌ౦దర్యం కేవలం ఆకర్షణకే కాదు. అది సర్వదేవతావాసం కావడం వల్ల పవిత్రతకు కూడ నిలయంగా ఉంది . ఆమె పుణ్యచరిత్రను ఏమని
వర్ణి౦చగలం. అది సామాన్యులకు సాధ్యం కాదు. అది నిర్జరులకు మాత్రమే
వర్ణించసాధ్యం . ఇక్కడ నిర్జరులు అంటే నిత్యయౌవనులైన దేవతలని ఒక అర్థం . ముసలితనం
లేని యువకులని మరో అర్థం .
. నిజంగా అటువంటి యువతిని
చేపట్టిన వానికి సౌ౦దర్యలక్ష్మితోబాటు మోక్షలక్ష్మి కూడ లభిస్తుందనడంలో
ఎటువంటి సందేహం లేదు. పద్యం పూర్తిగా తిలకించండి.
మధ్యం
విష్ణుపదం, కుచౌ శివపదం, వక్త్రం విధాతు:
పదం,
ధమ్మిల్ల: సుమన: పదం, ప్రవిలసత్కా౦చీ
నిత0బస్థలీ,
వాణీ చేన్మధురా,sధరోరుణధర:, శ్రీరంగభూమిర్వపు:,
తస్యా: కిం కథయామి పుణ్యచరితం మాన్యా సదా నిర్జరై:
No comments:
Post a Comment