Saturday, November 30, 2013

ఎలా పంపించాలో మీరే సెలవియ్యండి


ఎలా పంపించాలో మీరే సెలవియ్యండి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

అది కొత్త జంట . కొన్ని రోజుల క్రితమే పెళ్లి అయ్యింది. అనుకోకుండ వెంటనే భర్తకు దేశాంతరం వెళ్లవలసిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం ఉత్తర్వు. వెళ్లకతప్పదు. భార్యదగ్గరకొచ్చాడు. అంతా వివరించాడు. సంతోషంగా వీడ్కోలు చెప్పి సాగనంపమని అడిగాడు. ఆమె మనస్సు దు:ఖంతో నిండి పోయింది. కన్నీళ్లు పొంగుకొస్తున్నాయి. ఏమీ మాట్లాడలేకపోతోంది. ఏం మాట్లాడాలో ఆమెకు తోచడం లేదు. ఏం మాట్లాడవేంటి ? అన్నాడు గోముగా.
నాథా ! మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని 'వెళ్లవద్దు' అంటే అమంగళం అవుతుంది. 'వెళ్లండి' అందామా అంటే మీ వియోగాన్ని భరించే శక్తి నాకు లేదు. ' వెళ్లవద్దు' ఇక్కడే ఉండిపోండి అని గట్టిగా చెబుదామా అంటే మీపై అధికారం చెలాయించినట్లౌతుంది. అది నాకిష్టం లేదు . ఒకవేళ 'మీకెలా చెయ్యాలనిపిస్తే అలా చెయ్యండి' అందామా అంటే అది ఉదాసీనత ఔతుంది. ఇక 'మీరు లేకపోతే నేను ఒక్క క్షణమైన బ్రతుకలేను' అనే సత్యాన్ని మీకు చెబుదామా అంటే అలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. కాబట్టి ఈ క్లిష్టసమయంలో నన్నేమి సమాధానం చెప్ప మంటారో మీరే సెలవియ్యండి అంది దీనంగా. చాల ముచ్చటగా ఉంది కదూ! ఆమె మాటలతీరు . ఇక శ్లోకం చదవండి. ఆనందించండి.
మా యాహీత్యపమంగళం, వ్రజ కిల స్నేహేనశూన్యం వచ:,
తిష్ఠేతి ప్రభుతా, యథారుచి కురుష్వైషాప్యుదాసీనతా,
నో జీవామి వినా త్వయేతి వచనం సంభావ్యతే వా న వా,
తన్మాం శిక్షయ నాథ! యత్సముచితం వక్తుం త్వయి ప్రస్థితే
????

No comments: