Wednesday, March 9, 2016

అచ్చెరువు గొలిపే చెఱువు వారి నవరత్నాలు

అచ్చెరువు గొలిపే చెఱువు వారి నవరత్నాలు
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
ధునిక పండితకవులలో కీ||శే|| శ్రీ. చెరువు సత్యనారాయణశాస్త్రి గారు ప్రధానగణనీయులు. వారు కవి, పండితులు, శాస్త్రపారంగతులు, మంత్రద్రష్ట , శ్రీవిద్యోపాసకులు,  ఓరియంటల్ కళాశాల ప్రధానాధ్యాపకులున్ను.     సంస్కృతాంధ్రభాషల్లో సమానమైన ప్రతిభాపాటవాలు గల వీరు ఎన్నో కృతులు రచి౦చడంతో బాటు ఉభయభాషల్లో సమానవేగంతో ఎన్నో అవధానాలు కూడ  చేశారు.
వీరు మా గురుదేవులు, పాలకొల్లులోని శ్రీక్షీరారామలింగేశ్వర ఓరియంటల్ కళాశాల ప్రధానాచార్యులైన  కీ|| శే || శ్రీ లంక విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం (L.V.S) గార్కి ప్రియమిత్రులు, సహచరులు కావడం వల్ల వారు చేసిన కొన్ని  అవధానాలలో పాల్గొనే అవకాశం నాకు లబించింది. సాధారణంగా అవధానకవిత్వం గణబద్ధంగా ఉండవచ్చునేమో గాని  కవితాగుణబద్ధంగా ఉండడం చాల అరుదు. కాని వీరి అవధానకవిత మాత్రం అందుకు భిన్నంగా  గణబద్ధత  గుణనిబద్ధంత కూడ కలిగి ఉండేది. ప్రతి మాటలోను చమత్కారం తొంగి చూసేది. ఒకసారి పాలకొల్లులో అవధానం చేశారు. అవధానం పూర్తయ్యాక మా మిత్రుడు శ్రీ సీతాపతి పారితోషికం అందజేస్తూ శాస్త్రిగారూ! ఇప్పుడు మిమల్ని శ్రీదేవి వరిస్తోంది కదూ! అన్నాడు. దానికి సమాధానంగా ఆయన వాణిశ్రీ ఇంతకు ముందే వరించింది అన్నారు.  అవధానాలు చేయడమే కాక  వీరు సంస్కృతాంధ్రభాషల్లో ఆశువుగా ఎన్నో పద్యాలు రచించారు.  ఒక్క మాటలో చెప్పాలంటే వారు పెదవి కదిపితే పద్యం. వారు కదిల్తే పద్యం. వారిని కదిపితే పద్యం. పానీయంబులుత్రాగుచున్ , కుడుచుచున్ , భాషించుచున్ అన్నట్లుగా వీరు సర్వకాలసర్వావస్థలలోను హృద్యమైన పద్యరచన చేసిన సాటిలేని మేటికవి. బహుశ వీరు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి దౌహిత్రులు కావడంవల్ల తమ మాతామహుల ను౦డి కవితాశక్తిని, దైవీసంపత్తిని  సొంతం చేసుకున్నారు. వీరు రచించిన లేదా ఆశువుగా వచించిన  చల్లా వెంకట సుబ్బలక్ష్మి బ్రతుకేలా నివులేకుందినన్  అనే మకుటం గల శతకం నుండి కొన్ని పద్యాలు పరిశీలిద్దాం. వారు అవధానాలు చేసేటప్పుడు శ్రోతలకు వినిపించిన పద్యాల్లో  నాకు గుర్తున్న కొన్ని పద్యాలు మీకు తెలియజేస్తాను. ప్రతిభావంతుడు ఏ భావాన్నైనా సునాయాసంగా ప్రకటించగలడని, ఛందస్సు  ఏమాత్రం ప్రతిబంధకం కాదని వీరి పద్యాలు చదివి తెలుసు కోవచ్చు. ఇది చెవులూరించే మృదుమధురమైన తెలుగు మాండలికభాషలో రచించిన శతకం. నాయుడు బావకు ఎంకి ఊహాసు౦దరి, ప్రణయాధిదేవత అయినట్లుగా వీరికి చల్లావెంకటసుబ్బలక్ష్మి  అనే యువతి ఊహాసుందరి, ప్రణయాధిదేవత. ఆమె ఆయన్ని కవ్విస్తూ ఉంటుంది. అన్నీ చేజిక్కి౦చుకుంటుంది గాని ఆయన చేతికి చిక్కదు. అందీ అoదనట్లే ఉంటుంది. ఆయనకు ఆమె పట్ల గల ప్రేమ, అనుబంధం, విరహం, అంగీకార తిరస్కారాలతో పద్యాలు సాగిపోతాయి. స్థాలీ పులాకన్యాయంగా కొన్ని పద్యాలు పరిశీలిద్దాం.   
ఆమె విరహం భరించలేని  ఆయనేమంటున్నాడో చూడండి .               
  1. కల్లోకొస్తవు కౌగిలివ్వవు ననుoగవ్విస్తవేగాని  ము
     న్పల్లే దగ్గిరకావు  సొమ్మసిలియే వేలప్పుడో కాస్త మ
      గ్తల్లేనిద్దుర పడ్తె సాలు నువు వస్తావేడిపిస్తానికే
     చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్

     ఆమె విరహం తట్టుకోలేక ఎలా తల్లడిల్లి పోతున్నాడో చూడండి

2. కల్లోకొస్తవు కౌగిలివ్వవు ననుoగవ్విస్తవే రేత్రిరే     
    త్రల్లాకన్నులముందరిట్టులటుతారట్లాడినట్లుంట వీ
    కల్లోలంబు భరిoపలేను గదవే కారుణ్యముంజూపవే
    చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్

ఆమె ప్రసన్నత కోసం ఎన్ని విధాలుగా ప్రాధేయపడుతున్నాడో చూడండి.

3. తల్లో పూలుకొనిస్త, సేతులకు బందర్గాజులేయిస్త ,యీ
   ఊల్లో ఎవ్వుతి గాని కట్టననటువంటుప్పాడ చమ్కీ బుటా
   మల్లీమొగ్గల తెల్లకోకిదుగొ  యీ మారెల్లి పట్కొస్తనే,
   చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్

   ఆమెతో తనకు గల అనుబంధం , అనుభవాల్ని ఎలా నెమరు వేసు కుంటున్నాడో చూడండి.

4. ఊల్లో జాతర కెల్లినాము ఉడిపీ ఓటల్లొ పుల్బొoగరా
   లుల్లీకారము తిoటిమంట అపుడేదో కొత్త బొమ్మోస్తలా   
    ఆల్లోకెల్తిమి బెoచి టిక్కెటికి ఊసాడ్తoటె గేట్మూసిరే
    చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్.

  ఆమె లేని జీవితం జీవితమే కాదని వాపోతున్నాడు .

5. పల్లేరైనది జీవితం పెకుతి నాపై కచ్చ గట్టింది యి
   న్నాళ్లూ హాయిగ తోచినట్టి పెకుతంతా నువ్వులేకుoటె మూ
   గల్లే సచ్చినదానిలా అడవిలాగా సూన్నెమైనట్లుగా
   చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్
   వారిద్దరి మధ్య గల అనుబంధాన్ని ఆమెకు గుర్తుచేస్తూ ఇలా వాపోతున్నాడు కవి. 
6. గుల్లోకెల్తిమి దండమెట్టుకొనగా గుగ్గిళ్ళు పెట్టిండ్రు నే
   నల్లా కోవెలసుట్టుతా తిరిగి లేటైపోతె పూజారి ఆ
   పల్లెం తీస్కొని పాయె నన్బిలిచి నీ పాల్లో సగంబెడ్తివే
   చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్
       ప్రతిభా, చమత్కారలతో కూడిన మరో పద్యాన్ని  చూడండి .
7.           సల్లంగుoటది యెన్నెలంటరు సెగేస్తా వుంటె, తాపంగ రే
           త్రిల్లూ పొద్దులు కూడ యెల్గినడు సూరీడొక్కడే వచ్చి,      జా
          బిల్లేమైనడు, నీముకం యెనక సేవి త్తానికోచ్చుoటడే,
           చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్
           తెలుగు సామెత, పలుకుబడులతో నిండిన మరో పద్యం పరికిద్దాం. 
8.           ఇల్లూవాకిలి లేని  నాకు ఒక దిల్లిచ్చాడు ఆ దిల్లు నా      
      ఇల్లన్నావొకనాడు  నామటుకు ఏదీ లేని నాలోని పే
           నాల్లో పేనము గాక నిoదలచి పేనం తీస్కొ లేకుంటినే
           చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్
ఎక్కడైనా బావగాని వంగతోటలో బావకాడనే సామెత నిజమని నిరూపించిన ఈ పద్యం ఎంత మధురంగా ఉందో గమనించండి. 
9.  పల్లీల్దింటవు జంతికిల్ నములుతవ్ పప్పుo డ లే మిoగుతవ్
     ఉల్లీ పున్కులు మెక్కుతావయసుఫ్రూ టుo దంటె సీకెస్తవే
    ఇల్లా నేయెదురుంగ కన్బడితె యేమీ నీకు అన్పిo చదా
    చల్లా యెoకట సుబ్బలచ్చి  బతుకేలా నీవు లేకుoడినన్
ఇవి వారి పద్యాలలో కొన్ని మాత్రమే. నేటి పద్యరచనా ప్రియులు వీరు ఏర్పరచిన ఒరవడిని అనుసరించి పద్యరచన చేస్తే తెనుగుపద్యం  అందరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతు౦దనడంలో ఎటువంటి సందేహం లేదు. నిస్సందేహంగా వారి  రచనలు ఆంధ్రసాహిత్యచరిత్రలో ప్రముఖమైన స్థానాన్ని సంపాదిస్తాయి.  














2 comments:

Dr.Tadepalli patanjali said...

చాలా బాగా వ్రాసారు. ధన్యవాదములు.

Durga Prasada Rao Chilakamarthi said...

Thank you Sir.