Monday, April 27, 2020

'కనువిప్పు' శ్రీమతి . చిలకమర్తి లక్ష్మీ కుమారి


కనువిప్పు
శ్రీమతి . చిలకమర్తి  లక్ష్మీ కుమారి

వనజ మధ్యతరగతి కుటు౦బానికి చెందిన వనిత. భర్త మోహన్  ఒక ప్రైవేట్ క౦పెనీలో పనిచేసున్నాడు . ఇద్దరు పిల్లలు మూడు, ఐదు తరగతులు చదువుతున్నారు.  చాలీ చాలని జీతం. పొదుపుగా సంసారం నెట్టుకొస్తో౦ది వనజ.  భర్త సంపాదనలో  కొంత మొత్తం తీసి పోస్టాఫీసులో దాస్తో ఉంటుంది. ఉన్నదాంతో సంతృప్తిగా గడపడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.  వనజ వాళ్ళుండే ప్రక్క వాటాలోకి ఒక కుటుంబo అద్దెకు వచ్చారు.  ఆతను ప్రభుత్వ ఉద్యోగి. పేరు శేఖర్ భార్య పేరు నీరజ. వనజ నీరజల మధ్య సంబంధం పరిచయంగా మొదలై స్నేహంగా మారింది . నీరజ బజారుకు వెలుతూ వనజను సాయం రమ్మనేది.  బజారులో తాను కొనే ప్రతి వస్తువూ వనజను తీసుకోమనేది.  ఒకసారి నీరజ తాను ఒక డిన్నర్ సెట్ కొనుక్కుని వనజను కూడ తీసుకొమ్మని బలవంతం చేసింది . వనజ తనకు వద్దని ఎంత బ్రతిమాలినా వినకుండా తనే డబ్బు చెల్లించి తీసుకుంది . మరునాడు వనజ తాను జాగ్రత్త చేసుకున్న డబ్బులు తీసి అప్పు తీర్చింది. ఒకరోజు మోహన్ ఆపీసుకు వెళుతూ వనజతో - బ్యాగ్  లో డబ్బు ఉంది తీసి బీరువాలో పెట్టమని చెప్పేడు .  వనజ బ్యాగ్ తీసి చూస్తే అందులో ఇరవై వేలున్నాయి.  బీరువాలో పెడుతూ ఇంత డబ్బు ఎక్కడిదా అనుకుంది.  ఒకరోజు వనజ ఇంట్లో పనిచేసుకు౦టు౦డగా ఫోన్ వచ్చింది.  హలో! అనగానే అవతల నీరజ గొంతు. వనజా! నాకు నువ్వో సాయ౦ చెయ్యాలి. నాకు అర్జంటుగా పది వేలు కావాలి బ్యాంకుకెళ్లి తెచ్చే సమయం లేదు. రేపే నీకు ఇచ్చేస్తాను అంది. వనజ తనలో  నీరజ బ్యాంకు నుండి తీసి ఇస్తానని అంది కదా, ఎంత అర్జంటో అని అనుకుని  సరే పదినిమిషాల్లో రమ్మ౦ది. భర్త  దాచమన్న డబ్బుల్లోంచి తీసి ఇచ్చింది .  తరువాత రెండు, మూడు రోజులు గడిచాయి .  నీరజ నుండి ఏ సమాధానం లేదు.  వనజ ఆమె ఇంటికెళ్ళి చూస్తే  తలుపులు కూడ వేసే ఉన్నాయి.  వనజకి భయం పుట్టుకొచ్చింది.  భర్త డబ్బులు ఎప్పుడు అడుగుతాడో ఏమి సమాధాన౦ చెప్పాలో అని ఆలోచిస్తుంది.  ఇంతలో స్కూల్ నుండి పిల్లలొచ్చారు . వాళ్ళకి పాలు ఇచ్చి, హోం వర్క్ చేసుకోమని చెప్పింది. బాబు అమ్మతో అమ్మా! రేపు  స్కూల్ ఫీజు కట్టాలన్నాడు. ఈమధ్య మోహన్ రాత్రి పూట కూడ వర్క్ చేస్తున్నాడు.  కనుక ఏ విషయ౦ అడగటానికి సమయ౦  కుదరడం లేదు.  అతను వచ్చేలోపు నీరజ వాళ్ళ ఇంటికి వెళ్లింది. నీరజ వనజను చూడగానే అదోలా మొహం పెట్టి సారీ! వనజా! డబ్బు ఇచ్చేద్దామనే అనుకున్నాను  కానీ బ్యాంకు లో బ్యాలన్సు  లేదు. కొన్ని రోజుల్లో  ఇస్తా అంటుంది . వనజ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఎలాగో ఇంటికి వచ్చింది . అప్పుడే వచ్చిన మోహన్ వనజతో నేను దాచమన్న డబ్బు ఈలా యివ్వు, వాళ్లకి  ఇచ్చెయాలి అని అంటాడు.  వనజ కొంచెం తత్తరపడి ఆలోచిస్తుంది. మోహన్ అలా మొహం పెడతావే౦టి  నేను ఆఫీసుకు వెళుతూ  ఇచ్చాను కదా, అవి మా మిత్రుడు ఊరు వెలుతు ఉంచమని ఇచ్చాడు, అవి వాడికి ఇచ్చేయాలి. వనజ కళ్ళనుండి నీళ్ళు దారాపాతంగ వర్షిస్తున్నాయి . బొ౦గురు పోయిన గొంతుతో జరిగిన విషయం చెప్పి౦ది.   మోహన్ అంతా విని, సరే! ప్రస్తుత౦ ఇంట్లో  ఉన్న డబ్బులు ఇయ్యి మిగిలిన డబ్బులు తరువాత సర్దుబాటు చేద్దా౦ అంటాడు. వనజ కూర్చుని తన ఈ స్థితికి కారణ౦ ఆలోచిస్తుంది.

