ఒక్క పని పెక్కు లాభాలు
డాక్టర్. చిలకమర్తి
దుర్గాప్రసాద రావు
dr.cdprao@gmail.com
మునుపటితరం కన్న ఈ తరం
వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాల బాగా పెరిగిందనే చెప్పాలి. ఒకప్రక్క కొంతమందిలో ధూమపానం,
మద్యపాన౦ వంటి దురభ్యాసాలు ప్రబలుతున్నా మరో
ప్రక్క యోగ, వ్యాయామం, మార్నింగ్ వాక్
మొదలైన కార్యక్రమాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కాని ఇవన్నీ ఆ సమయానికే పరిమితమై
పోతున్నాయి. వ్యాయామశాలలో కొన్నిగ౦టలసేపు వ్యాయామం చేసినవాడు ఇంటికొచ్చాక ఇక్కడి గ్లాసు
అక్కడ పెట్టడ౦లేదు. అన్నీ దగ్గరకొచ్చి అ౦ది౦చాలి. అన్నీ మనమే దగ్గరకెళ్ళి తీసుకోవాలి. పూర్వపురోజుల్లో
వ్యవస్థ ఇలా ఉండేది కాదు. ప్రతివ్యక్తీ తాను చేయవలసిన లేదా చేయగలిగిన పనులు తానే చేసుకుపోతూ
ఉండేవాడు. అందువల్ల తనకు తెలియకుండానే శరీరానికి కావలసిన వ్యాయామం లభిస్తూ ఉండేది.
సమయం కూడ సద్వినియోగమయ్యేది. కాని నేడు తల్లిదండ్రుల మితిమీరిన గారాబం, రిమోట్
వంటి ఆధునికసౌకర్యాలు, విద్యావిధానం, సహజమైన సోమరితనం ఈనాటి పిల్లల్ని
శారీరకపరిశ్రమను౦చి దూరం చేస్తున్నాయి. దానివల్ల రోగనిరోధకశక్తి తగ్గి రోగాలు
ఎక్కువై అందరి పరిస్థితి వారానికి ‘మూడు రోజులు విందు
నాలుగు రోజులు మందు’ గా తయారౌతోంది.
తల్లిదండ్రులు చదువు పేరుతోనో మరే ఇతర కారణాల వల్లనో పిల్లలకు చిన్నచిన్న పనులు
కూడ చెప్పడం మానేశారు. ముద్దు, మురిపెం పేరుతో పిల్లల్ని మొద్దులుగా తయారుచేస్తున్నారు.
ఒకవేళ తల్లిదండ్రులు పనులు చెప్పినా పిల్లలు చేయడం లేదు. ఇక కొంతమంది తల్లులు డిగ్రీస్థాయికెదిగిన పిల్లలకు
కూడ నేటికి అన్న౦ కలిపి నోట్లో పెట్టడం చాల శోచనీయమైన విషయం. ప్రేమ వేరు , ముద్దు వేరు, గారాబం వేరు. వాటి మధ్య
గల తేడా తెలియక పిల్లల్ని నిర్వీర్యంగా తయారు చేస్తున్నారు. దిక్కు తోచని
పరిస్థిలో పడేస్తున్నారు.
ప్రతివ్యక్తీ చిన్నప్పటినుంచి ఏవో చిన్న చిన్న ఇ౦టిపనులో లేక బయటపనులో చేస్తూ ఉంటే ఆరోగ్యం,
తెలివితేటలూ, ఆత్మవిశ్వాసం ఏర్పడతాయి. ముఖ్యంగా నేడు ఆడపిల్లలకు వంట చెయ్యడం రాకపోవడంతో
పెళ్ళయ్యాక సంసారాన్ని పెంటపాలు చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కొన్ని పనులు
విధిగా పిల్లలకప్పగి౦చాలి. దానివల్ల వాళ్ళకు ‘మేం ఏపనైన చక్కగా
చేయగలం’ అనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. చిన్నతనం
నుంచే పనులన్ని నేర్చుకునే అవకాశం కలిగించాలి. ఉదాహరణకి లేచిన వెంటనే ఎవరి పక్కబట్టలు వారే మడతపెట్టుకునే లాగ తర్ఫీదు
ఇవ్వాలి. దీనివల్ల ఒక పని పూర్తవడమే కాకుండా శరీరానికి వ్యాయామం లభిస్తుంది. అలాగే గదులు శుభ్రంచేయడం, నీళ్ళు తేవడం వంటి
చిన్న చిన్న పనుల వల్ల దేహదార్ఢ్యం కలుగుతుంది. A sound mind in a sound body
అన్నట్లుగా శారీరకబలం వల్ల బుద్ధిబలం ఏర్పడుతుంది.
నేటి సమాజం
ఎటువంటి యువతను కోరుకొంటో౦దో ఒక ఆంగ్లకవి చిన్న పద్యంలో ఇలా అంటాడు :
Boys
of spirit boys of will
Boys
of muscles brain and power
Fit
to cope with any thing
These
are wanted every hour
ఇక యువత కేవలం morning walk మొదలైన వ్యాయామాలు చేసేబదులు
లేదా చేస్తూనే కొ౦తమంది కలిసి ఒక సంఘంగా ఏర్పడి మొక్కలు నాటడమో, కూరగాయలు పెంచడమో
చేస్తే పర్యావరణపరిరక్షణతో బాటు
ఆర్ధికస్తోమత పెరుగుతుంది. మానవసంబంధాలు మెఱుగౌతాయి. భేదభావాలు మఱుగౌతాయి. కొన్ని
కొన్ని దేశాలు మనం పరిశీలిస్తే వారు జానెడు భూమిని కూడ వ్యర్థంగా విడిచిపెట్టరనే
విషయం మనం గమని౦చొచ్చు. యువత ఇటువంటి కార్యక్రమాలు చేపడిదే ఒక్కపనితో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అందువల్ల సాధ్యమైనంతలో ప్రతివ్యక్తి అసలు సిసలైన వ్యాయామం కోసం కొంతసేపు నేలతల్లి
ఒడిలో చేరి మట్టితో మమైక్యం చె౦దాలి. ఒక్క మట్టిపనితో ఎన్నో గట్టి లాభాలు పొందాలి
.
ఒక బ్రహ్మచారి దర్భలు
చేత్తో పుచ్చుకుని మామిడిచెట్లమొదళ్లలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తున్నాడట.
ఒకప్రక్క చెట్లు తడిశాయట మరోప్రక్క పితృదేవతలు ఆనంది౦చారట. ఒక్కపనితో పెక్కు లాభాల౦టే ఇదే.
కశ్చిద్వటు: దర్భపవిత్రపాణి
: వృక్షాలవాలే కురుతే నివాపం
ఆమ్రాశ్చ సిక్తా:
పితరశ్చ తృప్తా: ఏకాక్రియా ద్వ్యర్థకరీ
బభూవ
**************
No comments:
Post a Comment