మౌనమే సమాధానం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
పెళ్లి అనేది రెండక్షరాల పదమే అయినా పెళ్లి చూపులు ఎన్నో అంశాలతో ముడిపడ్డాయి
. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు, విశ్లేషిస్తారు. ఉదాహరణకి అమ్మాయి వరుని అందానికే ప్రాధాన్యం ఇస్తుంది. మిగిలిన అంశాలు అంతగా పట్టించుకోదు. అమ్మాయి తల్లికి వరుని అందచందాలతో పనిలేదు. ఆమె ధనానికి ప్రాధాన్యం ఇస్తుంది. అల్లుడు స్థితిమంతుడా కాదా అమ్మాయిని పోషించగలడా లేదా అని ఆలోచిస్తుంది. అమ్మాయి తండ్రి వరుని చదువుకి ప్రాధాన్యం ఇస్తాడు. బాగా చదువుకున్నాడా లేదా? సమాజంలో చెలామణీ ఔతాడా లేదా అని ఆలోచిస్తాడు. మిగిలిన బంధువులంతా కులగోత్రాలు చూస్తారు. పెళ్లికొడుకు అదే కులమా!
లేక వేరే కులమా! ఒకవేళ వేరే కులమైతే తక్కువ కులమా! ఎక్కువ కులమా! అలా చేసుకోవడానికి కారణాలేమిటి ? అని . ఇక పెళ్లికి వచ్చిన జనం భోజనాలెలా ఉన్నాయి. ఎన్ని స్వీట్లు , ఎన్ని హాట్లు వడ్డించారు. వంటకాలెలా ఉన్నాయి ? వడ్డనా ? లేక 'బఫె(లో') అదే 'బఫే' సిస్టమా? ఇవన్నీ ఆలోచిస్తారని మన పెద్దలు చెబుతారు.
కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతం
బాంధవా: కులమిచ్ఛంతి మృష్టాన్నమితరే జనా:
ప్రస్తుతకాలంలో పై అంశాలనన్ని వదిలి పెట్టి పెళ్లిలో వధూవరుల ఎంపికలో వారి గుణగణాలకే ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఎంతో ఉంది. పూర్వం ఎటువంటి అల్లుడొస్తాడో అని భయపడేవారు. ఇప్పుడు ఎటువంటి కోడలొస్తుందో అని కూడ భయపడి చస్తున్నారు. అల్లుడు మంచివాడైతే అటు ఇటు అల్లుకు పోతాడు
కాకుంటే నొల్లుకు పోతాడు కోడలు మంచిదైతే అందరికి నీడగా నిలుస్తుంది కాకుంటే అటు ఇటు
అందరికి గోడగా
మారుతుంది . అపుడ ఇంటిలో సిరిసంపదలున్నా సుఖశాంతులు
సున్న. కాబట్టి గుణప్రాధాన్యం
లేకపోవడమే అన్ని అనర్థాలకు మూలకారణం. ఆ విషయం అలా ఉంచుదాం .
పూర్వకాలంలో గుణానికే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు మనం గమనించొచ్చు.
పార్వతి శివుణ్ణి వరించింది. ఆయన ఆమె
సౌందర్యానికి ఆకర్షితుడు కాలేదు. అందువల్ల ఆతన్ని
పొందాలంటే తపస్సొక్కటే సాధనమని నిర్ణయించుకుంది. అమ్మ వద్దన్నావినలేదు. నాన్నకి కేవలం కబురు పంపించి తపోవనానికి
వెళ్లిపోయింది. తీవ్రమైన, కఠోరమైన
తపస్సు చేసింది. శివుడే ఆమె కాళ్ల
దగ్గరకు వెళ్లవలసిన అగత్యం ఏర్పడింది. ఆయన పెట్టవలసిన పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. మాయావటువు రూపంలో అతిథిగా వచ్చాడు. సకలమర్యాదలు చేసింది. మెల్లగా ఆమెను కబుర్లలోకి దింపి ఆమె శివుని కోసం తపస్సు చేస్తోందని తెలుసుకున్నాడు. ఓ పార్వతి! నువ్వు ఎంతో తెలివైన దానివనుకున్నాను. ఇంత తెలివితక్కువదానివా! నువ్వు శివుణ్ణి చేసుకుంటే నీకెదురయ్యే
సమస్యలెప్పుడైనా ఆలోచించావా అని ఎన్నో విధాలుగా శివుణ్ణి ఆక్షేపించాడు . ఆమె
అన్నిటికి తగిన సమాధానం చెప్పింది . చివరకు ఆమెదే విజయం. శివుడు కాళ్ళ బేరానికి
వచ్చాడు . నేను నీకు దాసుణ్ణి, నన్ను నీవు తపస్సుతో
కొనేశావు అన్నాడు . ఆమెను వివాహం చేసుకోడానికి సమ్మతించాడు. శివుడు ఆ విధంగా
అనేటప్పడికి పార్వతి అంతవరకూ తాను పడ్డ
శ్రమంతా మఱచిపోయింది . ఆ తరువాత శివుడు సప్తర్షులను పెళ్లి పెద్దలుగా వ్యవహారం
చక్కబెట్టమని కోరాడు. పార్వతిని తనకిమ్మని అడగటానికి వారిని హిమవంతుని వద్దకు
పంపాడు . వారు అరుంధతిని వెంటనిడుకొని హిమవంతుని సందర్శించి తాము వచ్చిన
పని వివరించారు. పెళ్లి అనే పదంలో అక్షరాలు రెండే గాని ఆలోచించవలసిన అంశాలు చాల
మెండు . అపుడు హిమవంతుడు శివుని గురించి అన్ని తెలిసినవాడే ఐనప్పటికీ
లోకమర్యాదకోసం సప్త ఋషులకు వినయంగా
నమస్కరిస్తూ కొన్ని ప్రశ్నలడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడో చూడండి .
కిం గోత్రం ? కిము
జీవనం ? కిము ధనం? కా జన్మభూ: ? కిం వయ:?
కిం చారిత్ర్యమముష్య?
కే సహచరా : ? కే వంశజా: ప్రాక్తనా: ?
కా మాతా? జనక: శివస్య క
? ఇతి ప్రహ్వేణ పృథ్వీధృతా
పృష్టా : సస్మిత
నమ్రమూకవదనా: సప్తర్షయ: పాంతు వ:
किं गोत्रं ? किमु
जीवनं? किमु धनं? का जन्मभू:? किं वय:?
किं चारित्र्यममुष्य
? के सहचरा:? के वंशजा: प्राक्तना:?|
का माता ? जनक:
शिवस्य क ? इति प्रहवेण पृथ्वीभृता
पृष्टा: सस्मितनम्रमूकवदना:
सप्तर्षय: पान्तु व: ||
ఓమహర్షులారా! ఆయనదేగోత్రం ? ఏ ఉద్యోగం
చేస్తున్నాడు ? ఏ మాత్రం డబ్బు సంపాదించాడు ? ఎక్కడ పుట్టాడు ? వయస్సెంత ?
అతనిదే వంశం? అతని సహచరులెవరు?
పూర్వీకులెవరు? ఆయన తల్లి ఎవరు ? తండ్రి ఎవరు ? అని అందరి తరఫునా వకాల్తా
పుచ్చుకుని అన్ని తానే అడిగేశాడు .
ప్రశ్నలైతే అడిగాడుగాని ఆ ప్రశ్నలకు సమాధానాలే లేవు. ఆయన పుట్టుక లేనివాడు .
అందువల్ల గోత్రం లేదు . ఆది భిక్షువు . ఉద్యోగం గురించి చెప్పనక్కరలేదు . డబ్బు
గురించి అడగక్కరలేదు ఇల్లు కూడా లేని
స్మశానవాసి . అసలు పుడితే కదా ఎక్కడపుట్టాడో , వయస్సెంతో చెప్పడానికి . అతని
సహచరులందరు అతి సామాన్యులే . అసలు వంశం ఉంటే కదా పూర్వీకుల గురించి ఆలోచించడానికి
. స్వయంభువైన ఆయనకు అమ్మ లేదు నాన్న లేడు.
అందువల్ల హిమవంతుని ప్రశ్నలలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక తలొంచుకుని
ముసిముసి నవ్వులు నవ్వుకుంటు మౌనంగా ఉండిపోయారట . అటువంటి
సప్త ఋషులు మిమ్మల్ని రక్షించు గాక అని ఒక కవి చమత్కారంగా ఈ శ్లోకాన్ని
రచించాడు . ఇది చాల బాగుంది కదూ !
ఇక హిమవంతుడు అంత
అమాయకుడేమీ కాదు . అమ్మాయి నివ్వడానికి వెంటనే ఒప్పు కున్నాడు. మీన మేషాలు
చూడకుండా ‘ఇయం నమతి వ: సర్వాన్ త్రిలోచనవధూ: (ఇదిగో శివుని
భార్యయైన ఈమె మీకు నమస్కరిస్తో౦ది) అని
నిర్ణయించేశాడు కూడ.
K K K K K K K K
No comments:
Post a Comment