Monday, November 11, 2013

ఆ దు:స్థితి పగవారికి కూడ వద్దు

-->
ఆ దు:స్థితి పగవారికి కూడ వద్దు

డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

అవి భోజమహారాజు రాజ్యం చేస్తున్న రోజులు. ఒక అభాగ్యుడు రాజదర్శనానికి వచ్చాడు. తన దు:స్థితి ఇలా విన్నవించుకున్నాడు. ఓ మహారాజా! మాది ఒక నిరుపేదకుటుంబం. ఎంతనిరుపేద కుటుంబమంటే మాటల్లో వర్ణింపలేనంత. కుటుంబంలో నేను నా భార్య ఒక పసిబిడ్డ మాత్రమే ఉన్నాం. ఇంటిలో తినడానికేమీ లేదు. తల్లికి తిండి లేకపోవడంవల్ల పిల్లవాడి కివ్వడానికి పాలు కూడ రావడం లేదుపసిబిడ్డ   ఆకలితో  అలమటిస్తున్నాడు.

అంతలో ఎవడో ' పేలాలండి పేలాలు ' అంటూ అమ్ము కోడానికి వీధిలోకి వచ్చాడు. గట్టిగా అరుస్తున్నాడు. పేలాలు కొందామా అంటే కొనడానికి ఇంట్లో చిల్లిగవ్వ లేదు. ఇక పిల్లవాడు ఆ పిలుపు వింటే కొనమని పేచీపెడతాడని భావించిన నా ఇల్లాలు లోలోపల బాధతో కుమిలిపోతూనే ఆ పిలుపు వినబడకూడదని బిడ్డ చెవులు గట్టిగా మూసేసింది . అసలే పసిబిడ్డ అందులో లేత చెవులు. విపరీతమైన నొప్పి పుట్టి గిలగిల్లాడిపోతున్నాడు . కాని నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. నాభార్యను మందలించలేను . అలాగని నివారించనూ లేను. ఆ సన్నివేశం నా గుండెల్లో ముల్లులా గుచ్చుకుని నన్ను ఇంకా బాధపెడుతూనే ఉంది.  నన్ను ఈ దురవస్థ నుండి తప్పించి మీరే రక్షించాలి మహాప్రభూ! అని దీనంగా మొఱపెట్టు కున్నాడు. రాజు అతని కుటుంబపోషణకు కావలసినంత ధనం ఇచ్చి పంపించాడు. ఎందుకంటే ఆ భోజుడు కవిజనపోషకుడే కాదు. దీనజన పోషకుడు కూడ. అంతటి హృదయవిదారకమైన సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించిన ఈ రమణీయమైన శ్లోకం చూడండి.
अये लाजानुच्चै : पथि वचनमाकर्ण्य गृहिणी
शिशो: कर्णौ यत्नात्सुपिहितवती दीनवदना |
मयि क्षीणोपाये यदकृतदशावश्रुशबले
तदन्तश्शल्यं मे त्वमिह पुनरुद्धर्तुमुचित: ||

అయే లాజానుచ్చై: పథి వచనమాకర్ణ్య గృహిణీ
శిశో: కర్ణౌ యత్నాత్సుపిహితవతీ దీనవదనా
మయి క్షీణోపాయే యదకృతదశావశ్రు శబలే
తదంతశ్శల్యం మే త్వమిహ పునరుద్ధర్తు ముచిత: .

No comments: