స్వాతంత్ర్యోద్యమంలో
చిలకమర్తి పాత్ర
మనందరం
నివసిస్తున్న ఈ భూమిపట్ల మాతృభావన మనకు వేదకాలం నుంచి ఉంది. ఆ నాటి మానవుడు “మాతా భూమి: పుత్రోsహం
పృథివ్యా:” అని తనకు భూమిలో గల సంబంధాన్ని మాతృపుత్రసంబంధంగా
చాటుకున్నాడు. ఇక ఇతిహాసకాలం నాటి మానవుడు
మరో అడుగు ముందుకెళ్ళి కన్నతల్లి, ఉన్ననేల స్వర్గంకన్న మిన్నగా భావించాడు.
రావణసంహారం
పూర్తయింది. రాముడు సైన్యసమేతంగా అయోధ్యకు
తిరిగి రానున్నాడు. ఆసమయంలో లక్ష్మణుడు
రామునితో “ అన్నయ్యా ! మనం ఈ లంకారాజ్యంలోనే ఉoడిపోదాo. ఇది చాల
బాగుంది” అన్నప్పుడు రాముడు చెప్పిన మాటలు ఒక వ్యక్తికి తన మాతృభూమి
పట్ల ఉండవలసిన ఆదర గౌరవాల్ని జ్ఞాపకం చేస్తున్నాయి.
ఓలక్ష్మణ ! ఈ
లంకానగరం సర్వాoగసుందరమైన బంగారు భూమియే ఐనప్పటికీ నేను ఇష్టపడను .
ఎoదుకంటే జనని, జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి.
ఆపి స్వర్ణమయీ
లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ.
ఈ విధంగా మనకు
భూమితోనూ అందులోనూ మాతృభూమితోను గల సంబంధం చాల గాఢమైనది. అందువల్ల తమ మాతృదేశం
దాస్యశృoఖలాల్లో చిక్కుకున్నప్పుడు ఆమె
విముక్తి కోసం తను,మన,ధన,ప్రాణాలర్పించిన మహానుభావులెంతమoదో ఉన్నారు. వారు
ముల్లోకాల్లోను పూజింపబడుతూనే ఉంటారు. ఎందుకంటే –
‘స్వాతంత్ర్యమ్మునకై
తెగించి తన సర్వస్వమ్ముగోల్పోవు నే
పూతాత్ముండతడొక్కడే
త్రిభువనీపుజ్యుండు’ అంటారు ప్రముఖ కవి కీ||శే|| శ్రీ యేటుకూరి
వేoకట నరసయ్య గారు. దీన్నిబట్టి ఎవడు త్రికరణశుద్ధిగా మాతృదేశంకోసం
తన సర్వస్వాన్ని సమర్పిస్తాడో అట్టివాడు ముల్లోకాల్లోను గౌరవిoపబడతాడు.
మనదేశం ఆంగ్లేయుల
ఉక్కుపాదాలక్రిoద నలిగి ఎన్నో బాధలనుభవిoచింది. ఆమె దాస్యవిమోచనకు ఎంతోమంది
ఎన్నెన్నో త్యాగాలు చేశారు. మహాత్ముని
నాయకత్వంలో ఆసేతు హిమాచలం కులమతజాతిప్రాoతీయభేదం లేకుండా ఆయన వెంట నడిచింది.
అహింసాయుతపోరాటం జరిపి ఆంగ్లేయులను తరిమి తరిమి కొట్టింది. ఆ పోరాటoలో ఒక్కొక్కరు
ఒక్కొక్క మార్గం ఎంచుకున్నారు. కొంతమంది
సత్యాగ్రహాన్ని ఎన్నుకుంటే మరికొంతమంది ప్రజల్లో జాతీయభావాలు రేకెత్తిస్తూ కర్తవ్యాన్ని
ప్రబోధించే సాహిత్యాన్ని ఎన్నుకున్నారు.
మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే. అదే స్వాతంత్ర్యసాధన . అటువంటి సాహిత్యదళపతులలో
బ్రిటీషు వారినెదిరిoఛిన మొట్టమొదటివ్యక్తిగా శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి
పేరు భారతస్వాతoత్ర్యచరిత్రపుటలలో వ్రాయబడి ఉంది. ఆయన కేవలం స్వాతంత్ర్యసమరయోధునిగానే
కాక కవిగా, ప్రముఖపాత్రికేయునిగా,
గ్రంథాలయోద్యమనాయకునిగా, సంఘసంస్కర్తగా
ఎన్నో సేవలందించారు.
చిలకమర్తివారి
పూర్వీకులు ప్రకాశంజిల్లా మద్దిపాడు గ్రామానికి
చెందినవారైనప్పటికీ కొన్ని కారణాలవల్ల వలసవచ్చి పశ్చిమ గోదావరిజిల్లా
వీరవాసరంలో స్థిరపడ్డారు. శ్రీచిలకమర్తి
1867 సెప్టెంబర్ 26 వ తేదీన తణుకు తాలూకాలోని ఖండవల్లి గ్రామంలో జన్మించారు. ఈస్టిండియా కంపెనీవారు వీరవాసరంలో
స్థాపించిన ఆంగ్లపాఠశాలలో చదువు ప్రారంభించారు. వీరవాసరంలో నాల్గవ తరగతివరకు
మాత్రమే ఉండడంవల్ల నరసాపురం మిషన్ హై స్కూల్లో
పైచదువు కొనసాగించారు. 1887 లో మెట్రిక్ లో ఉత్తీర్ణులై కొంతకాలం రాజమహేంద్రవరంలో అధ్యాపకునిగా పని చేశారు. అప్పుడే అక్కడే
శ్రీకoదుకూరి వీరేశలింగం గారికి శిష్యులయ్యారు. ఎన్నో కావ్యాలు , నాటకాలు , నవలలు
, చారిత్రక నవలలు రచించారు. వీరు రచించిన ‘ గయోపాఖ్యానం’ నాటకం ఎంతో ప్రజాదరణ పొంది ఆనాడే ఒక లక్షపుస్తకాలు అమ్ముడు పోవడం ఒక
విశేషం . 1909 లో నిమ్నజాతులకు పాఠశాలను స్థాపించారు. వందలకొలది నిమ్నజాతులవారికి,
స్త్రీలకు ఉచితంగా విద్యనందిoచారు. బ్రహ్మసమాజం, హితకారిణి మొ||సంస్థల ద్వారా సమాజసేవలoదిoచారు.
‘సరస్వతి’, ‘మనోరమ’, ‘దేశమాత’ మున్నగు
పత్రికలను నడిపి జాతీయోద్యమాన్ని బలోపేతం చేశారు.
వారి సర్వతోముఖమైన సేవలకు గుర్తింపుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం 1943లో వారికి ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి
సత్కరించింది. వీరు అoధులైనప్పటికి ఇంతటి
మహోన్నత స్థానాన్ని పొందగలగడం ఒక విశేషం వీరు 1946 జూన్ 7 వ తేదిన మరణించారు.
ఈ వ్యాసంలో శ్రీచిలకమర్తి
అందించిన స్వాతంత్ర్యోద్యమస్ఫూర్తికవితలను గురించి సంగ్రహంగా తెలుసుకుందాం . అవి ఆంగ్లేయులు మన
దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. 1907 లో శ్రీ బిపిన్ చంద్రపాల్ దక్షిణభారతదేశంలో పర్యటిస్తూ తన మహోపన్యాసమహాప్రభంజనంతో ప్రజలలో
అచంచలమైన జాతీయస్ఫూర్తిని రేకెత్తిస్తున్నారు. ఆయన బరంపురం మీదుగా రాజమహేంద్రవరం
చేరుకొని 19-4-1907 నుండి 24-4-1907 వఱకు ఐదు రోజులపాటు తెలుగుప్రజల నుద్దేశించి
గంభీరoగా ఉపన్యసించారు. వారి ఆంగ్లప్రసంగాలను తెలుగులో అనువదించడానికి నియమితులైన
శ్రీ చిలకమర్తి చివరిరోజున ఆశువుగా చెప్పిన చైతన్యగీతానికి తెలుగుజాతి యావత్తు
ఉత్తేజం పొందినదనడంలో ఎటువంటి సందేహం లేదు .
భరతఖండంబు చక్కని
పాడియావు
హిందువులు
లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి
గొల్లవారు
పితుకు చున్నారు
మూతులు బిగియగట్టి
అనే పద్యంలో ఆంగ్లేయులను దోపిడిదారులగాను,
భారతీయులను దోపిడీకి గురౌతున్నవారిగాను వర్ణించిన తీరు ఎంతో స్ఫూర్తి దాయకం అయింది
. దేశభక్తుడు
కష్టాలను లెక్కచెయ్యకూడదని ప్రబోధించే ఈ పద్యం మఱింత స్ఫూర్తి దాయకం .
చెఱసాలల్ పృథు
చంద్రశాలలె యగున్ చేదోయి సంధించు న
య్యరదండల్
విరిదండలౌను కడు హేయంబైన చోడంబలే
పరమాన్నంబగు మోటు
కంబళులు తాల్పన్ పట్టుసెల్లాలగున్
స్థిరుడై
యేనరుడాత్మదేశమును భక్తిoగొల్చు నవ్వానికిన్
దేశభక్తునికి చెఱసాలలు పాలరాతిమేడలౌతాయట. సంకెళ్ళు
పూలదoడలౌతాయట. గంజే పరమాన్నమౌతుoదట. మోటైన కంబళ్లే పట్టువస్త్రాలౌతాయట. ఎంత
రమణీయమైన భావన ఇది . అలాగే
దాస్యశృoఖలాల్లో చిక్కుకొని అలమటిస్తున్న సమస్తదేశాన్ని ఒక బదిఖానగా అభివర్ణించిన తీరు పరమరమణీయo.
భరతఖండంబె ఒక
పెద్ద బందిఖాన
అందులోనున్న
ఖైదీలు హిందుజనులు
ఒక్క గదినుండి
మార్చి వేఱొక్క గదికి
పెట్టుటే గాక చెఱ
యంచు వేఱె గలదే
అంతేగాక
స్వాతంత్ర్యమనేది యాచనవల్ల సాధించేది
కాదని అది త్యాగాలవల్ల మాత్రమే సాధ్యమౌతుందని నొక్కి చెప్పే ఈ క్రింది
పద్యం ఉద్యమకారులందరికి స్ఫూర్తి దాయకం .
ఎందఱు కుoదకుండ మఱి
యెoదఱు బoదెలకందకుoడ నిం
కెందఱు
దేశముల్ విడిచి యీడిగలంబడకుండ
నెవ్వరే
చందమునన్ శ్రమంబడక
చప్పున చొప్పడునే స్వరాజ్యమో
హైందవులార !
చిoతిలకుడీ చెఱసాలలకేగుమన్నచో
ఈ
విధంగా ఆనాడు ఉద్యమస్ఫూర్తిని రేకెత్తించిన ఎన్నెన్నో కవితలు వీరి కలం నుంచి
జాలువారాయి. అలాగే ఆనాడు తమ కవితలతో ప్రజలలో జాతీయభావాలను రేకెత్తించిన వారిలో
శ్రీయుతులు రాయప్రోలు, విశ్వనాథ, జాషువ, కరుణశ్రీ, యేటుకూరి, తుమ్మల, మధునాపంతుల ,
త్రిపురనేని , దాశరథి మొదలగువారే గాక
మరెందఱో ఉన్నారు . నేటి యువత
వారి కవితలను చదివి,
స్పూర్తి పొంది, దేశాన్ని ప్రగతిపథం వైపు
నడిపించి, దేశం యొక్క పూర్వవైభవాన్ని తిరిగి సాధించాలని ఆశిద్దాం .
No comments:
Post a Comment