Thursday, January 9, 2014

అధికారం


అధికారం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
  dr.cdprao@gmail.com

యౌవనం, ధనం, అధికారం, అవివేకం అనే ఈ నాల్గింటిలో ఏ ఒక్కటున్నా మనిషి పతనం అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఇక అన్నీ ఒక్కచోటే కలిసుంటే చెప్పేదేముంది అన్నారు మన పెద్దలు. ఈ నాల్గింటిలో అధికారం మరింత ప్రమాదకరమైనది. యౌవనం వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి. డబ్బు వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి అలాగే అవివేకం వల్ల కూడ కొన్ని తప్పులు జరుగుతాయి. అయితే వాటికొక అంతం ఉంది. కాని అధికారం వల్ల జరిగే తప్పులకు అంతం అంటూ ఏమీ ఉండదు. అధికారం అంతమయ్యే వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఆ తరువాత ఆ సీటులో కూర్చున్న మరో అధికారికి అవన్నీ రాచబాటలవుతాయి.
మంచికో చెడుకో తెలియదు గాని పూర్వం కులవిభజన పేరుతో బుద్ధిబలం కొంతమంది వశంలోను, అంగబలం కొంతమంది చేతుల్లోను , అర్థబలం కొంతమంది అధీనంలోను, కండబలం మరికొంతమంది దగ్గర ఉంటూండేవి. ఏదైనా ఒక తప్పు జరగాలంటే ఒకరివల్ల సాధ్యమయ్యేది కాదు. అందర్ని ఒప్పించడం కూడ సాధ్యపడేదికాదు. కాని ఇపుడవన్నీ ఒక చోటే ఉండడం వల్ల అన్యాయాలకు అరాచకాలకు అదుపులేకుండా పోతోంది. ముఖ్యంగా కొంతమంది అధికారులు ప్రభుత్వధనాన్ని తమ సొంతసొమ్ముగా భావించి పందికొక్కుల్లా మేసేస్తున్నారు. ప్రభుత్వధనం చాల పవిత్రమైనది. అది ఏ ఒకరిదీ కాదు. ప్రతి పైసా ఎవరికి చేరాలో వారికే చేరాలి. అధికారయంత్రాంగం వారికి మాత్రమే చేర్చాలి. అధికారదుర్వినియోగం వల్లనే ఒకప్పుడు 'ఒప్పులకుప్ప ఒయారి భామగా ఉన్నమనదేశం నేడు అప్పుల కుప్ప అయ్యో రామ' గా తయారయింది. ఒకసారి పూర్వ వైభవాన్ని నెమరు వేసుకుందాం.

ఆచార్య చాణక్యుడు మనకు తెలుసు . ఆయన చంద్రగుప్తుని ప్రధాన మంత్రి. ఒకసారి చాణక్యుని ఇంటిలో కన్నం వేస్తే చాల ధనం దొరుకుతుందనే ఉద్దేశంతో ఒక దొంగ ఆయన ఇంట్లో దూరాడు. తనెప్పుడూ చాణక్యుణ్ణి చూడలేదు. ఆయన పేరు మాత్రమే విన్నాడు. లోపలకు వెళ్లగానే పిలకతో ఒకవ్యక్తి కనిపించాడు. చలితో గజగజ వణికిపోతున్నాడు. చుట్టు కొన్ని వందల కంబళ్లు గుట్టలు గుట్టలుగా పడేసి ఉన్నాయి. ఆయన లోపలికి వచ్చిన వ్యక్తిని గమనించి ఒక కంబళి అతనికందించాడు. దొంగ ' నువ్వెవరవని' ఆయన్ని అడిగాడు. నన్ను చాణక్యుడంటారు నేను చంద్రగుప్తుని ప్రధానమంత్రిని అన్నాడు. 'అది సరే మీవద్ద ఇన్ని కంబళ్లు ఉన్నాయేమిటి'? అనడిగాడు ఆ దొంగ. ఓ అదా! రాజు బీదసాదలకు పంచమని ఇవన్నీ నాకప్పగించాడు. నేనాపనిలో ఉన్నాను' అన్నాడు. మరి మీరు కప్పు కోలేదే! అనడిగాడు వాడు. రాజు అందరికీ ఇమ్మన్నాడు గాని నన్ను తీసుకొమనలేదు అన్నడాయన. ఇదీ అధికారాన్ని సద్వినియోగం చెయ్యడ మంటే. ప్రభుత్వం సొమ్ము ప్రజలది. దాన్ని వాడుకునే హక్కు ఎవరికీ లేదు. అది ఎవరికోసం ఉద్దేశించామో వారికే చెందాలి.
ఇక ఆధునికకాలానికొద్దాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారంటే తెలియని వారెవ్వరూ ఉండరు. ఆయన ప్రపంచప్రఖ్యాతి గడించిన ఇంజనీరు. ఆయన దగ్గర ఒక గుమాస్తా ఉండేవాడు. విశ్వేశ్వరయ్యగారు రోజు సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు ఒక క్రొవ్వొత్తి ఆర్పేసి మరో క్రొవ్వొత్తి వెలిగించమని అతనికి చెబుతూ ఉండేవాడు. అతను అలాగే చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి చిరాకొచ్చింది . అయ్యా! రెండూ క్రొవ్వొత్తులే. ఒకటి ఆర్పడమెందుకు మరోటి వెలిగించడమెందుకు నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు.
నేను రోజు రాత్రి ఎనిమిది గంటలదాక ప్రభుత్వం పనిలో ఉంటాను. ఆ తరువాత నా స్వంతపని కొంత చేసుకోవాలి. నా పని కోసం ప్రభుత్వం వారి కొవ్వొత్తి వాడుకోవడం న్యాయమా చెప్పు అన్నాడు. వాడు వెంటనే ఆయన రెండు కాళ్లమీద పడిపోయాడు.
మరో ఉదాహరణ. ఒకాయన మనదేశానికి రెండుసార్లు ఆపద్ధర్మప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన మరెవరో కాదు. శ్రీయుతులు జి .ఎల్. నంద. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి కొన్ని ఫైల్స్ తీసుకొచ్చారు. ఆయన ఇంటిలో ఒకచిన్నపిల్ల ఉంది. బహుశా ఆయన మనవరాలు కావచ్చు. ఆమె ఆ పైల్స్ లో కొన్ని కాగితాలు తీసి వాటిపై పిచ్చిగీతలు గీసేసింది. ఆయన చూసి తన పి.ఎ ని పిలిచి ఏమయ్యా ! ఇలా గీతలుగీ స్తోంటే నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా అడిగారు. సారీ సార్ చిన్నపిల్ల కదా!అని ఏమీ అనలేకపోయాను ఆన్నాడతను. సరేలే! ఐందేదో ఐంది. ఈ డబ్బులు తీసుకుని ఎన్ని షీట్లు పాడుచేసిందో అన్నీ కొనితెచ్చి అందులో పెట్టు అన్నారు.

ఉద్యమాలు క్రిందిస్థాయినుంచి సంస్కరణలు పై స్థాయి నుంచి రావాలని పెద్దల అభిప్రాయం . అందువల్ల ఉన్నతాధికారి నిజాయితీ పరుడైతే మిగిలినవారంతా నిజాయితీగా ఉండే అవకాశం ఉంది. ఉన్నతాధికారి అవినీతికి పాల్పడితే చిన్న ఉద్యోగి నిజాయితీగా ఉన్నా అది ఎంతో కాలం కొనసాగదు. ఒక్కొక్కప్పుడు నిజాయితీయే అతనికి శాపంగా మారుతుంది. అందువల్ల ప్రతి అధికారి తనవృత్తి పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలి. హుందాగా వ్యవహరించాలి. తనకు ప్రభుత్వమిచ్చిన అధికారం ఇతరులకు సేవ చెయ్యడానికి అవకాశంగా భావించాలి. కర్తవ్యనిర్వహణ కులమతాలకు అతీతంగా ఉండాలి. కులం గోడలకు మతం మందిరాలకు మాత్రమే పరిమితం చెయ్యాలి.
ముఖ్యమైన విషయం మరొకటుంది. చేస్తే ఉపకారం చెయ్యాలిగాని చచ్చినా అపకారం చెయ్యకూడదు. ఒక సందర్భంలో సంత్ కబీర్ అంటారు.
'నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాణ్ణి నువ్వెప్పుడు ఇబ్బంది పెట్టకు . వాడు బలహీనుడైనా వాడి నిట్టూర్పు చాల శక్తివంతమైనది. గిన్నెలకు మాట్లు వేసే వాళ్ల దగ్గర చిన్నకొలిమి దానికొక చర్మంతో చేసిన తిత్తి ఉంటాయి. ప్రాణం లేని ఆ తిత్తి లోంచి వచ్చిన గాలి ఇనుముని కూడ కరిగిస్తోంది. ఇక ప్రాణమున్న ఆ అభాగ్యుడి నిట్టూర్పుందే అది నీ వంశాన్నే దహించేస్తుంది. జాగ్రత్త ' అని
దుర్బల్ కో న సతాయియె జా కీ మోటా హాయ్
ముఈ ఖాల్ కీ సాంస్ సో సార భస్మ హో జాయ్
ఈ విషయాన్నే డాక్టర్ . సి. నారాయణ రెడ్డిగారుమరో విధంగా అన్నారు.
ఎత్తు మీద కూర్చున్నావని
నీ వృత్తి కలుషితం చేయకోయ్
అడుసు గుడిసె ఉరిమిందా
గడియైనా ఆగదు ఆసనం
కాబట్టి ప్రతి వ్యక్తి తన అధికారం దైవమిచ్చిన వరంగా భావించి న్యాయమార్గంలో చేయగలిగినంత సహాయం చెయ్యాలి. లేకపోతే పతనం తప్పదు. ఒకవేళ తాను తప్పుచేసి తప్పించుకోగలిగినా ఆ పాపఫలం అతని సంతానం మీద ఆపై వారిమీద తప్పక పడుతుంది. కొన్ని కుటుంబాల చరిత్ర పరిశీలిస్తే ఈ విషయం అక్షరాల నిజమని ఒప్పుకోక తప్పదు

No comments: