Tuesday, November 25, 2025

Means VS Ends

 

Means VS Ends

సాధనాలు - ఆశయాలు

డాక్టర్. చిలకమర్తి దుర్గా ప్రసాద రావు.  

మానవ జీవితంలో రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి . ఒకటి, లక్ష్యం రెండు, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎన్నుకునే ఉపాయాలు .

ఒక్కొక్కప్పుడు లక్ష్యం మంచిదైతే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నుకునే సాధనాలు అంతమంచివి కాకపోయినా అది పెద్ద దోషం కాదు. ఎందుకంటే లక్ష్యం ముఖ్యం .  ఇక మార్గాలు ఎంత మంచివైనా లక్ష్యం మంచిది కాక పొతే అది ప్రమాదకరమే. ఇక రెండూ మంచివే కావడం సర్వోత్తమం . అదే మహాత్ముని మార్గం .

ఉదాహరణకి,  ఒక పిల్లవాడు స్కూలుకు ఎగనామం పెట్టి సినిమాకు పోతే తండ్రి కఠినంగా దండిస్తాడు.  ఇక మేనమామ వాడు ఏడుస్తూంటే  చూడ లేక, జాలిపడి మరో సినిమా చూసి రమ్మని ఇంకో వంద రూపాయలు జేబులో పెడతాడు అనుకుందాం  . ఇక్కడ మామయ్య మంచి, నాన్న చెడ్డ అని ఆ పిల్లవాడు అనుకుంటే చాల పొరబాటు.  పరిణామం ఆలోచిస్తే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారూ అనేది  తెలుస్తుంది . 

ఒకసారి పురాణాలు పరిశీలిద్దాం. మనం పురాణాలు చదివితే దేవతలు ఎంత దారుణమైన,  చెత్త పనులు చేశారో మనకు అర్థం ఔతుంది. అవి నోటితో అనలేం , చేతితో వ్రాయలేం. అలాగే రాక్షసులు ఎంత తీవ్రమైన తపస్సులు, వ్రతాలు చేశారో కూడ మనకు తెలుస్తుంది. దేవతలు ఎన్ని చెడ్డపనులు చేసినా వాళ్ళను, ‘దేవతలు’ అనే అంటున్నాం.  . ఇక రాక్షసులు ఎన్ని మంచి పనులు చేసినా వారిని, ‘రాక్షసులు’ అనే అంటున్నాం . ఎందుకు?  వాళ్ళు సాధించ దలచు కున్న లక్ష్యాన్ని బట్టి . దేవతలు ఎన్ని చెడ్డ పనులు చేసినా వాళ్ళ లక్ష్యం విశ్వశాంతి, లోక కల్యాణం, ప్రజా శ్రేయస్సు . రాక్షసులు ఎంత తీవ్రమయిన తపస్సు, వ్రతాలు మొదలైన మంచి పనులు చేసినా వాళ్ళ లక్ష్యం త్రిలోకాధిపత్యం, తద్వారా ఇంద్ర సింహాసనాన్ని దక్కించుకుని, మూడు లోకాలను ఇబ్బందులకు గురి చెయ్యడం.    

ఇక ప్రస్తుత విషయానికొస్తే మన మాతృ దేశ విముక్తికి ప్రాణాలు సహితం లెక్క చేయక పోరాడి నటు వంటి మహనీయులెందరో ఉన్నారు. వారందరూ చాల గొప్ప వారే, వారిలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు.  కాని ఒకటే తేడా . కొందరు లక్ష్యమే మాకు ముఖ్యమని దాన్ని సాధించడానికి ఒక సాధనాన్ని ఎంచుకున్నారు . ఇక మహాత్ముడు ఒక అడుగు ముందుకు ఆలోచించి లక్ష్యం, సాధనం రెండు కూడ మంచివే కావాలని హెచ్చరించి, అహింసామార్గాన్ని ఎన్నుకున్నారు. విజయం సాధించి, కృతకృత్యులయ్యారు .  ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అంటారు. కార్య సాధనలో ఆయనకు (గాంధీజీకి) means మరియు End రెండు ముఖ్యమే, రెండూ పవిత్రమైనవే కావాలన్నారు. అందుకే ఆయన మార్గం నాకు నచ్చిందని, ఇది ఎంత వరకు సాధ్య మనే విషయంలో  నాకు సందేహాలు ఉన్నప్పటికి     వారి సిద్ధాతం ప్రజా బాహుళ్యంలో బలమైన ముద్ర వేసిందని తన Discovery of India అనే  గ్రంథంలో వివరించారు . ఆయన మాటల్లోనే తెలుసుకుందాం .  I have been attracted by Gandhiji’s stress on right means and I think one of his greatest contributions to our public has been this emphasis. The idea is by no means new, but this application of an ethical doctrine to large-scale public activity was certainly novel.   It is full of difficulty and perhaps ends and means separable but form together one organic whole.  In a world which   thinks almost exclusively of ends and ignore means, this emphasis on means seems odd and remarkable. How far it has succeeded in India I cannot say but there is no doubt that it has created a deep and abiding impression on the minds of large number of people.   

         ( డిస్కవరీ ఆఫ్ ఇండియా )

<><><> 

 

 

No comments: