కళ్యాణ మిత్రుడు
(మహారాష్ట్రీ జైన ప్రాకృత కథ)
డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద రావు
పూర్వం జంబూద్వీపంలో అపరవిదేహ అనే దేశం ఉంది . ఆ దేశంలో క్షితిప్రతిష్ఠితం అనే
నగరం ఉంది . ఆ నగరాన్ని పూర్ణచంద్రుడనే రాజు పరిపాలిస్తున్నాడు . ఆయన భార్య కుముదిని . ఆ రాజుకు ఆమె అంటే చాల ఇష్ట౦ . వారికి గుణసేనుడనే
కుమారుడు కలిగాడు. ఆ రాజు ఆస్థానంలో యజ్ఞదత్తుడనే పురోహితుడున్నాడు . అతని
భార్య సోమదేవమ్మ . వారికి అగ్నిశర్మ అనే పుత్రుడు కలిగాడు. ఆతని కళ్ళు పి౦గళవర్ణంతో గోళీకాయల్లా ఉంటాయి , తప్పడ ముక్కు
, చిన్న చిన్న చెవులు , ఎత్తుపళ్ళు , వంకరగా
బండగా ఉండే మెడ , కురుచ చేతులు , చాల సన్నని వక్షం , బానవంటి
పొట్ట , ఎగుడు దిగుడు పిక్కలు, ఒకకాలు
పొడుగు మరోకాలు పొట్టి, చింతనిప్పుల్లాంటి ఎర్రని జుట్టు . అదీ వాడి స్వరూపం .
ఆ నగర రాజకుమారుడు వాణ్ణి జనం మధ్యలోకి రప్పించి , వాద్యాలు వాయిస్తూ ,
తప్పట్లు చరుస్తూ నాట్యం చేయించేవాడు . గాడిదపై కూర్చోబెట్టి మిగిలిన కుర్రకారుచే
మహారాజు , మహారాజు అని జేజేలు కొట్టించి ఊరేగి౦చేవాడు. ఈ విధంగా రాజకుమారుడు రోజు
అవమానించడం చేత ఆ బాలునిలో వైరాగ్య భావం
కలిగింది .
వెంటనే అతడు నగరం విడిచిపెట్టి వనాలకు బయలు దేరాడు .
సుపరితోషం అనే ఆశ్రమానికి చేరుకున్నాడు .
అక్కడ ఉన్న మునులంతా అతన్ని చాల ఆదరించారు . ఒక మంచిరోజు చూసి దీక్ష కూడ
తీసుకున్నాడు. ఎన్నో అవమానాలను భరించి వైరాగ్యం పొందిన అతడు ఆ రోజునే “ నేను నేటినుంచి నెలకు ఒక పర్యాయమే భోజనం చేస్తాను . ఒక వేళ
నేను భిక్షకి వెళ్ళిన ఇంటిలో భిక్ష లభించక పొతే మరో ఇంటికి వెళ్ళను , ఆహారం లేకుండానే
గడిపేస్తాను “ అని ప్రతిజ్ఞ చేశాడు . కాలం గడుస్తోంది .
అక్కడ రాజు పూర్ణచంద్రుడు తన కొడుకు కుమారగుణసేనుడికి పెళ్లి చేసి , సింహాసనంలో
కూర్చోబెట్టి తాను భార్యతో వనాలకు వెళ్లి పోయాడు . కుమారగుణసేనుడు తన భార్యయైన
వసంతసేనతో ఎన్నో రాజ్యసుఖాలనుభావిస్తూ ఒకనాడు వసంతపురం అనే నగరం చేరుకున్నాడు. ఆ
సమయంలో నారింజ పళ్ళ బుట్టలు మోసుకేడుతున్న ఇద్దరు ఋషి కుమారులు అక్కడకు వచ్చారు . వారు శాస్త్రోక్తంగా రాజుని ఆశీర్వదించారు. రాజు
ఆసనం నుండి లేచి వారిని కూర్చోబెట్టి గౌరవించాడు. వారిద్దరూ ఓమహారాజా ! మా
ఆశ్రమకులపతి మీయొక్క కుశల సమాచారాన్ని కనుక్కోమని మమ్మల్ని పంపిస్తే మేము మీ వద్దకు
వచ్చామని వివరించారు . అప్పుడు రాజు వారితో “ మహాత్ముడైన మీ కులపతి ఎక్కడ ఉన్నారు “
అని అడగ్గా “ వారు చాల దగ్గరలో సుపరితోషమనే తపోవనంలో ఉన్నారని వివరించారు .
రాజు భక్తీ భావంతో ఆశ్రమాన్ని చేరుకొని ఎంతోమంది మునులను వారి సమక్షంలో ఉన్న
కులపతిని చూశాడు . కులపతికి సవినయంగా
నమస్కరించి వారినందరిని తన ఇంటికీ వచ్చి ఆతిథ్యం
స్వీకరి౦చమని కోరాడు . దానికి కులపతి అతనితో సరే నాయనా! మేము వస్తాము
. కానీ అగ్నిశర్మ అనే ఒక తాపసుడున్నాడు. ఆయన ప్రతిరోజూ ఆహారం తీసుకోడు . ఆయనకో
నియమం ఉంది . నెలకొకసారి మాత్రమె ఆయన ఆహారం తీసుకుంటాడు . ఆయన మొదట ఏ ఇ౦టికైతే
వెళ్తాడో ఆ ఇంటిలో భిక్ష వేస్తేనే స్వీకరిస్తాడు . ఒకవేళ అక్కడ భిక్ష లభించకపోతే
మరో ఇంటికి వెళ్ళడు , ఆ నెలంతా ఉపవాసమే చేస్తాడని వివరించాడు . అది విన్న రాజు
ఆయన్ని చూడదలచి ఆ ముని ఎక్కడ ఉన్నారని అడగ్గా ఈ ఆశ్రమంలోనే ఉన్న ఆమ్రవనంలో తపస్సు చేసుకుంటున్నారని చెప్పాడు . అప్పుడు రాజు అక్కడికి వెళ్లి అక్కడొక
మునిని చూశాడు . ఆయన పద్మాసనంలో కూర్చున్నాడు . నిశ్చలమైన నేత్రాలతో , ప్రశాంతమైన
ముఖంతో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు . రాజు అతన్ని అగ్నిశర్మగా గుర్తించి సంతోషంతో
నమస్కరించాడు . ఆ మహర్షి రాజుకి స్వాగతం పలికి అతన్ని ఆశీర్వదించాడు . రాజు మునితో
ఓ మహాత్మా! మీరు ఇంత కఠోరమైన వ్రాతదీక్సను
స్వీకరిచడానికి కారణమే౦టి ? అని ప్రశ్నించాడు . దానికి సమాధానంగా ఆ ముని రాజా! దారిద్ర్యదు:ఖం, ఇతరుల
వలన కలిగిన అవమానం , అందంగా లేకపోవడం , అదే విధంగా మహారాజ కుమారుడైన గుణసేనుడనే
కళ్యాణమిత్రుడు అని సమాధానం చెప్పాడు . రాజుకు సందేహం కలిగింది . ఓ మహామునీ ! సరే దారిద్ర్యం , అవమానం , మొదలైన కారణాలు సరైనవే కాని
మహారాజపుత్రుడు గుణసేనుడు కళ్యాణ మిత్రుడు ఎలా అయ్యాడో వివరించమని అడిగాడు . మహారాజా!
వినండి
जे होन्ति उत्तमनरा धम्मं सयमेव ते
पवज्जन्ति |
मज्झिम पयई संचोइया उ न कया इ वि जहन्ना ||
चोएइ य जो धम्मे जीवं विजिहेण केणइ
नएण |
संसार चार्य गयं जो नणु कल्लाणमित्तोत्ति ||
( जैन महाराष्ट्री प्राकृतम् )
ఎవరు స్వయంగా ధర్మం పట్ల ఆకర్షితులౌతారో వారు ఉత్తమమైన కోవకు చెందిన వారు
. మధ్యములు ఇతరులచే ప్రేరేపి0పబడి ధర్మం
పట్ల ఆకర్షితులౌతారు . అధములు ఏవిధంగాను ధర్మం పట్ల ఆకర్షితులు కాజాలరు . ఎవడు
సంసారంలో చిక్కుకున్న జీవుని ఏదోవిధంగా ధర్మంవైపు ఆకర్షితుడయ్యేలా చేస్తాడో వాడే
కళ్యాణమిత్రుడని చెప్పబడతాడు అన్నాడు మహర్షి .
( ఇది ‘కళ్యాణమిత్తో’ అనే జైనమహారాష్ట్రీప్రాకృతకథకు స్వేచ్ఛా నువాదం )
No comments:
Post a Comment