Friday, November 22, 2013

ఇదండి బాబు అసలు సంగతి


ఇదండి బాబు అసలు సంగతి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
/౧౦౬, ప్రేమ నగర్, దయాల్ బాగ్, ఆగ్రా

పరమశివుడు దిగంబరుడని అందఱికి తెలిసిన విషయమే. కాని ఎందుకు దిగంబరుడయ్యాడో ఎవరికి తెలియదు నాకొక్కడికి మాత్రమే తెలుసునంటాడు ఒక కొంటె కవి.
శివకేశవులిద్దఱు మంచి స్నేహితులు. ఒకళ్లను విడిచి వేఱొకరు ఉండలేరు. ఎక్కడకు వెళ్లాలన్నా కలిసే వెడతారు. ఒకసారి ఇద్దఱు కలిసి ఒకచోటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. విష్ణుమూర్తి శివునితో రేపు ఫలానా సమయానికి నీ దగ్గరకు వస్తాను సిద్ధంగా ఉండు కలిసి వెడదాం అనాడు . పరమశివుడు సరే అన్నాడు. కానీ విష్ణుమూర్తి అనుకున్న సమయంకంటే కొంచెం ముందుగానే వెళ్లడం తటస్థించింది.
శివుడు తన మిత్రుడైన విష్ణువు రాకను తెలుసుకున్నాడు. అంత ముందుగా వస్తాడని ఆయనా ఊహించలేదు. ఆయన సమయం వ్యర్థపరచడం ఈయనకు ఇష్టం లేదు. అందువల్ల వెంటనే తొందఱ తొందఱగా సిద్ధం కావాలనుకున్నాడు. ఏనుగు చర్మం కట్టుకున్నాడు. పామును మొలత్రాడుగా బిగించాడు. తనమిత్రుని దగ్గఱకు పరుగెత్తాడు. కాని అక్కడ తాను ఎన్నడు ఊహించని ఎప్పుడూ జరగని సంఘటన జరిగింది. అదేమిటంటే విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు. దాన్ని చూడగానే మొలత్రాడుగా నున్న పాము భయపడిపోయింది, అలికిడి లేకుండ అక్కడనుండి జారుకుంది . ఎప్పుడైతే మొలత్రాడు జారుకుందో కట్టుకున్న బట్ట కూడ జారిపడిపోయింది. ఇంకేముంది పరమశివుడు సిగ్గుతో తలదించేసుకున్నాడు. ఇంకెప్పుడు బట్టలు కట్టనే కట్టకూడదని ఒట్టేసుకున్నాడు. నాటినుంచి నేటిదాక అలాగే ఉండిపోయాడు. ఇదండి అసలు సంగతి .

విష్ణోరాగమనం నిశమ్య సహసా కృత్వా ఫణీంద్రం గుణం
కౌపీనం పరిధాయ చర్మకరిణ: శంభౌ పురో ధావతి
దృష్ట్వా విష్ణురథం సకంపహృదయ: సర్పో పతద్భూతలే
కృత్తిర్విస్ఖలితా హ్రియానతముఖో నగ్నో హర: పాతు న:
అసలు దిగంబరుడు అనేపదానికి దిక్కులే వస్త్రాలుగా కలవాడు అనగా సర్వవ్యాపి అని అర్థం. అంతే గాని బట్టలు లేనివాడని మాత్రం కాదు. ఇది కేవలం హాస్యం కోసం వ్రాసింది.

No comments: