Tuesday, November 19, 2013

ఇలాగ చెయ్యి నాన్నా


ఇలాగ చెయ్యి నాన్నా

డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఒక అవధానంలో ఒక సమస్య ఇచ్చారు. అదేంటంటే "అంభోధి: జలధి: పయోధి: ఉదధి: వారాన్నిధి: వారిధి:”అని. అది అసలు సమస్యే కాదు. ఎందుకంటే అందులోఉన్న ఆఱు పదాలకు ఒకటే అర్థం . సముద్రం . ఇది సమస్య కాకపోవడమే అవధానికి ఒక పెద్ద   సమస్య అయింది. దీంతో ఆయనకు రెండుసమస్యలెదురయాయి. ఒకటి దాన్ని సమస్యగ పరిగణించడం, రెండు ఆ సమస్యను పరిష్కరించడం . కొంతసేపు ఆలోచించాడు. వెంటనే అందుకున్నాడు.
కుమారస్వామి తన తండ్రియైన పరమశివుని దగ్గఱకెళ్లాడు. ఏరా! ఎందు కొచ్చావు. పనేంటి అన్నాడాయన . నాన్నా! అమ్మకి కోపం వచ్చింది. నీ నెత్తి మీదున్న గంగను వెంటనే విడిచిపెట్టెయ్యి అన్నాడు. పార్వతికి ఎందుకు కోపమొచ్చిందో శివుడికర్థమయ్యింది. గంగ పార్వతికి సవతి కదా అందుకే అయి ఉంటుంది అనుకున్నాడు. సరే లేరా! ఆవిడ ఎప్పటి నుంచో నానెత్తి మీద కూర్చుంది. ఇప్పుడు ఎక్కడ వదలాలి? ఎలా వదలాలి? నువ్వే చెప్పు అన్నాడు. వెంటనే కోపంతోను ఆవేశంతోను కుమారస్వామి ఆఱు ముఖాలు ఒకసారే 'అంభోధి', 'జలధి', 'పయోధి' , 'ఉదధి', 'వారాన్నిధి', 'వారిధి', ఇలా వివిధ పదాలతో ఒకేఅర్థం వచ్చేలాగ "సముద్రంలో వదిలెయ్యి నాన్నా!" అని సమాధానం చెప్పాయట. ఎంత అధ్భుతమైన కల్పన . శ్లోకం చదవండి మరి.
అంబా కుప్యతి తాత!మూర్ధ్ని విధృతా గంగేయ ముత్సృజ్యతాం
విద్వన్ షణ్ముఖ!కాగతిర్మమ చిరం మూర్ధ్ని స్థితాయా: వద
కోపావేశవశాదశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధిర్జలధి:పయోధిరుదధిర్వారాన్నిధిర్వారిధి:
--_

1 comment:

Unknown said...

అభినందనలు

కృతజ్ఞతలు