జీవితంలో ఇంతకు ముందున్న  ప్రశాంతత ఇప్పుడు కనిపించడం లేదు .  తెల్లవారిన దగ్గర నుండి గబ గబ ఇంట్లో పనులు చేసుకోడం, నీరజ ధర్మమా అని బజారుకు పరుగులు పెట్టడం, అక్కడ వస్తువులను అవసరానికి మించినవి కొనడం  ఇవన్నీ గుర్తుకు రాగానే తను ఎ౦త తప్పు  చేసి౦దో తెలిసి౦ది. పరుగుపెట్టి పాలు తాగడ౦ కన్నా నిలబడి నీళ్ళు తాగమని చెప్పే  పెద్దవాళ్ల మాటల్లోని ఆ౦తర్యం ఇప్పుడు అర్థమై౦ది. స్నేహం చెయ్యొచ్చు కానీ అవతల వాళ్ళు చెప్పేది విని, మన౦తట మన౦ ఆలోచించుకోవాలి.  అవసరమైనవే  కొనుక్కోవాలి . వస్తువులు అల౦కార౦గా షోకేసుల్లోను, టేబులు మీద కొని పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఏవి కొన్నా  పరిమితంగా కొనుక్కోవాలి.  మనకు డబ్బులు అవసరం వస్తే బ్యాంకులో దాచిన మొత్తం తీసుకోవటానికి  వీలు ఉంటుంది.  కొన్న వస్తువులు  తిరిగి అమ్మ లేము, ఒకవేళ అమ్మినా అమ్మబోతే అడివి కొనబోతే కొరివి సామెతలా వాటి ఖరీదులో నాలుగో వంతు డబ్బులు కూడ రావు.  కనుక  వనజ ఈ విషయములు ఆలోచి౦చి అనవసరమైన పరుగులు తీయకుడదని నిర్ణయించుకుంది. తనకు ఇప్పటికైన కనువిప్పు కలిగించిన  భగవంతునికి నమస్కారాలు తెలిపింది.  
                                   *********
                           
 




No comments: