Friday, April 4, 2025

శ్రీమద్రామాయణ కథా స్తోత్రం

 

శ్రీమద్రామాయణ కథా స్తోత్రం

రచయిత:- శ్రీ గంటి లక్ష్మీనారాయణ గారు

సమీక్ష :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

   శ్రీమద్రామాయణ కథా స్తోత్రం అనే కావ్యాన్ని  కీ||శే శ్రీ గంటి లక్ష్మీ నారాయణ గారు  రచించారు. వీరు వృత్తిరీత్యా అగ్రికల్చరల్ సూపరెంటెండెంట్ గా పని చేసి హైదరాబాద్ లో పదవీవిరమణ చేశారు . వీరు మా గురు వర్యులైన డాక్టర్ . ఓరుగంటి రామలాల్ శర్మగారికి చాల దగ్గర బంధువులు కావడం వల్ల వీరి పరిచయ భాగ్యం నాకు లభించింది. వీరు పదవీవిరమణ చేసి విశాఖపట్టణంలో నివసిస్తున్న సందర్భంలో వీరి వద్ద నేను ‘బ్రహ్మసూత్రభాష్యం’ కొంత కాలం అధ్యయనం చేశాను. వారు వేదాంత గ్రంథాలన్నీ క్షుణ్ణoగా అధ్యయనం చేసిన వారు మాత్రమే కాకుండా ఆంగ్లభాషలో నిష్ణాతులు కూడ కావడం వల్ల వారి బోధనలో ఒక వైశిష్ట్యం ఉండేది. చాల analytical గా బోధించేవారు.  నాకు ఎక్కడైనా సందేహం వస్తే ఆ సందేహానికి కారణం తెలుసుకుని దాన్ని తొలగించేవారు. శ్రీ రామలాల్ శర్మగారు కూడ తామప్పటికే తమ గురుదేవులు, పండిత ప్రకాండులు నైన  శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి వద్ద తర్క, వేదాంత శాస్త్రాల్లో పలు గ్రంథాలు అధ్యయనం  చేసిన వారే ఐనప్పటికీ నా కోసమా అన్నట్లుగా ప్రతి రోజు వచ్చి పాఠం వినేవారు. ఆ విధంగా వారికి శిష్యుడనైన నాకు సహాధ్యాయార్హత కూడ కలుగజేశారు . అది నా భాగ్యం. ఇక వీరు తమ అధ్యాపనలో   రత్నప్రభా వ్యాఖ్యాన విశేషాలతో బాటుగా భామతి లోని అభిప్రాయాలను కూడ సమయోచితంగా వివరించేవారు.                   

             ఇక ఇది రామకథను సంపూర్ణంగా అందించే చాల చిన్నదైన నిర్వచన కావ్యం . అన్నీ శ్లోకాలే . ఈ కావ్యం ప్రత్యేకతేమిటంటే  కవి ’ శ్రీ రామం నౌమి సర్వదా ’  అనే మాట ప్రతి శ్లోకం లోను మకుట రూపంగా పొందుపరిచారు. ఈ విధంగా ప్రతి శ్లోకంలోనూ నాల్గవ పాదం మకుట మైతే మిగిలిన మూడు పాదాల్లోనే కథ నడిచింది. రామాయణ కథా స్తోత్రం అనే పేరు కూడ సార్థకమైంది.

 ఉపోద్ఘాతంలో 14 శ్లోకాలు , బాలకాండలో 57,

అయోధ్యా కాండలో 33, అరణ్య కాండలో 44, కిష్కింధకాండలో 45, సుందరకాండలో 38, యుద్ధకాండలో 87, ఉత్తర కాండలో 8 శ్లోకాలున్నాయి.

ఇంత చిన్న కావ్యంలోనే కవి దేవీ, దేవతలను , కామకోటి పీఠాధీశులైన చంద్రశేఖరసరస్వతీ స్వామి వారిని , తమ సాహిత్య గురువులైన శ్రీ సుసర్ల సూర్యనారాయణ గారెని , తర్కశాస్త్ర గురువులైన శ్రీ వడ్లమాని వారిని , వేదాంత శాస్త్ర గురువులైన శ్రీ మండలీక వేంకట శాస్రి గారెని , తమకు చాల సులభంగా వేదాంత శాస్త్రాన్ని ఉపదేశించిన తమ పితృపాదులు శ్రీ రామముర్తి గారిని , తమ సహధర్మచారిణి శ్రీమతి మాణిక్యాంబ గారెని కృతజ్ఞతా పూర్వకంగా స్మరించారు . రామాయణ కథను యథాతథంగా స్తోత్ర రూపంగా వ్రాస్తున్నానని, సంసార సాగర తరణమే కావ్య రచనోద్దేశమని స్పష్టం చేశారు.

“రామాయణం యథా రూపం స్తోత్రరూపేణ  సర్వశ:      

వర్ణయిష్యామి నిస్తంద్ర: తరితుం భవసాగరం”

చిన్నప్పుడు వారి తండ్రి గారు మధ్యాహ్న వేళల్లో తమ ఒడిలో కూర్చో బెట్టుకుని రామాయణ కథను వినిపించే వారని, దాని వలన తమకు రామభక్తి దినదిన ప్రవర్థమానమైనదని, తత్ఫలితమే ఈ గ్రంథమని, పండితుల ఆమోదం పొందితే తాను కృతకృత్యుడనౌతాననీ సవినయంగా తెలియజేశారు.

“వాల్మీకి ప్రశ్నముద్దిశ్య నారదేన ప్రవర్ణితం

సర్వ సద్గుణ సంపన్నం శ్రీరామం నౌమి సర్వదా”

అనే శ్లోకంతో మొదలైన ఈ కావ్యం

ఉత్తరకాండలోని

“వేదార్థ ప్రతిపాద్యాయ వాల్మీకి శ్లోక మాలినే

రామాయణ స్వరూపాయ శ్రీమద్రామాయ మంగళం”  

అనే శ్లోకంతో ముగుస్తుంది .   సంస్కృతంలో  ఇంత సరళంగా , సంక్షిప్తంగా , సమగ్రంగా, రసవత్తరంగా  రామకథను పొందుపరచడం చాల కష్టమైన పని. సంస్కృత భాషపైన , రామాయణ కథ పట్ల ఆసక్తి గల వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.     

 ఈ కావ్యాన్ని  ఆచార్య . దివాకర్ల వేంకటావధాని, శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి వంటి పండితప్రకాండులు సమీక్షించడం ఒక విశేషం . రచయిత తమ గ్రంథం ఆ విధంగా రూపొందడానికి తమవంతు సహకారాన్ని అం దించిన ఆచార్య . దివాకర్ల వేంకటావధాని, శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి గార్లకు వినయపుర్వక అభివందనాలు తెలుపుతూ ముద్రణకు సహాయ, సహకారాలందించిన శ్రీ రాణి. శ్రీనివాసశాస్త్రిగారి సతీమణి శ్రీమతి. రాణి శ్రీదేవి గారికి ఆశీస్సులు అందజేశారు.

రచయిత ఈ కావ్యం మోతుగూడెం గ్రామంలో విరాజిల్లుచున్న శ్రీ కోదండ రామ స్వామి వారి చరణ కమలములకు అంకితం చేశారు. ఈ కావ్యాన్ని  ఠించడం వలన రామాయణ మహాకావ్యాన్ని పఠించిన ఫలితం కలుగు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.       

ఇటువంటి ఉత్తమ కావ్యాన్ని రచించి అందరి మన్ననలను పొందిన మా గురువర్యులు   శ్రీ గంటి లక్ష్మీ నారాయణ గారు చరితార్థులు , చిరస్మరణీయులు.

జయంతి తే సుకృతిన: రస సిద్ధా: కవీశ్వరా:

నాస్తి తేషాం యశ: కాయే జరామరణజం భయం.

                <><><>

No comments: