Thursday, November 21, 2019

వ్యక్తిత్వం –వకారపంచకం


            వ్యక్తిత్వం వకారపంచకం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన
వకార పంచకేనైవ నరో భవతి పూజిత:

అన్నారు మన పెద్దలు . అంటే మనిషి వ్యక్తిత్వాన్నిసూచించే  అంశాలు ఐదు ఉన్నాయి.  అవే౦టంటే వస్త్రం , రూపం , మాటతీరు , విద్య , వినయం  అనేవి . వాటిగురించి క్రమంగా తెలుసుకుందాం .   

  1. వస్త్రం : 
మొదటిది వస్త్రం . ఒక మనిషి ధరించే బట్టల వల్ల అతడు ఎటువంటి వాడో చాలవరకు అందరికి తెలుస్తుంది . అందువల్ల ప్రతివ్యక్తి తనకున్నంతలో  ఎప్పుడు పరిశుభ్రమైన బట్టలనే  ధరించాలి. మురికి బట్టలు వేసుకో కూడదు .  మంచి బట్టలే వేసుకోవాలి  . బట్టలు వ్యక్తి  యొక్క హుందాతనాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి . ఇక్కడ మంచిబట్టలంటే ఖరీదైన బట్టలని కాదు పరిశుభ్రమైన బట్టలని మాత్రమే  . సమాజంలో   కొంతమంది బట్టలను బట్టి గౌరవించేవారు కూడ ఉంటారు. బట్టలను బట్టి వ్యక్తిని అంచనా వేయడం కేవలం మనుషుల్లోనే కాదు దేవతల్లో కూడ ఉంది .    ఇక మనుషుల సంగతి  వేరే చెప్పాలా!
విష్ణుమూర్తి పీతాంబరుడు కాబట్టి సముద్రుడు పిలిచి పిల్లనిచ్చాడని శివుడు గజచర్మధారి కాబట్టి విషం ఇచ్చాడని మన పెద్దలు చమత్కరించారు . ఈ విషయాన్ని వివరిస్తూ ఎప్పుడో నేనొక పద్యం కూడ వ్రాశాను .

భువిలో యోగ్యతకన్న వస్త్రమునకొప్పున్ భూషణాధిక్య గౌ
రవముల్ పచ్చని బట్టవానికి మహద్ రాగంబుతోడందనూ
భవనిచ్చెన్ గజచార్మధారియగు నా ఫాలాక్షుకాత్మోత్థీతో
గ్రవిషంబిచ్చె నదీకళత్రుడట వస్త్రంబే ప్రధానంబుగన్

అందువల్ల పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఎవరు ఆక్షేపించే   విధంగా ఉ౦డకూడదు .

కుచేలినం దంతమలాపహాసినం
బహ్వాశన౦ నిష్ఠురవాక్యభాషిణ౦
సూర్యోదయే చాస్తమాయే చ శాయినం
విముంచతి శ్రీ రపి చక్రపాణిన౦

అనే సూక్తి ఒకటుంది . మాసిపోయిన బట్టలు వేసుకున్న వాణ్ణి, ముఖం కడుక్కోని వాణ్ణి,  అతిగా తినే వాణ్ణి,  కఠినంగా మాట్లాడేవాణ్ణి, సూర్యోదయ - సూర్యాస్తమయ వేళల్లో పడుకునే వాణ్ణి లక్ష్మి దరిజేరదట. ఒక వేళ ఆ పనులు విష్ణువు చేస్తున్నా అతన్ని విడిచి పెట్టేస్తు౦దట.     
ఇక ఈ కాలంలో  కొంతమంది ఫ్యాషన్ పేరుతో అసభ్యకరమైన , అర్ధనగ్నంగా ఉండే బట్టలు ధరిస్తున్నారు .!  ఒకడు ముందు in-shirt చేసు కున్నాడు . వెనకాల in-shirt చేసుకోలేదు. వాడి స్నేహితుడు అడిగాడు ఏరా! ముందు in-shirt ఎందుకు చేసుకున్నావు ? సమాధానం: - చొక్కాచిరిగి పోయింది  . మరి వెనుక in-shirt ఎందుకు  చేసుకోలేదు ? పేంటు చిరిగిపోయింది . ఇదీ సమాధానం .  ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలంటే నామోషి . కాని ఇప్పుడు బట్టలు చింపుకుని మరీ వేసుకుంటున్నారు . ఇది మరీ విడ్డూరం . కాబట్టి మనిషి ఇతరులు ఆక్షేపించే విధంగా కాకుండా పరిశుభ్రమైనవి , సంస్కారం ఉట్టి పడేటటువంటి   బట్టలు ధరించాలి.

2. రూపం :-  ఇది రెండో అంశం .  మనిషి రూపాన్ని బట్టి కూడ ఒక్కొక్కప్పుడు వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. యత్రాకృతి: తత్ర గుణా: భవంతి అన్నారు మన పెద్దలు . ఎక్కడ రూపం ఉంటుందో అక్కడ గుణాలు కూడ ఉంటాయని ప్రతీతి .  అంటే అందంగా ఉన్న ప్రతివాడు మంచివాడని  అందవికారంగా ఉన్నవాడు చెడ్డవాడని అర్థంకాదు . రూపం గుణాన్ని చాటే అంశాల్లో ఒకటని  మాత్రమే. అందువల్ల ప్రతిమనిషి తనకున్నంతలో అందంగా , హుందాగా  గంబీరంగా కనిపించాలి .

౩. వాక్కు :- ఇది మూడోది . మనిషి వ్యక్తిత్వం మాటతీరును బట్టి చెప్పొచ్చు . కొంతమంది మృదువుగా మాట్లాడతారు , కొంతమంది కఠినంగా మాట్లాడతారు . ఎంతో కఠినమైన విషయాన్ని కూడ మృదువుగా చెప్పొచ్చు . కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని చాల కఠోరంగా మాట్లాడతారు . అందువల్ల ఇతరులకు బాధకలగకుండా మాట్లాడ గలగాలి .

4. విద్య :-  ఇది నాల్గో అంశం .
         మనిషికి విద్య నిజమైన అలంకారం . విద్యలేని వాడు వింతపశువు అన్నారు మన పెద్దలు . ఇప్పుడు చదువుకొన్నవాడు సంతపశువుగా ప్రవర్తిస్తున్నాడు . సరే ! ఆ విషయం అలా ఉంచుదాం .  ప్రతి తల్లి , తండ్రి తమపిల్లల్ని విధిగా చదివి౦చాలి.
"మాతా శతుర్ : పితా వైరీ యేన బాలో న పాఠిత:
న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా" అంటుంది పంచతంత్రం .
 
పిల్లల్ని చదివి౦చని తల్లి , తండ్రి వారి పాలిట శత్రువులట. ఎందుకంటే  చదువులేని వాడు సమాజంలో హంసలమధ్య కొంగలా తేలిపోతాడట. అంతేకాకుండా పుత్ర: శత్రు: అపండిత: అని కూడ చెబుతుంది పంచతంత్రం   . అంటే చదువుకోని కుమారుడు, కుమార్తె  తల్లితండ్రుల  పాలిట శత్రువులట . అందువల్ల తల్లి దండ్రులు విధిగా తమపిల్లల్ని చదివించాలి . పిల్లలు విధిగా చదువుకోవాలి .

5. వినయం :- ఇది ఐదవ అంశం . చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు వినయం కూడ అంతే ముఖ్యం. అందువల్ల మనిషి ఎంత విద్యావంతుడౌతాడో   అంత వినయవంతుడు కూడ కావాలి . వినయంలేని విద్య వాసన లేని పువ్వు వంటిది . అది ఎవరికీ ఉపయోగ పడదు . తనకు కూడ ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది .  మనిషి ఈ ఐదు అంశాలను పరిశీలించి తగిన విధంగా జాగ్రత్తగా మసలుకుంటే అది వ్యక్తిత్వవికాసానికి దోహదం చేస్తుంది .         
                                                >>>>><<<<<

No comments: